కధల్లో జీవితాలు ఉన్నట్టే జీవితాల్లో కూడా కధలు వుంటాయి. అలాంటి కధ కాని కధ ఈ జరిగిన కధ.
స్నేహం అంటేనే స్వచ్చత. దాపరికం, స్వార్ధం ఇసుమంత కూడా లేనిదే నిజమైన స్నేహం అనిపించుకుంటుంది. మిగిలినవన్నీ పరిచయాలు మాత్రమే.
ఇప్పుడు మీరు చదవబోతున్న కధనంలోని పాత్రలన్నీ నిజమైనవే. ఆ పాత్రలు పలికిన పలుకులన్నీ ఒక ప్రత్యక్ష సాక్షి నోట నేను విన్నవే.
కాకినాడ జే.ఎన్.టీ.యూ. చాలా ప్రసిద్ధి చెందిన విద్యాసంస్థ. అక్కడ విద్యాభ్యాసం చేసి జీవితాల్లో స్థిరపడిన విద్యార్ధులు ఒక సాంప్రదాయాన్ని ఎన్నో సంవత్సరాలుగా పాటిస్తూ వస్తున్నారుట. అదేమిటంటే, ఒక బ్యాచ్ లో చదువు పూర్తి చేసుకున్న విద్యార్ధులు పాతికేళ్ళ తర్వాత అదే కళాశాలలో కలుస్తారు. ఇలా ప్రతి బ్యాచ్ వాళ్ళు ప్రతియేటా అదేచోట ఇరవై అయిదు సంవత్సరాల కలుస్తూ, గడిచిన ఇన్నేళ్ళ కాలంలోని జ్ఞాపకాలను నెమరు వేసుకుని రెండు మూడు రోజులు సరదాగా గడపడం అక్కడ ఆనవాయితీగా వస్తోందని విన్నాను. ఇది నిజమైతే నిజంగా గొప్ప సంగతే.
మూడేళ్ల క్రితం నిర్వహించిన ఆత్మీయ కలయిక కార్యక్రమానికి పాతికేళ్ళ క్రితం ఆ కాలేజీలో చదువుకున్న ఓ బ్యాచ్ కి చెందిన మొత్తం 180 మందిలో 130 మంది హాజరయ్యారు. వారిలో ఇద్దరు సీనియర్ ఐ ఏ ఎస్ అధికారులు, సరిహద్దు భద్రతా దళానికి చెందిన ఒక సీనియర్ పోలీసు అధికారి వున్నారు. అమెరికా నుంచి వచ్చిన ముప్పయ్ మంది దంపతయుక్తంగా పాల్గొన్నారు. కొందరు కళాశాల రోజుల్లోనే ప్రేమలో పడి పెద్దల ఆమోదంతో పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయినవారు కూడా వున్నారు.
రెండు దశాబ్దాలకు పైగా సాగిన ఈ మధ్యంతర కాలంలో ఎవరికి వారు జీవితాల్లో వారు స్థిరపడ్డారు. కళాశాలలో కలిసి చదువుకున్న తమ సహాధ్యాయే తమకు పై అధికారిగా వచ్చిన ఉద్యోగులు కూడా కొందరు వున్నారు. ఆఫీసులో సార్ సార్ అనే మర్యాద పిలుపులు కాస్తా ఈ సమ్మేళనంలో పాత రోజుల్లోమాదిరిగా షరామామూలు అరేయ్ ఒరేయ్ కి మారిపోయాయి.
‘ఐ.ఏ.ఎస్. కాగానే మమ్మల్ని మరచిపోయావు. నేను పనిచేస్తున్న డిపార్ట్ మెంటుకి నువ్వే హెడ్డువి. ఏదో ఫ్రెండువి కదా కలవాలని వస్తే నన్ను లోపలికే పంపలేదు.’ డివిజినల్ ఇంజినీరుగా పనిచేస్తున్న ఓ వ్యక్తి అన్నాడు.
‘భలేవాడివే! విజిటర్స్ స్లిప్ మీద నీ పేరు చూసి నా పియ్యేను పంపించి మరీ పిలిపించా కదా! ఇలా నిష్టూరం ఆడితే ఎలా’ జవాబిచ్చాడు ఆ ఐ.ఏ.ఎస్.
పోలీసు అధికారి అన్నాడిలా. ‘ఈ ఉద్యోగం పుణ్యమా అని నాకు వ్యక్తిగత జీవితం అంటూ లేకుండా పోయింది. ఎప్పుడూ నీడలా స్టెన్ గన్లు పట్టుకుని సెక్యూరిటీ గార్డులు. దేశ సరిహద్దుల్లో వున్నప్పుడు ఎలాగూ తప్పదు. నేను చదువుకున్న చోటు ఇది. ఇక్కడన్నా నన్ను వదిలిపెట్టండిరా బాబూ అని బతిమిలాడుకుని వాళ్ళని మెయిన గేటు దగ్గరే వదిలి వచ్చాను’
అందరూ ఒక్క పెట్టున నవ్వారు. ఆ నవ్వులు అలా ఓ మూడు రోజుల పాటు పువ్వులు పూస్తూనే వున్నాయి. ఒకరు పెద్దా అని లేదు, ఒకరు చిన్నా అనిలేదు. అందరూ టైం కాప్స్యూల్ లో మాదిరిగా పాతికేళ్ళు వెనక్కి వెళ్ళారు. కేరింతలతో, కాలేజీ కబుర్లతో సాగిపోతున్న ఆ ధారా ప్రవాహం ఎవరో అన్న ఒక్క మాటతో ఆగిపోయింది.
‘అన్నట్టు గణేష్ ఏడీ?’
పొట్టిగా వుండే గణేష్ కూడా వారందరితో పాటే అదే కాలేజీలో చదువుకున్నాడు. చదువు పూర్తయిన తర్వాత హైదరాబాదులో చిన్నా చితకా ఉద్యోగాలు చేసి తర్వాత అమెరికా వెళ్లి సెటిల్ అయ్యాడు. పెళ్లయింది. ఒక పిల్లాడు. ఏమైందో తెలియదు ఏదో అస్వస్తతకు గురై హఠాత్తుగా కన్నుమూశాడు. అమెరికాలోనే ఉంటున్న కళాశాల సహాధ్యాయులు గణేష్ భార్యను, పిల్లల్ని పట్టుబట్టి కాకినాడ తీసుకువచ్చారు. గణేష్ లేడన్న విషయం తెలిసి స్నేహితులందరూ ఎంతో బాధ పడ్డారు.
గణేష్ కొడుకు కల్పించుకుని అన్నాడు.
‘మిమ్మల్ని అందర్నీ చూస్తుంటే మా నాన్న ఎంత అదృష్టవంతుడో అనిపిస్తోంది. ఇక్కడ అరమరికలు లేని మీ స్నేహం గమనించిన తర్వాత చనిపోయి ఎంత దురదృష్టవంతుడో అనిపిస్తోంది’
ఈ మాటలతో అందరి కళ్ళూ చెమ్మగిల్లాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి