1, ఫిబ్రవరి 2022, మంగళవారం

అలా ఉండేవి ఆ రోజులు – భండారు శ్రీనివాసరావు

 ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజులు.

విజయవాడలో అల్లర్లు జరిగాయి. ఆ ప్రాంతంలో పర్యటించడానికి ముఖ్యమంత్రి పీ.వీ.నరసింహారావు బయలుదేరుతున్నారు. ఆయన అక్కడికి వెడితే, ప్రాంతీయ విద్వేషాలు పెరుగుతాయని, రావద్దని జిల్లా కలక్టర్, ఎస్పీ, పీవీని వారించారు. ముఖ్యమంత్రి హోదా, రాజకీయ ప్రయోజనాలు బేరీజు వేసుకున్న పీవీ వెళ్లడానికే నిర్ణయించుకున్నారు. ఇక లాభం లేదనుకుని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వల్లూరి కామేశ్వరరావు (వీకే రావు) రంగంలోకి దిగారు. వెళ్ళవద్దని ముఖ్యమంత్రికి సూచించారు.

నువ్వు సెక్రెటరీవి. నా ఉద్యోగివి. నీ పని నువ్వు చూసుకో. నేను చెప్పింది చేయి. నేను పొలిటీషియన్ని. నా పని నేను చేస్తా’ అంటూ ఆఫీసు మెట్లు దిగి కారెక్కడానికి వచ్చారు పీవీ. కానీ అక్కడ కారు డ్రైవర్ లేడు. ఏడని అడిగితే... ‘సీఎస్ గారు కారు తీయవద్దన్నారని’ సమాధానం వచ్చింది. ‘డ్రైవర్ నా ఉద్యోగి. అతడు నేను చెప్పినట్టే వింటాడు. అతను రాడు.’ అని సీఎస్ కరాఖండిగా చెప్పారు. పీవీ పర్యటన ఆగిపోయింది. మరుసటి రోజు పీవీ వల్లూరిని పిలిచి, ’నిన్న నేను వెళ్ళివుంటే గొడవలు పెరిగేవి. నన్ను ఆపి మంచిపని చేసావు’ అని మెచ్చుకున్నారు.

విధులపట్ల అదీ ఆనాటి అధికారుల నిబద్ధత. అధికారుల మాట పట్ల రాజకీయ నాయకుల మర్యాద, మన్ననలు అలా ఉండేవి.

 

ఓసారి శ్రీశైలంలో ఒక జాతీయ పార్టీ సమావేశం జరుగుతోంది. దాన్ని కవర్ చేయడానికి హైదరాబాద్ నుంచి ఒక విలేకరి వెళ్లాడు. సమావేశం పూర్తయ్యాక ఫాక్స్ ద్వారా వార్త పంపడానికి కొండ కిందకు వెళ్ళబోతున్నాడు. అది గమనించిన ఆ పార్టీ ప్రముఖుడొకరు జీపు ఏర్పాటు చేస్తానన్నా అతగాడు వొద్దన్నాడు. పరవాలేదని నచ్చజెప్పి తన జీపు డ్రైవర్ ను పిలిచి కాఫీ, టీలు, భోజనం, ఫాక్స్ బిల్లు వగైరాలకు కొంత డబ్బు ఇచ్చి తగిన సూచనలు చేసి ఆ విలేకరిని కిందికి పంపాడు. విలేకరి పనులన్నీ పూర్తయి హైదరాబాద్ బస్సు ఎక్కేదాకా వుండి రాత్రికి జీపు డ్రయివర్ తిరిగి వచ్చాడు. రాగానే ఇచ్చిన మొత్తాన్ని యధాతధంగా డ్రైవరు వాపసు చేయడంతో ఆ నాయకుడు ఖంగు తిన్నాడు. ‘ఏమీ ఖర్చు కాలేదా’ అని అడిగితే ‘లేదు సార్ ! కాఫీక్కూడా నన్ను డబ్బులివ్వనివ్వలేదు. పైగా నేను వొద్దంటున్నా మన జీపులో పది లీటర్ల డీజిల్ కొట్టించి డబ్బులు ఆయనే ఇచ్చాడు సార్అని చెప్పేసరికి నివ్వెరపోవడం ఆ నాయకుడి వంతయింది.

ఒకనాటి విలేకరుల నిబద్దత అది.

ఆ డ్రైవర్ నిబద్ధత కూడా చాలా గొప్పది.

 

కామెంట్‌లు లేవు: