12, జూన్ 2011, ఆదివారం

ఎంతో చిన్నది జీవితం! – భండారు శ్రీనివాసరావు

ఎంతో చిన్నది జీవితం! – భండారు శ్రీనివాసరావు



స్నేహం అనేది నీటి మీద రాత కాదు రాతి మీద గీత.


ఇద్దరు మిత్రులు అడవి మార్గం లో ప్రయాణం చేస్తున్నారు. మధ్యలో ఓ నది దాటుతుండగా వారి నడుమ ఏదో విషయంలో వాదప్రతివాదాలు మొదలయ్యాయి.


మాటామాటా పెరిగింది. వాటిలో తీవ్రత పెరిగింది. అందులో ఒకడు కోపం పట్టలేక రెండో వాడిని చాచి లెంపకాయ కొట్టాడు.


దెబ్బతిన్నవాడు ఖిన్నుడయ్యాడు. కానీ స్నేహితుడుపై తిరిగి చేయిచేసుకోలేదు.



మౌనంగా తల దించుకుని చేతి వేళ్ళతో నీటిమీద ఓ వాక్యం రాసాడు.


“ఈ రోజు నాకు చాలా దుర్దినం. మంచి స్నేహితుడు అనుకుంటున్న వ్యక్తి నా చెంప పగలగొట్టాడు”


దెబ్బకొట్టినవాడికి స్నేహితుడు రాసినదేమిటో అర్ధం అయింది. కానీ ఏమీ మాట్లాడలేదు. ప్రయాణం సాగుతోంది. కానీ వారి నడుమ మాటలే నిలచిపోయాయి. నీటిలో నడుస్తుండగానే ఉన్నట్టుండి ఓ అల విసురుగా వచ్చింది. దాని తాకిడికి దెబ్బతిన్న వ్యక్తి ప్రవాహంలో కొట్టుకుపోసాగాడు. రెండోవాడు ప్రమాదాన్ని పసికట్టి ఈదుకుంటూ వెళ్లి మునిగిపోతున్న స్నేహితుడ్ని కాపాడి వొడ్డుకు చేర్చాడు.


త్రుటిలో ప్రాణాలు దక్కించుకున్నవాడికి, ప్రాణం కాపాడిన వాడికి కృతజ్ఞతలు యెలా చెప్పాలో తెలియలేదు. తీరం చేరగానే కనిపించిన ఓ రాతిపై తన మనసులోని భావాన్ని చెక్కాడు.


“ఈ రోజు నా జీవితంలో మరవలేని రోజు. నా స్నేహితుడు తన ప్రాణాన్ని సయితం లెక్క చేయకుండా నా ప్రాణాన్ని కాపాడాడు. ఈ రోజునూ, అతడు నాకు చేసిన సాయాన్నీ ఎన్నటికీ మరువలేను.”


అది చదివి ఆశ్చర్యపోవడం రెండోవాడి వంతయింది.


‘ఇదేమిటి? దెబ్బ కొట్టినప్పుడు నీటి మీద గెలికాడు. ఇప్పుడేమో రాతి మీద చెక్కాడు.’


మనసులో మెదిలిన సందేహాన్ని మనసులోనే దాచుకోకుండా స్నేహితుడి ముందు బయట పెట్టాడు.


‘చెప్పు మిత్రమా! నాతో దెబ్బతిన్నప్పుడేమో నీటిమీద రాశావు. ఇప్పడేమో రాతిమీద రాశావు. ఏమిటి ఇందులోని మర్మం.’


రెండోవాడు ఇలా జవాబు ఇచ్చాడు.


“ఎవరయినా మనల్ని బాధ పెట్టినప్పుడు దాన్ని గుర్తు పెట్టుకోకూడదు. నీటి మీద రాసిన రాత ఎంతమాత్రం నిలవదు. మరచిపోవాల్సిన విషయం కనుక అలా రాసాను. పోతే నీవు చేసిన సాయం అంటావా. ఒకరోజుతో మరచిపోయేది కాదు. జీవితాంతం జ్ఞాపకం పెట్టుకోవాలి. రాతి మీద గీతలా కలకాలం గుర్తుండిపోవాలి. అందుకే అలా రాశాను”


అందుకే పెద్దలంటారు.


జీవితంలో ఓ విశిష్ట వ్యక్తిని కలుసుకోవడానికి ఓ క్షణం పట్టకపోవచ్చు. వారిని గురించి ఓ అవగాహనకు వచ్చి మెచ్చుకోవడానికి మరో గంట పట్టవచ్చు. వారిని అర్ధం చేసుకుని ఆరాధించడానికి ఓ రోజు తీసుకోవచ్చు. కానీ అలాటి వారిని మరచిపోవడానికి మాత్రం మొత్తం జీవిత కాలం చాలదు.


జీవితమనేది మనకు ఒక్కసారిమాత్రమే భగవంతుడు ప్రసాదించే వరం. దాన్ని వృధా చేయకుండా జీవిత సారాన్ని పూర్తిగా అనుభవించాలి.జీవితంలో తారసపడిన వైభోగాలకు విలువ ఇవ్వవద్దు. మీ అనుకున్నవారికి, నా అనుకున్నవారికి విలువ ఇవ్వండి.


ఇతరులని ద్వేషిస్తూ కూర్చుంటే జీవితం సరిపోదు. ఎందుకంటే –


‘ఎంతో చిన్నది జీవితం!’



కామెంట్‌లు లేవు: