10, నవంబర్ 2013, ఆదివారం

కొత్త బంగారులోకం



పొద్దున్నే పెడితే టీవీ లేదు. కరెంటు వుంది. ఈ కేబుల్ వాడికి చెప్పాలి. సెట్ అప్ బాక్స్ గుడ్డూ అంటూ వేలకువేలు పట్టుకుపోయాడు కాని టీవీ ఎప్పుడూ అంతే. ఇరవై నాలుగ్గంటలు వెధవ చాకిరీ వెధవ చాకిరీ అనుకుంటున్నదేమో తెలియదు. ఒక ఛానల్  వస్తే ఇంకో ఛానల్ గుర్రు బర్రు. పిక్చర్  ట్యూబ్ పగిలిపోతున్నట్టు ఒకటే చప్పుళ్ళు. డిజిటల్ క్వాలిటీ ప్రసారాలు అంటూ చేసిన ప్రచారాలు అంతటితోనే  సరి. ఎవడో ఈ బాక్సులు తయారుచేసేవాడు బాగుపడివుంటాడు. డిజిటల్ సంగతి సరే వెనకే బాగావుండేదని అంతా అనేవారే  కాని అడిగేవాడు లేడు. అదే సర్కారు ధైర్యం.
టీవీ లేకపోతే పోయింది. ఈ సెల్ ఫోనుకేమొచ్చింది. వూరికే చెవికోసిన మేకలా అరుస్తుండేది. ఇవ్వాళ ఏమిటి ఇలా మూగనోము పట్టింది. చార్జ్  అయిపోయిందా అంటే అదీ లేదు. ఏవైందబ్బా!
సెల్ ఫోను సరే అసలు నాకేమైంది. చుట్టూ ప్రపంచం చిత్రంగా మారిపోతోంది. రేడియోలో వెంకటేశ్వర సుప్రభాతం కమ్మగా వినబడుతోంది. హాల్లో ఓ మూల బల్లపై, వృద్ధాశ్రమంలో సీనియర్ సిటిజన్ లాగా ఇన్నాళ్ళు మౌనంగా   పడున్న లాండ్ లైన్ ఫోను గణ గణా మోగుతోంది. వరండాలోకి వెళ్ళి చూస్తే అందరి ఇళ్ళ పైకప్పుల మీద దొండ పాదుల పందిళ్ళ మాదిరిగా దూరదర్శన్ యాంటీనాలు దర్శనమిచ్చాయి. వెళ్ళి  టీవీ పెడితే,  పాలూ చేలూ పెరుగూ పేడా గురించి ఎవరో  చెబితే ‘మా స్టుడియోకి వచ్చి ఎన్నో మంచి విషయాలు చెప్పారం’టూ యాంఖరమ్మ వయ్యారాలు పోతూ అంటోంది.
రోజూ పొద్దున్నే ఇంటి గుమ్మం ముందు పడివుండే పేపరు మధ్యాహ్నానికి కానీ మొహం చూపించలేదు. అప్పుడు కానీ ‘ఈ చిత్రం భళారే విచిత్రం’ కారణం అర్ధం కాలేదు. అంతరిక్షంలో ఎక్కడినుంచో దారితప్పి  భూమి వైపు అమిత వేగంతో దూసుకువస్తున్న ఓ గ్రహశకలం మరోసారి దారితప్పి రోదసిలో వున్న మన సమాచార కృత్రిమ ఉపగ్రహాన్ని డీకొన్నదట. దాంతో దేశంలో సమాచార వ్యవస్థ మొత్తం కుప్పకూలిందట.
ఈ ‘ట’ వార్తలు ఇంకా పూర్తి కాకముందే మెలకువ వచ్చేసింది. కల చెదిరింది. అన్ని గదుల్లో టీవీలు, అందరి చేతుల్లో సెల్ ఫోన్లు తెగ  మోగిపోతున్నాయి.
అయ్యో ఇది కలా !

కల నిజమైతే యెంత బాగుంటుంది.  
(10-11-2013)