అనగనగా ఓ రాజు. ఆ
రాజుగారికో కొడుకు. యుక్తవయస్సు
రాగానే అతడికి పట్టాభిషేకం చేసి తాను వానప్రస్తాశ్రమం స్వీకరించాలన్న తలంపు
మహారాజుకు కలిగింది. అయితే రాజ్యభారాన్ని కొడుకు భుజస్కంధాలపై పెట్టేముందు
అందుకు తగిన శిక్షణ ఇప్పించేందుకు కుల గురువులవద్దకు పంపాడు.
గురువు గారి ఆశ్రమంలో
రాజూ పేదా అన్న తేడాలేదు. అక్కడ అందరూ సమానమే.
ఆశ్రమజీవితంలో కొంత
కాలం గడిపిన తరువాత యువరాజు ఓ రోజు వెళ్లి గురువును కలిశాడు.
కలిసి తన మనసులోని మాట బయట పెట్టాడు.
‘స్వామీ! ఇన్నాళ్ళబట్టి
నేను కప్పుకుంటున్న గొంగడి బాగా చిరుగులు పడిపోయింది. దాని స్తానంలో
కొత్తది ఇప్పిస్తే కృతజ్ఞుడిని’
గురువు పాత గొంగడిని
పరీక్షించి చూశాడు. యువరాజు చెప్పింది నిజమే. అది బాగా జీర్ణించి పోయి
కప్పుకోవడానికి పనికిరాకుండా వుంది.
గురువు కొత్త గొంగడి
తెప్పించి శిష్యుడికి ఇచ్చాడు. యువరాజు సంతోషంగా వెళ్ళిపోయాడు.
ఆ తరువాత గురువు
గారికి ఓ సందేహం వచ్చింది. ‘కొత్త
గొంగడి తీసుకువెళ్ళాడు
సరే పాత గొంగడి మాటేమిటి?’
శిష్యుడిని మళ్ళీ
పిలిపించాడు. ‘పాత
దుప్పటి ఏం చేశావ’ని ప్రశ్నించాడు.
‘పక్క బట్ట బాగా
మాసిపోయింది. అందుకని పాత గొంగడిని పక్కబట్టగా వాడుతున్నాన’ని బదులుచెప్పాడు.
కానీ, గురువు గారు అంతటితో
వొదిలిపెట్టలేదు.
‘పాడయిపోయిన పాత
పక్కబట్టని ఏం చేశావ’ని
ప్రశ్నించాడు.
‘కుటీరం కిటికీకి
దాన్ని పరదాగా కట్టాన’ని
శిష్యుడి జవాబు.
‘బాగుంది. మరి పాత పరదా
సంగతేమిటి? దాన్నేం
చేశావ్?’ గురువుగారు
మరో ప్రశ్న సంధించాడు.
‘ఇల్లు కడిగిన తరువాత
తుడవడానికి దాన్ని వాడుతున్నాన’ని శిష్యుడు చెప్పాడు.
గురువుగారి సందేహాలు
ఇంకా తీరినట్టులేదు.
‘అంతకుముందు ఈ పనులకు
వాడిన బట్టలు ఏమయ్యాయి?’
‘వాటిని దారాలుగా
విడదీసి ఆ దారాలతో వొత్తులు తయారు చేసి రాత్రి వేళల్లో ఆముదపు దీపాలు వెలిగించి
చదువుకుంటున్నాను’
అడగడానికి గురువుదగ్గర
ఏమీ మిగలలేదు. అలాగే శిష్యుడికి నేర్పడానికి కూడా ఆయన దగ్గర ఏమీ లేదు.
‘పనికిరానిదేమీ లేదు ఈ
లోకంలో’ అన్న
నీతిని బాగా వొంటబట్టించుకున్న యువరాజు చేతుల్లో ఈ
రాజ్యం భద్రంగా వుంటుందన్న గట్టి నమ్మకం గురువుకు కలిగింది.
అంతే!
పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేసుకోవలసిందని
మహారాజుకు కబురు
పంపారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి