3, జూన్ 2011, శుక్రవారం

జరగని పెళ్ళికి బాజాల మోత - భండారు శ్రీనివాసరావు

జరగని పెళ్ళికి బాజాల మోత - భండారు శ్రీనివాసరావు


(04-06-2011 తేదీ సూర్య దినపత్రికలో ప్రచురితం)


ప్రజలు గమనిస్తున్నారు అన్నది రాజకీయనాయకులు తరచుగా వాడే ఊతపదం.


ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని వారు భావిస్తున్నట్టు లేదు. బహుశా ఆ అవసరం వారికి లేదేమో కూడా. ఎందుకంటె మన దేశంలో రూపొందించుకున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ అలాటిది మరి.


ఈ వ్యవస్థకు మూలస్తంభం ఎన్నికలు. రాజ్యాంగం ధర్మమా అని కుల,మత,వర్ణ,లింగ,వయో వివక్ష లేకుండా ప్రజలందరూ ఈ ఎన్నికల్లో పాల్గొని తమకు నచ్చిన ప్రజాప్రతినిధిని ఎన్నుకునే అవకాశం వుంది. కానీ, దురదృష్టం ఏమిటంటే వోటు హక్కు వినియోగించుకోవడంతో పౌరుల ప్రజాస్వామ్య ధర్మం పూర్తవుతుంది. అంతటితో వారి పని సరి. మళ్ళీ ఎన్నికలొచ్చేదాకా ప్రజలతో పని లేదన్న సంగతి రాజకీయులందరికీ తెలుసు. పోతే, ఇక అక్కడనుంచి ప్రజాస్వామ్య రధం ఎన్నికయిన ప్రజాప్రతినిధుల దయాదాక్షిణ్యాలతో నడుస్తుంది. సంఖ్యలు, అంకెలు లెక్కలోకి వస్తాయి. పార్టీ ఫిరాయింపుల చట్టం కోరలనుంచి తప్పించుకునే వ్యూహ ప్రతివ్యూహాలతో రాజకీయం సాగుతుంది. అంకెల గారడీలు, టక్కు టమార విద్యలు రంగప్రవేశం చేస్తాయి. ప్రజల విశ్వాసంతో ఎవరికీ నిమిత్తం వుండదు. ప్రజాప్రతినిధుల విశ్వాసం వుంటే చాలు, ప్రజాస్వామ్య ప్రభుత్వాల నడక నల్లేరుపై బండిలా సాగిపోతుంది.


గత ఇరవై నాలుగ్గంటల్లో రాష్ట్ర రాజకీయాలు అనూహ్యమయిన మలుపులు తిరుగుతున్నాయి. రాజ్యాంగంలోని సాంకేతికతలను అడ్డం పెట్టుకుని తమదే పై చేయి అనిపించుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఈ విషయంలో ఆరితేరిన కాంగ్రెస్ ఈ పాచికలాటలో ఇంతవరకు ముందంజలో వుంది.


దాదాపు రెండేళ్లుగా నిష్క్రియాపియత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలచిన పాలక పక్షం లోని వ్యూహకర్తలు, తాము పదిలంగా దాచిపెట్టిన అస్త్రశస్త్రాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. వైరి పక్షం వూహలకు అందని వేగంతో పావులు కదుపుతున్నారు. ఎన్నాళ్ళబట్టో అటకెక్కించి వుంచిన పదవుల పందేరానికి వున్నట్టుండి తెర తీసారు. అదీ ఎంతో వ్యూహాత్మకంగా. స్పీకర్ ఎన్నిక పేరుతొ హడావిడిగా శాసన సభ సమావేశాలను ఏర్పాటుచేసారు. డిప్యూటీ స్ప్పీకర్ నాదెండ్ల మనోహర్ తో ఒక రోజు ముందుగానే రాజీనామా చేయించారు. దానితో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇద్దరు లేని పరిస్తితి ఏర్పడింది. గవర్నర్ తో ప్రమేయం లేని రీతిలో, గత శాసన సభ సమావేశాలను ప్రోరోగ్ చేయకుండా జాగ్రత్త పడడాన్ని బట్టి చూస్తే చాలా ముందుగానే కాంగ్రెస్ తన వ్యూహరచన చేసుకున్నట్టు అర్ధం అవుతోంది. ఈ సమయంలోనే, తెలుగుదేశం పార్టీ మహానాడు ముగింపులో చేసిన ప్రకటనకు అనుగుణంగా కిరణ్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చింది. కానీ అలా ఇచ్చే సమయానికి దాన్ని తీసుకోవాల్సిన స్పీకర్, డిప్యూటీ స్పీకర్ రెండు పదవులు ఖాళీ. నోటీసు ఇవ్వడానికి అసెంబ్లీకి వెళ్ళిన తెలుగుదేశం శాసన సభ్యులు చాలాసేపు వేచి చూసి, ఇక చేసేదేమీ లేక అసెంబ్లీ కార్యదర్శికి ఇచ్చి వెనుదిరగాల్సివచ్చింది. దానితో ఆ నోటీసు సాంకేతికంగా చెల్లుబాటు కాదన్న వాదన బయలుదేరింది. అసెంబ్లీ సమావేశం జరుగుతున్నప్పుడు స్పీకర్ కు ఇచ్చిన నోటీసునే పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి మళ్ళీ తెలుగుదేశం పార్టీ స్పీకర్ ఎన్నిక అనంతరం తిరిగి అదే నోటీసు ఇవ్వాల్సి వుంటుంది. దానిని పరిశీలించి అనుమతించడానికి కొత్త స్పీకర్ పది రోజులు వ్యవధి తీసుకోవచ్చని మరో సాంకేతిక అంశాన్ని తెరపైకి తెచ్చారు. అంటే శాసన సభ మరో సారి సమావేశం అయ్యేదాకా టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు అసెంబ్లీ అలమరా లోనే వుండిపోయే అవకాశం వుంది.


స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక తంతు ముగిసిన తరువాత వారిద్దరినీ శాసన సభ అభినందించే కార్యక్రమం మొదలవుతుంది. సభావ్యవహారాల సలహా సంఘం సమావేశమై అవిశ్వాస తీర్మానం నోటీసును పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి వుంటుంది. స్పీకర్ ఎన్నిక కోసం ఏర్పాటుచేసిన ఒకరోజు సమావేశంలో అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చే అవకాశాలు మృగ్యంగా కనబడుతున్నాయి. ఈ విషయం పూర్తిగా కొత్త స్పీకర్ విచక్షనాధికారానికి లోబడి వుంటుందన్నది నిపుణుల అభిప్రాయం. అయితే, జగన్ బలం ఎంతో లెక్కలు తేల్చుకోవాలని గట్టిగా కోరుకుంటున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా కోరుకున్న పక్షంలో కొత్త స్పీకర్ అవిశ్వాస తీర్మానాన్ని చేపట్టే అవకాశం వుంటుంది. అలా జరగని పక్షంలో అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడానికి వున్న ప్రస్తుత నిబంధనలను అడ్డం పెట్టుకుని శనివారం సభ ముగిసిన అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేసి ప్రోరోగ్ చేస్తే మళ్ళీ అవకాశం లభించేది వర్షాకాల సమావేశాల్లోనే. బీరాలు పలికిన పార్టీలన్నీ అప్పటిదాకా వేచిచూడాల్సిందే.


రెండు రోజులుగా నిబంధనల పేరుతొ నడుస్తున్న ఈ తంతును పరికిస్తున్నవారికి ఒక విషయం ఇట్టే అర్ధం అవుతుంది. ఇదంతా జగన్ పార్టీని ఇరుకున పెట్టడానికి కాంగ్రెస్ పన్నిన పధకంగా తెలిసిపోతుంది. తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చినట్టూ అవుతుంది. సాంకేతిక కారణాలతో దాన్ని అనుమతించనట్టు అవుతుంది. రోగి కోరిందే వైద్యుడు ఇవ్వడం అంటే ఇదే కాబోలు.


మహానాడుతో కొత్త జవసత్వాలు పుంజుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు - కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని, చాలినంత బలం లేకపోయినా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులకు పోటీ పెట్టాలని రెండు కీలక నిర్ణయాలను ప్రకటించి రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కించారు. అనుకున్నదే తడవుగా స్పీకర్ పదవికి మాజీ మంత్రి కేఈ కృష్ణ మూర్తినీ, డిప్యూటీ స్పీకర్ పదవికి మరో మాజీ మంత్రి సుద్దాల దేవయ్యను
అభ్యర్ధులుగా ప్రకటించి ఆటలో తానూ వెనకబడిలేనన్న సంకేతాలను ఇచ్చారు. బీసీ, ఎస్సీలపట్ల తమ పార్టీకి వున్న చిత్తశుద్ధిని ఈ విధంగా వెల్లడించుకున్నారు. ఈ పరిణామం సహజంగానే కాంగ్రెస్ పార్టీని కలవరపెట్టింది. పాలక పక్షం తన ధోరణి మార్చుకోకుండా సీమాంధ్ర వారికే పదవుల పందేరంలో పెద్ద పీట వేస్తోందని తెలంగాణా రాష్ట్ర సమితి నాయకులు ఆరోపణలకు దిగారు కూడా. పార్టీలోని సొంత శాసన సభ్యులు కొందరు సయితం ఈ ఆరోపణలతో గొంతుకలిపారు. వీటికి తోడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున ఇటీవల పులివెందుల నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో శాసన సభకు ఎన్నికయిన వైఎస్ సతీమణి విజయమ్మ అసెంబ్లీ సభ్యురాలిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసినప్పుడు పదమూడు మంది కాంగ్రెస్ శాసన సభ్యులు ఆవిడ వెంట తరలి రావడం కూడా పాలకవర్గం లొ చర్చనీయాంశం అయింది. పార్టీ ఆదేశాలను బేఖాతరు చేయడం కొత్త కాకపోయినా, స్పీకర్ ఎన్నిక, అవిశ్వాస తీర్మానం నేపధ్యంలో, అంతమంది శాసన సభ్యులు కట్టగట్టుకుని బాహాటంగా వైరి పక్షం నేత వెంట నడవడాన్ని ఆ పార్టీ నాయకత్వం జీర్ణించుకోలేకపోతోంది. అందుకే, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికలను ఏకగ్రీవం చేయడానికి అందరూ కలసి రావాలని పాలక పక్షం తరపున ఇతర పార్టీలకు విజ్ఞప్తులు చేయడం జరిగింది.


తగినంత బలం వున్నప్పటికీ, ఒకేసారి, స్పీకర్ ఎన్నిక, అవిశ్వాస తీర్మానం ఎడుర్కొవాల్సిరావడంతో, చేతిలో వున్న ఏ చిన్న అవకాశాన్ని కూడా వొదులుకునే స్తితిలో ఆ పార్టీ వున్నట్టు కనబడడం లేదు. కాంగ్రెస్ శాసన సభ్యులలో వున్న జగన్ సానుభూతిపరులతో కలసి మరికొందరు చేయి కలిపి అనర్హత వేటుకు సిద్ధపడితే, పరిస్థితులు మరోరకంగా మారే అవకాశాలు వుంటాయన్న భయం దాన్ని వేధిస్తూ వుండవచ్చు.


పోతే, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ నిలబెట్టే అభ్యర్ధులకు జగన్ పార్టీ లేదా ఆయనతో వున్న శాసన సభ్యులు మద్దతు ఇవ్వాలనేది కూడా వ్యూహాత్మక ప్రతిపాదనే. ఎందుకంటె ఓడిపోతే జగన్ వర్గంపై అనర్హత వేటు పడుతుంది. తెలుగుదేశానికి ఓడిపోయామన్న నామర్దా తప్ప వేరే నష్టం లేదు. జగన్ ఇంతవరకు తనకుందని చెప్పుకుంటున్న బలం ఏపాటిదో జనాలకు తెలిసిపోతుంది. గెలిస్తే మాత్రం పాలక పక్షం సభావిశ్వాసం కోల్పోయినట్టు అవుతుంది. ప్రభుత్వం కూలిపోవచ్చు. కానీ వెనువెంటనే మధ్యంతర ఎన్నికలు వచ్చే వీలు లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మెజారిటీ సభ్యుల మద్దతు వుందని ముందుకు వచ్చే నాయకుడికి గవర్నర్ అవకాశం ఇవ్వవచ్చు. కానీ, దరిమిలా శాసన సభ రద్దయినా, దానిని సుప్తచేతనావస్థలో వుంచినా – తెలుగు దేశం తరపున గెలిచిన వ్యక్తే శాసన సభ స్పీకర్ పదవిలో కొనసాగుతారు. బహుశా ఇదే కారణంతో వైఎస్ఆర్ పార్టీ ఈ ప్రతిపాదనను నిర్ద్వందంగా తిరస్కరిస్తోందని భావించాలి.


కడప ఉప ఎన్నికల్లో పోగొట్టుకున్న పరువు ప్రతిష్టలను మళ్ళీ ఏదో ఒక మేరకు పూరించుకునే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ నిబంధనలను అడ్డం పెట్టుకుని ఆడే ఈ ‘నెంబర్ గేమ్’ కు తెర తీసిందని అనుకోవాలి.

అసలు అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుందో రాదో తెలియని స్తితిలో సభలో పార్టీల బలాబలాలనుగురించీ, తీర్మానం గెలుపోటములు గురించీ చర్చించుకోవడం - జరగని పెళ్ళికి బాజాలు వాయించిన చందమే కాగలదు. (03-06-2011)


 

1 కామెంట్‌:

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

ధన్యవాదాలు ప్రవీణ్ శర్మ గారు.- భండారు శ్రీనివాసరావు