‘ఎందుండి ఎందు బోవుచు ఇందులకేతెంచినారు? అంటాడు ప్రవరాఖ్యుడు తమ ఇంటికి అతిధిగా వచ్చిన యతితో. (నిజానికి ఇలా చెప్పాపెట్టకుండా వచ్చేవాళ్ళని అభ్యాగతి అంటారని కాలేజీలో మా తెలుగు లెక్చరర్ గారు చెప్పేవారు.
ఎక్కడ నుండి వచ్చారు
ఎక్కడకు పోతున్నారు అని అడగడం మర్యాదగా భావించేవారు కాదేమో ఆ కాలంలో.
అలాగే యాదగిరిని ఈ రెండు
ప్రశ్నలు అడగడం అనవసరం. కాళ్ళకు పసరు రాసుకోకపోయినా, చక్రాలు తగిలించుకాకపోయినా ఎక్కడి నుంచయినా రాగలడు, అలాగే ఎక్కడికి అయినా పోగలడు. అంచేత ఈ రెంటి నడుమ లభించిన
విరామంలో అతడు చెప్పింది వింటూ పోవడమే విజ్ఞుల లక్షణం.
యాదగిరి అంటే తెలియని
వాళ్ళకోసం జర్నలిస్టు పాశం యాదగిరి అని పరిచయం చేస్తున్నాను.
కూర్చున్నది కాసేపే
అయినా చాలా విషయాలు మాట్లాడాడు. అన్నీ రాయాలంటే ఓ గ్రంధం అవుతుంది.
గోల్కొండ కోటలో అభ్సీ
గేట్ వుంది తెలుసు కదా అన్నాడు.
ఔరంగజీబు సైన్యాలు
గోల్కొండ పై దాడి చేసినప్పుడు ఆ కోటకు ఉన్న అయిదు ప్రధాన ద్వారాలలో ఒక ద్వారానికి ఆఫ్రికన్ దేశం అభ్సీనియా కు చెందిన మహమ్మద్
బిలాల్ అనే నీగ్రో బంటు కాపలాగా వున్నాడు. అతడు అక్కడ వున్నాడు అంటే గోల్కొండ ప్రభువులకు
అపరిమితమైన భరోసా. అతడి చివరి శ్వాస వరకు చివరి శత్రువు కూడా కోటలోకి అడుగుపెట్టలేడని ఓ నమ్మకం. అందుకే ఆ
గేటుకు అబ్సీ గేటు అని పేరు పెట్టారు.
ఇంతకీ యాదగిరి ఇదంతా
ఎందుకు చెబుతున్నట్టు. బంటు అనేది తెలుగు పదం కాదని చెప్పడానికి.
“సర్కారు జిల్లా తెలుగు
అంటారు. నిజానికి అందులో తెలుగు అనే పదం తప్ప తెలుగే లేదని అతడి ముక్తాయింపు. ఏమిటంటే
సర్కారు తెలుగు కాదు, జిల్లా
తెలుగు కాదు. ఆ రెండూ ఉర్దూ పదాలే. నిజం ఒప్పుకోవాలి. అసలు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు
మాట్లాడుకునే భాషలోనే ఎక్కువ ఉర్దూ పదాలు మనకు వినవస్తాయి, కనబడతాయి. భాష విషయంలో వారిది ఉదారవాదం అని
తీర్మానించాడు.
“అమితాబ్ బచన్ వాయిస్
కల్చర్ గురించి గొప్పగా చెబుతారు. నిజానికి ఆయన తండ్రి హరివంశ్ రాయ్ బచన్ కు ఈ
ఖ్యాతి దక్కాలి. ఆయన కొడుకు స్వరంలో స్పష్టత రావడం కోసం కఠిన మైన శిక్షణ ఇచ్చాడు. వేదాలు
ఎక్కడా రాసిలేవు. వాటిలోని పనసలు ఒక పట్టాన కొరుకుడు పడవు. గురువు ముఖతః వాటిని విని బట్టీయం వేయాలి.
శిష్యుల నోట ఎక్కడా ఉచ్ఛారణ దోషం రాకుండా
చూడడానికి గురువులు చాలా కష్ట పడేవారు. ఒక్కో అక్షరానికి ఒక్కో అర్ధం వుంటుంది.
తభావతు లేకుండా పలకాలి. ఉర్దూలో కబర్, ఖబర్ ఈ రెండు పదాలు దగ్గరగా అనిపిస్తాయి.
కానీ ‘క’ ‘ఖ’ ఒక్క అక్షరం
తేడాతో మొత్తం అర్ధం మారిపోతుంది. మసీదుల్లో
ప్రార్ధనలు కూడా అంతే! అవి చదవడానికి మదర్సాల్లో గట్టి తర్పీదు ఇస్తారు. మహమ్మద్
ప్రవక్త మొట్టమొదట ఈ ప్రార్థన చదవడం కోసం ఎంపిక చేసుకున్నది బిలాల్ అనే వాడిని.
మంచి స్వరం తప్పిస్తే అతడిలో గొప్ప అర్హతలు ఏమీ లేవు. అయినా పవిత్రమైన కార్యం కోసం
ప్రవక్త అతడినే ఎంపిక చేసుకున్నాడు.
“సాహెబ్! సాహెబా! సాహెబా
అంటే తల్లి. మసాబ్ ట్యాంక్ అని పిలుచుకుంటున్న చెరువుకు అసలు పేరు మా సాహెబా
టాంక్. కాలక్రమంలో మసాబ్ టాంక్ అయింది. చెరువు రూపురేఖలు లేకుండా పోయింది”
ఇలా సాగిపోయింది యాదగిరి
వాగ్జరి.
మా పిల్లలు కూడా శ్రద్ధగా వింటున్నారు.
చాయ్ బిస్కెట్ వంటి స్వల్ప ఆతిధ్యం స్వీకరించి ఇక
వెడతాను అని లేచాడు.
జర్నలిస్ట్ కాలనీలో కదా ఇల్లు. ఈ టైంలో ఎలా
వెడతావు అన్న ప్రశ్నకు నవ్వలేదు. సరికదా! రాజ కపూర్ నటించిన శ్రీ 420
హిందీ చిత్రంలోని పాట వినిపించాడు.
“మేరా జూతా
హై జాపానీ, ఏ పంట్లూన్ ఇంగ్లిస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ దిల్ హై హిందూస్తానీ!
“నికల్ పడే హై ఖులీ సడక్
పర్ అప్నా సీనా తానే
మంజిల్ కహాఁ కహా రుకానా ఊపర్ వాలా జానే!”
ఇంకాసేపు వుంటే బాగుణ్ణు
అనిపించింది.
“పక్కనే మెట్రో. చెక్
పోస్టు దగ్గర దిగితే జర్నలిస్ట్ కాలనీ” అన్నాడు.
పై పాట మళ్ళీ
వినిపించింది. యాదగిరి పాడలేదు.
నాకే చెవుల్లో వినిపించినట్టు
అనిపించింది, యాదగిరి
మాటలు విన్నాక.
(27-11-2021)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి