ఎవరీ వడ్డెర చండీదాస్ ?
మూడున్నర దశాబ్దాల కిందటి ముచ్చట.
శ్రీ పురాణం సుబ్రహ్మణ్యశర్మగారు ఆంధ్ర జ్యోతి
వారపత్రిక సంపాదకులుగా వున్నప్పుడు అంతగా పేరు తెలియని రచయిత ఒకరు తన నవలను
ప్రచురణార్ధం పంపారు. ఏండ్లూ పూండ్లు గడిచిపోతున్నా ఆ రచన గురించి అతీగతీ
తెలియకపోవడంతో ‘తన నవలను తనకు భద్రంగా
వొప్పచెప్పాలనీ, లేనిపక్షంలో న్యాయపరమయిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని
అతగాడు లీగల్ నోటీసు ఇచ్చాడు. దాంతో పురాణంగారు, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు సెలవులో వెళ్లడం వల్ల అప్పుడు వారపత్రికలో
తాత్కాలికంగా సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్న నేనూ కలసి, అలమరాలన్ని గాలించి,
పాతకట్టలన్నీ దులిపి ఎట్టకేలకు ఆ నవలను పట్టుకున్నాము.
ఆ విషయం రచయితకు తెలియచేద్దాం అనుకుంటూనే పురాణం
గారు యధాలాపంగా ఆ నవలలోని కొన్ని పేజీలు తిరగేసారు. ఆయన కళ్ళల్లో ఇసుమంత
ఆశ్చర్యంతో కూడిన కాంతి కనిపించింది. వెంటనే ఆర్టిస్టుని పిలిపించి అప్పటికప్పుడే
ప్రోమో రాయించడం, ఆ నవలను ధారావాహికంగా ప్రచురించేందుకు ముహూర్తం (తేదీ)
నిర్ణయించడం, ఆ విషయాన్ని పత్రికాముఖంగా ప్రచురించడం చకచకా జరిగిపోయాయి. దానితో
తెలుగు సాహితీ లోకానికి మరో కొత్త రచయిత పరిచయమయ్యాడు. తెలుగు నవలా సాహిత్యాన్ని
మరో మలుపు తిప్పిన ఒక గొప్ప రచయిత పాఠకులకు దొరికాడు. ఆయన ఎవ్వరో కాదు,
కీర్తిశేషులు వడ్డెర చండీదాస్.(అసలు పేరు చెరుకూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు) ఆ నవల –
తెలుగు నవలల్లో ఇప్పటికీ స్వయం జ్వలిత జ్వాలగా భాసిల్లుతున్న ‘హిమజ్వాల’.
వెలుగు చూడని ఈ సంగతులు తెలుసుకోవాలంటే - ‘మార్పుచూసిన కళ్ళు’ పుస్తకం చదవండి. అలనాటి
కమ్యూనిస్ట్ రష్యా చరమాంకం విశేషాలను అక్షరబద్ధం చేస్తూ సాగిన రచన. ముద్రణ పూర్తయి
విడుదలకు సిద్ధంగా వుంది. ప్రతులకు, వివరాలకు: శ్రీ కె. లక్ష్మణరావు, కార్యదర్శి,
వయోధిక పాత్రికేయ సంఘం, హైదరాబాదు. ఫోను: 9394712208,
Email: lakshmanarao_konda@yahoo.co.in>,
3 కామెంట్‌లు:
మీ ప్రొమొ టీజర్లు చాలా బాగున్నాయి సార్. ఇలా వేస్తూ వేస్తూ, చివరకు అన్ని విశేషాలూ వ్రాయకపోతారా అని ఎదురు చూస్తున్నాము. ఎంతైనా తెలుగు వాళ్ళం కదా, కొని చదవటానికి కొంచెం బాధే! పుస్తకాన్ని "ఈ బుక్" చెయ్యనివ్వకండి. మావంటి దుర్మార్గులు డౌన్లోడ్లో ఎక్కడినుంచో అక్కడినుంచె పట్టేస్తాము మరి!
@శివరామ ప్రసాదు గారికి – చదవడం ముఖ్యం కాని ‘కొని’ చదవడం కాదుకదా. వయోధిక పాత్రికేయ సంఘం వారు కూడా ఏదో లాభాలు గడించాలని ఈ ప్రయత్నానికి పూనుకోవడం లేదు. నలుగురు చదివే, నలుగురి చేత చదివించే నాలుగు పుస్తకాలు వేయాలన్నదే వారి ఆశయం.-భండారు శ్రీనివాసరావు
good info..interesting....
కామెంట్‌ను పోస్ట్ చేయండి