కాలాన్ని నమ్ముకున్న కాంగ్రెస్ – భండారు శ్రీనివాసరావు
ఎన్నికల కోయిల ముందే కూయొచ్చన్న సంకేతాలు ఏకంగా
యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ నుంచే వెలువడిన నేపధ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమ
శ్రేణులను తుది సమరానికి సంసిద్ధులను చేయడంలో నిమగ్నమయ్యాయి. చివరి పోరు అనడానికి కారణం వుంది. తెలుగుదేశం పార్టీ
ఇప్పటికే రెండు దఫాలుగా అధికారానికి దూరంగా వుంది. మూడోసారి కూడా అందలాన్ని
అందుకోలేకపోతే మరో అయిదేళ్లపాటు పార్టీ శ్రేణుల్ని కట్టడి చేయడం ఒక ప్రాంతీయ
పార్టీకి అలవికి మించిన పని అవుతుంది. పోతే, పాలక
పక్షం కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే వరసగా మూడో పర్యాయం కూడా ప్రజలు పట్టం కలిగేంత
గొప్ప పాలనను అందిస్తున్న దాఖలా అటు కేంద్రంలో కాని ఇటు రాష్ట్రంలో కానీ కానరాని
స్తితి. మరో జాతీయ పార్టీ బీజేపీ
పరిస్తితి కూడా ఇలాగే వుంది. కాంగ్రెస్ తప్పిదాలను ఇక ఎంతమాత్రం జీర్ణించుకోలేని
వోటర్లు కూడా ఆ పార్టీ పట్ల మొగ్గుచూపడానికి సిద్ధంగా వున్నారని చెప్పడానికి వీలు
లేకుండా ఆ పార్టీ ప్రతిష్ట నానాటికి
తీసికట్టు అన్న చందంగా తయారవుతోంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు గడ్కరీ ఉదంతం
దీనికి తాజా ఉదాహరణ. పోతే,
రాష్ట్రంలో మిగిలిన పార్టీల పరిస్తితి కూడా ఆశాజనకంగా లేదు. ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్న వై.ఎస్.ఆర్.
పార్టీ అధినాయకుడు జగన్ మోహనరెడ్డి జైలు
నాలుగు గోడల నడుమనే వుండిపోవడంతో ఆ పార్టీ
సైతం నాయకత్వలేమితో కొట్టుమిట్టాడుతోంది. షర్మిల రూపంలో ఎదిగివచ్చిన ప్రత్యామ్నాయం
కూడా పాదయాత్రల వరకు పనికిరావొచ్చేమో కాని, ఎన్నికల సమరంలో పార్టీని విజయపధంలో నడిపించే దక్షత ఒక్క జగన్
మోహన్ రెడ్డికి మాత్రమే వుందని నమ్మేవారు ఆ పార్టీలోనే చాలామంది వున్నారు. దర్యాప్తులు, విచారణల పేరుతొ ఒక పక్క సీబీఐ, మరోపక్క ఈడీ, ఆ పార్టీ నాయకులకు కంటిమీద కునుకు లేకుండా
చేస్తున్నాయి. అనేక సమస్యల నడుమ చేస్తున్న వొంటరిపోరాటం మరెంతో కాలం కొనసాగించడం
అసాధ్యమని, ఫలితంగా కార్యకర్తలు నిరుత్సాహానికి
గురయి అయోమయంలో పడే అవకాశాలు ఎక్కువనే అభిప్రాయం వినబడుతోంది. కాలం గడిచేకొద్దీ, అనేక కొత్త సమస్యలు ఆ కొత్త పార్టీని పట్టి
పీడించే అవకాశాలు లేకపోలేదు. వీటి ప్రభావం ఆ పార్టీ విజయావకాశాలను ఏదో ఒక మేరకు
దెబ్బతీసే ప్రమాదం కూడా వుంది. ప్రస్తుత పాలకపక్షం కాంగ్రెస్ నిష్క్రియాపరత్వం, దాన్ని సరిగ్గా
అంది పుచ్చుకుని రాజకీయ లబ్ధిని పొందడంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం
వైఫల్యం, వామపక్షాలతో సహా అన్ని పార్టీలు ప్రజాసమస్యల పట్ల
అంటీముట్టనట్టు వుండడం ఇవన్నీ పాలకపక్షానికి
కలసివచ్చే అంశాలే. అయినా కానీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ‘కాలమే అన్ని సమస్యలకు పరిష్కారం చూపగలద’న్న పద్ధతిలో కాలం గడుపుతోంది. ప్రతి రోజూ
పత్రికల్లో ఆ పార్టీలో పెచ్చరిల్లుతున్న లులుకల గురించిన కధనాలే. నాయకుల నడుమ పెరిగిపోతున్న పొరపొచ్చాలు
గురించిన వూహాగానాలే. ముఖ్యమంత్రికీ, మంత్రులకు పడదు. మంత్రులకూ మంత్రులకు పొసగదు. ముఖ్యమంత్రికీ, ఉపముఖ్యమంత్రికి కుదరదు. పీసీసీ అధ్యక్షుడి సంగతి
సరేసరి. ముఖ్యమంత్రి మెదక్ జిల్లాలో ఇందిరమ్మ బాట ప్రోగ్రాం పెట్టుకుని పోదామనుకుంటే, అదే జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి రానని
మొరాయింపు. ముఖ్యమంత్రే స్వయంగా ఫోను చేసినా డిప్యూటీ సీ.ఎం. ఏమాత్రం స్పందించలేదని మీడియా కోడై కూయడం ఈ మొత్తం
వ్యవహారానికి కొసమెరుపు. కాగా, నాయకుల
నడుమ సఖ్యత, సమన్వయం సాధించడం కోసం పీసీసీ అధ్యక్షుడు గాంధీ భవన్లో
సమావేశం ఏర్పాటు చేసి వందమంది నాయకులను ఆహ్వానిస్తే దాదాపు మూడోవంతు మంది గైరు
హాజరు. పదిహేనుమంది మంత్రులు మొహం
చాటేశారని సమాచారం. ఇక పార్టీకిచెందిన అనేకమంది పార్లమెంటు సభ్యుల జాడలేదు. ఉప
ముఖ్యమంత్రి కూడా బలవంతపెట్టగా
వచ్చివెళ్లినట్టు భోగట్టా.
పార్టీలో ఏం జరుగుతున్నదో ఎవరికీ తెలియదు, కానీ ఏదో జరిగిపోతున్నట్టు వార్తలు. వూహాగానాల్ని
ఖండించే నాధుడు వుండకపోగా పైగా వాటిని ప్రోత్సహించే సంప్రదాయం. జనం
నోళ్ళల్లో సదా నలగడానికి, ఇతర
విషయాలను ప్రజల దృష్టి నుంచి మళ్ళించడానికి
ఆ పార్టీ ఎంచుకున్న వ్యూహమేమో తెలియదు.
సాధారణంగా ఎన్నికల వేళ దగ్గరపడుతుంటే పాలకపక్షాలు
కొన్ని ప్రజారంజక నిర్ణయాలు ఇష్టం వున్నా లేకపోయినా, భరించగలిగే
స్తోమత వున్నాలేకపోయినా తీసుకోవడం కద్దు. కానీ, అదేమీ
చిత్రమో రాష్ట్రంలో పరిస్తితి ఇందుకు పూర్తిగా విరుద్ధం. గ్యాస్ సిలిండర్ల సంగతే
ఇందుకు చక్కని దృష్ట్యాంతం. సరఫరా చేసే సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను కుదిస్తూ
నిర్ణయం తీసుకున్నది కేంద్రంలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీయే ప్రభుత్వం.
ప్రజలనుంచి ఎదురయ్యే నిరసన గురించి అంచనా వేసుకున్న దరిమిలా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మరో మూడు
సిలిండర్లు అదనంగా సబ్సిడీ ధరపై ఇవ్వాలని ఆదేశించారు. ఈ అవకాశాన్ని రాష్ట్రంలో అధికారంలో వున్న
కాంగ్రెస్ ప్రభుత్వం యెగిరి గంతేసి అందిపుచ్చుకోవాలి. కానీ, కిరణ్ సర్కార్ ససేమిరా అంది. దీపం పధకం
లబ్దిదారులవరకే ఆ రాయితీని పరిమితంచేసి మిగిలిన వారికి మొండి చేయి చూపింది. దీనిపై
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వీ. హనుమంతరావు మండిపడ్డారు. ఏకంగా ముఖ్యమంత్రినే
నిలదీసినట్టు వార్తలు. కానీ చివరికి ఏమయింది. సాధ్యం కాని పని అని ముఖ్యమంత్రి
ఖరాఖండిగా చెప్పినట్టు ఆ వార్తలకు ముక్తాయింపు. పెట్రో ధరలు, ఫీజు రీయింబర్స్ మెంటు, రేషన్
కార్డుల కుదింపు ఇలా ఏది తీసుకున్నా కిరణ్ సర్కారు వైఖరి వోటర్లను
ఆకట్టుకునేదిగా లేదు. ఒకరకంగా ఇది అభిలషణీయం. ఎన్నికలను, వోటు
బ్యాంకులను లెక్కచేయకుండా మొత్తం రాష్ట్ర ప్రగతిని దృష్టిలో వుంచుకుని నిర్ణయాలను
తీసుకోవడం ఆహ్వానించదగ్గ విషయం. గాడితప్పిన రాష్ట్ర ఆర్ధిక పరిస్తితిని చక్కదిద్దడానికి
ఇలా వ్యవహరిస్తే తప్పుపట్టాల్సింది ఏమీ వుండదు. కానీ, నిజంగా
ఇంతటి సదుద్దేశ్యంతో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం వ్యవహరిస్తున్నది అని అనుకోవడం
అంత నమ్మదగినదిగా లేదు.
రాజకీయాల్లో రెండు తరహాల వాళ్లు వుంటారు. ఈ
రకమయిన తెగింపు నిర్ణయాలను వారు మాత్రమే తీసుకోగలుగుతారు.
ఒకరు రాజకీయవేత్తలు. వీరికి రేపటితో నిమిత్తం లేదు. తిమ్మిని బమ్మిచేసయినా సరే, ఆచరణ
సాధ్యం కాని వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టయినా సరే ఏదోఒక విధంగా అధికార పీఠాన్ని దక్కించుకోవాలని చూసేవారు.
అయితే, ఇక ఏం చేసినా ప్రజలు నమ్మి తమకు అధికారం అప్పగించడం
కల్ల అని నిర్ధారణకు వచ్చినప్పుడు ఈ
రకమయిన ‘గట్టి’ నిర్ణయాలు
తీసుకోవాడానికి కూడా సంకోచించరు. రెండో
వారు రాజనీతిజ్ఞులు. తక్షణ రాజకీయ
ప్రయోజనాలను పక్కన బెట్టి, భవిష్యత్తు
గురించి, భావితరాలను గురించి ఆలోచించే దూరదృష్టి
కలిగినవారు. కానీ ప్రస్తుతం ఈ రకం రాజకీయ నాయకులు ‘అంతరించిపోతున్న
జాతుల’ జాబితాలో వున్నారు.
కాకపొతే రాష్ట్ర
కాంగ్రెస్ నాయకత్వాన్ని బలంగా బలపరుస్తున్న కొందరు చెప్పేది వేరేగా వుంది. వీరు
కాలాన్ని, కాలం తెచ్చే మార్పుల్ని నమ్ముకుని రోజుల్ని
ఏమారుస్తున్నవారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మధ్యంతరం వచ్చిపడితే తప్ప అసెంబ్లీ
ఎన్నికలకు ఇంకా నిండా ఏన్నర్ధం పైచిలుకు వ్యవధానం వుంది. పాదయాత్రల పేరుతొ జనాలకు
వెడుతున్న రెండు ప్రతిపక్షాల నాయకులు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే కంటే, ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకోవడానికే ప్రాధాన్యతను
ఇస్తూ వుండడం పాలక పక్షానికి వూరట కలిస్తోంది. ఈ నేపధ్యంలో ప్రతిపక్షాల వోట్లు చీలక తప్పవన్న భరోసా
కాంగ్రెస్ వారిది. కోర్టులు, కేసులతో
జగన్ పార్టీని బలహీనపరచగలిగితే, ఇప్పటికే ప్రాంతీయ ఉద్యమవేడితో ఒక ప్రాంతంలో
బలహీనపడివున్న మరో ప్రధాన ప్రతిపక్షం
తెలుగుదేశాన్ని మరింత బలహీన పరచడం ‘చేతి’లో పని. అధికారం చేతిలో వుంది. అధికారులు కనుసన్నల్లో
వుంటారు. పార్టీ శ్రేణులను కట్టడి చేయడానికీ, వోటర్లను ఎంతో కొంత ఆకట్టుకోవడానికీ పనికొచ్చే ఈ
రెండు ‘ఆయుధాలు’ తమ చేతిలోనే వున్నాయి. సమస్య పరిష్కారాన్ని కాలానికే
వొదిలేసి నానబెట్టడం ద్వారా ‘ప్రాంతీయ సమస్య’ను ఓ మేరకు అదుపుచేయగలిగామని నమ్మే నాయకులకు
కాంగ్రెస్ లో కొదవ లేదు. బహుశా ఇలాటి ధీమాతోనే కాంగ్రెస్ తన సమస్యలను అన్నింటినీ ‘కాలానికే’ వొదిలేసి
నిశ్చింతగా కాలక్షేపం చేస్తోందని అనుకోవాలి. (26-10-2012)
4 కామెంట్‌లు:
మీ విశ్లేషణ చాలా బాగుంది .
కాలమే పరిష్కరిస్తుందని సమస్యలని పేరపెట్టుకుని కూర్చున్న ఇందిరా గాంధీ, నరసిం హారావులు చివరకి పెద్ద సాధించినదేమీ లేదన్న విషయాన్ని కాంగ్రెస్ వారు విస్మరిస్తున్నారు .
everybody should fallow nd believe the time sir..notonly congress..nd some others..
మీ వెబ్ పేజి విడ్త్, ఒకే పేజి విడ్త్‌లో కనిపించడం లేదు. దాంతో అడ్డంగా స్క్రోల్ చేసుకుని ఇబ్బదిగా చదవాల్సి వస్తోంది. లైన్ లెంగ్త్ తగ్గించే మార్గమేదైనా చూడండి.
@SNKR - Will you please provide your contact number or mail id if you have no objection? My number (Hyderabad) 98491 30595 Mail: bhandarusr@gmail.com, bhandarusr@yahoo.co.in
కామెంట్‌ను పోస్ట్ చేయండి