రాయపాటి సాంబశివరావు,
పార్లమెంటు సభ్యులు, గుంటూరు
వ్యాపారపు పనులమీద విదేశాలకు వెళ్ళినప్పుడు అనేకమంది పరిచయం అవుతుంటారు.
కొందరితో పరిచయాలు ‘రైలు స్నేహాల’ మాదిరిగా విడిపోయేవరకు విడలేని విధంగా వుంటాయి. మరికొన్ని జీవితాంతం కొనసాగుతాయి.
నేను మొదటిసారి శ్రీనివాసరావును కలుసుకున్నది హైదరాబాదులో. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయిన తరువాత రేడియోలో పనిచేసే ఆకిరి రామకృష్ణారావు, ఆయనా కలసి వచ్చి ఇంటర్వ్యూ చేశారు. మళ్ళీ అదే శ్రీనివాసరావును చాలా ఏళ్ళ తరువాత మాస్కోలో కలిసాను. అంతకుముందు ఆయన స్థానంలో పనిచేసిన ఏడిద గోపాలరావుతో నాకు మంచి పరిచయం. అలాగే ‘రాదుగ’ ప్రచురణాలయంలో పనిచేసే ‘ఆర్వీయార్’ కూడా బాగా తెలుసు. మాస్కోలో వున్న తెలుగు విద్యార్ధులందరికీ వాళ్ళిద్దరూ ‘గాడ్ ఫాదర్స్’ లాటివారు.
శ్రీనివాసరావు మాస్కోలో వున్న కాలంలో ఇండియన్ ఎంబసీ లో పనిచేసే తెలుగువాళ్ళ సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. అంతకుముందు వరకు అంటీ ముంటనట్టుగా వుంటున్న తెలుగు కుటుంబాల నడుమ సంబంధాలు శ్రీనివాసరావు మాస్కో వచ్చిన తరువాత బాగా మెరుగుపడ్డాయి. దీనికి కొంత ఆయనకు స్వతహాగా వున్న ‘పీఆర్’ కారణమయితే, ఆయన భార్య నిర్మలాదేవి ఆప్యాయతా ఆదరణ బాగా దోహదం చేశాయని నేననుకుంటున్నాను.
నేను మాస్కో వెళ్ళినప్పుడల్లా వారింటికి వెళ్ళేవాడిని. భోజరాజు ఆస్థానం మాదిరిగా ఇల్లంతా సందడి. శనాదివారాలు వచ్చాయంటే చాలు మాస్కోలోనే కాదు చుట్టుపక్కల నగరాల్లో చదువుకుంటున్న తెలుగు విద్యార్దులెంతోమంది వారింట్లో కనిపించేవారు. వాళ్ళావిడ నిజంగా అన్నపూర్ణ. ఎంతమంది వచ్చినా విసుగులేకుండా వండి వార్చేది. అన్నదాతా! సుఖీభవ!
పోతే, శ్రీనివాసరావు (నేను ఆప్యాయంగా ‘సీనప్పా’ అని పిలుస్తాను) ఆనాటి మాస్కో రోజులు గురించి రాసిన ‘మార్పు చూసిన కళ్ళు’ పుస్తకం చదివాను. అప్పటి, అక్కడి పరిస్తితులను కళ్ళకు కట్టినట్టుగా రాసాడని అనడంలో సందేహం లేదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి