9, ఆగస్టు 2025, శనివారం
బోనసు జీవితం- భండారు శ్రీనివాస రావు
అర్చన : భండారు శ్రీనివాసరావు
‘గుడికి
వెళ్లి వద్దామా’ అని అడిగేవాళ్ళు ఎవరూ లేకపోయినా, ఈరోజు ఉదయం స్నానం చేసి మా ఇంటికి
ఆనుకునే వున్న హనుమంతుడి గుడికి వెళ్లాను. ఆలయంలో పూజారి ఇంకా కొందరు భక్తులు
వున్నారు. మా ఆవిడ వున్నప్పుడు, మా రెండోవాడు సంతోష్ వున్నప్పుడు ఎన్నోసార్లు
వెళ్లాను. కానీ ఏనాడు ఒక్కడినీ ఆ గుడిలో అడుగుపెట్టలేదు. ఈ గుడి అనే కాదు జీవితంలో
ఒంటరిగా దైవ దర్శనాలు చేసుకున్న సందర్భాలు చాలా అరుదు. నుదుట సింధూరం దిద్దుకునేవాడిని కాదు.
చెప్పాను
కదా లోగడ ఎన్నోసార్లు నాది తిన్నడి (భక్త
కన్నప్ప) భక్తి అని. కానీ ఏదీ తిన్నగా
వుండదు. ఎందుకో ఈరోజు అప్రయత్నంగా కనీ
కనబడనట్టు బొట్టు పెట్టుకున్నాను. అనేక ఏళ్ళుగా మా ఇంట్లో ఏటేటా జరిగే తద్దినాలకి, మాసికాలకి క్రమం తప్పకుండా వచ్చే పూజారి సూర్య నారాయణ గారు కూడా నన్ను గుర్తు పట్టలేదు, పట్టిన తర్వాత ఆయన కళ్ళల్లో రవంత
ఆశ్చర్యం. బహుశా దేవుళ్ళు కూడా
ఆశ్చర్యపోయివుంటారు. కానీ లీలా మానుషరూపాలు కదా! వారి ముఖకవళికలను గుర్తించడం
మానవుడినైన నా వంటివారికి అసాధ్యం.
చేయగలిగినది, చేయించగలిగినది అర్చన. చేయించాను.
గోత్రం ఒక్కటే కానీ నామాలు పెక్కు. అందరివీ చెప్పాను మా అమ్మానాన్నల నుండి మొదలెట్టి
చిన్నారి మనుమరాలు జీవిక దాకా.
ఉదయం
నుంచి చుట్టపక్కాలు,
స్నేహితులు, ఫేస్
బుక్ మితృలు అనేక మంది, అన్ని వయసుల వాళ్ళ నుంచి ఫోన్లు. సందేశాలు. పిలుపుల్లో
అంకుల్ నుంచి తాతయ్యదాకా ప్రమోషన్ వచ్చింది. పెద్దరికంలో వున్న మజా కూడా అనుభవంలోకి
వచ్చింది.
అందరికీ
నమస్కారాలు,
అభివందనాలు,
కృతజ్ఞతలు,
ఆశీస్సులు.
(07-08-2025)
8, ఆగస్టు 2025, శుక్రవారం
అయాం ఎ బిగ్ జీరో : (207) : భండారు శ్రీనివాసరావు
వర్షార్పణం
జీవితంలో
పుట్టింది ఒక్క రోజునే అయినా,
పుట్టిన రోజులు ప్రతియేటా వస్తుంటాయి. చిన్నప్పుడు పండగలా అనిపించేది. ఇప్పుడు
అన్ని రోజుల్లో అదొక రోజు. అంతకంటే ప్రత్యేకత ఏమీ లేదనిపిస్తోంది.
ఈ ఫేస్
బుక్ లేనిరోజుల్లో ఈ రోజు ఎలా గడిచేదో ఆలోచిస్తే నవ్వు వస్తుంది. అమ్మా నాన్నా
కొత్త బట్టలు
కొనిపెడతారు అనే చిరు ఆశ పుట్టినరోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేలా చేసేది. స్కూలు రోజుల్లో అయితే, ఆ రోజు పుట్టిన రోజు జరుపుకునే పిల్లాడు ఇచ్చే చాక్ లెట్ రుచిని ఆనందంగా ఆస్వాదించడం. మరొకటి ఇస్తే ఎంత బాగుంటుందో
అనుకోవడం. కొంచెం పెద్దయ్యాక, గ్రీటింగు కార్డుల సంబరాలు,
ఇచ్చేది
ఆడపిల్లకు అయితే, అందమైన కొటేషన్లు వున్న కార్డులకోసం ఒక పూటల్లా షాపుల చుట్టూ తిరగడం, ఫోన్లు
చేసి శుభాకాంక్షలు చెప్పడం, నలుగురు
దోస్తులతో కలిసి హోటల్లో టిఫినో, భోజనమో
చేసి, వీలయితే (డబ్బులు వుంటే) ఓ సినిమా చూడడం, మరి కొంచెం పెరిగాక అంటే అటు వయసులో, ఇటు జీవితంలో అన్నమాట, దగ్గరి స్నేహితులతో పార్టీలు, పెళ్లయ్యాక వచ్చే పుట్టిన రోజున
భార్య ఇచ్చే మంగళ హారతులు,
దేవాలయ దర్శనాలు, కుటుంబంతో కలిసి మంచి
హోటల్లో భోజనాలు అలా అలా గడిచిపోయేవి పుట్టిన రోజులు.
అదొక
అందమైన కాలం. మళ్ళీ మళ్ళీ తిరిగి రాని మంచి కాలం.
ఫేస్
బుక్ మితృలు, బుక్
వెలుపలి మితృలు, చుట్టపక్కాలు, ఆత్మీయులు, ఆప్తబంధువులు చేసిన ఫోన్లు, పంపిన సందేశాలు, చెప్పిన
శుభాకాంక్షల వరదలల్లో ఒక పక్క కొట్టుకు పోతూ, మరోపక్క ఆకాశానికి చిల్లులు పడ్డట్టు
కురుస్తున్న భారీ వర్షంలో, చుట్టూ గట్లు తెగిన చెరువులా చుట్టుముట్టిన నీటి
నడుమ నడుస్తున్నదో, కొట్టుకుపోతున్నదో
తెలియని ఒక కారులో, దిక్కు తోచని స్థితిలో దారులు వెతుక్కుంటూ, ట్రాఫిక్ ని తప్పించుకోవడానికి
సందులు, గొందుల బాట
పట్టి వెళ్ళిన దారిలోనే మళ్ళీ మళ్ళీ తిరుగుతూ ఇళ్లకు చేరడం కోసం దాదాపు ఆరు గంటల పాటు చేసిన ప్రయాణం తలచుకుంటే, ఇంతకంటే విభిన్నంగా, విచిత్రంగా,
వైవిధ్యంగా ఎవరికైనా వాళ్ళ పుట్టిన రోజు గడుస్తుందా చెప్పండి. సాయంత్రం
అయిదు గంటలకు మొదలైన ఈ వర్షంలో ప్రయాణం
రాత్రి పదకొండు గంటలకు ముగిసింది.
ఈ నడుమ
ఫోను పలకరింపులు. వీటితో వున్న కాస్త మొబైల్ ఫోన్ చార్జ్ అయిపోతుందేమో అనే భయం. కారు అద్దాల నుంచి, కురుస్తున్న వర్షపు ధారల్లో
తడిసిముద్దవుతున్న బాహ్య ప్రపంచం కంటికి స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, చార్జ్ అయిపోతే అయిన వాళ్ళతో మాటా ముచ్చటా లేకుండా పోతుందేమో అనే సందేహంతో, ఫోను
చేసి శుభాకాంక్షలు చెప్పేవారితో కట్టె కొట్టె అన్నట్టు ముక్తసరిగా మాట్లాడడం చాలా ఇబ్బందిగా
అనిపించింది.
నా మేనల్లుడు
డాక్టర్ రంగారావు గారి కుమారుడు డాక్టర్ భరత్ ముచ్చటపడి కొనుక్కున్న కొత్త కారు.
ఇంటి నుంచి గంట దూరంలో నార్సింగ్ దగ్గర ఒక
రిసార్ట్ లో జరుగుతున్న పెళ్లి వేడుక కోసం
ఈ ప్రయాణం. వెళ్ళేటప్పుడు బయట భానుడి చండ్ర
నిప్పుల ప్రతాపం ఎంత తీవ్రంగా వుందన్నది రిసార్ట్ దగ్గర కారు దిగిన తర్వాత
తెలిసింది. ఈ మధ్య కురిసిన వానల వల్ల నగరం చాలావరకు చల్లబడింది అనే భావనతో ఉన్నాము.
ఊరి బయట దూరంగా విశాలమైన ప్రాంతంలో చక్కని
వేప వృక్షాలతో బయట వాతావరణం చాలా
ఆహ్లాదకరంగా వుంటుందనే ఊహతో కారు డోరు తీసి దిగిన మాకు బయట ఎండ పెడేల్మని మొహం మీద
ఈడ్చి కొట్టింది. దాంతో వేగంగా నడుచుకుంటూ
వెళ్లి పెళ్లి బృందాన్ని కలిశాము. ఏసీ
హాళ్ళు, ఏసీ గదులు, ఏసీ భోజన మందిరాలు. చాలా గొప్పగా
తీర్చి దిద్దారు ఆ రిసార్ట్ ని. పేరు ‘ఆయన’ (AYANA). తెలుగు ‘ఆయన’ ఈ ఆయన కాదు
అనుకుని గూగులమ్మని అడిగితే, చాలా
చెప్పింది. ఉత్తరాయణం,
దక్షిణాయనంలో వున్న ఆయనలతో పోల్చింది. ఇది కుదరదు అనుకుంటే చక్కని అమ్మాయి
అనుకోమంది. అయినా
ఈ మధ్య పిల్లలకు పెడుతున్న పేర్లే సరిగా అర్ధం కావడం లేదు. ఇక రిసార్టులు, కాంప్లెక్సుల
సంగతి చెప్పాలా!
పేరు
సంగతి అటుంచి రిసార్ట్ ను మాత్రం చాలా వైవిధ్యంగా తీర్చి దిద్దారు. దగ్గరి
బంధువులు ఎంతమంది వచ్చినా,
హాయిగా మూడు రోజుల పెళ్లి వేడుకలను అక్కడే
బస చేసి తీరికగా తిలకించేలా స్టార్ హోటళ్ళను తలదన్నే రీతిలో వసతి సౌకర్యాలు
వున్నాయి.
ఎదుర్కోలు
సాంప్రదాయ వేడుక హంగామాగా ముగిసిన తర్వాత, భోజనాలు చేసి, నేను, నామేనల్లుడు డాక్టర్ మనోహర్, డాక్టర్ భరత్
కారులో ఇళ్లకు బయలుదేరాము. అప్పటికి వాతావరణం కొంత చల్లబడింది. భరత్ మొబైల్ లో
తెలంగాణా వెదర్ మ్యాన్ అనే పేరుతో ఒక కుర్రవాడు తయారు చేసిన APP వుంది. అది
చెప్పిన ప్రకారం కాసేపట్లో భారీ వర్షం కురిసే అవకాశం వుంది. కురిసే సమయాలు, వర్షం పడే
ప్రాంతాలు కూడా వివరంగా చూపింది. భారీని మించిన భారీ వర్షం నగరాన్ని ముంచెత్తబోతోందన్న
హెచ్చరిక తెలంగాణా వెదర్ మ్యాన్ ఫోర్ కాస్ట్ సారాంశం.
మనోహర్ వుండేది అశోక్ నగర్ లో. మధ్యలో మేము వుండే యూసుఫ్
గూడా,
ఎల్లారెడ్డి గూడా. డ్రైవర్ వుండేది కూకట్ పల్లి. అంచేత ముందు మేము దిగి మనోహర్ ని
కారులో పంపిచ్చేద్దాం అని భరత్ అన్నాడు.
కారు ప్రయాణం సజావుగా సాగుతోంది. నేనూ మనోహర్ ఒక ఈడు
వాళ్ళం (నా కంటే ఏడాది చిన్న) కాబట్టి చిన్నతనంలో మా ఇళ్ళల్లో జరిగిన పెళ్ళిళ్ళ
ముచ్చట్లు మననం చేసుకున్నాము. ఒకే కాలానికి చెందిన ఇద్దరు కలిస్తే కాలం
తెలియకుండానే గడిచిపోతుంది. ఈ ముచ్చట్ల మధ్య ఆ వెదర్ మ్యాన్ అంచనా వాస్తవరూపం
దాలుస్తోందన్న సంగతి మాకు తెలియలేదు.
వేటూరి రాసిన ‘చినుకులా రాలి,నదులుగా సాగి, వరదలై పోయి, కడలిగా పొంగు’ పాటలా కాకుండా, వర్షం మొదలు కావడమే
తద్విరుద్ధంగా జరిగింది. చినుకులు లేవు, ఆకాశానికి చిల్లులు పడ్డట్టు ఏకంగా ఏనుగు తొండపు ధారలే!
చూస్తుండగానే రోడ్ల మీద ఎక్కడినుంచో తన్నుకు వస్తున్నట్టు వరద నీటి ప్రవాహాలు.
నిమిషాల వ్యవధిలో ట్రాఫిక్ అస్తవ్యస్తం. బహుశా వాహనదారులు
అందరూ గూగుల్ మ్యాపులని నమ్ముకున్నట్టున్నారు. ఎటు నీలి రంగు ఇండికేటర్
కనిపిస్తే అటు వాహనాలని అడ్డదిడ్డంగా మళ్లిస్తున్నారు. దాంతో అంతా అస్తవ్యస్తం.
భరత్ కాల్
డ్రైవర్ భాస్కర్ నెమ్మదస్తుడు. వేగంగా నడిచే కారు వేగాన్ని నత్త నడకను తలదన్నే
రీతిలో అతి తక్కువ వేగానికి తగ్గించి నడపడంలో వున్న కష్టం నడిపే వాడికే
తెలుస్తుంది. కారులో వున్న ముగ్గురం ఇవేవీ పట్టించుకునే పరిస్థితిలో లేము. మా
ముచ్చట్లలో మేమున్నాము.
కాసేపటి తర్వాత చూస్తే చుట్టూ నీళ్ళు, మధ్యలో
కారు, కారు ముందు కారు, కారు వెనక
కారు. ఎన్ని కార్లు అలా ఆగిపోయాయో లెక్క చెప్పడం కష్టం. ఎటు చూసినా ఆగిపోయిన
కార్లే. ఎటు చూసినా పరవళ్ళు తొక్కుతూ పారుతున్న వర్షపు వరద నీళ్ళే. అప్పటికే మేము
బయలుదేరి రెండు గంటలు దాటింది. పరిస్థితిలో తీవ్రత అర్ధం అయింది. అశోక్ నగర్ లో
ముందు మనోహర్ ని దింపి మేము వెనక్కి వద్దామనుకున్నాము. గూగుల్ మ్యాపు చూస్తే అన్నీ
ఎర్ర గీతలే.
అశోక్ నగర్ పోయి రావాలంటే మూడు, నాలుగు గంటలు లేదా అంతకంటే ఎక్కువే పట్టేలా వుంది. అంచేత
రెండు కిలోమీటర్ల దూరంలో వున్న మా ఇంటికి కానీ, భరత్ ఇంటికి కానీ పోవాలని నిర్ణయించారు. కానీ పోవడం ఎలా
అన్ని రోడ్లు కిక్కిరిసి వున్నాయి. మా ప్రయాణం ఆగుతోంది కానీ వర్షం ఆగడం లేదు.
దాని ఉధృతి ఇసుమంత కూడా తగ్గడం లేదు.
మొత్తం మీద మా ఇంటికి కూతవేటు దూరానికి చేరాము. అదిగో
ద్వారక అని ఆనందంగా పద్యం అందుకునే లోపల మా వాచ్ మన్ ని గేటు తీసి వుంచమని ఫోన్
చేస్తే కరెంటు పోయింది లిఫ్ట్ లేదు అని చెప్పాడు.
మళ్ళీ భరత్ రూటు మార్చి కారు తన ఇంటి వైపు పొమ్మన్నాడు.
అది మాఇంటికి దగ్గరే. మామూలుగా అయితే కారులో అయిదు నిమిషాలు. మాకు గంటకు పైగా
పట్టింది. కాంప్లెక్స్ మెయిన్ గేటు దగ్గర పక్కకు తిరగడానికి వీలు లేకుండా వాహనాలు
వున్నాయి. ఆ రద్దీ క్లియర్ కావడానికి చాలాసేపు ఇంటి ముందే వెయిట్ చేయాల్సి
వచ్చింది.
మొత్తం మీద ఒక ఇంటి కప్పు కిందకు చేరగలిగాము. మా వలలి
వనితకి ఫోన్ చేస్తే ఏమీ పర్వాలేదు, వర్షం
తగ్గితే, రాత్రి పదకొండు దాటినా సరే, ఫోన్ చేయండి, మా అబ్బాయి మోటార్ సైకిల్ మీద వచ్చి మీకు పోపన్నం
చేసిపెట్టి వెళతానని అని హామీ ఇచ్చింది. అమ్మయ్య పర్వాలేదు అనుకున్నా. కానీ భరత్ బలవంతం
మీద భోజనాలు అక్కడే కానిచ్చాము. వర్షం పూర్తిగా తగ్గిన గంట తర్వాత ట్రాఫిక్ ఒక
పద్దతిలోకి వచ్చిన సంగతి గూగుల్ ద్వారా తెలుసుకుని కారులో మనోహర్ ని అశోక్ నగర్ లో
దింపి, మళ్ళీ తేదీ
మారే ముందు ఎవరి ఇళ్లకు వాళ్ళం చేరుకున్నాము.
కధ సుఖాంతం.
మా పెద్ద కోడలు భావన చెప్పినట్టు ఇబ్బందులను చూసి కష్టాలుగా
భ్రమ పడరాదు.
(ఇంకా వుంది)
6, ఆగస్టు 2025, బుధవారం
అయాం ఎ బిగ్ జీరో (206) : భండారు శ్రీనివాసరావు
5, ఆగస్టు 2025, మంగళవారం
పరిచయ వాక్యాలు
కొడుకే తండ్రయిన వేళ - భండారు శ్రీనివాసరావు
'చిట్టి డెలివర్డ్ మేల్ చైల్డ్ - గోపాలరావు '
1973 ఆగస్టు అయిదో తేదీన మద్రాసు నుంచి మా మామగారు ఇచ్చిన టెలిగ్రాం బెజవాడలో వున్న నాకు మరునాడు చేరింది.
నాడు పుట్టిన నా పెద్ద కొడుకే ఈ సందీప్. సండే నాడు పుట్టాడు కనుక సందీప్ అని పిలవడం మొదలు పెట్టాము. బాలసారలు, నామకరణాలు గట్రా లేవు.
ఇప్పుడు పెరిగి పెద్దవాడు అయి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. నిరుడు వాడి యాభయ్యవ పుట్టిన రోజున నేను కాకతాళీయంగా అమెరికాలో వుండడం తటస్థించింది.
వాడి ఫ్రెండ్స్ ఓ పదిమంది తమ కుటుంబాలతో కలసి పుట్టిన రోజు వేడుకను సియాటిల్ లోని నదిలో నౌకా విహారం చేస్తూ ఘనంగా, సందడిగా నిర్వహించారు. నా కోడలు భావన, మనుమరాళ్ళు సఖి, సృష్ఠి ఈ వేడుకకు తగిన ప్రణాళిక చాలా ముందుగానే సిద్ధం చేశారు.
సందీప్ గురించి మాట్లాడమంటే నాకు మాటలు కరువయ్యాయి.
' 2019 లో నా భార్య నిర్మల కన్నుమూసేవరకు వాడికి నేను తండ్రిని. అప్పటినుంచి వాడు నాకు తండ్రిగా మారి కడుపులో పెట్టుకుని చూస్తున్నాడు '
ఇంతకు మించి నా నోరు పెగల్లేదు.
మాట్లాడిన వారందరూ చక్కటి తెలుగులో మాట్లాడి, సందీప్ తో తమ పరిచయాన్ని, స్నేహాన్ని, వాడి మంచితనాన్ని గొప్పగా ప్రశంసించారు.
ఇంటికి వచ్చిన తర్వాత తల్లి ఫోటో ముందు మళ్ళీ కేకు కట్ చేసి దణ్ణం పెట్టి ఆశీస్సులు తీసుకున్నాడు.
ఒకరకంగా వాడు నా కంటే రెండు రోజులు పెద్ద. నా పుట్టిన రోజు ఆగష్టు ఏడు అయితే వాడిది ఆగష్టు అయిదు.
Happy Birthday Sandeep (IST)
4, ఆగస్టు 2025, సోమవారం
అయాం ఎ బిగ్ జీరో ( 205 ) : భండారు శ్రీనివాసరావు
అయాం ఎ బిగ్ జీరో ( 205 ) : భండారు శ్రీనివాసరావు
మరికొన్ని అమెరికా సంగతులు
సియాటిల్ నుంచి బయలుదేరి సాల్ట్ లేక్ సిటీ మీదుగా రాత్రంతా విమానంలో ప్రయాణం చేసి బాల్టిమోర్ ఎయిర్పోర్ట్ చేరుకునే సరికి ఉదయం ఆరుగంటలు. మా మూడో అన్నయ్య కుమారుడు సత్య సాయి వచ్చి మమ్మల్ని ఇంటికి తీసుకు వెళ్ళాడు. రాత్రి నిద్ర మొత్తం బుధవారం పగటి వేళ బాకీ తీర్చుకున్నాము.
ఎందుకంటే మర్నాడు గురువారం ఆ మర్నాడు శుక్రవారం హెక్టిక్ స్కెడ్యూలు. మా అన్నయ్య పిల్లలు అమెరికాలో వుండడం వల్ల నా ప్రయాణం నల్లేరు మీద బండిలా సాగుతోంది.
ఒకరకంగా చెప్పాలి అంటే గవర్నర్ గారి పర్యటన మాదిరిగా వుంది. అన్నీ ఎరెంజ్ చేసి కారు, విమానం ఎక్కమంటారు.
గురువారం అంతా అమెరికా రాజధాని వాషింగ్టన్ డీ సీ అంతా కలయ తిరిగాము. Nations' most famous address వైట్ హౌస్ మా ప్రియారిటీ.
సెక్యూరిటీ హడావిడి వుంటుందని అనుకుంటూ వెడితే అక్కడ ముగ్గురు నలుగురు సాయుధ పోలీసులు మాత్రమే కనిపించారు. ముందుగా ఆన్ లైన్లో బుక్ చేసుకుంటే విజిటర్లను లోపలకు కూడా అనుమతించే ఏర్పాటు వుందట.
విచిత్రం ఏమిటంటే వైట్ హౌస్ కు వెళ్ళే మార్గంలో, దానికి కూతవేటు దూరంలో పేవ్ మెంట్ మీద ఇద్దరు బిచ్చగాళ్లు (హోం లెస్) కనిపించారు. అదే దోవలో దారిపక్కన టోపీలు, టీ షర్టులు అమ్ముకుంటున్న వాళ్ళు కనిపించారు.
అమెరికా పార్లమెంట్, లింకన్ మెమోరియల్, వాషింగ్ టన్ మెమోరియల్ (ఎత్తైన స్థూపం) చూసాము. ఎటు తిరిగినా, ఏమి చేసినా, ఫోటోలు తీసుకుంటున్నా, అక్కడ అడిగేవాళ్ళు, అభ్యంతర పెట్టేవాళ్ళు ఎవరూ లేకపోవడం చిత్రంగా అనిపించింది. అటకాయించే భద్రతా సిబ్బంది మాకు కనబడలేదు.
అమెరికా రాజధానిలో మేము చూసినంతమేరకు , పెద్ద పెద్ద భవనాలు వున్నాయి కానీ, ఆకాశ హర్మ్యాలు కానరాలేదు. దానికి కారణం అడిగితే, వాషింగ్ టన్ మెమోరియల్ స్థూపం కంటే మించి ఎత్తైన భవనాలు నిర్మించరాదని చట్టం వుందని చెబుతారు.
సాయంత్రం తిరిగి బాల్టి మోర్ వస్తూ, రీగన్ ఎయిర్పోర్ట్ సమీపంలో గ్రెవెల్లీ పాయింట్ అనే ఒక టూరిస్ట్ ప్రాంతానికి వెళ్ళాము. అప్పటికే అక్కడ వందకు పైగా వాహనాలు పార్కింగు ఏరియాలో ఆగి ఉన్నాయి. విమానాశ్రయం నుంచి బయలుదేరే లేదా అక్కడ ల్యాండ్ అయ్యే విమానాలను ఆ పాయింట్ నుంచి చాలా దగ్గరగా చూడవచ్చు.
హైదరాబాదు బేగంపేటలో ఎయిర్పోర్ట్ వున్నప్పుడు దగ్గరలో ఒక ఫ్లై ఓవర్ మీద నిలబడి, ఇలానే వచ్చిపోయే విమానాలను జనం ఆసక్తిగా చూసిన సంగతులు గుర్తుకు వచ్చాయి.
విమానాలను కనుక్కున్న దేశం అమెరికా. ఎగిరే విమానాలను దగ్గర నుంచి చూడాలని వందలమంది కార్లలో తరలి వెడుతున్న దేశం అమెరికా. చిత్రంగా అనిపించడంలో ఆశ్చర్యం ఏముంది?
అయితే ఒక విషయం ఒప్పుకుని తీరాలి.
ఎంత చిన్న విషయాన్ని అయినా పర్యాటక ఆకర్షణగా మార్చి జనాలను రప్పించడంలో వారి తెలివితేటలు అమోఘం.
మర్నాడు ఉదయం న్యూయార్క్ ప్రయాణం.
అమెరికాలో పర్యాటక ప్రదేశాలు చుట్టబెట్టాలి అంటే ముందు సిద్ధపడాల్సింది కాలి నడకకు.
ఉదయం పదిన్నర కు బాల్టిమోర్ నుంచి రోడ్డు మార్గంలో న్యూయార్క్ బయలుదేరాం.
ఏడుగురం వసతిగా కూర్చుని, ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రయాణించే విశాలమైన వాహనం.
ఫిలడెల్ఫియా, డెలావేర్ మీదుగా న్యూజెర్సీ చేరుకున్నాము. డెలావేర్ అనేది అమెరికాలో చాలా చిన్న రాష్ట్రం. స్టేట్ సేల్ టాక్స్ వుండని కారణంగా అనేక పెద్ద కంపెనీలు అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుంటాయి. ఖరీదైన సెల్ ఫోన్లతో సహా అనేక వస్తువులు బయటకంటే చౌకగా లభిస్తాయి.
చుట్టుపక్కల అనేక రాష్ట్రాల వారు ఆ రాష్ట్రానికి వెళ్లి కొనుగోళ్లు చేస్తుంటారు.
అమెరికా మాజీ ప్రెసిడెంటు బైడన్ ఈ రాష్ట్రానికి చెందిన వారే. గతంలో వైస్ ప్రెసిడెంటుగా వున్నప్పుడు ఆయన కుటుంబం ఇక్కడే వుండేదిట. ఆయన రైల్లో ప్రతిరోజూ న్యూయార్క్ ఆఫీసుకు వెళ్లి వస్తుండేవారు అని మాతో పాటు వున్న మిత్రుడు చెప్పారు.
ఇక న్యూ జెర్సీలో ఆగి ఇండియా స్క్వేర్ లో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వీధిలోని సదరన్ స్పయిస్ రెస్టారెంట్ లో భోజనాలు చేశాము.
తర్వాత కాలి నడకన కలయ తిరిగాము. పక్కనే వున్న పాన్ షాపులో కిళ్ళీలు తీసుకున్నాము. అచ్చం ఇండియాలో వున్నట్టే వుంది. ఆ షాపుకు ఒక తాడు వేలాడ తీసివుంది. ఎవరో వచ్చి ఒక్కటంటే ఒకటే సిగరెట్ కొనుక్కుని, ఆ తాడు కొసన ఉన్న నిప్పుతో సిగరెట్ వెలిగించుకోవడం చూసి ఆశ్చర్యం వేసింది. అమెరికా వచ్చిన తర్వాత మొదటిసారి ఆ వీధిలో కారు హారన్లు వినిపించాయి. ఒకచోట రోడ్డు మీద రంగురంగులలో వేసిన రంగవల్లి కనిపించింది. అలాగే ‘మీ చేయి చూసి జాతకం చెప్పబడును’ అనే బోర్డు కూడా.
నదీ గర్భంలో సుమారు వందేళ్లకు పూర్వం నిర్మించిన హాలండ్ టన్నెల్ ద్వారా హడ్సన్ నదిని దాటి అవతల న్యూయార్క్ హార్బర్ కు వెళ్లాము. అక్కడ నుంచి పెద్ద బోటులో ప్రయాణిస్తూ, నది రెండు వైపులా అటు న్యూ జెర్సీ, ఇటు న్యూయార్క్ లోని రమ్యహర్మ్య భవనాలు వీక్షిస్తూ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చేరుకున్నాము.
అద్భుతమైన నిర్మాణం. వందేళ్లకు పూర్వమే ఆ భారీ శిల్పం రూపొందించిన తీరు విభ్రమ కలిగించేదిగా వుంది.
పారిస్ లో ఆ భారీ విగ్రహాన్ని నిర్మించి విడి భాగాలుగా విడతీసి ఆ నాటి తెర చాప పడవల్లో న్యూయార్క్ తీరానికి తరలించిన తీరును వివరించే లఘు చిత్రాలను అక్కడ భారీ (ఐ మాక్స్) తెరలపై ప్రదర్శిస్తున్నారు. వాటిని చూసాము.
తరువాతి అడంగు న్యూయార్క్ డౌన్ టౌన్ లోని గ్రౌండ్ జీరో. అంటే ఉగ్రవాదుల దాడులకు గురై నేలమట్టం అయిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాల స్థానంలో నిర్మించిన అమర వీరుల స్మారక ప్రదేశం. అలాగే అదే ప్రాంతంలో మరో సమున్నతమైన వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనాన్ని కొత్తగా నిర్మించారు.
అక్కడికి చాలా దగ్గరలో వున్న ప్లాజా అనే భవనాన్ని చూడడానికి వెళ్ళాము. ఈ భవనంతో మాకో బాదరాయణ సంబంధం, అనుబంధం వుంది. దాదాపు మూడు దశాబ్దాలకు పూర్వం మా రెండో అన్నయ్య భండారు రామచంద్ర రావు గారు, ఈ భవనం 29 వ అంతస్తులో అనుకుంటా కొన్ని సంవత్సరాలు నివసించారు. అప్పుడు ఆయన న్యూయార్క్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తూ వుండే వారు.
తర్వాత గ్రౌండ్ జీరో పక్కనే అపూర్వ నిర్మాణ కౌశలంతో నిర్మించిన అండర్ గ్రౌండ్ రైల్వే చూసాము.
అక్కడ నుంచి అమెరికాతో పాటు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను శాసించే న్యూయార్క్ స్టాక్ ఎక్సెంజి దగ్గర ప్రఖ్యాతిగాంచిన భారీ బుల్ విగ్రహాన్ని చూడడానికి వెళ్ళాము.
నమ్మకమో, మూఢ నమ్మకమో తెలియదు, వీటికి ఎవరూ అతీతులు కారేమో అనిపించే దృశ్యాన్ని అక్కడ చూసాను.
షేర్ లావాదేవీల్లో కలిసి రావాలని కోరుకుంటూ అనేక మంది ఆ బుల్ విగ్రహం వద్దకు వెడతారు. తప్పేమీ లేదు. ఎవరి నమ్మకాలు వారివి. అయితే ఇక్కడ చిత్రం ఏమిటంటే ఆ బుల్ వృషణాలను తాకి మనసులో కోరుకుంటే వారు కోరుకున్నట్టుగా షేర్ ధరలు పెరుగుతాయట. ఈ నమ్మకం అక్కడి వారిలో ఎంతగా వున్నదో తెలియడానికి అక్కడ కనిపించిన క్యూలే సాక్ష్యం.
ఇక చివరి మజిలీ ప్రపంచ ప్రఖ్యాత టైమ్ స్క్వేర్.
నిజానికి న్యూయార్క్ లోని అనేకానేక వీధుల్లో అదొకటి. కానీ దాని వైభోగమే వేరు. పర్యాటకులు అందరూ కట్టగట్టుకుని వచ్చినట్టు ఆ ప్రాంతం అంతా జనంతో కిటకిటలాడుతోంది. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ అంతా అక్కడే వినియోగిస్తున్నట్టు ధగధగలాడుతోంది.
నా కంటికి మాత్రం అదో కలవారి తిరునాళ మాదిరిగా అనిపించింది.
కాళ్ళు అరిగేలా తిరిగి తిరిగి కారులో మళ్లీ వూరు చేరే సరికి అర్ధరాత్రి రెండు గంటలు దాటింది.
మా అన్నయ్య కొడుకు సత్యసాయి నేను ఇండియా వెళ్ళిపోతున్న సందర్భంగా వాళ్ళ ఇంట్లో వీడ్కోలు విందు ఇచ్చాడు. వున్న వూళ్ళో వాళ్ళే కాకుండా చుట్టుపక్కల అనేక ప్రదేశాల నుంచి మా బంధుమిత్రులు దాదాపు నలభై మంది వచ్చారు. ఇంతమంది చుట్టూ వుంటే ఒంటరివాడిని ఎందుకవుతాను?
అమెరికాలో అనేక ప్రదేశాలు తిరిగాను. విమానాల్లో, కార్లలో ప్రయాణించాను. పెద్ద పెద్ద హోటళ్లలో బస చేసాను. ఎక్కడా ఒక్క రూపాయి (డాలర్) ఖర్చు చేయనివ్వకుండా వెంట వుండి అన్నీ వాళ్ళే చూసుకున్నారు. నా పట్ల ఇంతటి అవ్యాజానురాగం చూపించడానికి నాకు తెలిసి ఏ ఒక్క కారణం లేదు, కేవలం మా అమ్మ, నాన్న కడుపున పుట్టిన నా అదృష్టం తప్ప.
తోకటపా:
వైట్ హౌస్ పైన ఎగురుతున్న అమెరికన్ జాతీయ పతాకం కిందనే నలుపు తెలుపులో మరో జెండా ఎగురుతుంటుంది. యుద్ధాల్లో మరణించిన లేదా ఆచూకీ తెలియకుండా పోయిన అమెరికన్ సైనికుల స్మృత్యర్ధం రూపొందించిన పతాకం అది.
కింది ఫోటోలు:
