(ఈరోజు నవంబరు 21 తేదీ ఆదివారం ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం)
అనువాదం ముఖ్యోద్దేశం అర్ధం కావడం అనేవారు కీర్తిశేషులు, పదప్రయోగ దురంధరులు, ఆర్వీయార్ గా సుప్రసిద్దులయిన రాళ్ళభండి వెంకటేశ్వరరావు గారు.
నేను
పాతికేళ్ళకు పూర్వం మాస్కో రేడియోలో పనిచేసేటప్పుడు ఈ అనువాద సమస్యలు నాకూ
ఎదురయ్యాయి. ఎందుకంటే ప్రతిరోజూ ఓ గంట వ్యవధికి సరిపోను రేడియో కార్యక్రమాలను
తెలుగులో రూపొందించాల్సిన బాధ్యత నాపై వుండేది. రష్యన్ రేడియో అధికారులు
కార్యక్రమాల మూలప్రతిని ఇంగ్లీష్ లో ఇచ్చేవారు. దాదాపు ఎనభయ్ కి పైగా ప్రపంచ
భాషలకు ప్రాతినిధ్యం వహిస్తూ అక్కడ పనిచేసే మేమందరం వాటిని ఎవరి భాషలోకి వాళ్ళం
అనువాదం చేసుకుని ప్రసారం చేసేవాళ్ళం. నాటి కమ్యూనిస్టు ప్రభుత్వం వారి
భావజాలాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేసుకోవడం కోసం ఈ ఏర్పాటు. అందువల్ల కొన్ని
కొరుకుడు పడని వాక్య నిర్మాణాలు, పదజాలాలు అక్కడ పనిచేసే
వాళ్లకు కాస్త ఇబ్బందికరంగా వుండేవి. ఈ నేపధ్యంలో, మాస్కోలో
నేనున్న రోజుల్లోనే మాస్కో ‘రాదుగ’ ప్రచురణ సంస్థలో పనిచేసే ఆర్వీయార్ గారు ( ఇప్పుడు
కీర్తిశేషులు) నాకు ‘అనువాద సమస్యలు’ అనే పుస్తకాన్ని కానుకగా ఇచ్చారు.
‘రారా’ గా ప్రసిద్ధులయిన రాచమల్లు రామచంద్రారెడ్డి గారు రాసిన ఈ
పుస్తకానికి సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించింది. (రెడ్డి గారు కూడా అనేక
సంవత్సరాలపాటు మాస్కోలో అనువాదకుడిగా పనిచేశారు) అనువాద సమస్యలు అన్నింటికీ ఈ
పుస్తకం పరిష్కారం చూపలేకపోవచ్చు కాని అనువాదాల పట్ల అనురక్తి వున్న ప్రతి ఒక్కరు
చదవదగ్గ పుస్తకం అని నా ఉద్దేశ్యం. అనువాదం ఎలా చేయాలో, ఎలా చేస్తే మూలానికి దూరం జరగకుండా చదువరికి అర్ధం
అయ్యేలా సుబోధకంగా అనువాదం ఎలా చేయొచ్చో తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదివి తీరాలి.
విశాలాంద్ర ప్రచురణ సంస్థలో ఈ పుస్తకం దొరికే అవకాశం వుంది.
మాస్కోలో
వారాంతపు రోజుల్లో సాయంకాలక్షేపాలు చేసేటప్పుడు, నాకూ
ఆర్వీయార్ కు నడుమ తెలుగు భాష, అనువాదాలకు చెందిన అనేక
విషయాలు దొర్లేవి.
ఆయన
అనేక కబుర్లు ఆసక్తికరంగా చెప్పేవారు.
“పరమహంస
విద్యానాధ స్వామివారు, షేక్స్పియర్ పేరుని ‘శూలపాణి’ అని
అనువదించారుట. కందుకూరి వీరేశలింగం గారి స్వీయ చరిత్రలో, డిస్ట్రిక్ట్ జడ్జ్ కి ‘ప్రాడ్వివాకుడు’ అని, మెయిన్ రోడ్ కి ‘ప్రధాన రధ్య’ అనీ, రైల్వే లైన్ కి ఇనుపదారి, అయోమార్గం
అనీ ఇలా అనువాదాలు కనిపిస్తాయి. కట్టమంచి రామలింగారెడ్డి గారు కూడా హోం వర్క్ కి ‘గైహికము’ అనీ, డిక్టేషన్ కి ‘ఉక్త
లేఖనం’ అనీ తెలుగు పదాలు
ఇచ్చారట.
అయితే, ఈ తెలుగు ప్రయోగాలకంటే, వాటి తాలూకు
అసలు ఇంగ్లీష్
పదాలే వాడుకలో ప్రాచుర్యం పొందాయి.
వాటి
అర్ధం అందరికీ తెలిసేటప్పుడు ఇక అయోమయ పదకల్పన ఎందుకన్నది ఆర్వీయార్ అభిప్రాయం.
విద్యార్ధి
కల్పతరువు అనే పుస్తకం వుంది. ఇప్పుడు దొరుకుతున్నదో లేదో తెలవదు. అందులో
ధర్మామీటర్ (తాపమానిని), కెమెరా (ఛాయాగ్రాహక
యంత్రం), టెలిగ్రాఫ్ (
తాజావార్తా యంత్రం), ఇలా అర్ధ వివరణ ఇచ్చారు.
అయితే అర్ధం అవడం ముఖ్యమా అనువాదం ముఖ్యమా అనే ప్రశ్నకు జవాబు దొరకాలి.
సర్వీస్
కమీషన్ కి తెలుగేమిటి? దాన్ని అనువాదం చేసి
అదే ప్రశ్న అడిగితే ఎవ్వరికీ ఉద్యోగాలు రావు అనేవారు రావు గారు.
పోతే, అనువాదాలకు సంబంధించి సంస్మరించుకోవాల్సిన మరో మహనీయుడు ‘కలం కూలీ’ జీ.కృష్ణ
గారు. అనువాదం చేసేటప్పుడు తెలుగులో ఆలోచించమని చెప్పేవారు. ఒక భాషలో వుండే పదాలు
ఆయా ప్రాంతాల లేదా సంస్కృతుల ప్రాతిపదికగా ఆ భాషల్లోకి చొరబడతాయి. మరో భాషలోకి
అనువదించేటప్పుడు వాటి సమానార్ధక పదాలు లభ్యం కాకపోవచ్చు. అప్పుడు ఇంగ్లీష్
తెలియని పల్లెపట్టుల్లోని ప్రజలు ఇలాటి
భావాలను వ్యక్తం చేసేటప్పుడు ఎటువంటి పదాలు వాడతారు అని కాసేపు ఆలోచిస్తే చక్కటి
సమానార్ధకాలు దొరికితీరుతాయి. కాని మన అనువాద నిపుణులకు ఆ తీరిక వుండదు. వారికి
అప్పటికప్పుడు తట్టిన పదాలను జనం మీద ప్రయోగించి అవే ప్రామాణికం పొమ్మంటారు. అందువల్లనే
అలాటి వాటి గురించి నవ్వులాటగా మాట్లాడుకునే పరిస్తితి ఎదురవుతోంది. పిల్లి అంటే
మార్జాలం అంటూ సరిపెట్టుకోమంటున్నారు.
తెలంగాణా
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ కాకతీయ గురించిన వార్త కొన్నాళ్ళ క్రితం ఒక తెలుగు పత్రికలో వచ్చింది.
మిషన్ అనే ఇంగ్లీష్ పదానికి ‘మర, యంత్రం’ అని భాష్యం చెప్పుకున్న
ఆ విలేకరి, మిషన్ కాకతీయను అనువాదం చేయబోయి ‘యంత్ర
కాకతీయ’ అని రాశాడు. అతడి
మాతృభాషాభిమానం మెచ్చదగినదే. అయితే ‘మిషన్, మెషిన్ నడుమ గందరగోళంలో ఆయన రెండో దాన్నే ఎంచుకుని యంత్ర
కాకతీయ అనే కొత్త పద ప్రయోగాన్ని తన పాఠకులపై రుద్దాడు. అతగాడి పొరబాటో, గ్రహపాటో కాని, సోషల్
మీడియా దాన్ని అందిపుచ్చుకుని చర్చోపచర్చలతో చీల్చి చెండాడింది.
ఈ
పొరబాటు ఆ వార్త పంపిన విలేకరిదా, చూసి ప్రచురించిన
సంపాదక బృందానిదా, లేదా తన పత్రికలో ఏమి
వస్తున్నదో చదివే తీరికలేని పత్రికా సంపాదకుడిదా అంటూ అనేకానేక జవాబులేని
ప్రశ్నలతో ఈ చర్చ అనంతంగా కొన్నాళ్ళు సాగింది.
సరే!
ఇదొక కధ.
అర్ధం
కానిదాన్ని గ్రీక్ అండ్ లాటిన్ అనే ఒక్క మాటతో కొట్టేయడం మనకు తెలిసిందే.
లాటిన్
భాషలో ‘ఇగ్నోటం పెర్
ఇగ్నోటియస్’ అని ఒక పద ప్రయోగం
వుంది. ఒక పట్టాన కొరుకుడు పడని ఈ లాటిన్ పదప్రయోగానికీ ఓ అర్ధం వుంది.
వివరించబోయిన విషయం కంటే వివరణ క్లిష్టంగా వుండడం అనేది దీని మూలార్ధం.
నెట్
ప్రపంచం ఆవిష్కరణ అనంతరం తెలుగు వినియోగం వేగంగా పెరుగుతోంది. ఈ నేపధ్యంలో అనువాద
సమస్యలు మరింత పెరిగే అవకాశం వుంది. వీటిని ఎదుర్కోలేక సమాధానపడితే, పుట్టతేనె వంటి తియ్యటి తెనుగు తన స్వరూపాన్నే కోల్పోయే
ప్రమాదం వుంటుంది.
కాబట్టి, రాసేది అనుసృజన అయినా అనువాదం అయినా తెలుగులో ఆలోచించి
తెలుగులో రాయాలి.
అనువాద
సమస్యలు వుండవచ్చు కాని అనువాదమే చదువరికి ఓ సమస్యగా మారకూడదు. (21-11-21)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి