ఆంధ్ర జ్యోతి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆంధ్ర జ్యోతి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, జులై 2013, బుధవారం

నడిచివచ్చిన దారి -భండారు శ్రీనివాస రావు


పంతొమ్మిదివందల డెబ్బయి ఒకటి -ఆగష్టు నెల- ఇరవయ్యవ తేది. విజయవాడ, లబ్బీపేట లోని 'ఆంద్ర జ్యోతి' కార్యాలయం.
అందులో అడుగు పెట్టి - ఎడిటర్ నార్ల వెంకటేశ్వర రావు గారిని కలుసుకున్నాను.
ఆయన ఎగాదిగా చూసి, నా పరిచయం కనుక్కుని-
'మీ అన్నయ్య ఒకటే చంపేస్తున్నాడయ్యా! పైకి పో. ఉపేంద్ర వుంటాడు. నేను పంపానని చెప్పు' అన్నారు ఫోన్ మీద చేయి వేస్తూ.
అదే నా తొట్ట తొలి ఉద్యోగ నియామకపు ఉత్తర్వు.
ఉపేంద్ర గారిని కలిసాను. కూర్చోమని సైగ చేసారు. గుర్రపు నాడా ఆకారంలో వున్నా బల్ల చివర్లో కూర్చున్నాను. పీ.టీ.ఐ., యు.ఎన్.ఐ. వార్తల్ని తెలుగులోకి తర్జుమా చేయమన్నారు. ఆ విధంగా మొదలయింది నా జర్నలిస్టు జీవితం.
అలా మూడు నెలలు గడిచాయి. జీతం విషయం నేను అడగను లేదు - వాళ్ళు చెప్పను లేదు. ఒక రోజు అటెండర్ నాగేశ్వరరావు నా దగ్గరకు వచ్చి అక్కవుంటెంట్ ని  కలవమని చెప్పాడు. వెడితే- ఓ ఓచర్ మీద సంతకం చేయించుకుని పది- పది రూపాయల నోట్లు - వంద నా చేతిలో పెట్టారు. అదే నా తొలి వేతనం.
ఉద్యోగం తప్ప వేరే ధ్యాస లేని రోజులవి. రాసిన ప్రతిదీ మర్నాడు పేపర్లో రాకున్నా- ప్రూఫ్ లో అచ్చయిన నా వార్తల్ని చదువుకుని మురిసిపోయేవాడిని. నేను చేరిన కొత్తల్లోనే నార్ల గారు హైదరాబాద్ వెళ్ళిపోవడం - నండూరి రామమోహనరావు గారు బాధ్యతలు  స్వీకరించడం జరిగిపోయాయి.ఎందుకో ఏమోగానీ, దిన,వార పత్రికలకు సంబంధిoచిన అన్ని అంశాలలో నాకు తర్ఫీదు ఇచ్చారు. ప్రతిరోజూ ఎడిట్ పేజీలో కార్టూన్ తో కూడిన నాలుగు వాక్యాల గేయాన్ని 'వాక్టూనులు ' అనే శీర్షికతో రాసేవాడిని. సినిమా సమీక్షలు, పుస్తక సమీక్షలు, ఆదివారాల్లో - పిల్లలకోసం ప్రత్యెక కధలు - బంగ్లాదేశ్ అవతరణకు దోహదం చేసిన పంతొమ్మిదివందల డెబ్బయి ఒకటి ఇండో-పాక్ యుద్ధంలో భారత సైన్యాల కదలికలను సూచించే మ్యాపులు - ఇలా అన్నింట్లో నేనున్నానంటూ వేలు పెట్టేవాడిని. శ్రీయుతులు ఉపేంద్ర, ఐ వెంకటరావు, కే.రామకృష్ణ, వీరభద్రరావు, ఎల్వీ రమణ, సత్యనారాయణ, ఆంజనేయులు, చంద్రశేఖర ఆజాద్ వంటి సహోద్యోగుల నడుమ నా ఆంధ్ర జ్యోతి ఉద్యోగ పర్వం నాలుగున్నర సంవత్సరాలపాటు ఇట్టే గడిచిపోయింది.
అన్నట్టు చెప్పడం మరిచాను. మొదట్లోనే నార్లగారు నాకో బ్రహ్మొపదేశం చేశారు. జర్నలిస్టు అనే వాడు ఎప్పుడూ, జేబులో రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకోవాలనే వారు. చాలా కాలంపాటు దాని పాటించాను కూడా. తర్వాతి రోజుల్లో రేడియోలో పనిచేస్తున్నప్పుడు ఏదో విషయంలో పేచీ వచ్చి,రాజీనామా ఇచ్చేసి ఇంటికి వచ్చేశాను. అంతే! నెలరోజులపాటు మళ్ళీ ఆఫీసు మొహం చూడలేదు. చివరికి ఎవరో పూనుకుని రాజీ చేయడం, ఉద్యోగంలో తిరిగి చేరడం జరిగిపోయాయి. అదో అధ్యాయం.
రాసిన రాతలు అచ్చులో చూసుకునే అవకాశం ఆంద్ర జ్యోతి ద్వారా లభిస్తే- సొంత గొంతును తెలుగునాట నలుగురికీ వినిపించే వీలు రేడియోలో దొరికింది. వార్తా సేకరణ, కూర్పు, తెలుగులోకి అనువాదం ఇలాంటి ప్రక్రియలతో పాటు, రెగ్యులర్ న్యూస్ రీడర్లు రాని రోజున ఏకంగా స్టూడియో లోకి వెళ్ళిపోయి వార్తలు చదివేయడం- వారానికి రెండు మార్లు వార్తా వాహిని - ఒకసారి జీవన స్రవంతి (రోజువారి జరిగే ఘటనలకు కొంత హాస్యాన్ని జోడించి తయారు చేసిన ప్రత్యెక వార్తలు ) ఇలా అన్నిరకాలుగా నా రేడియో జీవితాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నాను.
ఆ రోజుల్లో ఇన్ని పత్రికలూ లేవు. ఇంత మంది విలేకరులు లేరు. ముఖ్య మంత్రి నిర్వహించే విలేకరుల సమావేశానికే పది, పన్నెండు మంది హాజరైతే గొప్పగా వుండేది. నేను రేడియోలో చేరింది ఎమర్జెన్సీ రోజుల్లో కావడం వల్ల-వార్తల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాగం, రేడియో పై ఎక్కువగా ఆధార పడాల్సి రావడం- రేడియో విలేకరిగా నా ప్రాధాన్యతను కొంత పెంచింది.
ఈ క్రమంలో,  ఎందరో మంత్రులు, ఎంతోమంది ముఖ్యమంత్రులు, డీజీపీలు ,చీఫ్ సెక్రటరీలు, సీనియర్ ఐ.ఏ.ఎస్., ఐ.పీ.ఎస్. అధికారులు,  కేంద్రమంత్రులు,  ఎంపీలు,  శాసన సభ్యులు - ఇందరితో సాన్నిహిత్యాలు, విందులు, వినోదాలు,విమాన యానాలు,విదేశీ ప్రయాణాలు, హెలికాఫ్టర్ చక్కర్లు - మాస్కో రేడియో ఉద్యోగ విజయాలు - ఓ విధమైన 'మత్తు 'లో వృత్తి జీవితం గడిచిపోయింది.

ఇక వృత్తి జీవితం చివరి రెండేళ్ళు – కే.ఎస్. శర్మ గారి పుణ్యమా అని హైదరాబాద్  దూరదర్సన్  వార్తా విభాగంలో ఆర్వీవీ గారి సారధ్యంలో దొర్లిపోయాయి. రెండువేల అయిదు డిసెంబరు ఆఖర్లో ఉద్యోగ విరమణ.  లోగడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మోహన్ కందా గారన్నట్టు- మనిషికి మరణం, ఉద్యోగికి రిటైర్మెంట్ రెండూ తప్పవు.

4, జూన్ 2013, మంగళవారం

ఇది ఇండియా – అది అమెరికా


(ఆంధ్ర జ్యోతి – 04-06-2013)
షిండే మింగిన ప్రాణం
ఆమెకు గుండెపోటు వచ్చింది. హుటాహుటిన ఆసుపత్రికి తీసుకు వచ్చారు. ఆస్పత్రి గేటు వరకు వచ్చేశారు. అక్కడ సైంధవులు అడ్డుపడ్డారు. దీంతో గేటు వద్దే ఆమె మరణించింది.  ఆ సైంధవులు ఎవరంటే కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే భద్రతా దళాలు. చత్తీస్ ఘడ్ మావోయిస్టుల దాడిలో  గాయపడినవారిని పరామర్శించేందుకు షిండే రాయ్ పూర్ ఆస్పత్రికి వచ్చారు. అదేసమయంలో ఓ మహిళకు గుండెపోటు వచ్చింది.  షిండే భద్రతాదళాలు ఆమెను  ఆసుపత్రిలోకి తీసుకుపోనీకుండా అడ్డుకున్నారు. అత్యవసరంగా వైద్యం అందించాలని ఎంతగా ప్రాధేయపడ్డా ప్రయోజనం లేకుండాపోయింది. సకాలంలో వైద్యం అందక   మరణించిందని ఆమె బంధువులు ఆరోపించారు. ఇది ఇండియా.
పోతే మరో సంఘటన.
ఇది జరిగి కొన్నేళ్ళు అవుతోంది.
అమెరికా పశ్చిమతీరంలోని  సియాటిల్ నగరంలో కాపురం వుంటున్న మా పెద్దబ్బాయి సందీప్ కుటుంబంతో కొన్నాళ్ళు గడపడానికి నేనూ మా ఆవిడా వెళ్ళాము. అక్కడ కూడా టీవీ ఛానళ్ళ హడావిడి ఎక్కువే. ఒకరోజు పర్యటనపై  ఆ నగరానికి వచ్చివెడుతున్న  అమెరికా ప్రెసిడెంట్ -  ‘ఎయిర్ ఫోర్స్ వన్’ విమానానికి అధికారులు క్లియరెన్స్ ఇవ్వకపోవడం వల్ల ఆయన ఎయిర్ పోర్ట్ లోనే కొద్దిసేపు  వుండిపోవాల్సివచ్చిందని స్క్రోలింగులు పరుగులు పెట్టాయి. అయితే అసలు విషయం మరునాడు పేపరు చూస్తే తెలిసింది. ఒక రోగిని తీసుకువస్తున్న హెలికాప్టర్  దిగడానికి వీలుగా అధ్యక్షుడి విమానాన్ని కొద్దిసేపు ఆపేశారని ఒక  వార్త సారాంశం. అది అమెరికా.    

 (04-06-2013)   

12, మార్చి 2013, మంగళవారం

చీరే మేరే సప్నే






పండక్కి ఈ మారయినా
షాపులో చేసి అరువయినా
కనీసం  కంచిపట్టు చీరయినా
కొని తీరాలి ఆరునూరయినా

(వాక్టూన్లు – భండారు - ఆంధ్ర జ్యోతి దినపత్రిక – 1975) 

7, జనవరి 2013, సోమవారం

ఎవరి గోల వారిదే అను ముఖ్యమంత్రి చిట్కా




ఎవరి గోల వారిదే అను ముఖ్యమంత్రి చిట్కా


గతంలో అంటే దాదాపు నలభై ఏళ్ళక్రితం అనుకుంటాను ముళ్లపూడి వెంకరమణ గారు సంభాషణలు గురించి చక్కని హాస్య గుళిక రాశారు. కొన్ని ఏకపక్షంగా అంటే ఎదుటివాడు చెప్పేది పట్టించుకోకుండా మాట్లాడుకుంటూ పోవడం అయితే మరికొన్ని రైలు పట్టాల మాదిరిగా ఎక్కడా కలవకుండా ఎవరి గోల  వారిదే అన్నట్టు సాగుతుతుంటాయని కడుపుబ్బ  నవ్వించే కొన్ని ఉదాహరణలు పేర్కొన్నారు.
ఈ రోజు (07-01-2013) ఆంధ్ర జ్యోతి మొదటి పుటలో ప్రచురించిన ఒక వార్త అలనాటి ముళ్లపూడి వారి రచనను గుర్తుకు తెచ్చింది. చిత్తగించండి.
తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు లో జరిగిన ‘నగదు బదిలీ పధకం’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, సభకు హాజరయిన కొందరు మహిళలకు నడుమ సాగిన రైలుపట్టాల సంభాషణను ఆ పత్రిక ఇలా ప్రచురించింది.
“నగదు బదిలీ చేస్తున్నాం. ఇకపై బ్యాంకులే మీ ఇంటికి వస్తాయి”
“ఆరు సిలిండర్లతో పొయ్యిలో పిల్లి లేవడం లేదు. విద్యుత్ చార్జీలు భరించలేకపోతున్నాం”
“నిత్యావసర సరుకులు ఒకే ప్యాకెట్ గా అందజేస్తాం. బియ్యం, పసుపు, కారం, కందిపప్పు, చింతపండు, ఉప్పు, పంచదార  అందులో వుంటాయి. “
“నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఏదో కొద్దిగా బియ్యం, కిలో చొప్పున సరుకులు ఇస్తే సరిపోతుందా? విద్యుత్ చార్జీలతో పాటు సర్ చార్జీలు విధించడంతో ఇబ్బందులు పడుతున్నాం.”
“మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. అందరూ చప్పట్లు కొట్టండి”
యెంత బాగుందో కదా ఈ టెక్నిక్.
ఇక నుంచి బహిరంగ సభల్లో నాయకులను నిలదీసే జనాలను చెదరగొట్టడానికి పోలీసుల లాఠీలు అక్కరలేదు, భాష్పవాయు తూటాలు ప్రయోగించనక్కరలేదు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కనిపెట్టిన ఈ చిట్కా చాలు.
(07-01-2013)  

17, నవంబర్ 2012, శనివారం

ఎవరీ వడ్డెర చండీదాస్ ?


ఎవరీ వడ్డెర చండీదాస్ ?
మూడున్నర దశాబ్దాల కిందటి ముచ్చట.
శ్రీ పురాణం సుబ్రహ్మణ్యశర్మగారు ఆంధ్ర జ్యోతి వారపత్రిక సంపాదకులుగా వున్నప్పుడు అంతగా పేరు తెలియని రచయిత ఒకరు తన నవలను ప్రచురణార్ధం పంపారు. ఏండ్లూ పూండ్లు గడిచిపోతున్నా ఆ రచన గురించి అతీగతీ తెలియకపోవడంతో ‘తన నవలను తనకు భద్రంగా  వొప్పచెప్పాలనీ, లేనిపక్షంలో న్యాయపరమయిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అతగాడు లీగల్ నోటీసు ఇచ్చాడు. దాంతో పురాణంగారు, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు  సెలవులో వెళ్లడం వల్ల అప్పుడు వారపత్రికలో తాత్కాలికంగా సబ్ ఎడిటర్ గా   పనిచేస్తున్న నేనూ కలసి, అలమరాలన్ని గాలించి, పాతకట్టలన్నీ దులిపి ఎట్టకేలకు ఆ నవలను పట్టుకున్నాము.
ఆ విషయం రచయితకు తెలియచేద్దాం అనుకుంటూనే పురాణం గారు యధాలాపంగా ఆ నవలలోని కొన్ని పేజీలు తిరగేసారు. ఆయన కళ్ళల్లో ఇసుమంత ఆశ్చర్యంతో కూడిన కాంతి కనిపించింది. వెంటనే ఆర్టిస్టుని పిలిపించి అప్పటికప్పుడే ప్రోమో రాయించడం, ఆ నవలను ధారావాహికంగా ప్రచురించేందుకు ముహూర్తం (తేదీ) నిర్ణయించడం, ఆ విషయాన్ని పత్రికాముఖంగా ప్రచురించడం చకచకా జరిగిపోయాయి. దానితో తెలుగు సాహితీ లోకానికి మరో కొత్త రచయిత పరిచయమయ్యాడు. తెలుగు నవలా సాహిత్యాన్ని మరో మలుపు తిప్పిన ఒక గొప్ప రచయిత పాఠకులకు దొరికాడు. ఆయన ఎవ్వరో కాదు, కీర్తిశేషులు వడ్డెర చండీదాస్.(అసలు పేరు చెరుకూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు) ఆ నవల – తెలుగు నవలల్లో ఇప్పటికీ స్వయం జ్వలిత జ్వాలగా భాసిల్లుతున్న  ‘హిమజ్వాల’.        
వెలుగు చూడని ఈ సంగతులు తెలుసుకోవాలంటే -  ‘మార్పుచూసిన కళ్ళు’ పుస్తకం చదవండి. అలనాటి కమ్యూనిస్ట్ రష్యా చరమాంకం విశేషాలను అక్షరబద్ధం చేస్తూ సాగిన రచన. ముద్రణ పూర్తయి విడుదలకు సిద్ధంగా వుంది. ప్రతులకు, వివరాలకు: శ్రీ కె. లక్ష్మణరావు, కార్యదర్శి, వయోధిక పాత్రికేయ సంఘం, హైదరాబాదు. ఫోను: 9394712208, Email: lakshmanarao_konda@yahoo.co.in>,

10, నవంబర్ 2012, శనివారం

మిత్రవాక్యం



ఐ. వెంకట్రావు, చీఫ్ ఎడిటర్, మహా టీవీ,
మాజీ ఎడిటర్, ఆంధ్ర జ్యోతి, మాజీ చైర్మన్, ప్రెస్ అకాడమి



అలనాటి సోవియట్ అనుభవాలు అంటే ఇదేదో రాజకీయ సంబంధమైన పుస్తకం అనుకున్నాను. కానీ భండారు శ్రీనివాసరావు వాటి జోలికి పోకుండా కేవలం ఒక సాధారణ వ్యక్తిగా తన అనుభవాలను గ్రంథస్తం చేయడం బాగుంది. ఈ పుస్తకానికి ‘మార్పు చూసిన కళ్ళు’ అని పేరు పెట్టడం ఇంకా బాగుంది. ఇందులోనే  ఆయన కవి హృదయం కూడా  అర్ధమవుతుంది.
శ్రీనివాసరావు, నేనూ డెబ్బయ్యవ దశకంలో బెజవాడలో ఆంధ్ర జ్యోతిలో కలిసి పనిచేసాము. వాళ్ల అన్నగారు భండారు పర్వతాలరావు గారినుంచి చక్కని  సంభాషణా చతురతను  అందిపుచ్చుకుని వుంటారు. ఎక్కడవుంటే అక్కడ నవ్వుల వాన కురిపించడం వాళ్లకు వంశానుగతంగా లభించిన వరమేమో.
శ్రీనివాసరావు   జర్నలిస్టుగా కన్నా హాస్య  రచయితగా  మరింత బాగా రాణిస్తాడన్న అభిప్రాయం మాలో చాల మందికి వుండేది.  ఆరోజుల్లోనే  ఆంధ్రజ్యోతిలో ఆయన అనుదినం  రాసిన  నాలుగు పంక్తుల ‘వాక్టూన్లు’,  ఆ తరువాత ఆకాశవాణిలో సొంత గొంతుకతో  వారం వారం వినిపించిన ‘జీవన స్రవంతి’ దీనికి ప్రబల  తార్కాణం. ఆ వొరవొడే ఈ పుస్తకంలో కూడా తొంగి చూసింది. చదివించే గుణాన్ని  సుతారంగా ఈ రచనకు అద్దింది.
శ్రీనివాసరావు మాస్కోలో వున్న రోజుల్లో నేనొకసారి వెళ్లాను. వున్నది కొద్ది రోజులే అయినా ఈ పుస్తకంలో రాసినవి అక్షర సత్యాలని అప్పటి రోజులను తలచుకుంటే అనిపిస్తోంది.
ఇన్నేళ్ళ తరువాత రాసినా వాటిల్లో తాజాతనం తగ్గకపోవడానికి ఆ రోజులకున్న ప్రత్యేకతే కారణం.
భండారు శ్రీనివాసరావు ఆకాశవాణి నుంచి, దూరదర్శన్ నుంచి వృత్తిరీత్యా  పదవీ విరమణ చేసివుండవచ్చు.  కానీ,  ప్రవృత్తి రీత్యా ఆయనకు అక్షర సన్యాసం లేదు. అందుకే కాబోలు ఇప్పటికీ ఆయన అక్షర సాంగత్యాన్నే కొనసాగిస్తున్నారు.
ఆలస్యంగా అయినా ఈ  పుస్తకాన్ని వెలుగులోకి తీసుకువస్తున్నందుకు ‘వయోధిక పాత్రికేయ సంఘం’ వారు అభినందనీయులు.


(సం) ఇనగంటి వెంకట్రావు