(ఎవరీ అంకుల్ టామ్ ? అన్న ప్రశ్నకు టెలివిజన్ రంగంలో
నిష్ణాతులయిన తోట భావనారాయణ గారు సవివరమైన సమాధానం ఇచ్చారు. నలుగురూ
తెలుసుకోవాల్సిన విషయాలు ఇందులో వున్నాయన్న ఉద్దేశ్యంతో, ఆయనతో నాకున్న పరిచయాన్ని
ఉపయోగించుకుని ఆయన రాసిన ఈ వ్యాసాన్ని
ఇక్కడ పొందుపరుస్తున్నాను. దీనిపై ‘కాపీ రైట్లు’, ‘కాపీ కొట్టే రైట్లు’ సమస్తం ఆయనవే. అంటే కింద ఫోటోలో కనిపిస్తున్న తోట భావనారాయణ గారివే)
ఎ.సి నీల్సన్ కంపెనీ (
AC Nielsen Company ) : రేటింగ్స్ మాట వినగానే గుర్తుకొచ్చేది
ఎ.సి.నీల్సన్ కంపెనీ. ఈ సంస్థ నీల్సన్ మీడియా రీసెర్చ్ పేరుతో మార్కెట్ విశ్లేషణ
మీద దృష్టి సారించింది. 1923లో
ప్రారంభమైనప్పటికీ, 1930 తర్వాతే ప్రేక్షకుల మీద అధ్యయనం మొదలెట్టింది.
అప్పట్లో రేడియో శ్రోతలతో దీన్ని
మొదలుపెట్టింది. ఏ ఫ్రీక్వెన్సీని
శ్రోతలు ఎంతసేపు వింటున్నారో సర్వే చేయటం ద్వారా కార్యక్రమ నిర్వాహకులకూ, ప్రకటన కర్తలకూ ఈ
సమాచారాన్ని అందజేయటం దీని పని. అయితే పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు విడివిడిగా
ఎవరు వింటున్నారో తెలుసుకునే సౌకర్యం మాత్రం లేదు. అప్పటివరకు కొంత మంది శ్రోతలకు
డైరీ ఇచ్చి, వాళ్ళచేత
నమోదు చేయించే విధానం అమలులో ఉంది. శ్రోతల ఆసక్తి, నిజాయితీ, అందుబాటు అనే మూడు
ప్రధాన అంశాల మీద ఆధారపడి రేటింగ్ నిర్ణయించడం కన్నా ఆటోమేటిక్ గా ఏ ఫ్రీక్వెన్సీ
ఎంతసేపు ఆన్ చేసి ఉందో తెలుసుకోవడమే మెరుగైన, కచ్చితమైన విధానమనే
అభిప్రాయం కలగడానికి నీల్సన్ సంస్థ దోహదం చేసింది.
కొద్దిపాటి పరిశోధన, మార్పుల అనంతరం Nielsen Audi meter సిద్ధమైంది. అమెరికా
తూర్పు ప్రాంతంలోని 800 ఇళ్లను
శాంపిల్ గా తీసుకుని సర్వే చేపట్టారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో రేడియోల
వినియోగంతో పాటు శాంపిల్ సైజ్ కూడా గణనీయంగా పెరిగింది. 1949 నాటికి 97 శాతం అమెరికన్ రేడియో
శ్రోతలకు ప్రాతినిధ్యం వహించే సరైన శాంపిల్ సైజ్ తయారయింది. అదే సమయంలో మరో పోటీ
సంస్థ రేడియో రేటింగ్స్ రంగం నుంచి తప్పుకుంది. దీంతో Nielsen సంస్థకు డిమాండ్ మరింత
పెరిగ చందాదారులు ఎక్కువయ్యారు. చందాదారులు చెల్లించే డిపాజిట్లు ప్రధాన
ఆదాయ వనరు కావడంతో కొత్త డిపాజిట్ల ఫలితంగా Nielsen శాంపిల్ సైజ్ ఇంకా
పెంచుకోగలిగింది. మరోవైపు టెలివిజన్ రంగం విస్తరించడం ఎక్కువైంది. రేడియోను
పక్కనపెట్టి టీవీ మీద దృష్టి సారించిన నీల్సన్ సంస్థ 1964 నాటికి రేడియోను
పూర్తిగా వదులుకుంది.
ఆన్ చేయడం, ఆఫ్ చేయడం మొదలుకుని
టీవీ ఛానల్స్ మారుస్తూ ఉన్నప్పుడు సైతం సమగ్రంగా సమాచారం నమోదు చేయగలిగే
పరికరాన్ని రూపొందించడంతో సంస్థ విజయం సాధించింది. ఈ సమాచారన్ని ఎప్పటికప్పుడు
కేంద్ర కార్యాలయానికి పంపేందుకు ప్రత్యేకమయిన టెలిఫోన్ లైన్లు కూడా లీజుకు
తీసుకోవడం మరో ప్రత్యేకత. నీల్సన్ బ్లాక్ బాక్స్ ( Nielsen Black Box ) పేరుతో ప్రసిద్ధమైన ఈ
మీటర్లు టెలివిజన్ రేటింగ్ లెక్కగట్టడంలో కీలకమైన పాత్ర పోషిస్తూ వచ్చాయి. అయితే ఏ
టీవీ కార్యక్రమాలు ఎంతసేపు చూస్తున్నారన్న విషయాలు మాత్రమే ఇందులో నమోదయ్యే అవకాశం
ఉండగా ఏయే వర్గం వారు ఆ కార్యక్రమాలు చూస్తున్నారు? వారిలో స్త్రీలెంత
మంది? పురుషులెంత
మంది? అనే
విషయాలు మాత్రం స్పష్టంగా తెలిసే అవకాశం లేకపోవటం ఒక లోటుగా కనిపించింది. ఇందుకోసం
ప్రత్యేకంగా డైరీలు వాడటం మొదలెట్టారు.
కొంత మంది ప్రేక్షకుల ఇళ్లలో ఈ డైరీలు
ఉంచి అందులో వివరాలు నమోదు చేయాలని కోరేవారు. టీవీ ఆన్ చేసిన ప్రతిసారీ ఏ ఛానల్
ఎంతసేపు ఎవరెవరు చూసారో అందులో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇది యంత్రసాయంతో జరిగేది
కాదు గనుక శాంపిల్ సైజు చాలా తక్కువగా ఉంటుంది. పైగా అందరూ శ్రద్ధగా నమోదు
చేయకపోతే ప్రయోజనం ఉండదు.
సామాన్య ప్రేక్షకులకు వీరు ప్రతినిధులు
కాకపోవచ్చుననేది మరో వాదన. ఈ విధానం లోపభూయిష్టమైనదన్న విమర్శలు వెల్లువెత్తాయి.
ఇందుకు కారణం నీల్సన్ సంస్థ వారి పీపుల్స్ మీటర్స్ ఇచ్చిన డేటాకు, డైరీల డేటాకు పొంతన
లేకపోవటమే. సహజంగానే పరిశ్రమలో ఇదొక వివాదాస్పద అంశంగా మారింది. రేటింగ్స్
ఆధారంగానే ప్రకటనల రేట్లలో బేరసారాలు జ
రుగుతాయి కనక ఇందులో తేడాల వలన చాలా
ఇబ్బందులొచ్చిపడ్డాయి. ఏమైనప్పటికీ ఈ వివాదాల మధ్యలో రేటింగ్స్ ఇచ్చేందుకు
మరికొన్ని చిన్నాచితకా సంస్థలు ముందుకొచ్చినా ఈ రంగంలో ఒక్కరే ఉండటం సమంజసమని, అన్ని టీవీలూ అదే
సంస్థ రేటింగ్స్ ను ప్రామాణికంగా తీసుకోవడం మంచిదనే విషయంలో ఏకాభిప్రాయం
కుదిరింది. ఆ విధంగా నీల్సన్ వారి పీపుల్స్ మీటర్ విధానానికే అమెరికన్ ఛానల్స్
పట్టం కట్టాయి. Nielsen Television Index ( NTI ) పేరుతో ఇస్తున్న
రేటింగ్స్ అక్కడ ప్రామాణికంగా మారాయి. (ఇంకా వుంది)
(16-11-2013)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి