ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, అక్టోబర్ 2012, శుక్రవారం

కాలాన్ని నమ్ముకున్న కాంగ్రెస్ – భండారు శ్రీనివాసరావు


కాలాన్ని నమ్ముకున్న కాంగ్రెస్ భండారు శ్రీనివాసరావు
ఎన్నికల కోయిల ముందే కూయొచ్చన్న సంకేతాలు ఏకంగా యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ నుంచే వెలువడిన నేపధ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమ శ్రేణులను తుది సమరానికి సంసిద్ధులను చేయడంలో నిమగ్నమయ్యాయి. చివరి పోరు  అనడానికి కారణం వుంది. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే రెండు దఫాలుగా అధికారానికి దూరంగా వుంది. మూడోసారి కూడా అందలాన్ని అందుకోలేకపోతే మరో అయిదేళ్లపాటు పార్టీ శ్రేణుల్ని కట్టడి చేయడం ఒక ప్రాంతీయ పార్టీకి అలవికి మించిన పని అవుతుంది. పోతే, పాలక పక్షం కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే వరసగా మూడో పర్యాయం కూడా ప్రజలు పట్టం కలిగేంత గొప్ప పాలనను అందిస్తున్న దాఖలా అటు కేంద్రంలో కాని ఇటు రాష్ట్రంలో కానీ కానరాని స్తితి.  మరో జాతీయ పార్టీ బీజేపీ పరిస్తితి కూడా ఇలాగే వుంది. కాంగ్రెస్ తప్పిదాలను ఇక ఎంతమాత్రం జీర్ణించుకోలేని వోటర్లు కూడా ఆ పార్టీ పట్ల మొగ్గుచూపడానికి సిద్ధంగా వున్నారని చెప్పడానికి వీలు లేకుండా ఆ పార్టీ ప్రతిష్ట  నానాటికి తీసికట్టు అన్న చందంగా తయారవుతోంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు గడ్కరీ ఉదంతం దీనికి తాజా ఉదాహరణ. పోతే, రాష్ట్రంలో మిగిలిన పార్టీల పరిస్తితి కూడా ఆశాజనకంగా లేదు.  ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్న వై.ఎస్.ఆర్. పార్టీ అధినాయకుడు జగన్ మోహనరెడ్డి  జైలు నాలుగు గోడల నడుమనే  వుండిపోవడంతో ఆ పార్టీ సైతం నాయకత్వలేమితో కొట్టుమిట్టాడుతోంది. షర్మిల రూపంలో ఎదిగివచ్చిన ప్రత్యామ్నాయం కూడా పాదయాత్రల వరకు పనికిరావొచ్చేమో కాని,  ఎన్నికల సమరంలో  పార్టీని విజయపధంలో నడిపించే దక్షత ఒక్క జగన్ మోహన్ రెడ్డికి మాత్రమే వుందని నమ్మేవారు ఆ పార్టీలోనే  చాలామంది వున్నారు. దర్యాప్తులు, విచారణల పేరుతొ ఒక పక్క సీబీఐ, మరోపక్క ఈడీ,   ఆ పార్టీ నాయకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అనేక సమస్యల నడుమ చేస్తున్న వొంటరిపోరాటం మరెంతో కాలం కొనసాగించడం అసాధ్యమని, ఫలితంగా కార్యకర్తలు నిరుత్సాహానికి గురయి అయోమయంలో పడే అవకాశాలు ఎక్కువనే అభిప్రాయం వినబడుతోంది. కాలం గడిచేకొద్దీ, అనేక కొత్త సమస్యలు ఆ కొత్త పార్టీని పట్టి పీడించే అవకాశాలు లేకపోలేదు. వీటి ప్రభావం ఆ పార్టీ విజయావకాశాలను ఏదో ఒక మేరకు దెబ్బతీసే ప్రమాదం కూడా వుంది. ప్రస్తుత పాలకపక్షం కాంగ్రెస్ నిష్క్రియాపరత్వం, దాన్ని సరిగ్గా  అంది పుచ్చుకుని రాజకీయ లబ్ధిని పొందడంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం వైఫల్యం, వామపక్షాలతో సహా అన్ని పార్టీలు ప్రజాసమస్యల పట్ల అంటీముట్టనట్టు వుండడం ఇవన్నీ పాలకపక్షానికి  కలసివచ్చే అంశాలే. అయినా కానీ,  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం కాలమే అన్ని సమస్యలకు పరిష్కారం చూపగలదన్న పద్ధతిలో కాలం గడుపుతోంది. ప్రతి రోజూ పత్రికల్లో ఆ పార్టీలో పెచ్చరిల్లుతున్న లులుకల గురించిన  కధనాలే. నాయకుల నడుమ పెరిగిపోతున్న పొరపొచ్చాలు గురించిన వూహాగానాలే.  ముఖ్యమంత్రికీ, మంత్రులకు పడదు. మంత్రులకూ  మంత్రులకు పొసగదు. ముఖ్యమంత్రికీ, ఉపముఖ్యమంత్రికి కుదరదు. పీసీసీ అధ్యక్షుడి సంగతి సరేసరి. ముఖ్యమంత్రి మెదక్ జిల్లాలో ఇందిరమ్మ బాట ప్రోగ్రాం పెట్టుకుని పోదామనుకుంటే, అదే జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి రానని మొరాయింపు. ముఖ్యమంత్రే స్వయంగా ఫోను చేసినా డిప్యూటీ సీ.ఎం. ఏమాత్రం  స్పందించలేదని మీడియా కోడై కూయడం ఈ మొత్తం వ్యవహారానికి కొసమెరుపు. కాగా, నాయకుల నడుమ సఖ్యత, సమన్వయం  సాధించడం కోసం పీసీసీ అధ్యక్షుడు గాంధీ భవన్లో సమావేశం ఏర్పాటు చేసి వందమంది నాయకులను ఆహ్వానిస్తే దాదాపు మూడోవంతు మంది గైరు హాజరు. పదిహేనుమంది  మంత్రులు మొహం చాటేశారని సమాచారం. ఇక పార్టీకిచెందిన అనేకమంది పార్లమెంటు సభ్యుల జాడలేదు. ఉప ముఖ్యమంత్రి  కూడా బలవంతపెట్టగా వచ్చివెళ్లినట్టు భోగట్టా.
పార్టీలో ఏం జరుగుతున్నదో ఎవరికీ తెలియదు, కానీ ఏదో జరిగిపోతున్నట్టు వార్తలు. వూహాగానాల్ని ఖండించే  నాధుడు వుండకపోగా  పైగా వాటిని ప్రోత్సహించే సంప్రదాయం. జనం నోళ్ళల్లో సదా నలగడానికి, ఇతర విషయాలను ప్రజల దృష్టి నుంచి మళ్ళించడానికి  ఆ పార్టీ ఎంచుకున్న వ్యూహమేమో  తెలియదు.  
సాధారణంగా ఎన్నికల వేళ దగ్గరపడుతుంటే పాలకపక్షాలు కొన్ని ప్రజారంజక నిర్ణయాలు ఇష్టం వున్నా లేకపోయినా, భరించగలిగే స్తోమత వున్నాలేకపోయినా తీసుకోవడం కద్దు. కానీ, అదేమీ చిత్రమో రాష్ట్రంలో పరిస్తితి ఇందుకు పూర్తిగా విరుద్ధం. గ్యాస్ సిలిండర్ల సంగతే ఇందుకు చక్కని దృష్ట్యాంతం. సరఫరా చేసే సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను కుదిస్తూ నిర్ణయం తీసుకున్నది కేంద్రంలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీయే ప్రభుత్వం. ప్రజలనుంచి ఎదురయ్యే నిరసన గురించి అంచనా వేసుకున్న దరిమిలా  కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మరో మూడు సిలిండర్లు అదనంగా  సబ్సిడీ ధరపై  ఇవ్వాలని ఆదేశించారు.  ఈ అవకాశాన్ని రాష్ట్రంలో అధికారంలో వున్న కాంగ్రెస్ ప్రభుత్వం యెగిరి గంతేసి అందిపుచ్చుకోవాలి. కానీ, కిరణ్ సర్కార్ ససేమిరా అంది. దీపం పధకం లబ్దిదారులవరకే ఆ రాయితీని పరిమితంచేసి మిగిలిన వారికి మొండి చేయి చూపింది. దీనిపై సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వీ. హనుమంతరావు మండిపడ్డారు. ఏకంగా ముఖ్యమంత్రినే నిలదీసినట్టు వార్తలు. కానీ చివరికి ఏమయింది. సాధ్యం కాని పని అని ముఖ్యమంత్రి ఖరాఖండిగా చెప్పినట్టు ఆ వార్తలకు ముక్తాయింపు. పెట్రో ధరలు, ఫీజు రీయింబర్స్ మెంటు, రేషన్ కార్డుల కుదింపు ఇలా ఏది తీసుకున్నా కిరణ్ సర్కారు వైఖరి  వోటర్లను  ఆకట్టుకునేదిగా లేదు. ఒకరకంగా ఇది అభిలషణీయం.  ఎన్నికలను, వోటు బ్యాంకులను లెక్కచేయకుండా మొత్తం రాష్ట్ర ప్రగతిని దృష్టిలో వుంచుకుని నిర్ణయాలను తీసుకోవడం ఆహ్వానించదగ్గ విషయం. గాడితప్పిన రాష్ట్ర ఆర్ధిక పరిస్తితిని చక్కదిద్దడానికి ఇలా వ్యవహరిస్తే తప్పుపట్టాల్సింది ఏమీ వుండదు. కానీ, నిజంగా ఇంతటి సదుద్దేశ్యంతో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం వ్యవహరిస్తున్నది అని అనుకోవడం అంత నమ్మదగినదిగా లేదు.
రాజకీయాల్లో రెండు తరహాల వాళ్లు వుంటారు. ఈ రకమయిన తెగింపు నిర్ణయాలను వారు  మాత్రమే తీసుకోగలుగుతారు. ఒకరు రాజకీయవేత్తలు. వీరికి రేపటితో నిమిత్తం లేదు. తిమ్మిని బమ్మిచేసయినా సరే, ఆచరణ  సాధ్యం కాని వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టయినా సరే ఏదోఒక విధంగా  అధికార పీఠాన్ని దక్కించుకోవాలని చూసేవారు. అయితే, ఇక ఏం చేసినా ప్రజలు నమ్మి తమకు అధికారం అప్పగించడం కల్ల అని నిర్ధారణకు వచ్చినప్పుడు  ఈ రకమయిన గట్టినిర్ణయాలు తీసుకోవాడానికి కూడా  సంకోచించరు. రెండో వారు రాజనీతిజ్ఞులు.  తక్షణ రాజకీయ ప్రయోజనాలను పక్కన బెట్టి, భవిష్యత్తు గురించి, భావితరాలను గురించి ఆలోచించే దూరదృష్టి కలిగినవారు.   కానీ ప్రస్తుతం ఈ రకం  రాజకీయ నాయకులు అంతరించిపోతున్న జాతుల జాబితాలో వున్నారు.
కాకపొతే రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని బలంగా బలపరుస్తున్న కొందరు చెప్పేది వేరేగా వుంది. వీరు కాలాన్ని, కాలం తెచ్చే  మార్పుల్ని నమ్ముకుని రోజుల్ని ఏమారుస్తున్నవారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మధ్యంతరం వచ్చిపడితే తప్ప అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నిండా ఏన్నర్ధం పైచిలుకు వ్యవధానం వుంది. పాదయాత్రల పేరుతొ జనాలకు వెడుతున్న రెండు ప్రతిపక్షాల నాయకులు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే కంటే, ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకోవడానికే ప్రాధాన్యతను ఇస్తూ వుండడం పాలక పక్షానికి వూరట కలిస్తోంది. ఈ నేపధ్యంలో   ప్రతిపక్షాల వోట్లు చీలక తప్పవన్న భరోసా కాంగ్రెస్ వారిది.  కోర్టులు, కేసులతో  జగన్  పార్టీని  బలహీనపరచగలిగితే, ఇప్పటికే ప్రాంతీయ ఉద్యమవేడితో ఒక ప్రాంతంలో బలహీనపడివున్న మరో  ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశాన్ని మరింత బలహీన పరచడం చేతిలో పని. అధికారం చేతిలో వుంది. అధికారులు కనుసన్నల్లో వుంటారు. పార్టీ శ్రేణులను కట్టడి చేయడానికీ, వోటర్లను ఎంతో కొంత ఆకట్టుకోవడానికీ పనికొచ్చే ఈ రెండు ఆయుధాలుతమ చేతిలోనే వున్నాయి. సమస్య పరిష్కారాన్ని కాలానికే వొదిలేసి నానబెట్టడం ద్వారా ప్రాంతీయ సమస్యను ఓ మేరకు అదుపుచేయగలిగామని నమ్మే నాయకులకు కాంగ్రెస్ లో కొదవ లేదు. బహుశా ఇలాటి ధీమాతోనే కాంగ్రెస్ తన సమస్యలను అన్నింటినీ కాలానికేవొదిలేసి నిశ్చింతగా కాలక్షేపం చేస్తోందని అనుకోవాలి. (26-10-2012)

24, జూన్ 2011, శుక్రవారం

కాంగ్రెస్‌ ఇల్లు చక్కబడుతుందా ? - భండారు శ్రీనివాసరావు

కాంగ్రెస్‌ ఇల్లు చక్కబడుతుందా ? - భండారు శ్రీనివాసరావు

(24-06-2011 తేదీ సూర్య దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం)


- కొనసాగుతున్న కాంగ్రెస్‌ ‘సంస్కృతి’

- మళ్ళీ మొదలైన అధిష్ఠానం పట్టు

- వై.ఎస్‌. వ్యతిరేకులకు వరం!

- తెలంగాణలో విశ్వసనీయత ప్రశ్నార్ధకం

- కోస్త, సీమల్లోనూ దయనీయ స్థితి

- పక్కలో బల్లెంలా జగన్‌ సవాళ్ళు



బహుశా రాష్ట్ర కాంగ్రెస్‌ చరిత్రలో మున్నెన్నడు కనీ వినీ ఎరుగని స్వేచ్ఛనూ, వాక్స్వాతంత్య్రాన్ని కాంగ్రెస్‌ వాదులు నేడు అనుభవిస్తున్నారనుకోవాలి. పార్టీకి చెందిన సీనియర్‌ ఎంపీలు లగడపాటి రాజగోపాల్‌, పొన్నం ప్రభాకర్‌ ఇటీవల టీవీ తెరలపై చేసిన మాటల యుద్ధం చూసిన వారికి ఈ అభిప్రాయం కలగడం సహజం. మువ్వ న్నెల కాంగ్రెస్‌ కండువాలను మినహాయిస్తే, వారిద్దరెవరో తెలియని వారికి ఆ ఇద్దరు ఒకే పార్టీకి చెందినవారంటే నమ్మడం కష్టం. రాష్ట్ర మంత్రి శంకరరావు, మరో కాంగ్రెస్‌ సీనియర్‌ ఎంపీ సర్వే సత్యనారాయణ ఇదేమాదిరి మరో అంకానికి తెరలేపారు.



హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వారిద్దరూ ప్రచురణార్హం కాని భాషలో ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. ఎలక్ట్రానిక్‌ మీడియా పుణ్యమా అని ఈ సన్నివేశాన్ని ఇంటిల్లిపాదీ ఇళ్ళల్లో కూర్చుని వీక్షించగలిగారు. కాకపొతే, ఈ రకమయిన దూషణ ఘట్టాలు తరచు సాగిపోవడానికి కాంగ్రెస్‌ నాయకులు గత రెండేళ్లుగా శక్తివంచన లేకుండా సాయపడుతూ వస్తున్నారు. జగన్‌ పార్టీని విమర్శించే క్రమంలో కొందరు, ప్రాంతీయ తత్వంతో మరికొందరు, పదవులపై ఆశ పెంచుకుని అది తీరేదారి దొరకక ఇంకొందరు- ఈ మార్గాన్నే ఎంచుకుని బుల్లితెరలకు అవసరమయిన ముడి సరుకుని పంచిపెట్టడంలో తలమునకలుగా ఉన్నారు.



గతంలో కూడా రాష్టక్రాంగ్రెస్‌ నాయకులు తమ పొరపొచ్చాలను దాచిపెట్టుకుని వ్యవహరించిన దాఖలాలు లేవు. పైపెచ్చు రాజకీయాలలో ఈ విధమయిన ధోరణికి ‘కాంగ్రెస్‌ సంస్కృతి’ అనే ముద్దు పేరు కూడా జత పడింది. అలనాటి కాంగ్రెస్‌ కురువృద్ధులు ప్రకాశం పంతులు, సంజీవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి తదాదిగా రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులందరూ అసమ్మతిని పెంచిపోషించిన వారే. ముఠా సంస్కృతిని అక్కున చేర్చుకున్నవారే. అరవయ్యవ దశకం చివర్లో జరిగిన ప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఎన్నికల సంఘం సభ్యుల ఎన్నిక సందర్భంలో కాకాని వెంకటరత్నం, మూర్తిరాజుల నడుమ జరిగిన భీకర పోరు కాంగ్రెస్‌లోని ముఠా తగాదాలను బట్టబయలు చేసింది.



ఆ తరువాతి తరంలో రాష్ట్ర రాజకీయాలను తమదైన శైలిలో శాసించిన చెన్నారెడ్డి, రాజశేఖరరెడ్డి వంటి ఘనాపాఠీలు కూడా తమ పూర్వీకుల బాటలోనే మరికొంత ముందుకు సాగారు. అయితే మారిన రాజకీయ సమీకరణాలు, పరిస్థితులు వారికి కలసి వచ్చాయి. అధిష్ఠానానికి అనుకూలంగా ఉంటూనే రాష్ట్రంలో తమ మాటకు ఎదురులేకుండా చూసుకోగలిగారు. ఈ విషయలో చెన్నారెడ్డి కంటే రాజశేఖరెడ్డి చాలా అదృష్టవంతుడనే చెప్పాలి. ఆయన జీవించి ఉన్నంత కాలం పార్టీలోని ఆయన ప్రత్యర్ధులు ఆయన వైపు కన్నెత్తి చూడలేని స్థితి, పన్నెత్తి ఎదిరించలేని పరిస్థితి.



రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణానంతరం రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి తలకిందులైంది. వైఎస్‌ఆర్‌ హయాంలో రాష్ట్ర పార్టీపై ఆజమాయిషీ చేయలేకపోయిన అధిష్ఠానం మళ్ళీ తన పట్టు బిగించే ప్రయత్నాలు మొదలు పెట్టింది. పార్టీలోని వైఎస్‌ వ్యతిరేకులకు ఇది కలసివచ్చింది. మూసుకుపోయిన నోళ్ళు మళ్ళీ తెరుచుకున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో పార్టీలో ముసలం పుట్టింది. దీనికి తోడు వైఎస్‌ మరణానంతరం ఎగసిపడిన తెలంగాణ ఉద్యమం ఆ ప్రాంతంలో కాంగ్రెస్‌ విశ్వసనీయతను ప్రశ్నించే స్థాయికి తీసుకు వెళ్ళింది.



శ్రీకృష్ణ కమిటీ వంటి కంటి తుడుపు చర్యలు ఆ ప్రాంత ప్రజల మనోభావాలను మార్చలేకపోగా ఉద్యమం మరింత ఊపందుకుంది. మరోపక్క వైఎస్‌ఆర్‌ సెంటిమెంటును ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళిన ఆయన కుమారుడు జగన్మోహన్‌ రెడ్డి తన కొత్త పార్టీతో కాంగ్రెస్‌కు పక్కలో బల్లెంగా తయారవడంతో కోస్త, సీమల్లో కూడా పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. కడప ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం కాంగ్రెస్‌కు మరింత గడ్డుపరిస్థితిని తెచ్చి పెట్టింది.నాయకుల బలహీనత, చోటా నాయకులకు బలంగా మారింది. పట్టుమని నలుగురు అనుచరులు కూడా లేని చిన్ననాయకులు ముఠా సంస్కృతి పుణ్యమా అని బడానాయకుల అవతారం ఎత్తారు. పదవికి అర్హత సంపాదించుకోవడం కంటే పదవిని అడ్డదార్లలో సంపాదించుకునే క్రమంలో ఆరితేరారు. నాకళ్ళముందు రాజకీయాల్లోకి వచ్చినవాడు అంత పెద్ద పదవిని అందుకోగాలేనిది నేనేనా తక్కువతిన్నదన్న పోటీ మొదలై, అర్హత అనే పదం రాజకీయ పరమ పద సోపా నపఠంలో పెద్దపాము నోట్లోపడి అట్టడుక్కు చేరింది.



ఈ నేపథ్యం కొందరికయినా ఇందిరాగాంధీ నాటి కాంగ్రెస్‌ రోజులను గుర్తుకు తేవడం సహజం. ఆమె శకం మొదలయిన తరువాత పార్టీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తనకు వ్యతిరేకులని లేశమాత్రం అనుమానం కలిగినా సరే, ఇందిర వారిని నిర్దాక్షిణ్యంగా అణిచి వేసేవారు. చదరంగం బల్లపై పావులను కదిపినట్టు రాష్ట్రాల ముఖ్యమంత్రులను రాత్రికి రాత్రి మార్చివేసేవారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఇలాటి ప్రయోగం తెలుగు దేశం పార్టీ ఆవిర్భావానికి, దరిమిలా కాంగ్రెస్‌ అవిచ్ఛిన్న పాలనకు ప్రజలు మంగళం పాడడానికి దారితీసింది. ఇందిర హయాంలో రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు తమలో తాము ఎన్ని గిల్లికజ్జాలు పెట్టుకుని ఎంత రచ్చ చేసుకున్నా ఢిల్లీలోని అధినాయకుల జోలికి మాత్రం వెళ్ళేవాళ్ళు కాదు.



అధిష్ఠానం అంటే బెరుకూ, భయం పైనుంచి కిందిదాకా పాకిపోయాయి. కానీ ఇప్పుడలా కాదు, ఏకంగా అధినేత్రి సోనియా గాంధీ జాతీయతనే ఎత్తిచూపే విధంగా మీడియా ముందు మాట్లాడినా అడిగేవాళ్ళు లేకుండా పోయారు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అనే తేడాలేకుండా వరసపెట్టి విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే విస్తుపోవడం జనంవంతవుతోంది. పార్టీలోని ప్రత్యర్ధులను విమర్శించడానికి వాడుతున్న భాష వెగటుకలిగిస్తోంది. నిజంగా మనసులో మాట చెబుతున్నారా లేక మీడియా దృష్టిని ఆకర్షించడానికా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.



పైపెచ్చు ఈ అపభ్రంశపు పదప్రయోగాలకు అసెంబ్లీ ఆవరణనో రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్నో వేదికగా చేసుకుంటున్న తీరు మరీ విడ్డూరంగా ఉంది. ఇక బుల్లితెరలపై అనునిత్యం జరిగే చర్చల్లో పాల్గొనే కాంగ్రెస్‌ నాయకులు అవకాశం దొరికిన ప్రతి సందర్భాన్ని ఇందుకోసం చక్కగా వాడుకుంటున్నారు. ఈ విషయంలో ఏ పార్టీ వెనుకబడి లేదు కానీ, కాంగ్రెస్‌కు మాత్రం అగ్రతాంబూలం ఇవ్వకతప్పదు. ఎందుకంటె తమ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అందరికంటే ఎక్కువ అని తమకు తామే కితాబు ఇచ్చుకుంటూ, ఆ ముసుగులో మరిన్ని గుద్దులాటలకు దిగే వీలూ చాలూ వారికే ఎక్కువ కనుక.



అలాగని రాష్ట్ర పార్టీపై ఢిల్లీ నాయకులకు పూర్తిగా అదుపు లేకుండా పోయిందని చెప్పలేము. ఇందుకు తాజా ఉదాహరణ, కాంగ్రెస్‌ పార్టీ ప్రజా ప్రతినిధులు తెలంగాణ వాదాన్ని అధిష్ఠానం ముందు మరోమారు బలంగా వినిపించే ఉద్దేశంతో జరిపిన ఢిల్లీ యాత్ర. దేశ రాజధానిలో పార్టీ అధిష్ఠాన దేవతలను కలుసుకుని తమ గోడు వినిపించుకోవడానికి వాళ్లు పడ్డ పాట్లు వర్ణనాతీతం. చివరికి ఢిల్లీ దొరలకు మరో గడువు పెట్టి తిరిగి రావాల్సిన పరిస్థితి. ఈ పరిణామాలు వారికి కూడా కొరుకుడు పడడంలేదు. వారి స్వరం పెరుగుతోంది. ఆవేదన స్తానంలో ఆక్రోశం చోటుచేసుకుంటోంది. అది ఆగ్రహంగా మారినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఎందుకంటే వారు ఎదుర్కొంటున్న సమస్య అలాటిది. అట్టడుగునుంచి వారిపై నానాటికీ ఒత్తిడి ఎక్కువవుతోంది.



తిరిగి ఎన్నికల్లో పార్టీ టిక్కెట్టు ఇచ్చినా గెలిచి చట్టసభల్లో కాలుమోపుతామన్న ఆశ అడుగంటుతోంది. ఇక టీవీ చర్చల సంగతి సరేసరి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని అధిష్ఠానం ముక్కలనే ముక్కున పెట్టుకుని తిరిగి మీడియా ఎదుట వల్లెవేయడానికి నానా అవస్థ పడుతున్నారు. తాము చేస్తున్న ప్రతి ఢిల్లీయాత్రా మరో డెడ్‌ లైన్‌ ప్రక టించడానికి తప్ప విషయం తేల్చడానికి ఉపయోగపడడం లేదన్న అబిప్రా యం వారిలో కలుగుతున్నట్టుంది. ఇప్పుడు కోస్త, సీమ కాంగ్రెస్‌ నాయకు లదీ అదే పరిస్థితి. మొన్నటి వరకు ఢిల్లీలో చక్రం తిప్పగల మొనగాళ్ళం తామేఅని పెంచుకున్న నమ్మకం వారిలో సైతం సడలుతున్న ట్టుంది. మంత్రి శైలజానాథ్‌ నాయకత్వంలో ఢిల్లీ వెడదామని అనుకుంటు న్నట్టు సీనియర్‌ కాంగ్రెస్‌ ఎంపీ లగడపాటి చేసిన ప్రకటన దీనికి అద్దం పడుతోంది.



మరో వారం పది రోజుల్లో కేంద్ర, రాష్ట్ర మంత్రి వర్గాలను విస్తరిస్తారన్న సమాచారం ఒక్కటే వారిలో కొందరిని అధిష్ఠానం ముందు అదిమి పెడుతోంది. కానీ ఢిల్లీనుంచి తాజాగా అందుతున్న వార్తలు వారిని మళ్ళీ నిరాశలోకి నెడుతున్నాయి. రాష్ట్రంలో పార్టీ ప్రస్తుత పరిస్థితులను బట్టి 2014 ఎన్నికల్లో ప్రజలే కాంగ్రెస్‌కు మొండి చేయి చూపడం ఖాయమన్న అంచనాలకు వచ్చిన కాంగ్రెస్‌ అధిష్ఠానం మంత్రివర్గ విస్తరణలో రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులను పక్కనబెట్టే అవకాశాలు లేకపోలేదన్నది ఆ వార్తల సారాంశం. భావిభారత ప్రధానిగా రాహుల్‌ గాంధీని ప్రతిష్ఠించాలని కలలు కంటున్న కాంగ్రెస్‌ అధిష్ఠాన దేవత గెలుపోటముల బేరీజులో ఆంధ్రప్రదేశ్‌ ను చిన్నచూపుచూసే ప్రమాదం ఉందని పత్రికల్లో కథనాలు వెలువడుతున్నాయి.



రాహుల్‌ గాంధీ ఆలోచనలు సైతం ఇదే క్రమంలో సాగుతున్నాయన్న వార్తలు నిజమయితే, కేంద్ర మంత్రివర్గ విస్తరణలో మన రాష్ట్రానికి మళ్ళీ మొండిచేయి ఖాయం. ఎందుకంటె, పందెం కాసేవాడు గెలుపు గుర్రాన్నే ఎంచుకుంటాడు. కొడిగడుతున్న కాంగ్రెస్‌ ఆశలకు అధిష్ఠానం తలపెట్టిన కాయకల్ప చికిత్స ఏమేరకు పనికి వస్తుందన్నది కాలమే నిర్ణయిస్తుంది. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, పీసీసీ కొత్త అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కలసికట్టుగా పనిచేయడం మీదనే పార్టీ భవిష్యత్తు కొంత ఆధారపడి ఉంది. ఇంకా మూడేళ్ల వ్యవధి మాత్రమే మిగిలి ఉంది. వీరిద్దరూ విభిన్న అధికారకేంద్రాలుగా మారిపోకుండా పార్టీ తలరాతను మారుస్తారా లేక తమనే అధిష్ఠానం మార్చే పరిస్థితి కొని తెచ్చుకుంటారా అన్నది వేచి చూడాల్సిన విషయం.











3, జూన్ 2011, శుక్రవారం

జరగని పెళ్ళికి బాజాల మోత - భండారు శ్రీనివాసరావు

జరగని పెళ్ళికి బాజాల మోత - భండారు శ్రీనివాసరావు


(04-06-2011 తేదీ సూర్య దినపత్రికలో ప్రచురితం)


ప్రజలు గమనిస్తున్నారు అన్నది రాజకీయనాయకులు తరచుగా వాడే ఊతపదం.


ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని వారు భావిస్తున్నట్టు లేదు. బహుశా ఆ అవసరం వారికి లేదేమో కూడా. ఎందుకంటె మన దేశంలో రూపొందించుకున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ అలాటిది మరి.


ఈ వ్యవస్థకు మూలస్తంభం ఎన్నికలు. రాజ్యాంగం ధర్మమా అని కుల,మత,వర్ణ,లింగ,వయో వివక్ష లేకుండా ప్రజలందరూ ఈ ఎన్నికల్లో పాల్గొని తమకు నచ్చిన ప్రజాప్రతినిధిని ఎన్నుకునే అవకాశం వుంది. కానీ, దురదృష్టం ఏమిటంటే వోటు హక్కు వినియోగించుకోవడంతో పౌరుల ప్రజాస్వామ్య ధర్మం పూర్తవుతుంది. అంతటితో వారి పని సరి. మళ్ళీ ఎన్నికలొచ్చేదాకా ప్రజలతో పని లేదన్న సంగతి రాజకీయులందరికీ తెలుసు. పోతే, ఇక అక్కడనుంచి ప్రజాస్వామ్య రధం ఎన్నికయిన ప్రజాప్రతినిధుల దయాదాక్షిణ్యాలతో నడుస్తుంది. సంఖ్యలు, అంకెలు లెక్కలోకి వస్తాయి. పార్టీ ఫిరాయింపుల చట్టం కోరలనుంచి తప్పించుకునే వ్యూహ ప్రతివ్యూహాలతో రాజకీయం సాగుతుంది. అంకెల గారడీలు, టక్కు టమార విద్యలు రంగప్రవేశం చేస్తాయి. ప్రజల విశ్వాసంతో ఎవరికీ నిమిత్తం వుండదు. ప్రజాప్రతినిధుల విశ్వాసం వుంటే చాలు, ప్రజాస్వామ్య ప్రభుత్వాల నడక నల్లేరుపై బండిలా సాగిపోతుంది.


గత ఇరవై నాలుగ్గంటల్లో రాష్ట్ర రాజకీయాలు అనూహ్యమయిన మలుపులు తిరుగుతున్నాయి. రాజ్యాంగంలోని సాంకేతికతలను అడ్డం పెట్టుకుని తమదే పై చేయి అనిపించుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఈ విషయంలో ఆరితేరిన కాంగ్రెస్ ఈ పాచికలాటలో ఇంతవరకు ముందంజలో వుంది.


దాదాపు రెండేళ్లుగా నిష్క్రియాపియత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలచిన పాలక పక్షం లోని వ్యూహకర్తలు, తాము పదిలంగా దాచిపెట్టిన అస్త్రశస్త్రాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. వైరి పక్షం వూహలకు అందని వేగంతో పావులు కదుపుతున్నారు. ఎన్నాళ్ళబట్టో అటకెక్కించి వుంచిన పదవుల పందేరానికి వున్నట్టుండి తెర తీసారు. అదీ ఎంతో వ్యూహాత్మకంగా. స్పీకర్ ఎన్నిక పేరుతొ హడావిడిగా శాసన సభ సమావేశాలను ఏర్పాటుచేసారు. డిప్యూటీ స్ప్పీకర్ నాదెండ్ల మనోహర్ తో ఒక రోజు ముందుగానే రాజీనామా చేయించారు. దానితో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇద్దరు లేని పరిస్తితి ఏర్పడింది. గవర్నర్ తో ప్రమేయం లేని రీతిలో, గత శాసన సభ సమావేశాలను ప్రోరోగ్ చేయకుండా జాగ్రత్త పడడాన్ని బట్టి చూస్తే చాలా ముందుగానే కాంగ్రెస్ తన వ్యూహరచన చేసుకున్నట్టు అర్ధం అవుతోంది. ఈ సమయంలోనే, తెలుగుదేశం పార్టీ మహానాడు ముగింపులో చేసిన ప్రకటనకు అనుగుణంగా కిరణ్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చింది. కానీ అలా ఇచ్చే సమయానికి దాన్ని తీసుకోవాల్సిన స్పీకర్, డిప్యూటీ స్పీకర్ రెండు పదవులు ఖాళీ. నోటీసు ఇవ్వడానికి అసెంబ్లీకి వెళ్ళిన తెలుగుదేశం శాసన సభ్యులు చాలాసేపు వేచి చూసి, ఇక చేసేదేమీ లేక అసెంబ్లీ కార్యదర్శికి ఇచ్చి వెనుదిరగాల్సివచ్చింది. దానితో ఆ నోటీసు సాంకేతికంగా చెల్లుబాటు కాదన్న వాదన బయలుదేరింది. అసెంబ్లీ సమావేశం జరుగుతున్నప్పుడు స్పీకర్ కు ఇచ్చిన నోటీసునే పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి మళ్ళీ తెలుగుదేశం పార్టీ స్పీకర్ ఎన్నిక అనంతరం తిరిగి అదే నోటీసు ఇవ్వాల్సి వుంటుంది. దానిని పరిశీలించి అనుమతించడానికి కొత్త స్పీకర్ పది రోజులు వ్యవధి తీసుకోవచ్చని మరో సాంకేతిక అంశాన్ని తెరపైకి తెచ్చారు. అంటే శాసన సభ మరో సారి సమావేశం అయ్యేదాకా టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు అసెంబ్లీ అలమరా లోనే వుండిపోయే అవకాశం వుంది.


స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక తంతు ముగిసిన తరువాత వారిద్దరినీ శాసన సభ అభినందించే కార్యక్రమం మొదలవుతుంది. సభావ్యవహారాల సలహా సంఘం సమావేశమై అవిశ్వాస తీర్మానం నోటీసును పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి వుంటుంది. స్పీకర్ ఎన్నిక కోసం ఏర్పాటుచేసిన ఒకరోజు సమావేశంలో అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చే అవకాశాలు మృగ్యంగా కనబడుతున్నాయి. ఈ విషయం పూర్తిగా కొత్త స్పీకర్ విచక్షనాధికారానికి లోబడి వుంటుందన్నది నిపుణుల అభిప్రాయం. అయితే, జగన్ బలం ఎంతో లెక్కలు తేల్చుకోవాలని గట్టిగా కోరుకుంటున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా కోరుకున్న పక్షంలో కొత్త స్పీకర్ అవిశ్వాస తీర్మానాన్ని చేపట్టే అవకాశం వుంటుంది. అలా జరగని పక్షంలో అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడానికి వున్న ప్రస్తుత నిబంధనలను అడ్డం పెట్టుకుని శనివారం సభ ముగిసిన అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేసి ప్రోరోగ్ చేస్తే మళ్ళీ అవకాశం లభించేది వర్షాకాల సమావేశాల్లోనే. బీరాలు పలికిన పార్టీలన్నీ అప్పటిదాకా వేచిచూడాల్సిందే.


రెండు రోజులుగా నిబంధనల పేరుతొ నడుస్తున్న ఈ తంతును పరికిస్తున్నవారికి ఒక విషయం ఇట్టే అర్ధం అవుతుంది. ఇదంతా జగన్ పార్టీని ఇరుకున పెట్టడానికి కాంగ్రెస్ పన్నిన పధకంగా తెలిసిపోతుంది. తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చినట్టూ అవుతుంది. సాంకేతిక కారణాలతో దాన్ని అనుమతించనట్టు అవుతుంది. రోగి కోరిందే వైద్యుడు ఇవ్వడం అంటే ఇదే కాబోలు.


మహానాడుతో కొత్త జవసత్వాలు పుంజుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు - కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని, చాలినంత బలం లేకపోయినా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులకు పోటీ పెట్టాలని రెండు కీలక నిర్ణయాలను ప్రకటించి రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కించారు. అనుకున్నదే తడవుగా స్పీకర్ పదవికి మాజీ మంత్రి కేఈ కృష్ణ మూర్తినీ, డిప్యూటీ స్పీకర్ పదవికి మరో మాజీ మంత్రి సుద్దాల దేవయ్యను
అభ్యర్ధులుగా ప్రకటించి ఆటలో తానూ వెనకబడిలేనన్న సంకేతాలను ఇచ్చారు. బీసీ, ఎస్సీలపట్ల తమ పార్టీకి వున్న చిత్తశుద్ధిని ఈ విధంగా వెల్లడించుకున్నారు. ఈ పరిణామం సహజంగానే కాంగ్రెస్ పార్టీని కలవరపెట్టింది. పాలక పక్షం తన ధోరణి మార్చుకోకుండా సీమాంధ్ర వారికే పదవుల పందేరంలో పెద్ద పీట వేస్తోందని తెలంగాణా రాష్ట్ర సమితి నాయకులు ఆరోపణలకు దిగారు కూడా. పార్టీలోని సొంత శాసన సభ్యులు కొందరు సయితం ఈ ఆరోపణలతో గొంతుకలిపారు. వీటికి తోడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున ఇటీవల పులివెందుల నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో శాసన సభకు ఎన్నికయిన వైఎస్ సతీమణి విజయమ్మ అసెంబ్లీ సభ్యురాలిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసినప్పుడు పదమూడు మంది కాంగ్రెస్ శాసన సభ్యులు ఆవిడ వెంట తరలి రావడం కూడా పాలకవర్గం లొ చర్చనీయాంశం అయింది. పార్టీ ఆదేశాలను బేఖాతరు చేయడం కొత్త కాకపోయినా, స్పీకర్ ఎన్నిక, అవిశ్వాస తీర్మానం నేపధ్యంలో, అంతమంది శాసన సభ్యులు కట్టగట్టుకుని బాహాటంగా వైరి పక్షం నేత వెంట నడవడాన్ని ఆ పార్టీ నాయకత్వం జీర్ణించుకోలేకపోతోంది. అందుకే, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికలను ఏకగ్రీవం చేయడానికి అందరూ కలసి రావాలని పాలక పక్షం తరపున ఇతర పార్టీలకు విజ్ఞప్తులు చేయడం జరిగింది.


తగినంత బలం వున్నప్పటికీ, ఒకేసారి, స్పీకర్ ఎన్నిక, అవిశ్వాస తీర్మానం ఎడుర్కొవాల్సిరావడంతో, చేతిలో వున్న ఏ చిన్న అవకాశాన్ని కూడా వొదులుకునే స్తితిలో ఆ పార్టీ వున్నట్టు కనబడడం లేదు. కాంగ్రెస్ శాసన సభ్యులలో వున్న జగన్ సానుభూతిపరులతో కలసి మరికొందరు చేయి కలిపి అనర్హత వేటుకు సిద్ధపడితే, పరిస్థితులు మరోరకంగా మారే అవకాశాలు వుంటాయన్న భయం దాన్ని వేధిస్తూ వుండవచ్చు.


పోతే, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ నిలబెట్టే అభ్యర్ధులకు జగన్ పార్టీ లేదా ఆయనతో వున్న శాసన సభ్యులు మద్దతు ఇవ్వాలనేది కూడా వ్యూహాత్మక ప్రతిపాదనే. ఎందుకంటె ఓడిపోతే జగన్ వర్గంపై అనర్హత వేటు పడుతుంది. తెలుగుదేశానికి ఓడిపోయామన్న నామర్దా తప్ప వేరే నష్టం లేదు. జగన్ ఇంతవరకు తనకుందని చెప్పుకుంటున్న బలం ఏపాటిదో జనాలకు తెలిసిపోతుంది. గెలిస్తే మాత్రం పాలక పక్షం సభావిశ్వాసం కోల్పోయినట్టు అవుతుంది. ప్రభుత్వం కూలిపోవచ్చు. కానీ వెనువెంటనే మధ్యంతర ఎన్నికలు వచ్చే వీలు లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మెజారిటీ సభ్యుల మద్దతు వుందని ముందుకు వచ్చే నాయకుడికి గవర్నర్ అవకాశం ఇవ్వవచ్చు. కానీ, దరిమిలా శాసన సభ రద్దయినా, దానిని సుప్తచేతనావస్థలో వుంచినా – తెలుగు దేశం తరపున గెలిచిన వ్యక్తే శాసన సభ స్పీకర్ పదవిలో కొనసాగుతారు. బహుశా ఇదే కారణంతో వైఎస్ఆర్ పార్టీ ఈ ప్రతిపాదనను నిర్ద్వందంగా తిరస్కరిస్తోందని భావించాలి.


కడప ఉప ఎన్నికల్లో పోగొట్టుకున్న పరువు ప్రతిష్టలను మళ్ళీ ఏదో ఒక మేరకు పూరించుకునే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ నిబంధనలను అడ్డం పెట్టుకుని ఆడే ఈ ‘నెంబర్ గేమ్’ కు తెర తీసిందని అనుకోవాలి.

అసలు అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుందో రాదో తెలియని స్తితిలో సభలో పార్టీల బలాబలాలనుగురించీ, తీర్మానం గెలుపోటములు గురించీ చర్చించుకోవడం - జరగని పెళ్ళికి బాజాలు వాయించిన చందమే కాగలదు. (03-06-2011)


 

28, మే 2011, శనివారం

కూడలిలో రాష్ట్ర రాజకీయాలు – భండారు శ్రీనివాసరావు

కూడలిలో రాష్ట్ర రాజకీయాలు – భండారు శ్రీనివాసరావు

(28-05-2011 తేదీ సూర్య దినపత్రికలో ప్రచురితం) 

రాష్ట్ర రాజకీయాలు దశాదిశా తెలియని స్తితిలో నాలుగు రోడ్ల కూడలిలో చతికిలపడి వున్నాయి.

ప్రధాన పార్టీల్లో పాలక పక్షం కాంగ్రెస్ ది ఒక విచిత్రమయిన స్తితి. అధికారంలో వున్నామా లేదా అని ఎప్పటికప్పుడు గిల్లి చూసుకోవాల్సిన పరిస్తితి. ప్రజలు పగ్గాలు ‘చేతి’కిచ్చి రెండేళ్లు గడిచిపోయాయి. మామూలుగా అయితే మన్నూ మిన్నూ ఏకమయ్యేలా సంబరాలు చేసుకోవాల్సిన సందర్భం. రెండేళ్ళ పాలనలో సాధించిన విజయాలు గురించి గొప్పలు చెప్పుకోవాల్సిన తరుణం. పత్రికలనిండా ప్రకటనలతో హోరెత్తించాల్సిన సమయం. కానీ అంతా గుప్ చుప్. అంతటా నీరవ నిశ్శబ్ధం. దీనికి కారణాలు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మొన్నటికి మొన్న కడప గడపలో మాడు బొప్పికట్టేలా తగిలిన దెబ్బ. దెబ్బ తగులుతుందని తెలిసినా కాచుకోలేని దుస్తితి. ఇంత గట్టిగా తగులుతుందని ఊహించలేని నిస్సహాయ స్తితి. ఏదయితేనేం దెబ్బకు ఢిల్లీ దిగివచ్చింది. కేంద్రంలో ఆరోగ్య శాఖ చూస్తున్న రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ పార్టీకి సోకిన అనారోగ్యాన్ని సరిచేయడానికి హుటాహుటిన హైదరాబాద్ వచ్చారు. ఆ రెండ్రోజులు రాష్ట్ర రాజధానిలో సందడే సందడి. గొంతెమ్మ కోర్కెలతో కొందరు, గొంతువరకు దిగమింగుకున్న ఆగ్రహంతో మరికొందరు. వందలాదిగా తరలివచ్చిన కార్యకర్తలతో, చిన్నాచితకా నాయకులతో ఆజాద్ మంతనాలు ఏకధాటిగా సాగాయి. ఏదో జరగబోతోందన్న భ్రమలు కల్పించాయి. కానీ ఆయన చేతిలో మాత్రం ఏముంది. అసలు మంత్ర దండం హస్తినలో వుంది. రోగ నిర్ధారణ చేయగలరేమోకానీ, రోగనిదానం తన చేతులో లేదన్న విషయం ఆయనకూ తెలుసు. అందుకే చెప్పాల్సిన నాలుగు ముక్కలు పర్యటన చివర్లో ముక్తసరిగా మీడియాకు చెప్పేసి ఢిల్లీ విమానం ఎక్కేసారు. కాంగ్రెస్ కధ తెలిసిన వారికి ఇక చెప్పే కధ ఏముంటుంది. షరా మామూలు ప్రకటనలు. షరా మామూలు ఊహాగానాలు. ముఖ్యమంత్రికి క్లాసు తీసుకున్నారనీ, సహచర మంత్రులతో వ్యవహార శైలిని మార్చుకోవాలంటూ సలహా ఇచ్చారనీ రకరకాల కధనాలు. అసలు ముఖ్యమంత్రినే మారుస్తున్నారంటూ పలురకాల ప్రచారాలు. ఇంతాచేసి ఆజాద్ వచ్చి సాదించింది ఏమిటంటే సున్నకు సున్న హళ్లికి హళ్లి. ఆయన పరిస్తితీ అంతంత మాత్రమే. ఆజాద్ ఇంచార్జ్ గా వున్న తమిళనాడు ఎన్నికల్లో ఏమిజరిగిందో ఎవరికి తెలియంది కనుక.



ఇక తెలంగాణా వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి వొదలని మరో తలనొప్పి. అయితే ఇది కాంగ్రెస్ కు ఒకరకంగా శాపం. ఒకరకంగా వరం. ప్రధాన ప్రత్యర్ధి తెలుగుదేశం పార్టీని మరింత ఇరుకున పెట్టడానికి రాష్ట్ర విభజన వ్యవహారం ఆ పార్టీకి కొంతమేరకు కలసివస్తోంది. తెలంగాణాను కోరుకుంటున్న టీఆర్ఎస్ కూడా ఈ విషయం లో టీడీపీ పైనే ఎక్కువగా బాణాలు ఎక్కుపెడుతోంది. ఇది ఒకరకంగా కాంగ్రెస్ కు ఊరటే. కానీ సొంత పార్టీ నాయకులు కలిగిస్తున్న ఇబ్బందులే కాంగ్రెస్ ను ఎక్కువగా ఇరకాటం లోకి నెడుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో ఇద్దరు మంత్రుల మధ్య రగిలిన రగడే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఈ సచివుల సమరానికి ఇంకా తెర పడక ముందే కేంద్రం లో మరో ఇద్దరు మంత్రులు- కపిల్ సిబాల్, జై రాం రమేష్ ల నడుమ కీచులాట తెరపైకి వచ్చింది. ఇక చెప్పేదేముంది. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? కల్ల.

స్తానిక సంస్తల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోబోతున్న మరో అగ్ని పరీక్ష. ఎన్నికలు వాయిదా వేయడానికి వీలులేకుండా సుప్రీం ఆంక్షలు. మారిన, మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో గెలుపు మీద సన్నగిల్లుతున్న ఆశలు. ఏమిచేయాలో పాలుబోని స్తితి. మధ్యేమార్గంగా పార్టీ గుర్తులు లేకుండా ఎన్నికలు జరిపితే పోలా అన్న ఆలోచనలు. గెలిచినవాడే మనవాడు అనుకుంటే చిక్కేలేదు. వోడినా వోడిపోయామన్న బాధా వుండదు. వోటమికి బాధ్యతా వుండదు.


ఇక, సొంత పార్టీలో లుకలుకలా కాంగ్రెస్ కు కొత్తేమీ కాదు. పోతే, తెలంగాణా పార్టీ ప్రజాప్రతినిధుల వ్యవహారం, వాళ్లు పెడుతున్న డెడ్ లైన్లు. వాటి విషయం అధిష్టానమే చూసుకుంటుందన్న ధీమా. ఏ పార్టీకి లేని అదనపు సౌలభ్యం కాంగ్రెస్ కు మరోటి వుంది. మరో మూడేళ్లదాకా అధికారం చేతిలో వుంటుంది, చేజేతులా చేజార్చుకుంటే తప్ప. అందుకే, ప్రజా సమస్యలను గాలికి వొదిలేసి రోడ్డు కూడలిలో మరో మూడేళ్ళు నిశ్చింతగా వేచి వుండొచ్చు.

పోతే తెలుగు దేశం. తెలంగాణా ప్రాంతంలో జరిగిన ఉపఎన్నికల్లో ఎదురయిన పరాభవం నుంచి పూర్తిగా తేరుకోకముందే కడప ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కని వైనం ఆ పార్టీని మరింత కుంగ తీసింది. ప్రధాన ప్రతిపక్షంగా వుంటూ ప్రజా సమస్యలను పట్టించుకుంటున్న పార్టీగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంత ప్రయత్నిస్తున్నా అవన్నీ నీరు కారిపోతున్నాయన్న బాధ ఆ పార్టీది. ముందొచ్చిన చెవులకన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్న చందంగా కొత్తగా పుట్టుకొచ్చిన వైఎస్ఆర్ పార్టీ ఆ గుర్తింపును ఎగరేసుకుపోతున్నతీరును టీడీపీ ఓ పట్టాన జీర్ణం చేసుకోలేకపోతోంది. దీనికి తోడు పులి మీది పుట్రలా సొంత పార్టీలో తెలంగాణ రగిల్చిన చిచ్చు. రాష్ట్రం చీలకముందే దాదాపు అన్ని పార్టీలు నిట్టనిలువుగా ఈ అంశంపై చీలిపోయాయి. రెండు కళ్ళ సిద్ధాంతంతో నెట్టుకొస్తున్న తెలుగుదేశం కూడా మినహాయింపు కాదు. నాగం ఉదంతమే దీనికి ఉదాహరణ. గండిపేట తెలుగు విజయం ఆవరణలో అట్టహాసంగా ప్రారంభమయిన ముప్పయ్యో మహానాడు లో కూడా తెలంగాణా చిచ్చు రాజుకోకతప్పేట్టు లేదు. ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన స్తితి. తేల్చుకోలేని పరిస్తితి. నాలుగు రోడ్ల కూడలిలో నిలబడ్డ తెలుగుదేశం ఎదుర్కుంటున్న అవస్త ఇది. దీనికి తోడు వారసత్వ వ్యవహారం. కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తూ పురుడుపోసుకున్న తెలుగుదేశం పార్టీలో వారసత్వ రాజకీయాలను గురించి వార్తా కధనాలు వెలువడుతూ వుండడం మరో విచిత్రమయిన పరిస్తితి. నిజమే, తెలుగు దేశం పార్టీ వయస్సులో చిన్నదేమీ కాదు. యువకులుగా వుంటూ ప్రారంభంలోనే పార్టీలో చేరిన వారు ఇప్పటికి షష్టిపూర్తి చేసుకుని వుంటారు. కొత్త రక్తం ఎక్కించాల్సిన అవసరం ఆసన్న మయింది. అలాగని, ఈ ‘వార్’సత్వం వ్యవహారాన్ని మరింత ముదరనివ్వడం అసలే పీకల్లోతు కష్టాల్లో వున్న ఆ పార్టీకి మేలు చేయదు. మహానాడు లోనయినా దీనికి ముగింపు పలికితే ఆ పార్టీని ఆదినుంచీ అభిమానిస్తున్నవాళ్ళు సంతోషిస్తారు. ఎవరో అన్నట్టు రాజకీయం అంటే వారసత్వం కాదు, పౌరసత్వం. పార్టీని పునరుజ్జీవింప చేయాలనుకునే వాళ్లు ఈ విషయాన్ని గమనం లో పెట్టుకోవాలి.

క్రాస్ రోడ్డులో వున్న మరో పార్టీ టీ ఆర్ ఎస్. నిజానికి ఉద్యమ పార్టీ అయిన టీ ఆర్ ఎస్ కు కూడలిలో నిలబడి ఎదురుచూపులు చూడాల్సిన పని లేదు. తెలంగాణా ఒక్కటే లక్ష్యం కనుక పక్క దారి పట్టాల్సిన అవసరమూ లేదు. కానీ, కలుపుకుపోతేనే తప్ప విడిపోవాలన్న ప్రధాన ధ్యేయం నెరవేరని స్తితి దానిది. ఎప్పటికప్పుడు గమ్యానికి దగ్గరగా వస్తూ దూరం జరిగిపోతున్న అనుభవాలు ఈ పార్టీ సొంతం. బలమూ, బలహీనతలు తెలిసిన నాయకత్వం కనుక విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ, వైఫల్యాలకు ఇతర పార్టీలను బాధ్యులను చేయడం టీ ఆర్ ఎస్ ప్రధానమయిన ఎత్తుగడగా చేసుకుంది. కిందపడ్డా పైచేయి అనిపించుకోవడంలో ఈ పార్టీకి ఎవ్వరూ సాటి కాదు. పోటీ కాదు. నిర్దేశించిన గడువులను పెంచుకుంటూ పోగల వెసులుబాటు ఈ పార్టీకి వున్నట్టుగా మరొకరికి లేదు. ప్రజల భావోద్వేగాలే పునాది కాబట్టి నాలుగు రోడ్ల కూడలిలో ఎన్నాళ్ళయినా వేచివుండగల అవకాశం వుంది.

అన్న ప్రాసన రోజునే ఆవకాయ తిని అరిగించుకోగల పుష్టి పుష్కలంగా వున్నట్టు రుజువు చేసుకుంది వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం లోని వై ఎస్ ఆర్ పార్టీ. కడప ఉప ఎన్నికల్లో లభించిన అపూర్వ విజయం ఆ పార్టీలో అనూహ్యమయిన ఆత్మ స్తయిర్యాన్ని నింపితే, ఇతర పార్టీలలో న్యూనతా భావాన్ని పెంచి పోషించింది. తనది వాపు కాదు బలుపు అని నిరూపించుకోవాలనో ఏమో వై ఎస్ జగన్ స్వరం పెంచి మరీ సవాళ్లు విసురుతున్నారు. తన విజయం కడప గడప వరకే పరిమితం కాదని నిరూపించుకునే ప్రయత్నాలను ప్రారంభించారు. పాలక పక్షాన్ని ఎదుర్కొంటూ ప్రజా సమస్యలపై పోరాడే ప్రధాన ప్రతిపక్ష పాత్రను తనకు తానుగా భుజానికెత్తుకున్నట్టు కనిపిస్తోంది. కడప సమరంలో కకావికలయిన కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలను మరింత ఉక్కిరిబిక్కిరి చేసే క్రమంలో తన రాజకీయ ఎత్తుగడలకు రూపకల్పన చేసుకుంటున్న తీరు స్పష్టం అవుతోంది. ఏనాటికయినా జగన్ కాంగ్రెస్ పంచన చెరక తప్పదని కాంగ్రెస్ అధినాయకత్వం స్తాయిలో వెలువడుతున్న సంకేతాలను, ప్రచారాన్ని తిప్పికొట్టడాని కేమోనన్నట్టుగా జగన్ అప్పటికప్పుడు పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించిన తీరు గమనార్హం. కాపురం చేసే కళ కాలిమెట్టెలు చెబుతాయన్నట్టుగా నూతన కార్యవర్గం లో తనదయిన బలమయిన సామాజిక వర్గానికే జగన్ పెద్దపీట వేసి, బడుగు బలహీన వర్గాలను చిన్న చూపు చూసారన్న సణుగుళ్ళు, సన్నాయి నొక్కులు అప్పుడే మొదలయ్యాయి. పార్టీ పదవుల పంపకం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఎన్నో ధక్కామొక్కీలు తిన్న పార్తీలే ఈ విషయంలో తల బొప్పిళ్ళు కట్టించుకున్న దాఖలాలు అనేకం. అయినా అనుభవం నేర్పే పాఠాల ముందు మరొకరు నేర్పే నీతి బోధలు బలాదూరే. అయితే, జనాన్ని నమ్ముకుని నాలుగు రోడ్ల కూడలిలో నిలబడ్డ వై ఎస్ జగన్ కు లక్ష్యం కడు దూరం లో వుంది. మధ్యలో కాడి వొదిలేయ్యకుండా ముందుకు సాగాల్సిన బరువయిన బాధ్యత కూడా ఆయన భుజస్కందాలపై వుంది. జారిపోతే, పార్టీనే జావకారిపోతుంది.

సామాజిక న్యాయం నినాదంతో ప్రజల ముందుకు వచ్చి, ప్రజా తీర్పుకు కట్టుబడివుండే ఓరిమి లేకుండా కాంగ్రెస్ లో విలీనం కావడానికి సిద్ధపడిన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ దశా దిశా కోల్పోయి నాలుగు రోడ్ల నడుమ దిక్కులు చూస్తోంది. నిర్దేశించుకున్న గమ్యం వైపు ప్రయాణం కొనసాగించడానికి వీలులేకుండా ఇంజను పాడయి, ఇంధనం కరువయిన స్తితిలో ఆ పార్టీ అయోమయావస్తలో వుంది.

పోతే, వామపక్షాలు - పశ్చిమ బెంగాల్ లో ఎదురయిన ఘోర పరాభవంతో దిక్కు తోచని స్తితిలో వున్నాయి. రాష్ట్రం లో మారిపోతున్న రాజకీయ సమీకరణాల్లో తమను ఇముడ్చుకోగల రాజకీయ ప్రత్యామ్నాయం కోసం అన్వేషిస్తున్నాయి. ఏదో ఆసరాతో కూడలి దాటినా ఎక్కబోయే అధికార పీఠం అంటూ ఏమీ లేదు కనుక వేచిచూసే సహజ వైఖరిని కొనసాగిస్తున్నాయి.

రాష్ట్రం లోని రాజకీయ పక్షాలన్నీ మొత్తం మీద దిశా నిర్దేశనం దొరకని స్తితిలో వున్నాయనే చెప్పాలి. కానీ, దీనివల్ల వాటికి వాటిల్లే తక్షణ ప్రమాదం ఏమీ లేదు. కానీ, జనం మాటేమిటి? వాళ్ళిలా ఎన్నాళ్ళు ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడాలి? (27-05-2011)