10, జూన్ 2011, శుక్రవారం

ముఖ్యమంత్రికి బొత్స బలమా ? బల్లెమా ? – భండారు శ్రీనివాస రావు


ముఖ్యమంత్రికి బొత్స బలమా ? బల్లెమా ? – భండారు శ్రీనివాస రావు

(10-06-2011 నాటి ‘సూర్య’ దినపత్రికలో ప్రచురితం)


తిరుపతి మొక్కు తీర్చుకున్న తరువాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లో నూతనోత్సాహం తొణికిసలాడుతోంది. అసెంబ్లీలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక సజావుగా జరిగిపోవడం, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు నిబంధనల సాకుతో సోదిలో లేకుండా పోవడం - ఇవన్నీ ముఖ్యమంత్రికి సానుకూల పరిణామాలే. స్పీకర్ ఎన్నిక ద్వారా ‘రుజువయిన విశ్వాసం’ ఆయనలో ఆత్మ విశ్వాసాన్ని మరింత పెంచింది. పరిపాలనపై పట్టు పెంచుకునే దిశగా ఆయనతో అడుగులు వేయిస్తోంది. రైతు సదస్సుల పేరుతొ జిల్లాల్లో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ, పనిలో పైగా పార్టీ కార్యకర్తల సమావేశాల్లో స్వరం పెంచి మాట్లాడేలా చేస్తోంది. దీనికి ఉదాహరణ శ్రీకాకుళంలో ఆయన చేసిన ప్రసంగం. ఆ ప్రసంగంలో జగన్ అనుకూల కాంగ్రెస్ నాయకులను గురించి ఆయన చేసిన ప్రత్యేక ప్రస్తావన. పార్టీలో జగన్ కోవర్టులుగా అభివర్ణిస్తున్న వారికి ముఖ్యమంత్రి కొత్తగా ఇంటి దొంగలని నామకరణం చేశారు. ‘ఇంటి దొంగల్ని ఈశ్వరుడయినా పట్టలేడు. పార్టీ నుంచి వెళ్లిపోవాలని అనుకుంటున్న వాళ్లు దయచేసి వెళ్ళిపొండి. లేని పక్షంలో మీ పాత స్తానాలకు మేమే పంపిస్తాం.’ అన్న రీతిలో ఆయన ప్రసంగం సాగింది. కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలి తెలిసిన వారు కూడా శ్రీకాకుళం లో ఆయన చూపిన తెగువను చూసి ఆశ్చర్య పోయివుంటారు. బహుశా, ఆయన ముఖ్యమంత్రి పదవిని స్వీకరించిన తరువాత పార్టీ లోని జగన్ అనుకూల వర్గం వారిపై ఈ విధంగా విరుచుక పడడం ఇదే మొదటి సారి. పైగా శ్రీకాకుళం జిల్లాలో జగన్ వర్గం ఎమ్మెల్యేలుగా గుర్తింపు పొందిన ధర్మాన కృష్ణ దాస్, కొర్ల భారతి ముఖ్యమంత్రి ప్రసంగించిన రైతు సదస్సుకు హాజరయిన వారిలో వున్నారు. ఆ తరువాత జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ముఖ్యమంత్రి తన విమర్శల ప్రస్తావనకు వేదికగా చేసుకోవడం విశేషం.


అయితే, ముఖ్యమంత్రి హెచ్చరికలను ‘నిస్పృహతో చేసిన వ్యాఖ్యలు’ గా రాజకీయపరిశీలకులు పరిగణిస్తున్నారు. స్పీకర్ ఎన్నికతో తన ప్రభుత్వం పట్ల శాసన సభ ‘విశ్వాసం’ రుజువయిందని సంబరపడుతున్న ముఖ్యమంత్రి, అదే నోటితో పార్టీలో ‘ఇంటి దొంగల’ ప్రస్తావన తీసుకురావడం ఆయనలోని ద్వైదీభావానికి అద్దం పడుతోందని అంటున్నారు. అలాగే, ప్రదేశ్ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా ఉత్తరాంధ్ర సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ నియామకం ముఖ్యమంత్రి అభీష్టానికి వ్యతిరేకంగా జరిగిందని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. పైపెచ్చు అధిష్టానం ఎంపిక చేసిన బొత్స సత్యనారాయణ సాదా సీదాగా కనబడే అసాధారణ రాజకీయ నాయకుడు. సామాజిక కోణం నుంచి చూసినా లేక ఈనాటి రాజకీయాలకు అవసరమయిన ఇతర కోణాలనుంచి చూసినా బొత్స సత్యనారాయణ అన్ని విధాల ముఖ్యమంత్రికి సమ ఉజ్జీ అనే చెప్పాలి. జగన్ మోహన రెడ్డిని దీటుగా ఎదుర్కొనగల సత్తా వున్న మనిషిగా పార్టీ అధిష్టానం బొత్సను గుర్తించి పీసీసీ పీఠం అప్పగించింది. అందర్నీ కలుపుకుపోయే బొత్స తత్వం పార్టీ పటిష్టానికి ఉపయోగపడవచ్చు. ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు పట్ల ఆయన గతంలో వెల్లడించిన సానుకూల భావాలే పార్టీ కొత్త అధ్యక్షుడు కావడానికి సానుకూలంగా మారాయని చెప్పవచ్చు. ఒక్క వి.హనుమంతరావును మినహాయిస్తే తెలంగాణా ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులెవ్వరు ఆయన ఎంపిక పట్ల అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అలాగే టీ ఆర్ ఎస్ కూడా. ఇవన్నీ ముందు ముందు బొత్సకు కలిసొచ్చే అంశాలే. దానికి తోడు, పదవి రాగానే, ఢిల్లీ నుంచి తిరిగొస్తూనే, అస్వస్తత నుంచి కోలుకుంటున్న కాకా మొదలుకుని సొంత పార్టీ – ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో కలిపేసి కొంగొత్త భ్రమలతో ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్న చిరంజీవిని కూడా ఇంటికి వెళ్లి కలిసి తనతో కలుపుకోగల కలుపుగోలుతనం బొత్స సొంతం.


సంప్రదాయానికి భిన్నంగా ఈ సారి ఉత్తరాంధ్రకు చెందిన బొత్సకు అధిష్టానం పీ సీ సీ అధ్యక్ష పీఠం అప్పగించడానికి ఇతరత్రా కారణాలు కూడా వున్నాయి. రాష్ట్రానికి సంబంధించినంతవరకు ఢిల్లీలోని పార్టీ పెద్దలను కలవరపెడుతున్న అంశాలలో తెలంగాణాతో పాటు అంతటి ప్రాధాన్యం కలిగింది జగన్ మోహన రెడ్డి స్తాపించిన కొత్త పార్టీ. ఈ పార్టీవల్ల భవిష్యత్తులో కాంగ్రెస్ భవితవ్యానికి ఎదురుకాగల ముప్పు ఎలాటిదన్నది కడప ఉప ఎన్నికలలో ఎదురయిన ఘోర పరాజయంతో దానికి అర్ధం అయింది. పైకి ఎన్ని బీరాలు పలుకుతున్నా రాష్ట్రంలో ఆ పార్టీని ఎదుర్కోవడం రాజకీయంగా కాంగ్రెస్ కు పెనుసవాలే అన్నది ఆ పార్టీ నాయకులే ఆంతరంగిక సంభాషణల్లో అంగీకరిస్తున్న సత్యం. అందుకే, కడప ప్రభావాన్ని కనీసం ఉత్తరాంధ్రలోనయినా నిలువరించగలిగితే రానున్న ఎన్నికల నాటికి కాంగ్రెస్ పడవను వొడ్డు ఎక్కించవచ్చన్నది ఆ పార్టీ వ్యూహంగా కానవస్తోంది. ఉత్తరాంధ్రలో ఒక ప్రధాన సామాజిక వర్గానికి నాయకత్వం వహిస్తున్న బొత్స ద్వారా కొంత మేరకయినా నష్టాన్ని పూడ్చుకోవడం అన్నది ఆ పార్టీ వ్యూహకర్తల ఆలోచనగా తోస్తోంది. వై ఎస్ జగన్ హవాకు అడ్డుకట్ట వేయడం ప్రధాన కర్తవ్యంగా మారిన కాంగ్రెస్ అధిష్టానం కంటికి బొత్స అవసరానికి పనికి వచ్చే తురుపు ముక్కగా కనిపించడంలో ఆశ్చర్యం లేదు.


రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణం తరువాత ఆయన కుమారుడు జగన్ పట్ల బొత్స అనుసరిస్తున్న వైఖరి కూడా బొత్సకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడానికి దోహదపడి వుంటుంది. రాజశేఖరరెడ్డికి అనుంగు శిష్యుడయిన బొత్స- తన విధేయతను కానీ, విశ్వాసాన్ని కానీ ఆయనవరకే పరిమితం చేసి, ఆయన అనంతరం జగన్ మోహన్ రెడ్డిని ఎడంగా వుంచి వ్యవహరించడం అప్పట్లో వై ఎస్ అభిమానులకు కొరుకుడు పడలేదు కూడా. కానీ, ఇప్పుడదే అధిష్టానం వద్ద మార్కులు సంపాదించడానికి బొత్సకు ఉపయోగపడిందని అనుకోవాలి.


అయితే, ఆయనలోని చొరవా చురుకుదనం ఎలాటి ముఖ్యమంత్రికయినా ఇబ్బంది కలిగించే లక్షణాలే. క్రమంగా బలపడుతున్నానన్న ఆశలు కదలాడుతున్న తరుణంలో జరిగిన బొత్స నియామకం కిరణ్ కుమార్ రెడ్డికి ఏ విధమయిన బలమిస్తుందన్నది అనుమానమే. ఎందుకంటె, సహజంగా మాటకారి అయిన బొత్సను, ముభావంగా ముక్తసరిగా మాట్లాడే ముఖ్యమంత్రితో పోల్చిచూసుకోవడం మొదలవుతుంది. పైపెచ్చు, రాజకీయ పరమపద సోపానపఠంలో నిచ్చెనలన్నీ త్వరత్వరగా ఎక్కేసి మరెన్నో ఎత్తులకు ఎదగాలన్న కాంక్ష బలంగా వున్న బొత్స తదనుగుణంగానే రాజకీయ ఎత్తులకు పూనుకుంటే ఆశ్చర పడాల్సింది ఏమీ వుండదు. పీ సీ సీ పదవితో పాటు మంత్రి పదవి కూడా వుండాలని బొత్స పట్టుబట్టడం వెనుక ఏదయినా ముందు చూపు కూడా వుండివుండవచ్చు. సీ ఎం కావాలన్న కోరికను కూడా దాచుకోని నైజం ఆయనది.


మామూలు పరిస్థితుల్లో అయితే పీసీసీ అధ్యక్ష పీఠం అన్నది అలంకారప్రాయమే. ఎన్నికల సమయంలో మాత్రం ఈ పదవికి ఎంతో కొంత ప్రాధాన్యత వుంటుంది. పార్టీ అభ్యర్ధుల ఎంపిక సమయంలో కొందరి విషయంలో నయినా పీసీసీ అధినేత మాట చెల్లుబాటు అయ్యే అవకాశం వుంటుంది. ప్రస్తుతం సాధారణ ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ వ్యవధానం వుంది. పోనీ, స్తానిక సంస్తల ఎన్నికలయినా కనుచూపు మేరలో వున్నాయనుకుంటే, ఆ ఆశ కూడా కనబడడం లేదు. కడప ఉప ఎన్నికల ఫలితాల నేపధ్యంలో స్తానిక సంస్తల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం పూనుకుంటుందనే ఆశలు ఆవిరవుతున్నాయి. పాలక వర్గాలు రద్దయిన స్తానిక సంస్తలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించే ఆర్డినెన్స్ ఇవ్వాళో రేపో జారీ అయ్యే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి.


పోతే, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక సమయంలో అనుభవంలోకి వచ్చిన ఉద్రిక్త క్షణాలు ముఖ్యమంత్రిని ఇంకా కలవరపెడుతూనే వుండి వుండవచ్చు. ఆ ఎన్నికలో సాధించిన విజయం కేవలం సాంకేతిక మైనదే అన్న విషయం ఆయనకు తెలియంది కాదు. ప్రజారాజ్యం విలీనంతో పెరిగిన బలం, మజ్లిస్ పార్టీ మద్దతు, అనర్హత వేటు పడుతుందన్న భయంతో జగన్ అనుకూల వర్గీయులయిన ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా వత్తాసు పలకడం – అధికార పార్టీ అభ్యర్ధుల గెలుపుకు దోహదం చేసాయి. అయినా కూడా రావాల్సిన వోట్లకన్న అత్తెసరు వోట్ల ఆధిక్యం మాత్రమే లభించడం ఆ పార్టీ నేతలను ఇబ్బందికి గురిచేసింది. ప్రస్తుతానికి బయటపడినా ముందు ముందు మరోసారి ఇదే పరీక్ష ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. అవిశ్వాసం అనే కత్తి ముఖ్యమంత్రి నెత్తిమీద వేలాడుతూనే వుంటుంది. మరో అగ్ని పరీక్ష తెలంగాణా రూపంలో తయారుగా వుంది. (09-06-2011)


కామెంట్‌లు లేవు: