17, నవంబర్ 2013, ఆదివారం

ఎవరీ అంకుల్ టామ్ ? - 3


ఎవరీ అంకుల్ టామ్ ? అన్న ప్రశ్నకు టెలివిజన్ రంగంలో నిష్ణాతులయిన తోట భావనారాయణ గారు సవివరమైన సమాధానం ఇచ్చారు. నలుగురూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇందులో వున్నాయన్న  ఉద్దేశ్యంతో, ఆయనతో నాకున్న పరిచయాన్ని ఉపయోగించుకుని ఆయన రాసిన ఈ  వ్యాసాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను. దీనిపై ‘కాపీ రైట్లు’,  ‘కాపీ కొట్టే రైట్లు’  సమస్తం ఆయనవే. 


(శ్రీ తోట భావనారాయణ)

రేటింగ్స్ లెక్కింపు విధానం
టీవీ ప్రేక్షకులందరూ ఏయే ఛానల్స్ ఏ సమయంలో ఎంతసేపు చూస్తున్నారన్నది నేరుగా తెలుసుకోవడం సాధ్యమయ్యేపని కాదు. ఎన్నికల సర్వే తరహాలో ఇక్కడ కూడా ఒక శాంపిల్ సర్వే మాత్రమే నిర్వహించడం కుదురుతుంది. ఒక శాంపిల్ సైజ్ నిర్ధారించుకుని, వాళ్లు ఎంతసేపు ఏ ఛానల్ చూస్తున్నారో లెక్కించి, ఆ ఫలితాలను మొత్తం ప్రేక్షకులకు వర్తింపచేయటమే రేటింగ్స్ పని. శాంపిల్ గా ఎంచుకున్న ప్రేక్షకుల ఇళ్లలో టీవీ మీద మీటర్లు పెట్టి, అన్ని మీటర్లలోని సమాచారాన్ని ఆయా ఛానల్స్ ప్రసారం చేస్తున్న కార్యక్రమాల డేటాకు జత చేసి ఏ కార్యక్రమాన్ని ఎవరు ఎంతసేపు చూశారో విశ్లేషిస్తారు. Nielsen సంస్థ  అమెరికాలో 5 వేల ఇళ్లను శాంపిల్ గా తీసుకుంది. నిజానికి అమెరికాలో పదికోట్ల టీవీలు ఉన్నప్పటికీ 5 వేల శాంపిల్స్ మాత్రమే తీసుకోవటం చాలా తక్కువగానే కనిపిస్తుంది. అయితే  ఆ ఐదువేల ఇళ్లు మొత్తం జనాభాకు ప్రాతినిధ్యం వహించేందుకు వీలుగా ఉన్నాయని నీల్సన్ సంస్థ  తమ ఎంపికను సమర్ధించుకుంటోంది.

ఈ మీటర్ వలన ఏ ఛానల్ ఎంత సేపు చూశారన్నదే తెలుస్తుంది. ఎవరు చూశారో తెలియదు. ఏ వయోవర్గానికి చెందిన వారు చూశారో, వారు పురుషులో, స్త్రీలో తెలియదు. అందుకే ఈ సమాచారం కోసం మరో ఏర్పాటు అనివార్యమయింది. ఈ ఇళ్లలో టీవీల దగ్గర మరో చిన్న బాక్స్ అమర్చాల్సి వచ్చింది ఎవరు చూడటం మొదలెట్టినా ఆన్ బటన్ నొక్కాలి. కుటుంబ సభ్యులందరికీ వేరు వేరుగా ఆన్, ఆఫ్  బటన్స్ ఉంటాయి. అందువలన ఎవరు టీవీ చూడబోతుంటే వాళ్లు వెళ్లి టీవీ ఆన్ చేసి కూర్చుంటారు. చూడటం ఆపేసి వెళ్లాలనుకున్నప్పుడు ఆఫ్ చేసి వెళ్తారు. ఆ విధంగా ఆ కుటుంబంలోని ఫలానా సభ్యుడు ఫలానా సమయం నుంచి ఫలానా సమయం వరకు టీవీ చూసినట్లు నమోదవుతుంది. దీని ఆధారంగా వివిధ వయోవర్గాల వారు టీవీ చూసిన సమయాన్ని లెక్కగడతారు.
ఇదంతా ఒక వంతయితే ఫోన్ సాయంతో సమాచారం సేకరించడం మరో వంతు. Nielsen సంస్థ వేలాది మంది ఇళ్లకు ఫోన్ చేసి ఆ సమయంలో వాళ్లు టీవీ చూస్తున్నారా, చూస్తుంటే ఏ కార్యక్రమం చూస్తున్నారు అనే సమాచారం సేకరిస్తుంది. ఈ సమాచారాన్ని తమ మీటర్ల సమాచారంతో సరిపోల్చుకోవటం కూడా గమనించవచ్చు. ఈ సమాచారాన్ని విశ్లేషించి ప్రతి ఛానల్ లో ప్రతి కార్యక్రమాన్ని ఎవరెవరు ఎంత సేపు చూశారో ఒక నివేదిక తయారుచేస్తారు.  ఇందులో మొదటి దశలో ప్రాథమిక సర్వే జరుగుతుంది. ఇది కొంత భారీ స్థాయిలోనే జరుగుతుంది. దీని వలన రేటింగ్స్ కు సరిపడే ప్రతినిధులు ఎవరనే విషయం తేలుతుంది. ఆ తరువాత, ప్రాతినిధ్యపు టీవీ యజమానుల ఇళ్లకు వెళ్లి, వాళ్లకు నచ్చజెప్పి, సర్వేకు సహకరించాల్సిందిగా  కోరతారు. వాళ్ల ఇంట్లో మీటర్, దానికి అనుసంధానంగా ఒక టెలిఫోన్ సెట్ పెట్టుకునేందుకు కూడా అనుమతి తీసుకుంటారు. అలా ఏర్పాటు చేసిన మీటర్, టెలిఫోన్ సాయంతో కేంద్ర కార్యాలయానికి ఏరోజుకారోజు పూర్తిస్థాయిలో డేటా అందుతుంది. అదే సమయంలో టీవీ కేంద్రాల వారి కార్యక్రమాల వివరాలు కూడా కేంద్ర కార్యాలయం అందుకుంటుంది. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఏ కార్యక్రమాన్ని ఎవరెవరు ఎంత సేపు చూశారో లెక్కించి, దాన్ని మొత్తం ప్రేక్షకులకు వర్తింపచేసి సమగ్ర సమాచారాన్ని టీవీ సంస్థల కంప్యూటర్లకు అందజేయటం ఆఖరి దశ.

దీని ఆధారంగా మొత్తం ప్రేక్షకులలో ఎంత శాతం మంది ఏ ఛానల్ చూస్తున్నారో కూడా లెక్కగట్టే వీలుంది. ప్రేక్షకాదరణ ఎక్కువగా ఉన్నట్టు తేలిన కార్యక్రమాలకు ఎక్కువ ప్రకటనలు వస్తాయి. ఎక్కువ ప్రకటనలు వచ్చే కార్యక్రమాన్ని మరింత నాణ్యంగా రూపొందించేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తుంది. రేటింగ్స్ ఆధారంగానే ఛానల్ యజమానులు ఆయా కార్యక్రమాల్లో ఇచ్చే ప్రకటనలకు రేట్లు నిర్ణయించి వసూలు చేస్తారు. (ఇంకావుంది)

కామెంట్‌లు లేవు: