11, నవంబర్ 2013, సోమవారం

రారండోయ్ రారండోయ్ రేడియో విందాం రారండోయ్ - 4


రెండేళ్ళ తరువాత అంటే 1935 లో డెక్కన్  రేడియో కేంద్రాన్ని నిజాం స్వాధీనం చేసుకున్నారు. నిజాం సంస్థానంలోని వైర్  లెస్ విభాగం కింద డెక్కన్ రేడియో పనిచేయడం మొదలు పెట్టింది.  నవాబ్ ఆలీ యవార్ జంగ్ ఆధ్వర్యంలో డెక్కన్ రేడియో కేంద్రానికి  మరిన్ని హంగులు సమకూరాయి. ఇంగ్లాండ్ లోని మార్కొనీ కంపెనీ తయారు చేసిన శక్తివంతమైన రెండువందల వాట్ల రేడియో ట్రాన్స్ మిటర్ ను దిగుమతి చేసుకున్నారు. రేడియో కేంద్రాన్ని చిరాగ్ ఆలీ లేన్ నుంచి ఖైరతా బాద్ లోని యావర్ మంజిల్  అనే భవనంలోకి మార్చారు. కొత్త రికార్డింగ్ స్టుడియోలను నిర్మించారు.  నగర పొలిమేరల్లోని సరూర్ నగర్ ప్రాంతంలో పెద్ద యాంటీనా నెలకొల్పారు. దానిమీద వున్న యెర్ర విద్యుత్ దీపాలు నగరంలో సుదూరంగా వుండే అనేక ప్రాంతాలకు కనబడేవని చెప్పుకునే వారు. డెక్కన్ రేడియోలో పనిచేసే ఒక ఉద్యోగిని లండన్ పంపించి బీబీసీ లో శిక్షణ ఇప్పించారంటే   డెక్కన్ రేడియో పట్ల నవాబ్ ఆలీ యవార్ జంగ్  ఎంతటి శ్రద్ధ తీసుకున్నదీ అర్ధం అవుతుంది.


  
(డెక్కన్ రేడియో స్టూడియోలో అలనాటి సంగీతకారులు)

తరువాతి రోజుల్లో డెక్కన్ రేడియో సంగీత కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. వాటికి శ్రోతల నుంచి  విశేషమైన ఆదరణ లభించడం అందుకు కారణం. ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ఉస్తాద్ బడే గులాం ఆలీ ఖాన్హీరా బాయ్  బరడేకర్, ఆవిడ సోదరి సరస్వతీ రాణే  వంటి సుప్రసిద్ధ సంగీతకారులు డెక్కన్ రేడియో కళాకారుల జాబితాలో వుండేవారు. మరో ప్రసిద్ధ సంగీత కారుడు ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ రెండు పర్యాయాలు హైదరాబాదు వచ్చి డెక్కన్ రేడియోలో   ప్రోగ్రాములు ఇచ్చారు.
డెక్కన్ రేడియో నుంచి తెలుగు, కన్నడం, మరాఠీ భాషల్లో కూడా కొన్ని కార్యక్రమాలు ప్రసారం అయ్యేవి కాని వాటి వ్యవధి చాలా పరిమితం.   



10, నవంబర్ 2013, ఆదివారం

కొత్త బంగారులోకం



పొద్దున్నే పెడితే టీవీ లేదు. కరెంటు వుంది. ఈ కేబుల్ వాడికి చెప్పాలి. సెట్ అప్ బాక్స్ గుడ్డూ అంటూ వేలకువేలు పట్టుకుపోయాడు కాని టీవీ ఎప్పుడూ అంతే. ఇరవై నాలుగ్గంటలు వెధవ చాకిరీ వెధవ చాకిరీ అనుకుంటున్నదేమో తెలియదు. ఒక ఛానల్  వస్తే ఇంకో ఛానల్ గుర్రు బర్రు. పిక్చర్  ట్యూబ్ పగిలిపోతున్నట్టు ఒకటే చప్పుళ్ళు. డిజిటల్ క్వాలిటీ ప్రసారాలు అంటూ చేసిన ప్రచారాలు అంతటితోనే  సరి. ఎవడో ఈ బాక్సులు తయారుచేసేవాడు బాగుపడివుంటాడు. డిజిటల్ సంగతి సరే వెనకే బాగావుండేదని అంతా అనేవారే  కాని అడిగేవాడు లేడు. అదే సర్కారు ధైర్యం.
టీవీ లేకపోతే పోయింది. ఈ సెల్ ఫోనుకేమొచ్చింది. వూరికే చెవికోసిన మేకలా అరుస్తుండేది. ఇవ్వాళ ఏమిటి ఇలా మూగనోము పట్టింది. చార్జ్  అయిపోయిందా అంటే అదీ లేదు. ఏవైందబ్బా!
సెల్ ఫోను సరే అసలు నాకేమైంది. చుట్టూ ప్రపంచం చిత్రంగా మారిపోతోంది. రేడియోలో వెంకటేశ్వర సుప్రభాతం కమ్మగా వినబడుతోంది. హాల్లో ఓ మూల బల్లపై, వృద్ధాశ్రమంలో సీనియర్ సిటిజన్ లాగా ఇన్నాళ్ళు మౌనంగా   పడున్న లాండ్ లైన్ ఫోను గణ గణా మోగుతోంది. వరండాలోకి వెళ్ళి చూస్తే అందరి ఇళ్ళ పైకప్పుల మీద దొండ పాదుల పందిళ్ళ మాదిరిగా దూరదర్శన్ యాంటీనాలు దర్శనమిచ్చాయి. వెళ్ళి  టీవీ పెడితే,  పాలూ చేలూ పెరుగూ పేడా గురించి ఎవరో  చెబితే ‘మా స్టుడియోకి వచ్చి ఎన్నో మంచి విషయాలు చెప్పారం’టూ యాంఖరమ్మ వయ్యారాలు పోతూ అంటోంది.
రోజూ పొద్దున్నే ఇంటి గుమ్మం ముందు పడివుండే పేపరు మధ్యాహ్నానికి కానీ మొహం చూపించలేదు. అప్పుడు కానీ ‘ఈ చిత్రం భళారే విచిత్రం’ కారణం అర్ధం కాలేదు. అంతరిక్షంలో ఎక్కడినుంచో దారితప్పి  భూమి వైపు అమిత వేగంతో దూసుకువస్తున్న ఓ గ్రహశకలం మరోసారి దారితప్పి రోదసిలో వున్న మన సమాచార కృత్రిమ ఉపగ్రహాన్ని డీకొన్నదట. దాంతో దేశంలో సమాచార వ్యవస్థ మొత్తం కుప్పకూలిందట.
ఈ ‘ట’ వార్తలు ఇంకా పూర్తి కాకముందే మెలకువ వచ్చేసింది. కల చెదిరింది. అన్ని గదుల్లో టీవీలు, అందరి చేతుల్లో సెల్ ఫోన్లు తెగ  మోగిపోతున్నాయి.
అయ్యో ఇది కలా !

కల నిజమైతే యెంత బాగుంటుంది.  
(10-11-2013)             

9, నవంబర్ 2013, శనివారం

రారండోయ్ రారండోయ్ రేడియో విందాం రారండోయ్ - 3



దేశానికి స్వాతంత్ర్యం రావడానికి ఓ పుష్కర కాలం కంటే చాలా ముందుగానే, అప్పటి నిజాం సంస్థానంలో రేడియో ప్రసారాలు మొదలయ్యాయి. 1933 లో రెండువందల వాట్ల ట్రాన్స్మిషన్ శక్తితో,  ‘డెక్కన్ రేడియోఅనే పేరుతో  ఒక ప్రైవేటు రేడియో స్టేషన్ ను హైదరాబాదులో ఏర్పాటు చేశారు. ఆ రేడియో ట్రాన్స్ మిటర్  ను స్తానికంగా రూపొందించడం విశేషం. వాస్తవానికి ఈ రేడియో కేంద్రం  ఒక కుటుంబం ఆధ్వర్యంలో ఏర్పాటయింది. ఆ కుటుంబసభ్యులే కేంద్రం నిర్వహణ బాధ్యత చూసుకునేవారు. చిరాగ్ ఆలీ లేన్ లోని ఆజం మంజిల్ భవనంలో ఈ రేడియో కేంద్రం పనిచేసేది.
ఉర్దూలో వార్తలతో పాటు గజల్స్, ఖవ్వాలీలు,  పాటలు ప్రసారం అయ్యేవి. ఆ రోజుల్లో సినిమా పాటల రికార్డులు అంత సులభంగా దొరికేవి కావు. దానితో స్థానిక సంగీత కళాకారులు రేడియో కేంద్రానికి వచ్చి తమ కార్యక్రమాలను రికార్డ్ చేసేవారు. ప్రసిద్ధ సంగీత విద్వాంసుడు రోషన్ ఆలీ డెక్కన్ రేడియోలో మొదటి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆ తరువాత ఎం ఏ రవూఫ్ డెక్కన్ రేడియోలో స్టుడియో ఎక్జిక్యూటివ్ గా చేరారు. ఆయన పేరు పొందిన గజల్ గాయకుడు. తదనంతర కాలంలో రవూఫ్ ఈ కేంద్రానికి డైరెక్టర్ అయ్యారు.  
మొహరం మాసంలో  రేడియో కేంద్రానికి సెలవు ప్రకటించేవారు. ప్రసారాలు వుండేవి కావు.         

ఆ తరువాత కొన్ని మార్పులు చేశారు. మొదటి పదమూడు రోజులు ప్రసారాలు నిలిపివేసేవాళ్ళు. మిగిలిన రోజుల్లో కూడా సంగీత కార్యక్రమాలు వుండేవి కావు. స్థానిక వార్తాపత్రికల్లో వెలువడిన వార్తల ఆధారంగా న్యూస్ బులెటిన్లు తయారయ్యేవి. రాష్ట్రానికి సంబంధించిన సమాచారమే వార్తల్లో చోటుచేసుకునేది.

ఇదో చిత్రం



తెలతెల్లారుతున్నప్పుడు, కంటున్న  కలలకు తెరపడుతున్నప్పుడు,  కళ్ళు తెరవాలంటే తగని బద్ధకం. ఇంకాసేపు అలాగే  పడుకోవాలని, నిద్ర పోవాలని తెగ అనిపిస్తుంది. ఇక  మధ్యాహ్నం భోజనం చేసీ చేయగానే ఓ కునుకు తీయాలని చావుకోరిక పుడుతుంది. కాని  అదేవిటో చిత్రం,  రాత్రి వేళ మాత్రం అర్ధరాత్రి బాగా  పొద్దుపోయిన తరువాత కూడా నిద్రపట్టి చావదు.


8, నవంబర్ 2013, శుక్రవారం

ఏవీఎస్ అనే మూడక్షరాలా! తుత్తి అనే రెండక్షరాలా !!


మూడయితేనేం రెండయితేనేం ఈ రెండూ ఇప్పుడు లేవు. ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం అనే నవ్వుల రేడు మనల్ని విషాదంలో ముంచేసి ఎక్కడో ఎవ్వరో ఎవరికీ తెలియనివారిని నవ్వులతో ముంచేయడం కోసం ఈ రోజు అర్జంటుగా ఎవ్వరివద్దా   సెలవు తీసుకోకుండానే వెళ్ళిపోయారు.


నేను పనిచేసిన ఆంధ్రజ్యోతిలోనే ఆయనా నా తరువాత పనిచేశారు. నేను నమ్మిన నవ్వుల్నే ఆయన అఖిలాంధ్ర లోకానికి పంచిపెట్టాడు. ప్రెస్ క్లబ్  ఫంక్షన్ కు పిలవగానే వచ్చి, పిలవకుండానే ఆపక్కనే  వున్న మా ఇంటికి వచ్చి ఆ రాత్రి నవ్వుల పువ్వులు పూయించి వెళ్లారు.
ఎవీఎస్ ఒక జర్నలిస్టు. ఒక హాస్య రచయిత. ఒక మిమిక్రీ కళాకారుడు. ఒక రాజకీయ వ్యాఖ్యాత. అన్నింటికీ మించి ఒక మానవతావాది.
మంచివాళ్ళంటే ఆ దేవుడికి ఇష్టం. ఏవీఎస్ లాటి మనుషులంటే మరీ  ఇష్టం. ఆయన చెప్పే ‘తుత్తి’ జోకులంటే మరీ మరీ ఇష్టం. అందుకే చెప్పాపెట్టకుండా ఈ పయనం.
ఆయనకు నా శ్రద్ధాంజలి. 

(08-11-2013) 

చాయ్ పట్టుకొచ్చిన ముఖ్యమంత్రి అంజయ్య


‘అంజయ్య గారితో నా అనుభవాలు’ చదివిన ఆకాశవాణి పూర్వ సంచాలకులు డాక్టర్ పీ.ఎస్.గోపాలకృష్ణ  మరో జ్ఞాపకాన్ని తట్టిలేపారు.
అంజయ్య గారు ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో -  రాష్ట్రం వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధిని గురించి ఆకాశవాణి  ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. దానికి  ముఖ్యమంత్రి సందేశం కూడా జోడిస్తే బాగుంటుందని రేడియో అధికారులు భావించారు.   రికార్డింగ్ యూనిట్  తీసుకుని, అప్పుడు ప్రోగ్రాం ఎక్జిక్యూటివ్ గా పనిచేస్తున్న గోపాలకృష్ణ, నేనూ కలసి   ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళాము. మాటా మంతీ మధ్య అంజయ్యగారు ఎవర్నో పిలిచి అందరికీ చాయ్ తెమ్మని చెప్పి మళ్ళీ కబుర్లలో పడిపోయారు. రికార్డింగ్ కూడా పూర్తయింది.  కాని,  చాయ్ రాలేదని గ్రహించిన అంజయ్యగారు తానే లేచి వెళ్ళి మా అందరికీ ట్రేలో తేనీరు తెచ్చి ఇచ్చారు. ‘ఎలాటి భేషజాలు లేని ముఖ్యమంత్రిని చూడడం తన సర్వీసులో అదే మొదటిసారి’ అని గోపాలకృష్ణ పదే  పదే గుర్తుచేసుకుంటూ వుండేవారు.

(08-11-2013)

రారండోయ్ రారండోయ్ రేడియో విందాం రారండోయ్ - 2


పాటల్లోనే కాదు మాటల్లో కూడా సంగీతం వినవచ్చు. వినిపించవచ్చు.
ఉర్దూ భాషకు ఆ శక్తి వుంది.
డెబ్బయ్యవ దశకంలో హైదరాబాదు రేడియో కేంద్రం నుంచి సరిగ్గా  సాయంత్రం అయిదు గంటల యాభయ్ నిమిషాలకు ఉర్దూలో ప్రాంతీయ వార్తలు మొదలయ్యేవి.
యే ఆకాష్ వాణి హైదరాబాద్ హై.  అబ్ ఆప్  వసీమక్తర్ సే ఇలాఖాయే ఖబ్రే సునియే
ఉర్దూ తెలియని వాళ్లు కూడా వసీమక్తర్ (వసీం అక్తర్) చదివే వార్తలు వినడం నాకు తెలుసు. ఆయన వార్తలు చదువుతుంటే సంగీతం వింటున్నట్టుగా వుండేది.  నేను ఆయనతో కలిసి చాలా సంవత్సరాలు ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం ప్రాంతీయ వార్తావిభాగంలో పనిచేశాను. ఉర్దూ లో అ ఆలు తెలియకపోయినా ఆయనకు అభిమానిగా మారాను. నాకు ఉర్దూ రాదు కాని వసీమక్తర్ కు తెలుగు తెలుసు. పొడి పొడి మాటల్లోనే భావం అర్ధం అయ్యేలా చెప్పేవాడు. ఇక వార్తలు సరేసరి. ముందే చెప్పినట్టు సంగీతం వింటున్నట్టుగా వుండేది. దురదృష్టం ఏమిటంటే ఇటువంటివారి ఫోటోలు దొరక్కపోవడం. వసీమక్తర్ చనిపోయిన రోజు నాకు బాగా జ్ఞాపకం. ఎంతోమంది ఆయన్ని కడసారి చూడడానికి వచ్చారు. వాళ్ళల్లో అన్ని మతాల వాళ్లు వున్నారు. వసీమక్తర్ తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకురావడం ఆయన్ని గురించిన మరో జ్ఞాపకం.
కొన్ని ఉద్యోగాలు చేయడం కూడా పూర్వజన్మ సుకృతం. చిన్నవా పెద్దవా అన్న మాట అటుంచి గొప్పగొప్ప వాళ్ళతో కలిసి పనిచేశామన్న తృప్తి కలకాలం మిగిలిపోతుంది. ఆ అదృష్టం నాకు దక్కింది.

ఈ అనుభవాల సమాహారమే ఈ వ్యాస పరంపర. 
(08-11-2013)   

గాంధీగారి కోతులు


"చెడు కనం, చెడు వినం, చెడు మాట్లాడం" ఇది గాంధీ గారి కాలం నాటి కోతుల మాట.
కానీ ఇవి ఇప్పటి కాంగ్రెస్  కోతులు. వీటి రూటే సపరేటు.


'మాలో ఒకరు చెడు కనరు, మరొకరు చెడు వినరు, ఇంకొకరు చెడు మాట్లాడరు. అయితే నలుగురికీ తెలియని అసలు విషయం ఏమిటంటే -  మాలో చెడు కనని కోతి చెడు వింటుంది, మాట్లాడుతుంది. చెడు వినని కోతి చెడు  కంటుంది, మాట్లాడుతుంది కూడా.  చెడు  మాట్లాడని కోతి వింటుంది, కంటుంది. ఇక మేం ముగ్గురం కలసి విన్నది, కన్నది, మాట్లాడింది ఆ చెడునంతా సమానంగా పంచుకుంటాం. పంచిపెడతాం.
అసలు సిసలు కాంగ్రెస్ కోతులం అన్నమాట. నేటి కాంగ్రెస్ కు అసలైన వారసులం అన్నమాట."  (08-11-2013)

(NOTE: PHOTO CREDIT GOES TO THE OWNER) 

7, నవంబర్ 2013, గురువారం

రారండోయ్ రారండోయ్ రేడియో విందాం రారండోయ్ - 1


ఏ ముహూర్తాన మార్కొనీ మహాశయులు రేడియో కనిపెట్టారో కాని అనేక దశాబ్దాలపాటు అది ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ఇళ్ళల్లో అదో అపూర్వ వస్తువుగా వెలిగిపోయింది. కాలక్రమంలో వచ్చిన మార్పులనే  కారుమబ్బుల క్రీనీడల్లో ప్రస్తుతం కొట్టుమిట్టాడుతూ ఉనికిని కాపాడుకునే విఫల ప్రయత్నం చేస్తున్న రేడియో కదాకమామిషు:

మొత్తం దేశం సంగతి యేమో కాని దక్షిణ భారత దేశంలో రేడియో ప్రసారాలు ప్రారంభం కావడానికి కారకులు ఓ తెలుగు వ్యక్తి అంటే ఒక పట్టాన నమ్మడం కష్టమే. ఆయనే  రావు బహదూర్ సీ.వీ. కృష్ణ స్వామి సెట్టి.  1914 లో మద్రాసు నగర పాలక సంస్థలో ఎలక్త్రికల్ ఇంజినీర్ గా చేరారు. తొలిసారి విమానం ఎక్కిన భారతీయుల జాబితాలో పేరు దక్కిచ్చుకున్న వ్యక్తి. 1924లో మద్రాసు రేడియో క్లబ్ ద్వారా ఆయన రేడియో ప్రసారాలు మొదలుపెట్టారు.  1924 మే 16 న ఏర్పడిన ఈ మద్రాసు ప్రెసిడెన్సీ రేడియో క్లబ్, 1924 జులై  31 నాడు ప్రసారాలు మొదలు పెట్టింది. అయితే ఆ ప్రసారాలలో సంగీతానికే ఎక్కువ ప్రాధాన్యం వుండేది. కాకపొతే ఇది మూడేళ్లలోనే మూతపడింది. అయితే  కృష్ణ స్వామి సెట్టి గారి పూనికతో 1930 ఏప్రిల్ 1 వ తేదీ నుంచి మద్రాసు నగర పాలక సంస్థ రేడియో ప్రసారాలు ప్రారంభించింది.   కాని ఆ పరిమిత ప్రసారాల్లో తెలుగు పాటలు విన్పించినా తెలుగు నాటకాలు వంటివి ప్రసారం అయిన ఆధారాలు లేవనీ ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు డాక్టర్ పీఎస్ గోపాలకృష్ణ ఉవాచ. పోలీసువారి ప్రకటనలు, ఆరోగ్య విశేషాలు కొన్ని ప్రసారం చేసేవారు. బడి పిల్లలకోసం  కొన్ని కార్యక్రమాలు వినిపించేవారు. ఈ ప్రసారాలు  చిత్తూరు, వేంకటగిరి మొదలయిన  చోట్ల వినిపించేవి. వాతావరణం అనుకూలించినప్పుడు బంగాళాఖాతం తీరం వెంబడి వున్న వూళ్ళల్లో విశాఖపట్నం దాకా వినిపించేవని గోపాలకృష్ణ ఒక వ్యాసంలో రాశారు.



(1920 ప్రాంతంలో రేడియో వినడానికి  ఇంత శ్రమ పడేవారు) 

NOTE: COURTESY OWNER OF THE PHOTOGRAPH 

6, నవంబర్ 2013, బుధవారం

పార్టీలు వేరయినా ‘వరస’ ఒక్కటే!


పార్టీలు వేరయినా ‘వరస’  ఒక్కటే!
రాష్ట్ర విభజన అనండి రాష్ట్ర సమైక్యత అనండి – నిప్పూ ఉప్పూ మాదిరిగా ఏమాత్రం పొసగని  అన్ని పార్టీలదీ ఒక్కటే మాట - అదే చిత్రం! అదే విచిత్రం! కావాలంటే ఆయా పార్టీల నాయకులు తరచుగా చెప్పే  మాటలు ఓసారి  గమనించండి. అర్ధమై పోతుంది.
“కేవలం మా పార్టీని ఇరుకున పెట్టడానికి అవతలి పార్టీలు కుమ్మక్కై చేస్తున్న ఆరోపణ ఇది.  ఆ రాజకీయ పార్టీలన్నిటిది  ఒకటే లక్ష్యం.  వోట్లు, సీట్లు. ఎన్నికల్లో గెలిచి అధికారం కైవసం చేసుకోవడం యెలా అన్న యావ తప్పితే వాటికి ఈ విషయంలో మా మాదిరిగా ఎంతమాత్రం  చిత్తశుద్ధి లేదు.”
ఈ మాటలు చెప్పింది, చెప్పేది  ఏ పార్టీ అన్నది, ఏ పార్టీవారన్నది అసలు లెక్క లోకే  రాదు. ఎందుకంటే తిరగేసి మరగేసి అందరూ ఏకధాటిగా వినిపించే వాదనల  సారాంశం ఇదే.  కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వైఎస్ఆర్సీపీ, సీపీఐ,,  ఇలా ఏ పార్టీ వారిదయినా ఒకటే స్వరం. ఒకటే రాగం. పల్లవులే వేరు,  ‘దారులు వేరయినా వారి బారులొక్కటే’ అన్న చందంగా.       
(ఇందుకు సీపీయం మినహాయింపు. ఎందుకంటే వారిది మొదటి నుంచీ  ఒకటే మాట – రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచాలని.  టీ.ఆర్.ఎస్. వాళ్లకు కూడా ఈ మినహాయింపు  కొంత వర్తిస్తుంది ఎందుకంటే ఆ పార్టీ  పుట్టిందే వేర్పాటు నినాదంతో కాబట్టి. వారికి మరో మాటా బాటా లేదు కాబట్టి)

నమ్మకం కుదరాలంటే  ఏదో ఒకరోజు ఉదయం కాస్త మనస్సు ఉగ్గపట్టుకుని  టీవీ చర్చలు చూడండి.
(06-11-2013)       

5, నవంబర్ 2013, మంగళవారం

ఐ పాడ్ మేజిక్



అన్నిరకాల మేజిక్ లు అయిపోయి ఇక ఐ పాడ్ మేజిక్ లు వచ్చేసాయి. మూడునిమిషాలే కాబట్టి హాయిగా చూసెయ్యొచ్చు. ఒక పనయిపోతుంది. ఏమంటారు? లింకుపై నొక్కి చూడండి.
http://www.lifo.gr/tv/videos/460

3, నవంబర్ 2013, ఆదివారం

ఆడవాళ్లా మజాకా!


ఆడవాళ్లంటే గౌరవం పెరిగే సందర్భం నిన్న అనుభవంలోకి వచ్చింది.
ప్రభుత్వ సర్వీసులో వున్నవాళ్ళు పదవీ విరమణ వయసు రాగానే ఇంటికి పంపించేస్తారు. అంతవరకూ ఆఫీసులో నలుగురితో వారు సంపాదించుకున్న ఆదరణను బట్టి వీడ్కోలు గౌరవం వుంటుంది. కాకపొతే కొంత స్థాయీ భేదాలు కూడా  సహజం.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగంలో దాదాపు నలభయ్ ఏళ్ళ బట్టి పనిచేస్తూ వచ్చిన విజయలక్ష్మి అనే ఆవిడ మొన్న అక్టోబర్ ముప్పయి ఒకటిన రిటైర్ అయింది. మామూలుగానే చిన్న కార్యక్రమం పెట్టి వీడ్కోలు ఇచ్చి వుంటే ఇప్పుడీ విషయం రాయాల్సిన అవసరం వుండివుండేది కాదు.
ముందు కొంత నేపధ్యం చెప్పుకుందాం.
గతంలో నేను రేడియోలో పనిచేసేటప్పుడు న్యూస్ ఎడిటర్లు, కరస్పాండెంట్లు అంతా మగ మహారాజులే. స్టెనోలు, టైపిస్టులు మాత్రం ఆడవాళ్లు. న్యూస్ రీడర్లు కొంత మినహాయింపు.  ఇప్పుడా పరిస్తితి పూర్తిగా మారిపోయింది. న్యూస్ యూనిట్ హెడ్ బాఖర్ మీర్జా అయినప్పటికీ న్యూస్ ఎడిటర్ శ్రీమతి సుప్రశాంతి. న్యూస్ కరస్పాండెంట్ శ్రీమతి లక్ష్మి. న్యూస్ రీడర్లు శ్రీమతి తురగా ఉషారమణి, శ్రీమతి మాధవీలత. ఇంగ్లీష్ స్టెనో గ్రాఫర్ శ్రీమతి శైలజ, తెలుగు స్టెనో శ్రీమతి విజయలక్ష్మి. చివరాఖరుకు నాలుగో తరగతి అధికారులు (క్లాస్ ఫోర్ ) కూడా శ్రీమతి శ్యామల, శ్రీమతి అన్నపూర్ణ.
మా యూనిట్లో ఈ ఆడవాళ్లందరూ కలసి  ప్రభుత్వంలో ఒక విభాగాన్ని యెంత సమర్ధవంతంగా నడపవచ్చో రుజువు చేశారు.
2011 లో మొత్తం దేశంలోని ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగాల్లో ‘బెస్ట్ న్యూస్ యూనిట్ అవార్డ్’ హైదరాబాదుకు లభిస్తే ‘బెస్ట్ న్యూస్ ఎడిటర్ అవార్డ్’ను శ్రీమతి సుప్రశాంతి కైవసం చేసుకున్నారు. ‘2009 బెస్ట్ న్యూస్ కరస్పాండెంట్ అవార్డ్’ శ్రీమతి లక్ష్మికి లభించింది. లక్ష్మి 2010 లో రాష్ట్రపతి లావోస్, కంబోడియా పర్యటనలను, 2013 లో ప్రధాని జపాన్ పర్యటనను  ఆకాశవాణి తరపున కవర్ చేస్తే, సుప్రశాంతి 2011 లో ప్రధాని వెంట మాల్దీవులకు, మళ్ళీ 2013  లో ప్రధాని వెంట జర్మనీకి వెళ్ళి వచ్చారు.


(ఎడమనుంచి కుడికి - రంగారావు,విజయలక్ష్మి దంపతులు, లక్ష్మారెడ్డి, అద్దంకి రాం కుమార్, డి. వెంకట్రామయ్య, భండారు శ్రీనివాసరావు, శైలజ, సుప్రశాంతి, లక్ష్మి, తురగా ఉషారమణి)     

సరే! ఇదంతా వృత్తిగతం. ఇన్ని అవార్డులు రివార్డులు పొందిన తరువాత సామాన్యంగా ఎవరయినా సరే  తాము అసామాన్యులమని అనుకోవడం సహజం. కానీ వీరిద్దరూ దానికి పూర్తిగా మినహాయింపు. వీరే కాదు, ఇప్పుడు ఆ యూనిట్లో పనిచేస్తున్న మహిళలందరూ భేషజాలు ఎరుగనివారే. అందుకే ఒక స్టెనోగ్రాఫర్ రిటైర్మెంట్ వేడుకను అంతా  పూనుకుని ఎంతో  ఘనంగా నిర్వహించారు.దాదాపు అరవై మంది క్యాజువల్ న్యూస్ రీడర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ గౌరవం పొందిన విజయలక్ష్మికి అభినందనలు. ఈ అభినందన వేడుకను కనుల పండుగగా నిర్వహించిన వారందరికీ శతాభివందనలు. (వయసు రీత్యా చిన్నవారయినా మానసికంగా బాగా పరిణతి చెందినవారు కాబట్టి  తప్పులేదేమో!)
(03-11-2013)

పెళ్ళాన్ని సంతోషంగా వుంచాలంటే :


భార్యను సుఖపెట్టాలనుకున్న భర్త ఆమెకు :
ఒక స్నేహితుడిగా
ఒక ప్రేమికుడిగా
ఒక సాటి మనిషిగా
ఒక వంటమనిషిగా
ఒక ఎలెక్త్రీషియన్ గా
ఒక ప్లంబర్ గా
ఒక కార్పెంటర్ గా
ఒక డెకొరేటర్ గా
ఒక మంచి శ్రోతగా
ఒక పనివాడిగా
ఒక అంగరక్షకుడిగా
చెప్పిన  ప్రతిమాట చెవి వొగ్గి వినేవాడిగా
చెప్పిన ప్రతిపని బుద్దిగా చేసేవాడిగా
ఒక శ్రేయోభిలాషిగా
చక్కని తెలివితేటలు కలవాడిగా
ధైర్యశాలిగా
సంపాదన పరుడిగా
అడిగినవన్నీ కొనిపెట్టేవాడిగా
అడగనివి కూడా కొనేవాడిగా
ఏవీ కొన్నా వాటిని గురించి ఏవీ అడగనివాడిగా
ఆమె పుట్టిన రోజును మరచిపోనివాడిగా
వుంటే చాలు.
పోతే, భర్తను సంతోషంగా వుంచాలంటే
ఇవేవీ అక్కరలేదు
అతడ్ని వొంటరిగా  వొదిలిపెడితే చాలు.
అతడికి అదే పదివేలు.


(ఒక ఇంగ్లీష్ గల్పికకు సంక్షిప్త స్వేచ్చానువాదం )

2, నవంబర్ 2013, శనివారం

దీపావళి శుభాకాంక్షలు


మీ హృదయాంగణంలో
మీ గృహ ప్రాంగణంలో
దీపావళి దివ్యకాంతులు ప్రసరించాలని మనసారా కోరుకుంటూ –


(నిర్మలాదేవి, భండారు శ్రీనివాసరావు) 


  

1, నవంబర్ 2013, శుక్రవారం

ఆకాశవాణి నూతన డైరెక్టర్ జనరల్ ఆర్. వెంకటేశ్వర్లు గారికి అభినందన మందారమాల


ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ గా తెలుగువారయిన శ్రీ ఆర్. వెంకటేశ్వర్లు పదవీ బాధ్యతలు స్వీకరించారు. నాకు తెలిసి ఆకాశవాణిలో ఇంతటి అత్యున్నత పదవి తెలుగువారికి దక్కడం ఇదే మొదటి సారి.  గతంలో ఆకాశవాణి, దూరదర్శన్ ఈ రెంటికీ కలిపి ఏర్పాటుచేసిన ప్రసార భారతి సంస్థకు సారధ్యం వహించిన ఖ్యాతి శ్రీ కంభంపాటి సుబ్రహ్మణ్య శర్మగారికి లభించింది.


(శ్రీ ఆర్. వెంకటేశ్వర్లు)

శ్రీ వెంకటేశ్వర్లు పరిచయం వున్నవారందరికీ ముందు గుర్తు వచ్చేది ఆయన మందస్మిత వదనం. గతంలో ఆయన ఆలిండియా రేడియో, ఫీల్డ్ పబ్లిసిటీ సంస్థల అధికారిగా పనిచేసిన రోజులనుంచీ నాకు ఆయనతో పరిచయం. తరువాత అంచెలంచెలుగా ఎదుగుతూ వరంగల్ రేడియో స్టేషన్ డైరెక్టర్ గా, హైదరాబాదు దూరదర్శన్ డైరెక్టర్ గా పనిచేసినప్పుడు ఆయనతో సాన్నిహిత్యం మరింత బలపడింది. మెట్లెక్కిన కొద్దీ  సహజంగా కానవచ్చే బెట్టుసరి వైఖరి వెంకటేశ్వర్లు గారిలో కలికానికి కానరాకపోవడం వల్ల మా మైత్రీబంధం మరింత గట్టిపడింది. ఎప్పుడు ఎక్కడ కనబడినా ‘ఏం మిత్రమా కుశలమా’ అనే మాట ఆయన నోట వినబడేది. అధికారిక అంతరం లేని ఆయన అంతరంగం వల్ల ఆయనతో నా వ్యవహార శైలి మునుపటి మాదిరిగానే కొనసాగుతూ వచ్చింది.
ఆర్ వీ వెంకటేశ్వర్లు గారు (అందరికీ ఆర్వీగా పరిచయం) ఢిల్లీ వెళ్ళిపోయిన తరువాత పెద్దగా కలిసింది లేదు. ఈరోజు ఆయన ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ గా నియమితులయినారని తెలిసి కాస్త సందేహిస్తూనే అభినందించడానికి ఫోను చేసాను. కొన్ని ఆయన లైన్లోకి రాగానే ఫోను కట్టయింది. బిజీ గా వుండొచ్చు అనుకున్నాను. క్షణాల వ్యవధిలో నా ఫోను మోగింది. “ఏం మిత్రమా! యెలా వున్నారు!” అంటూ అదే పలకరింపు.
కాసేపు మాట్లాడారు. కానీ నాకు చాలాసేపు అనిపించింది. హైదరాబాదు వచ్చినప్పుడు కలుద్దాం అని చెప్పి నేనే ముగించాను.

ఆయనకు మరోసారి మనః పూర్వక అభినందనలు. (01-11-2013)                     

గరీబోళ్ళ బిడ్డ – నిను మరవదు ఈగడ్డ


మాజీ ముఖ్యమంత్రి అంజయ్య గారు మరణించినప్పుడు ఒక పత్రిక పెట్టిన పతాక శీర్షిక ఇది. ‘ఏ పత్రికలో ఇలా వచ్చింది – ఈ హెడ్డింగు పెట్టింది ఎవరు’ అంటూ చాలామంది అడిగారు. అంజయ్య గారు చనిపోయినప్పుడు అప్పుడు ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న శ్రీ  వర్దెల్లి మురళి ఈ శీర్షిక పెట్టారు. ప్రస్తుతం శ్రీ మురళి సాక్షి పత్రిక ఎడిటర్ గా వున్నారు.
ఎలాగూ హెడ్డింగుల ప్రసక్తి వచ్చింది కాబట్టి మరో విషయం. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మన రాష్ట్రంలో మొదటిసారి నల్గొండకు రైలు మార్గం ఏర్పాటు అయింది. అప్పుడు ఆంధ్ర ప్రభ ఎడిటర్ గా వున్న శ్రీ ఏబీకే ప్రసాద్ పెట్టిన పతాక శీర్షిక – “ నల్గొండకు రైలొచ్చింది”
ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు ఒక పత్రిక పెట్టిన హెడ్డింగు - " పేదోని అన్నం గిన్నె తొణికింది". (రెండు రూపాయల కిలో బియ్యం పధకం నేపధ్యంలో అనుకుంటాను.) ఈ శీర్షిక పెట్టింది కూడా  ఏబీకే గారే.    

పాశం యాదగిరిని తెలవని జర్నలిష్టులు హైదరాబాదులో వుండరు. చాలామందికి తెలవని సంగతి ఏమిటంటే - ఆయన ‘యాదు’ లో చాలా చక్కని చిక్కని సంగతులు ఎన్నో వున్నాయి. కదిలించి చూడాలే కాని ఇలాటి కదిలించే కబుర్లు ఎన్నో. 

పుణ్యమూర్తి పుట్టినరోజు

పుణ్యమూర్తి పుట్టినరోజు
కొందరికి అమ్మ. మరికొందరికి అత్తయ్య. ఇంకొందరికి  బామ్మ. ఎందరెందరికో అమ్ముమ్మ. ఆమే మా అమ్మ, కీర్తిశేషులు భండారు వెంకట్రావమ్మ. ఈరోజు ఆ  పుణ్యమూర్తి పుట్టినరోజు. మా  అందరి గుండెల్లో ఆమె ఇంకా జీవించే వుంది. అంచేత ఆమెకు మేము జయంతులు జరపం. ఏటా పుట్టిన రోజులే.


కృష్ణాజిల్లా జగ్గయ్యపేట తాలూకా గండ్రాయిలో పుట్టి అదే జిల్లా లోని మరో కుగ్రామం కంభంపాడును మెట్టి రాఘవరావుగారి అర్ధాంగిగా ఏడుగురు ఆడపిల్లలకి, నలుగురు మొగపిల్లలకు తల్లయి, అత్త పాత్రలో కూడా తల్లి ప్రేమనే పంచి,  భండారు వంశాంకురాలను కుల, మత, జాతి, ప్రాంతీయ భేదాలకు అతీతంగా విశ్వవ్యాప్తం చేసిన మహనీయురాలు. మా పెద్దన్నయ్య కీర్తిశేషులు భండారు పర్వతాలరావు గారు 1972 లో పూనుకుని చేసిన మా అమ్మ ‘సహస్ర  చంద్రదర్శనం’ కార్యక్రమానికి  పిల్లాజెల్లా అందరూ దేశవిదేశాలనుంచి తరలి వచ్చి ఆమె ఆశీస్సులు స్వీకరించి వెళ్ళిన శుభ సందర్భం ఇప్పటికీ మా అందరి మనస్సులో పదిలంగా వుంది.

పుణ్యలోకాలలో వున్న ఆమె ఆశీస్సులు ఇప్పటిమాదిరిగానే ఎప్పటికీ అందరికీ లభిస్తూ వుండాలని కోరుకుంటూ – భండారు కుటుంబం.                  

31, అక్టోబర్ 2013, గురువారం

దిగ్భ్రాంతి ప్రకటనలు కాదు – కావాల్సింది కనికరంతో కూడిన కార్యాచరణ


బస్సు ప్రమాదంలో నలభయ్ అయిదు మంది ప్రయాణీకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయిన దుర్ఘటనపై పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేసి చేతులు దులుపుకున్నారు. పరామర్శలతో పని ముగించుకున్నారు.  తమ వారినిపోగొట్టుకుని నిండు బాధల్లో వున్న వారి బంధువులను మరిన్ని బాధలు పెట్టే చర్యలకు స్వీకారం చుట్టారు. కాలి  బూడిద కుప్పలుగా మారిన వారిని గుర్తించడం కోసం రక్త బంధువులందరూ  హైదరాబాదు నాంపల్లిలోని ఫోరెన్సిక్ లేబొరేటరీకి పలానా సమయానికల్లా  రావాలని ఓ పత్రికా ప్రకటన చేసి వూరుకున్నారు. ఇంత కనికరం లేని అధికారులు, పాలకులు బహుశా మన దేశంలోనే వుంటారేమో. ఒక పక్క సొంత మనుషులు చనిపోయారు. ఆ బాధ ఒకటయితే సాంప్రదాయాల ప్రకారం నిర్వర్తించాల్సిన కర్మకాండల వొత్తిడి మరో పక్క.  వారిలో చాలామంది బయటి ప్రాంతాలవాళ్ళు. ఏమాత్రం బాధ్యత కలిగిన ప్రభుత్వం అయినా వారికోసం కొన్ని కనీస ఏర్పాట్లు చేసివుండేది. ఓ వంద మందికో నూటపాతిక మందికో హైదరాబాదులో ఆశ్రయం కల్పించలేని దుస్తితిలో ప్రభుత్వం వుందని అనుకోలేము. వారందరికీ ప్రభుత్వ అతిధి గృహాల్లో ఒక రోజో రెండు రోజులో వసతి  భోజన సౌకర్యాలు, లేబొరేటరీకి వెళ్ళి రావడానికి రవాణా ఏర్పాట్లు చేసివుంటే మన రాష్ట్రంలో ఒక సంక్షేమ ప్రభుత్వం పనిచేస్తోందని వాళ్లు తమ వారితో చెప్పుకునే వారు. బాధల్లో వున్నవారికి కాసింత ఆపన్న హస్తం అందించడం వల్ల సర్కారు నిధులేమీ తరిగిపోవు, కరిగిపోవు.  ‘మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం’  అని ప్రకటనలు చేయగానే సరిపోదు. ఆ చిత్తశుద్ధి ఆచరణలో కూడా కనబడాలి. ప్రభుత్వం తలచుకోవాలే కాని రక్త బంధువుల రక్త నమూనాలు వారికి ఎలాటి అసౌకర్యం లేకుండా సేకరించడం కూడా పెద్ద పనేమీ కాదు. వారి చిరునామాలు, వివరాలు అన్నీ ప్రభుత్వ అధికారుల వద్ద వున్నాయి. వాళ్ల ఇళ్లకు వెళ్ళే ఈ పని పూర్తిచేయవచ్చుకూడా.  ఇంట్లో ఓ మనిషి చనిపోయినప్పుడు ఆ ఇంట్లో పరిస్తితి యెంత దయనీయంగా వుంటుందో అర్ధం చేసుకోవడానికి పెద్ద మేధస్సు అక్కరలేదు. అర్ధం చేసుకునే మనస్సు వుంటే చాలు. రక్త నమూనాలు ఇవ్వడానికి వచ్చినవారి కడగండ్లు టీవీల్లో చూసినప్పుడు ఇలాటి కష్టం  పగవారికి కూడా రాకూడదు అనిపించింది. కానీ సర్కారు వారికి మాత్రం  చీమ కుట్టినట్టు కూడా లేదు. ఏం చేస్తాం. మన రాతల్ని బట్టే మన పాలకులు.
-    (31-10-2013)