దేశాన్ని ఎవరు పాలిస్తున్నారు? – భండారు
శ్రీనివాసరావు
న్యాయబద్ధంగా, చట్ట
బద్ధంగా ఒక కోటి రూపాయలు సంపాదించాలంటే ఎన్నేళ్ళు కష్టపడాలి? యెంత కష్ట పడాలి?
అదే అక్షరాలా నలభయ్ మూడు వేల కోట్లరూపాయలు సంపాదించాలంటే –
ఇది కాలము,దూరము, కాలము
సమయము లెక్కకాదు లెక్కకట్టి చెప్పడానికి. కానీ ఈ ప్రశ్నకూ ఈ మధ్య జవాబు
దొరికింది.
ఒక్క కేంద్ర మంత్రిని తప్పిస్తే చాలు అంత డబ్బూ రెక్కలు కట్టుకుని వచ్చి వొళ్ళో
వాలుతుందని అపర కుబేరుడు రిలయన్స్ సంస్థాపక అధినేత దీరూ భాయ్ అంబానీ పెద్ద
కుమారుడు ముఖేష్ అంబానీ రుజువు చేశారు.
ప్రభుత్వాలపై కార్పొరేట్ ప్రపంచం పట్టు ఎలాటిదో ఈ సంఘటన తెలియచెప్పింది.
పాలకులు సంపన్న వర్గాల నడుమ ఈ రకమయిన పరస్పరాధేయ
సంబంధాలు అనేక దేశాల్లో అనేకానేక రూపాల్లో
కానవస్తాయి. రాజులు రాజ్యాల రోజుల్లో పాలకులపై పెత్తనాన్ని మత పెద్దలు పోషిస్తే, ఆధునిక కాలంలో బడా పారిశ్రామిక వేత్తలు ఈ
పాత్రను సొంతం చేసుకున్నారు.
రాజకీయ పార్టీలకు అధికారం పరమావధి. ఎన్నికల
సమరాంగణంలో గెలిచి పీఠం ఎక్కాలంటే డబ్బుది ప్రధాన భూమిక. డబ్బు ద్వారా అధికారం
అన్నది వారి మార్గం అయితే, అధికారంలో
వున్నవారిని లోబరచుకోవడం ద్వారా డబ్బు
సంపాదించడం పారిశ్రామికవర్గాల పన్నుగడ. అందుకే వీరి నడుమ సయోధ్యకు సానుకూలతలు
అనేకం. అవగాహనకు అవకాశాలు అపారం. ఇచ్చి పుచ్చుకోవడాలకు వీలు సాళ్లు పుష్కలం.
అయితే, ప్రభుత్వాలపైనా, పాలకులపైనా రాజ్యాంగేతర శక్తులు
పట్టుచిక్కించుకుంటే ముందు దెబ్బతినేది
పాలితులయిన ప్రజల ప్రయోజనాలే. పాలకులు,
పారిశ్రామికవేత్తలకు నడుమ పైకి కనిపించకుండా
కుదిరే ఏవిధమయిన వొప్పందం అయినా అది సామాన్య జనాలకు మేలు చేసేదిగా వుంటుందని అనుకోవడానికి
వీలుండదు.
ఈ ప్రస్తావనకు ప్రాతిపదిక అయిన వర్తమానానికి
వస్తే –
ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న కేంద్ర మంత్రివర్గ
విస్తరణ పూర్తయింది. ఎన్నికల సమరాంగణంలోకి దూకే
పోరాట జట్టుగా కొత్త మంత్రివర్గాన్ని ప్రధానే అభివర్ణించారు. ఇందుకోసం ఆయనా, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కలసి పెద్ద
కసరత్తే చేశారు. సీనియారిటీ లెక్కలు తీసారు. విధేయతను కొలిచి చూసారు. రాహుల్ కోరిక
మేరకు యువకులను, కొత్తవారిని మంత్రులుగా తీసుకున్నారు.
మొదటిసారి లోకసభకు ఎన్నికయినవారికి కూడా మంత్రి పదవులు ఇచ్చారు. ఈ క్రమంలో కొందరు సీనియర్లకు ఉద్వాసన చెప్పారు. వారికి
పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. మంత్రిపదవే పోయిన తరువాత ఇక కొత్తగా
కట్టబెట్టే పార్టీ పదవులతో చేసేదేమిటన్న నిర్వేదం కొందరికి మిగిల్చారు. తాజాగా ఆరోపణల
మచ్చ పడ్డ మరికొందరికి మాత్రం మరింత మంచి శాఖలు పందారం చేశారు. వినయ విధేయతల
ప్రాతిపదికపై కొన్ని కొత్త ముఖాలకి
మంత్రివర్గంలో చోటు కల్పించారు. విధేయత విషయంలో అందరికంటే ఒక ఆకు ఎక్కువ చదివిన సీనియర్లను సామాజిక సమతుల్యం
పేరుతొ పక్కనబెట్టారు. ఇది రుసరుసలకు దారితీయడంతో చివరి నిమిషంలో కొన్నిమార్పులు చేశారు. రోజులు గడవకముందే చేసిన
మార్పులకు మరి కొన్ని చేర్పులు చేశారు. ఇంకా చేస్తూనే వున్నారు. మరి ఇంత హైరానా
పడి, రోజుల తరబడి కసరత్తులు చేసి సాధించింది ఏమిటన్న
ప్రశ్న అలాగే వుంది. సరయిన గుర్తింపు లభించలేదని
అసహనంతో వున్నవాళ్ళు నెమ్మదించలేదు.
మార్పులు చేర్పుల్లో మంచి హోదా
లభిస్తుందని ఆశలు పెంచుకున్న వాళ్లకు కూడా
ఆ ఆనందం ఆఖరి క్షణంలో ఆవిరై
పోయింది. ఆశావహుల సంగతి ఎలావున్నా ఆంధ్ర ప్రదేశ్ కు స్వాతంత్ర్యం లభించిన తరువాత
ఎన్నడూ కనీ వినీ ఎరుగని స్థాయిలో పది మందికి మంత్రివర్గంలో స్థానం లభించింది. చిన్నవో పెద్దవో వివిధ మంత్రిత్వ శాఖలు దొరికాయి. అంతవరకూ సంతోషించాలి. అయితే, ఈ ప్రక్రియలో తెలంగాణాకు అన్యాయం జరిగిందన్న
ఆలోచన పురుడు పోసుకుంది. అది పెరిగి పెద్దది కాకుండానే మరో వాదం తెర ముందుకు
వచ్చింది. అసలు తెలంగాణా ఇవ్వడానికే ఇదంతా
చేసారని, జైపాల్ రెడ్డికి చిన్న పోస్ట్ ఇచ్చి రిజర్వ్ లో పెట్టింది ఇందుకోసమేనని కొందరు భాష్యాలు చెప్పారు.
కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయకముందే
ఉత్తరాది మీడియా బాంబు లాంటి వార్త
పేల్చింది, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అభీష్టం
మేరకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ నుంచి మన రాష్ట్రానికి చెందిన సీనియర్ మంత్రి
జైపాల్ రెడ్డిని తప్పిస్తున్నారని. రిలయన్స్ కు అనుకూలమయిన నిర్ణయాలు తీసుకోవడంలో
జైపాల్ రెడ్డి విముఖత ప్రదర్శిస్తూ వుండడమే దానికి కారణమని కొన్ని పత్రికలు ముక్తాయింపు కూడా ఇచ్చాయి.
మీడియా వూహాగానాలను నిజం చేస్తూ జైపాల్ రెడ్డి
శాఖ మారింది. చాలా చిన్న శాఖగా పరిగణించే శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖను జైపాల్
రెడ్డి వంటి సీనియర్ కు వొప్పగించిన తీరు చూసి నివ్వెర పోవడం అందరి వంతు అయింది.
ఆయన మాత్రం నిబ్బరం కోల్పోలేదు. ‘పెట్రోలియం
శాఖ ఇచ్చినప్పుడు కొంత అసంతృప్తికి గురయ్యాను
కాని ఇప్పుడు శాస్త్ర సాంకేతిక శాఖ కేటాయించినప్పుడు ఎలాటి అసంతృప్తి లేద’ని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో పండిపోయిన మనిషి.
యెలా స్పందించాలో ఆ మాత్రం తెలియని వ్యక్తి కాదు కదా.
అసలేం జరిగి వుంటుందన్న దానిపై కొత్త వూహాగానాలు
మొదలయ్యాయి. ఇంకా పేరుపెట్టని కొత్త పార్టీ పెట్టి అన్ని పార్టీలకు చెందిన అగ్ర
నాయకులపై అవినీతి ఆరోపణాస్త్రాలు
గుప్పిస్తూ మీడియాలో వెలిగిపోతున్న కేజ్రీ వాల్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని మరింత
చెలరేగిపోయారు. అంతకుముందు తాను అవినీతి ఆరోపణలు చేసిన కేంద్ర మంత్రి ఖుర్షీద్
కు శాఖల మార్పిడిలో పెద్దపీట వేయడం చూసి
కేజ్రీ వాల్ కు పుండు మీద కారం రాసినట్టయింది. మీడియాలో వెల్లడయిన సమాచారానికి
మరికొంత జోడించి తన అంబులపొదిలో
ఆరోపణాస్త్రాలకు కొదవలేదని నిరూపించారు.
ముఖేష్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్
ఇండస్ట్రీస్ సంస్థకు దేశ
ప్రయోజనాలను ప్రభుత్వం తాకట్టు పెట్టిందని, ఇందులో భాగంగానే జైపాల్ రెడ్డిని పెట్రోలియం శాఖనుంచి తప్పించారని
కేజ్రీ వాల్ ఆరోపణ.
ప్రభుత్వంతో కుదుర్చుకున్న అవగాహనకు విరుద్ధంగా రిలయన్స్
గ్యాస్ ఉత్పత్తిని దాదాపు నిలిపివేసి ధర
పెంచాలని అడ్డదారిలో వొత్తిడి
తెస్తోందని అంటూ, సరకును దాచి పెట్టి కృత్రిమంగా రేట్లు పెంచాలని చూసే చిల్లర
వ్యాపారుల నైజంతో రిలయన్స్ దిగ్గజం
వ్యవహారాన్ని కేజ్రీ వాల్ పోల్చారు.
ముఖేష్ అంబానీ డిమాండ్లను
అంగీకరిస్తే రిలయన్స్ సంస్థకు అదనంగా 43 వేల కోట్ల రూపాయల అదనపు లాభం రాగలదని., కేంద్ర రాష్ట్ర
ప్రభుత్వాలపై 53 వేల కోట్లు అదనపు భారం పడగలదని జైపాల్ రెడ్డి తయారుచేసిన నోట్ లో
పేర్కొన్నారని కేజ్రీ వాల్ వెల్లడించారు. కృష్ణా గోదావరి బేసిన్ లో గ్యాస్ అన్వేషణ
విషయంలో ప్రభుత్వంపై అధిక భారం పడగల అనేక రాయితీలను గతంలో బీజేపీ సారధ్యంలోని ఎన్
డీ యే ప్రభుత్వం కూడా సమకూర్చి పెట్టిందని ఆయన గుర్తుచేశారు.
ఈ ఆరోపణలను రిలయన్స్
తీవ్రంగా ఖండించింది. వీటి వెనుక స్వార్ధపర శక్తుల ప్రచ్చన్న హస్తం వుందని ఎదురు
దాడికి దిగింది.
కేజ్రీ వాల్ ఆరోపణలు
ఎలావున్నా, వాటిపై ప్రభుత్వం సరిగా స్పందించకపోవడం గమనార్హం.
ప్రతి ఆరోపణకూ సమాధానం చెప్పడం కుదిరేపని కాదని సమర్ధించుకోవచ్చు. కానీ
విషయాలు ఇంత స్పష్టంగా వుండి సందేహాలకు తావిస్తున్నప్పుడు వివరణ ఇవ్వాల్సిన నైతిక
బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకోజాలదు. లేకపోతే దేశాన్ని ఎవరు పాలిస్తున్నారు ?
ప్రజలతో ఎన్నికయిన ప్రభుత్వాలా? ప్రభుత్వ రాయితీలతో సంపద పోగేసుకుంటున్న బడా పారిశ్రామికవేత్తలా?
అనే మరో ప్రశ్న తలెత్తుతుంది. (03-11-2012)
7 కామెంట్‌లు:
ఈ దేశాన్ని ఎవరు పాలించడంలేదు.
పాలిస్తే ఇంత దుస్థితిలో ఉండదు.
ఏదో అలా నడుస్తోంది అంతే.
@బోనగిరి - బాగా చెప్పారు. - భండారు శ్రీనివాసరావు
మీరెన్నైనా చెప్పండి, మన్‌మోహన్ సింగును మాత్రం మీరు కరప్ట్ అనలేరు. అంబానీలు అధినేత్రికి, కాంగ్రేస్ పార్టీకి వేల కోట్లు ఇస్తే ఇచ్చివుండవచ్చు. మన్మోహనుడికి ఎంగిలి మెతుక్ కూడా దక్కలేదు, ఎందుకంటే ఆయన తినడు. మంగళారతులిచ్చి, కొబ్బరికాయకొట్టి, వీరతిలకం దిద్దగలిగే మచ్చలేని నిజాయతీపరత్వం ఆయన స్వంతం, మరి. ఏం చేద్దాం?
రాజకీయ పార్టీలకు అధికారం పరమావధి. ఎన్నికల సమరాంగణంలో గెలిచి పీఠం ఎక్కాలంటే డబ్బుది ప్రధాన భూమిక. డబ్బు ద్వారా అధికారం అన్నది వారి మార్గం అయితే, అధికారంలో వున్నవారిని లోబరచుకోవడం ద్వారా డబ్బు సంపాదించడం పారిశ్రామికవర్గాల పన్నుగడ.
------------------------
universal truth.
Rao S Lakkaraju - Thanks
కొబ్బరి చెట్టుకి మడిబట్ట కట్టి, ఇహ నా కొబ్బరికాయలు ఏదొంగవెధవ ముట్టుకోడని ప్రశాంతంగా నిద్రపోయిందట వెనకటికొక చాందసపు బామ్మగారు! మన ప్రధానమంత్రి పరమ నీతిమంతుడైన ఆర్ధిక నిపుణుడు గనుక మనదేశ భవిష్యత్తుని దేదీప్యమానంగా వెలిగించేస్తాడని కొండత ఆశతో చూసే సామాన్య ఓటరుకి ఆ బామ్మగారికి పెద్ద తేడా ఏమి లేదు.
Our state politicians are one step above compared to this. They them self were/are? industrialists and politicians who influence and policy makers who generate thousands of crore's in 5 years. But unfortunately our people still carry them on shoulders. Some times I found this contrary on this blog too.
కామెంట్‌ను పోస్ట్ చేయండి