24, జూన్ 2011, శుక్రవారం

కాంగ్రెస్‌ ఇల్లు చక్కబడుతుందా ? - భండారు శ్రీనివాసరావు

కాంగ్రెస్‌ ఇల్లు చక్కబడుతుందా ? - భండారు శ్రీనివాసరావు

(24-06-2011 తేదీ సూర్య దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం)


- కొనసాగుతున్న కాంగ్రెస్‌ ‘సంస్కృతి’

- మళ్ళీ మొదలైన అధిష్ఠానం పట్టు

- వై.ఎస్‌. వ్యతిరేకులకు వరం!

- తెలంగాణలో విశ్వసనీయత ప్రశ్నార్ధకం

- కోస్త, సీమల్లోనూ దయనీయ స్థితి

- పక్కలో బల్లెంలా జగన్‌ సవాళ్ళు



బహుశా రాష్ట్ర కాంగ్రెస్‌ చరిత్రలో మున్నెన్నడు కనీ వినీ ఎరుగని స్వేచ్ఛనూ, వాక్స్వాతంత్య్రాన్ని కాంగ్రెస్‌ వాదులు నేడు అనుభవిస్తున్నారనుకోవాలి. పార్టీకి చెందిన సీనియర్‌ ఎంపీలు లగడపాటి రాజగోపాల్‌, పొన్నం ప్రభాకర్‌ ఇటీవల టీవీ తెరలపై చేసిన మాటల యుద్ధం చూసిన వారికి ఈ అభిప్రాయం కలగడం సహజం. మువ్వ న్నెల కాంగ్రెస్‌ కండువాలను మినహాయిస్తే, వారిద్దరెవరో తెలియని వారికి ఆ ఇద్దరు ఒకే పార్టీకి చెందినవారంటే నమ్మడం కష్టం. రాష్ట్ర మంత్రి శంకరరావు, మరో కాంగ్రెస్‌ సీనియర్‌ ఎంపీ సర్వే సత్యనారాయణ ఇదేమాదిరి మరో అంకానికి తెరలేపారు.



హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వారిద్దరూ ప్రచురణార్హం కాని భాషలో ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. ఎలక్ట్రానిక్‌ మీడియా పుణ్యమా అని ఈ సన్నివేశాన్ని ఇంటిల్లిపాదీ ఇళ్ళల్లో కూర్చుని వీక్షించగలిగారు. కాకపొతే, ఈ రకమయిన దూషణ ఘట్టాలు తరచు సాగిపోవడానికి కాంగ్రెస్‌ నాయకులు గత రెండేళ్లుగా శక్తివంచన లేకుండా సాయపడుతూ వస్తున్నారు. జగన్‌ పార్టీని విమర్శించే క్రమంలో కొందరు, ప్రాంతీయ తత్వంతో మరికొందరు, పదవులపై ఆశ పెంచుకుని అది తీరేదారి దొరకక ఇంకొందరు- ఈ మార్గాన్నే ఎంచుకుని బుల్లితెరలకు అవసరమయిన ముడి సరుకుని పంచిపెట్టడంలో తలమునకలుగా ఉన్నారు.



గతంలో కూడా రాష్టక్రాంగ్రెస్‌ నాయకులు తమ పొరపొచ్చాలను దాచిపెట్టుకుని వ్యవహరించిన దాఖలాలు లేవు. పైపెచ్చు రాజకీయాలలో ఈ విధమయిన ధోరణికి ‘కాంగ్రెస్‌ సంస్కృతి’ అనే ముద్దు పేరు కూడా జత పడింది. అలనాటి కాంగ్రెస్‌ కురువృద్ధులు ప్రకాశం పంతులు, సంజీవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి తదాదిగా రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులందరూ అసమ్మతిని పెంచిపోషించిన వారే. ముఠా సంస్కృతిని అక్కున చేర్చుకున్నవారే. అరవయ్యవ దశకం చివర్లో జరిగిన ప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఎన్నికల సంఘం సభ్యుల ఎన్నిక సందర్భంలో కాకాని వెంకటరత్నం, మూర్తిరాజుల నడుమ జరిగిన భీకర పోరు కాంగ్రెస్‌లోని ముఠా తగాదాలను బట్టబయలు చేసింది.



ఆ తరువాతి తరంలో రాష్ట్ర రాజకీయాలను తమదైన శైలిలో శాసించిన చెన్నారెడ్డి, రాజశేఖరరెడ్డి వంటి ఘనాపాఠీలు కూడా తమ పూర్వీకుల బాటలోనే మరికొంత ముందుకు సాగారు. అయితే మారిన రాజకీయ సమీకరణాలు, పరిస్థితులు వారికి కలసి వచ్చాయి. అధిష్ఠానానికి అనుకూలంగా ఉంటూనే రాష్ట్రంలో తమ మాటకు ఎదురులేకుండా చూసుకోగలిగారు. ఈ విషయలో చెన్నారెడ్డి కంటే రాజశేఖరెడ్డి చాలా అదృష్టవంతుడనే చెప్పాలి. ఆయన జీవించి ఉన్నంత కాలం పార్టీలోని ఆయన ప్రత్యర్ధులు ఆయన వైపు కన్నెత్తి చూడలేని స్థితి, పన్నెత్తి ఎదిరించలేని పరిస్థితి.



రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణానంతరం రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి తలకిందులైంది. వైఎస్‌ఆర్‌ హయాంలో రాష్ట్ర పార్టీపై ఆజమాయిషీ చేయలేకపోయిన అధిష్ఠానం మళ్ళీ తన పట్టు బిగించే ప్రయత్నాలు మొదలు పెట్టింది. పార్టీలోని వైఎస్‌ వ్యతిరేకులకు ఇది కలసివచ్చింది. మూసుకుపోయిన నోళ్ళు మళ్ళీ తెరుచుకున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో పార్టీలో ముసలం పుట్టింది. దీనికి తోడు వైఎస్‌ మరణానంతరం ఎగసిపడిన తెలంగాణ ఉద్యమం ఆ ప్రాంతంలో కాంగ్రెస్‌ విశ్వసనీయతను ప్రశ్నించే స్థాయికి తీసుకు వెళ్ళింది.



శ్రీకృష్ణ కమిటీ వంటి కంటి తుడుపు చర్యలు ఆ ప్రాంత ప్రజల మనోభావాలను మార్చలేకపోగా ఉద్యమం మరింత ఊపందుకుంది. మరోపక్క వైఎస్‌ఆర్‌ సెంటిమెంటును ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళిన ఆయన కుమారుడు జగన్మోహన్‌ రెడ్డి తన కొత్త పార్టీతో కాంగ్రెస్‌కు పక్కలో బల్లెంగా తయారవడంతో కోస్త, సీమల్లో కూడా పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. కడప ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం కాంగ్రెస్‌కు మరింత గడ్డుపరిస్థితిని తెచ్చి పెట్టింది.నాయకుల బలహీనత, చోటా నాయకులకు బలంగా మారింది. పట్టుమని నలుగురు అనుచరులు కూడా లేని చిన్ననాయకులు ముఠా సంస్కృతి పుణ్యమా అని బడానాయకుల అవతారం ఎత్తారు. పదవికి అర్హత సంపాదించుకోవడం కంటే పదవిని అడ్డదార్లలో సంపాదించుకునే క్రమంలో ఆరితేరారు. నాకళ్ళముందు రాజకీయాల్లోకి వచ్చినవాడు అంత పెద్ద పదవిని అందుకోగాలేనిది నేనేనా తక్కువతిన్నదన్న పోటీ మొదలై, అర్హత అనే పదం రాజకీయ పరమ పద సోపా నపఠంలో పెద్దపాము నోట్లోపడి అట్టడుక్కు చేరింది.



ఈ నేపథ్యం కొందరికయినా ఇందిరాగాంధీ నాటి కాంగ్రెస్‌ రోజులను గుర్తుకు తేవడం సహజం. ఆమె శకం మొదలయిన తరువాత పార్టీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తనకు వ్యతిరేకులని లేశమాత్రం అనుమానం కలిగినా సరే, ఇందిర వారిని నిర్దాక్షిణ్యంగా అణిచి వేసేవారు. చదరంగం బల్లపై పావులను కదిపినట్టు రాష్ట్రాల ముఖ్యమంత్రులను రాత్రికి రాత్రి మార్చివేసేవారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఇలాటి ప్రయోగం తెలుగు దేశం పార్టీ ఆవిర్భావానికి, దరిమిలా కాంగ్రెస్‌ అవిచ్ఛిన్న పాలనకు ప్రజలు మంగళం పాడడానికి దారితీసింది. ఇందిర హయాంలో రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు తమలో తాము ఎన్ని గిల్లికజ్జాలు పెట్టుకుని ఎంత రచ్చ చేసుకున్నా ఢిల్లీలోని అధినాయకుల జోలికి మాత్రం వెళ్ళేవాళ్ళు కాదు.



అధిష్ఠానం అంటే బెరుకూ, భయం పైనుంచి కిందిదాకా పాకిపోయాయి. కానీ ఇప్పుడలా కాదు, ఏకంగా అధినేత్రి సోనియా గాంధీ జాతీయతనే ఎత్తిచూపే విధంగా మీడియా ముందు మాట్లాడినా అడిగేవాళ్ళు లేకుండా పోయారు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అనే తేడాలేకుండా వరసపెట్టి విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే విస్తుపోవడం జనంవంతవుతోంది. పార్టీలోని ప్రత్యర్ధులను విమర్శించడానికి వాడుతున్న భాష వెగటుకలిగిస్తోంది. నిజంగా మనసులో మాట చెబుతున్నారా లేక మీడియా దృష్టిని ఆకర్షించడానికా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.



పైపెచ్చు ఈ అపభ్రంశపు పదప్రయోగాలకు అసెంబ్లీ ఆవరణనో రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్నో వేదికగా చేసుకుంటున్న తీరు మరీ విడ్డూరంగా ఉంది. ఇక బుల్లితెరలపై అనునిత్యం జరిగే చర్చల్లో పాల్గొనే కాంగ్రెస్‌ నాయకులు అవకాశం దొరికిన ప్రతి సందర్భాన్ని ఇందుకోసం చక్కగా వాడుకుంటున్నారు. ఈ విషయంలో ఏ పార్టీ వెనుకబడి లేదు కానీ, కాంగ్రెస్‌కు మాత్రం అగ్రతాంబూలం ఇవ్వకతప్పదు. ఎందుకంటె తమ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అందరికంటే ఎక్కువ అని తమకు తామే కితాబు ఇచ్చుకుంటూ, ఆ ముసుగులో మరిన్ని గుద్దులాటలకు దిగే వీలూ చాలూ వారికే ఎక్కువ కనుక.



అలాగని రాష్ట్ర పార్టీపై ఢిల్లీ నాయకులకు పూర్తిగా అదుపు లేకుండా పోయిందని చెప్పలేము. ఇందుకు తాజా ఉదాహరణ, కాంగ్రెస్‌ పార్టీ ప్రజా ప్రతినిధులు తెలంగాణ వాదాన్ని అధిష్ఠానం ముందు మరోమారు బలంగా వినిపించే ఉద్దేశంతో జరిపిన ఢిల్లీ యాత్ర. దేశ రాజధానిలో పార్టీ అధిష్ఠాన దేవతలను కలుసుకుని తమ గోడు వినిపించుకోవడానికి వాళ్లు పడ్డ పాట్లు వర్ణనాతీతం. చివరికి ఢిల్లీ దొరలకు మరో గడువు పెట్టి తిరిగి రావాల్సిన పరిస్థితి. ఈ పరిణామాలు వారికి కూడా కొరుకుడు పడడంలేదు. వారి స్వరం పెరుగుతోంది. ఆవేదన స్తానంలో ఆక్రోశం చోటుచేసుకుంటోంది. అది ఆగ్రహంగా మారినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఎందుకంటే వారు ఎదుర్కొంటున్న సమస్య అలాటిది. అట్టడుగునుంచి వారిపై నానాటికీ ఒత్తిడి ఎక్కువవుతోంది.



తిరిగి ఎన్నికల్లో పార్టీ టిక్కెట్టు ఇచ్చినా గెలిచి చట్టసభల్లో కాలుమోపుతామన్న ఆశ అడుగంటుతోంది. ఇక టీవీ చర్చల సంగతి సరేసరి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని అధిష్ఠానం ముక్కలనే ముక్కున పెట్టుకుని తిరిగి మీడియా ఎదుట వల్లెవేయడానికి నానా అవస్థ పడుతున్నారు. తాము చేస్తున్న ప్రతి ఢిల్లీయాత్రా మరో డెడ్‌ లైన్‌ ప్రక టించడానికి తప్ప విషయం తేల్చడానికి ఉపయోగపడడం లేదన్న అబిప్రా యం వారిలో కలుగుతున్నట్టుంది. ఇప్పుడు కోస్త, సీమ కాంగ్రెస్‌ నాయకు లదీ అదే పరిస్థితి. మొన్నటి వరకు ఢిల్లీలో చక్రం తిప్పగల మొనగాళ్ళం తామేఅని పెంచుకున్న నమ్మకం వారిలో సైతం సడలుతున్న ట్టుంది. మంత్రి శైలజానాథ్‌ నాయకత్వంలో ఢిల్లీ వెడదామని అనుకుంటు న్నట్టు సీనియర్‌ కాంగ్రెస్‌ ఎంపీ లగడపాటి చేసిన ప్రకటన దీనికి అద్దం పడుతోంది.



మరో వారం పది రోజుల్లో కేంద్ర, రాష్ట్ర మంత్రి వర్గాలను విస్తరిస్తారన్న సమాచారం ఒక్కటే వారిలో కొందరిని అధిష్ఠానం ముందు అదిమి పెడుతోంది. కానీ ఢిల్లీనుంచి తాజాగా అందుతున్న వార్తలు వారిని మళ్ళీ నిరాశలోకి నెడుతున్నాయి. రాష్ట్రంలో పార్టీ ప్రస్తుత పరిస్థితులను బట్టి 2014 ఎన్నికల్లో ప్రజలే కాంగ్రెస్‌కు మొండి చేయి చూపడం ఖాయమన్న అంచనాలకు వచ్చిన కాంగ్రెస్‌ అధిష్ఠానం మంత్రివర్గ విస్తరణలో రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులను పక్కనబెట్టే అవకాశాలు లేకపోలేదన్నది ఆ వార్తల సారాంశం. భావిభారత ప్రధానిగా రాహుల్‌ గాంధీని ప్రతిష్ఠించాలని కలలు కంటున్న కాంగ్రెస్‌ అధిష్ఠాన దేవత గెలుపోటముల బేరీజులో ఆంధ్రప్రదేశ్‌ ను చిన్నచూపుచూసే ప్రమాదం ఉందని పత్రికల్లో కథనాలు వెలువడుతున్నాయి.



రాహుల్‌ గాంధీ ఆలోచనలు సైతం ఇదే క్రమంలో సాగుతున్నాయన్న వార్తలు నిజమయితే, కేంద్ర మంత్రివర్గ విస్తరణలో మన రాష్ట్రానికి మళ్ళీ మొండిచేయి ఖాయం. ఎందుకంటె, పందెం కాసేవాడు గెలుపు గుర్రాన్నే ఎంచుకుంటాడు. కొడిగడుతున్న కాంగ్రెస్‌ ఆశలకు అధిష్ఠానం తలపెట్టిన కాయకల్ప చికిత్స ఏమేరకు పనికి వస్తుందన్నది కాలమే నిర్ణయిస్తుంది. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, పీసీసీ కొత్త అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కలసికట్టుగా పనిచేయడం మీదనే పార్టీ భవిష్యత్తు కొంత ఆధారపడి ఉంది. ఇంకా మూడేళ్ల వ్యవధి మాత్రమే మిగిలి ఉంది. వీరిద్దరూ విభిన్న అధికారకేంద్రాలుగా మారిపోకుండా పార్టీ తలరాతను మారుస్తారా లేక తమనే అధిష్ఠానం మార్చే పరిస్థితి కొని తెచ్చుకుంటారా అన్నది వేచి చూడాల్సిన విషయం.











కామెంట్‌లు లేవు: