29, నవంబర్ 2021, సోమవారం

హమే తుమ్సే ప్యార్ కిత్ నా...... భండారు శ్రీనివాసరావు

  నా హిందీ అంతంత మాత్రం. హిందీ సినిమాలకు వెళ్ళినప్పుడు హాల్లో అందరూ పాప్ కార్న్ తింటుంటే నేను మాత్రం మా ఆవిడ మెదడు కొరుక్కుని తింటుండేవాడిని, ఆ హీరో ఏమన్నాడు? ఆ హీరోయిన్ ఎందుకలా ఏడుస్తోంది? అని అడ్డమైన ప్రశ్నలు వేస్తూ. ఈ హిందీ ప్రస్తావన దేనికంటే... మా పెద్దవాడు సందీప్ పెళ్ళికి రాంచీ నుంచి ఆడపెళ్లి వాళ్ళు తరలివచ్చారు. రవిగారు, విజయ శ్రీనగర్ కాలనీలో తాము కొనుక్కున్న కొత్తఫ్లాటును వాళ్లకి బసగా ఇచ్చారు. శ్రీ వాస్తవ్ గారు, ఆయన భార్య ఇందూ శ్రీ వాస్తవ్ వారి సమీప బంధువులు చాలామంది వచ్చారు. 1999 నవంబరు 29 అర్ధరాత్రి సందీప్ పెళ్లి. సత్యసాయి కళ్యాణ మండపంలో. ఆ రోజుల్లో హైదరాబాదులో ఆ మండపం కాసింత ఖరీదు వ్యవహారమైనా శ్రీ వాస్తవ్ దాన్ని ముచ్చటపడి ఎంపిక చేసుకున్నారు. ఈ పెళ్ళికి అరుణ, శేఖర రెడ్డి దంపతులు మూడు రోజులపాటు తమ ఖరీదైన కారును మా అధీనంలో ఉంచారు. అమీర్ పేటలోని శైలి అపార్ట్ మెంటు నుంచి శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమం వరకు బారాత్ సాగింది. అదీ మాకు కొత్తే. సందీప్ స్నేహితులు పవన్, సుధీర్, సుధాకర్, రాజశేఖర్, కృష్ణ, శేషిరెడ్డి, కోటిరెడ్డి దారిపొడుగునా నృత్యాలు చేస్తూ మంచి ఉత్సాహం కలిగించారు. ఆరోజు ఉదయం కళ్యాణ మండపంలోనే ఉపనయనం. ఆ ఏసీ హాల్లో హోమం చేయడానికి నిబంధనలు అడ్డం వచ్చి, బయట కారిడార్లోనే ఆ కార్యక్రమం పూర్తిచేసాము. అదే ఇబ్బంది పెళ్ళికి కూడా ఎదురయింది. సాంప్రదాయ బద్ధంగా కన్యాదానం చేయాలనుకున్న శ్రీవాస్తవ్ దంపతులు లోపల రిసెప్షన్ ఏర్పాట్లు చేసుకుని బయట ఆవరణలో షామియానాలు వేయించి, కుర్చీలు తెప్పించి మరో పెళ్లి ఖర్చు మీద వేసుకున్నారు. బెజవాడ నుంచి ఈ పెళ్ళికి వచ్చిన హనుమంతరావు బావ పెళ్లి జరిగే వేదికకు దగ్గరలో కుర్చీ వేయించుకుని ఇటు దక్షిణాది పద్దతిలో, అటు ఉత్తరాది విధానంలో ఏక కాలంలో తెల్లవారుఝాము దాకా కొనసాగిన వివాహ క్రతువును ఆ సాంతం శ్రద్ధగా చూసారు. రాంచీ నుంచి వచ్చిన మహిళా పురోహితురాలు తాను చదువుతున్న ప్రతి మంత్రానికి అర్ధ తాత్పర్యాలను వివరించి చెప్పడం హనుమంతరావు బావగారిని ఆకర్షించింది. పెళ్లిని ఒక తంతులాగా ముగించడం కాకుండా ఆ క్రతువును నిష్టతో నిర్వహించడం చూసి ఆయన ఆ మహిళా పురోహితురాలిని మెచ్చుకున్నారు కూడా. అంతకుముందు రోజు అంటే నవంబరు 28 న రవి గారి అపార్ట్ మెంటు ‘డోఎన్’ లో మెహందీ కార్యక్రమం. అప్పటిదాకా ఇలాంటి తంతులు ఎరగని వాళ్ళం కనుక మెహందీలో చిన్నాపెద్దా అందరూ సరదాగా పాటలు పాడడం చూసి ఎంతో సంబరపడ్డాము. అదిగో అప్పుడు పెళ్లి కుమారుడు సందీప్ గోడనానుకుని నిలబడి, క్రీగంట పెళ్లి కుమార్తె భావనను చూస్తూ పాడిన పాటే ఇది.హమే తుమ్సే ప్యార్ కిత్ నా......” అర్ధం నాకంతగా బోధపడలేదు కాని, రాంచీ నుంచి వచ్చిన పెళ్లి వారందరూ తెగ మెచ్చుకున్నారు. ఈ పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ మర్నాడు కాక ఆ మర్నాడు (డిసెంబరు ఒకటి) బేగంపేటలోని ఎయిర్ పోర్టు దగ్గరలోని ఒక హోటల్లో జరిగిన మా రెండో అన్నయ్య రామచంద్ర రావు గారి కుమారుడు రాజేష్, ప్రియల పెళ్ళికి కూడా హాజరయి వధూవరులను ఆశీర్వదించి వెళ్ళడం భండారు కుటుంబానికి ఒక మరపురాని తీయటి జ్ఞాపకం.

డియర్ భావన, సందీప్

మీ పెళ్లి రోజున, మీ పుట్టిన రోజున, సఖి, సృష్టి పుట్టిన రోజుల్లో అమ్మ చేసే హడావిడి నాకింకా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. అమెరికా టైం ప్రకారం మీకు గ్రీటింగ్స్ చెప్పాలని చాలా ఆత్రుత పడేది. ఎందుకు వాళ్ళని అర్ధరాత్రి నిద్ర లేపి మరీ చెప్పాలా అని నేను అంటున్నా తను పట్టించుకునేది కాదు.

తన నుంచి ఇలాంటి ఆప్యాయతానురాగాలు నేను నేర్చుకునేలోగా తను దాటి వెళ్ళిపోయింది.

ఈరోజు, మీ పెళ్లి రోజు, మీ ఇద్దరికీ శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ప్రియ, రాజేష్ లకు ముందస్తు శుభాశీస్సులు.

-నాన్న

 పైన రాసిన ఆ హిందీ పాటకి గూగులమ్మ లింకు:

https://www.youtube.com/watch?v=iJllh7l-D3g




కామెంట్‌లు లేవు: