(20-02-2022 ఆదివారం
ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం)
సర్జికల్
స్ట్రయిక్స్ అనే పదం మరోసారి మీడియాలో వినపడుతోంది. రాజకీయ
విమర్సలు, ఆరోపణల ప్రసక్తి లేకుండా దీని పూర్వాపరాల పునశ్చరణే ఈ వ్యాసాంశం.
మూడేళ్ల
క్రితం అంటే 2019 ఫిబ్రవరి పద్నాలుగో తేదీ. మధ్యాన్నం మూడు గంటలు
దాటింది. ఎర్రటి కాశ్మీర్ కుంకుమ పువ్వును విస్తారంగా పండించే పుల్వామా ప్రాంతం
ఉగ్రవాదదాడితో మరింత ఎర్రబడింది. విధి నిర్వహణ కోసం రోడ్డుమార్గంలో జమ్మునుంచి
కాశ్మీర్ తరలివెడుతున్న భారత సైనిక వాహన శ్రేణిపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ
జైషె మహ్మద్ కు చెందిన ఆదిల్ అనే ఉగ్రవాది ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు.
శక్తివంతమైన పేలుడు పదార్ధాలు కలిగిన మరో వాహనంలో వాహనశ్రేణి వెంట వేగంగా
ప్రయాణిస్తూ, తన కారును తానే పేల్చేసుకున్నాడు. ఆ పేలుడు తీవ్రతకు పక్కనే ప్రయాణిస్తున్న
మిలిటరీ కాన్వాయ్ లోని ఒక బస్సు తునాతునకలయింది. ఆ వేడికి కరిగి ఇనుప ముద్దగా
మారింది. ఆ బస్సులో ప్రయాణిస్తున్న మొత్తం నలభయ్ మంది భారత సైనికులు ఈ సంఘటనలో
విగతజీవులయ్యారు. వారి దేహాలు వంద మీటర్ల పరిధిలో చెల్లాచెదురుగా పడ్డాయి. మరో
నలుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది క్షతగాత్రులు అయ్యారు. దేశం యావత్తు
దిగ్భ్రాంతికి గురయింది.
ఈ
దాడికి పూనుకుంది తామే అని మసూద్ ఆజాద్ నాయకత్వంలోని జైషే ఉగ్రవాద సంస్థ
ప్రకటించుకుంది. ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఆదిల్ అహ్మద్ అలియాస్ వకాస్ మాట్లాడిన
దృశ్యాలతో కూడిన వీడియోను సంఘటన జరిగిన కొద్ది సేపటిలోనే ఈ సంస్థ విడుదల చేసింది.
‘దీన్ని జమ్మూ కాశ్మీర్ ప్రజలు చూసే సమయానికి తాను స్వర్గం(దేవుని వద్దకు)
చేరుకుంటాన’ని ఆదిల్ ఆ వీడియోలో పేర్కొన్నాడు. తన నమ్మకం పట్ల తనకున్న నమ్మకం
అతడ్ని అన్నిరకాల మానవ సంబంధాలనుంచి దూరం చేసిందని ఈ వీడియోని బట్టి అర్ధం
చేసుకోవచ్చు.
‘కత్తి
తిప్పేవాడు ఆ కత్తి ఒరలోనే మరణిస్తాడు’ అన్నది బైబిల్ సూక్తి. క్రైస్తవం ఒక్కటే
కాదు, ఇస్లాం
అయినా ఆ మాటకు వస్తే, ప్రపంచంలోని ఏ మతమయినా హింసామార్గాన్ని
ఎంతమాత్రం అనుమతించదు. ప్రబోధించదు. ఏమాత్రం సమర్థించదు. అయితే, ఈ మానవేతిహాసంలో
జరిగిన అనేక యుద్ధాలు మతం పేరిట మొదలు కావడం ఆ మతాలు చేసుకున్న దౌర్భాగ్యం.
‘మతాన్ని
మీరు రక్షిస్తే, ఆ మతం మిమ్మల్ని రక్షిస్తుంది’ అనే ప్రాధమిక సూత్రం ఈ తగవులకు మూలకారణం.
మతాన్ని రక్షించడం అంటే పర మతాలనుంచి దాన్ని కాపాడుకోవడం కాదనీ, ఎవరి
మతాన్ని వారు గౌరవించుకుంటూ, పర మతాలను సయితం గౌరవించడమనీ మత పెద్దలు ఎంతగా మొత్తుకున్నా మత ఛాందసులు
పట్టించుకోవడం లేదు. ఫలితం మతం పేరిట యుద్ధాలు, రక్త తర్పణాలు.
టూత్
పేస్టు ట్యూబ్ నుంచి పేస్ట్ బయటకు తీయగలమే
కాని తిరిగి దానిని ట్యూబ్ లో పెట్టడం అసాధ్యం. అలాగే, ఉగ్రవాదం, తీవ్రవాదం
ఏ పేరుతొ పిలిచినా దాన్ని పెంచడం సులభం, తుంచడం కష్టం. ఇప్పుడు మానవాళికి
కావాల్సింది మానవ హననం కాదు, కాసింత సహనం.
'సహనావవతు' అనేది
వేద కాలం నుంచి వినవస్తున్న హితోక్తి. కానీ దాన్ని బోధించేవారే కానీ పాటించేవారు
కరువయ్యారు.
మోడీ
సర్కారు పుల్వామా సంఘటనపై తీవ్రంగా
స్పందించింది. వీర సైనికుల త్యాగాలను వృధా కానివ్వం అంటూ ప్రధాని మోడీ ట్వీట్
చేశారు.
కాంగ్రెస్
తో సహా అన్ని ప్రతిపక్షాలు ఉగ్రవాద చర్యను ఆ నాడు తీవ్రంగా గర్హించాయి.
అంతకు
ముందు మూడేళ్ల క్రితం 2016 సెప్టెంబరు
18 వ
తేదీన కాశ్మీర్ లోని బారాముల్ల జిల్లా ఉరీలోని భారత సైనిక శిబిరంలోకి ఉగ్రవాదులు
చొరబడి పద్దెనిమిది మందిని పొట్టనబెట్టుకున్నారు. ఆ ముష్కర చర్యతో దేశం యావత్తు
దిగ్భ్రాంతి చెందింది. మనమేమీ చేయలేమా అనే ప్రశ్న తలెత్తింది. గతంలో కూడా ఆ
ఉగ్రవాదులు భారత పార్లమెంటుపై దాడి జరిపారు. ఖచ్చితంగా ఆ చర్య పొరుగు దేశంపై
యుద్ధం చేయడంతో సమానమే. పార్లమెంటుపై దాడికి తెగించినవారిపై తక్షణమే గట్టి చర్య
తీసుకునివుంటే ఇప్పుడీ పరిస్తితి తలెత్తేది కాదు అనే భావన ప్రజల్లో కలిగింది.
ఉరీ
సంఘటన జరిగినప్పుడు కూడా మన దేశ నాయకులు ‘ఉక్కుపాదంతో ఉగ్రవాదాన్ని అణచివేస్తామనే
భారీ ప్రకటనలు చేసారు. అవి షరా మామూలు ఊకదంపుడు ప్రకటనలనే విమర్శలు వచ్చాయి. భారత
ప్రభుత్వం మేకతోలు గాంభీర్యం ప్రదర్శిస్తోందని అన్నవారూ వున్నారు. అలా అన్న పది
రోజులకే అంటే సెప్టెంబరు 28 వ తేదీన భారత సైనికులు మెరుపు దాడి
చేసి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని అయిదు ఉగ్రవాద స్థావరాలపై దెబ్బతీసి తమ ఆధిక్యతను
అద్భుతంగా ప్రదర్శించారు. దేశ గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టారు. ఉరీ
సంఘటనకు ప్రతీకారం తీర్చుకున్నారు. సర్జికల్ స్ట్రయిక్స్ అనే పద ప్రయోగం కూడా
అప్పుడే ప్రాచుర్యంలోకి వచ్చింది.
పాక్
ఆక్రమిత కాశ్మీర్ భూభాగంలోకి భారత సైనికులు చొరబడి అక్కడి ఉగ్రవాద స్థావరాలపై
మెరుపు దాడులు (సర్జికల్ స్ట్రయిక్స్) జరిపి తమకు అప్పగించిన పనిని విజయవంతంగా
పూర్తి చేయడం ఆ రోజుల్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
సర్జికల్
స్ట్రయిక్స్ లో కొన్ని ప్రత్యేక లక్షణాలు
వున్నాయి.
ఈ
మెరుపుదాడుల వల్ల అక్కడి సాధారణ పౌరులకు హాని జరగకూడదు. కేవలం లక్ష్యఛేధనే గురిగా
ఎంచుకోవాలి. మెరుపు దాడులు చేయడానికి తగిన శిక్షణ పొందిన, అనుభవం
కలిగిన కమాండోలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. కటిక చీకట్లో కూడా చూడగలిగిన కంటి
పరికరాలను, గురి చూసి కొట్టగలిగిన ఆధునిక ఆయుధాలను వారికి సమకూర్చాలి. అన్నింటికంటే
ప్రధానం లక్ష్య నిర్దేశం. ఎలాటి పొరబాటుకు అవకాశం లేకుండా శత్రువు స్థావరాన్ని ఖచ్చితంగా
నిర్ధారణ చేసుకోవడం, అలాగే శత్రు బలగాలకు తమ ఉనికి, కదలికలు గురించి గురించి ఎలాంటి అనుమానాలు కలగకుండా గమ్యాన్ని చేరుకోవడం
ఈ మెరుపు దాడుల్లో అతి ప్రధానం. ఈ విషయంలో భారత సైన్యం ఎంతో కసరత్తు చేసింది. భారత
ఉపగ్రహాల సాయం తీసుకుని ఉగ్రవాద స్థావరాల ప్రాంతాన్ని ముందుగానే గుర్తించింది.
అంచేతే, అర్ధరాత్రి తమ కదలికలను ఎవరూ గుర్తుపట్టకుండా వెళ్లి, ఒప్పగించిన
బాధ్యతను నూటికి నూరు పాళ్ళు పూర్తి చేయగలిగింది.
నిజానికి
సర్జికల్ అనే పదం వైద్య శాస్త్రానికి సంబంధించినది. దేహంలో ప్రాణాంతక వ్యాధికి
కారణమైన ‘కణం’ ఎక్కడ వున్నా, మిగిలిన శరీర భాగాలకు ఇసుమంత హాని జరగకుండా, శస్త్రచికిత్స ద్వారా ఆ కణాన్ని మాత్రమే తొలగించే లాప్రోస్కోపిక్
ప్రక్రియలు ప్రస్తుతం అందుబాటులో వున్నాయి. ఈ సర్జికల్ స్ట్రయిక్స్ లక్ష్యం కూడా
అలాంటిదే.
మహాభారతం
సౌప్తిక పర్వంలో కూడా ఇటువంటి
అస్త్రశస్త్రాల ప్రసక్తి కానవస్తుంది. భారత యుద్ధం ముగిసిన తరువాత, తన
ప్రభువైన సుయోధనుడి పరాజయాన్ని, పాండవుల చేతిలో తన తండ్రి ద్రోణుడి మరణాన్ని జీర్ణించుకోలేని అశ్వద్ధామ, పాండవ
వంశనాశనానికి శపధం చేస్తాడు. పాండవులు లేని సమయంలో వారి శిబిరంలో ప్రవేశించి ధృష్టద్యుమ్యుడితో
సహా ఉపపాండవులను ఊచకోత కోస్తాడు. తదనంతరం ముఖాముఖి జరిగిన యుద్ధంలో అర్జునుడు, అశ్వద్ధామ
పరస్పరం తలపడతారు. ద్రోణనందనుడు ఒక గడ్డి పరకను చేతిలోకి తీసుకుని బ్రహ్మశిరోనామాస్త్రాన్ని
ఆవాహన చేసి ‘అపాండవం భవతు’ అంటూ దానికి లక్ష్య నిర్దేశనం చేసి ప్రయోగిస్తాడు.
అందుకు ప్రతిగా అప్పుడు అర్జునుడు కూడా, కృష్ణుడి ప్రేరణపై అదే అస్త్రాన్ని
స్మరించి, ‘గురుపుత్రుడైన ఆశ్వద్దామకు హానిచేయకుండా, ప్రత్యర్ధి అస్త్రానికి లక్ష్యమైన మా
సోదరులను రక్షించాలని తన అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ మహాస్త్ర శస్త్రాల ధాటికి
ముల్లోకాలు తల్లడిల్లడంతో వ్యాస, నారద మహర్షులు జోక్యం చేసుకుని అస్త్ర ఉపసంహారానికి విజ్ఞప్తులు చేస్తారు.
అర్జునుడు అంగీకరించినా, బ్రహ్మ శిరోనామాస్త్రం ఉపసంహార ప్రక్రియ ఆశ్వద్దామకు తెలియక పోవడం వల్ల, ఆ
అస్త్ర లక్ష్యాన్ని పాండవ వంశీయుల గర్భవిచ్చిత్తికి మళ్ళించి లోకనాశనాన్ని
తప్పించారని బొమ్మకంటి వెంకట సుబ్రమణ్య శాస్త్రి గారు తాము రచించిన శ్రీ మదాంధ్ర
సంపూర్ణ మహా భారతంలో పేర్కొన్నారు.
సమరము
సేయరే బలము సాలిన......అనే పద్యం తెలుగునాట చాలా ప్రాచుర్యం పొందింది. శక్తి వుంటే
సంగరానికి దిగి అమీతుమీ తేల్చుకోవాలి. దొంగ దెబ్బలు తీయడం వీరుల లక్షణం కాదు. కానీ
పొరుగు దేశం పాకిస్తాన్ కు ఉన్న ప్రధమ, అధమ లక్షణమే
ఇది కావడం ప్రపంచ దౌర్భాగ్యం.