25, నవంబర్ 2021, గురువారం

‘నా బలమా! నీ నామ బలమా!’ – భండారు శ్రీనివాసరావు

 

నాకు గంధర్వుల శాపం వుంది. అదేదో సినిమాలోలా విన్నది వెంటనే నోట్ చేసుకుంటే తప్ప ఆ తర్వాత గుర్తుండదు.

నాకు అప్పుడప్పుడు మితృలు పాశం యాదగిరి, ఆర్వీవీ కృష్ణారావు, అమెరికా నుంచి వీవీ శాస్త్రి గారు, తరచుగా మా అన్నగారు రామచంద్రరావు ఫోన్లు చేస్తుంటారు. ఆ మాటల్లో ఎన్నెన్నో పాత ముచ్చట్లు దొర్లుతుంటాయి. చాలా మంచి సంగతులు. వాళ్లకు రాయాలని తోచదు. నాకు రాయకపోతే తోచదు. కానీ చెప్పాను కదా! పాడు మతిమరపు. వెంటనే రాసుకుంటే సరి. లేకపోతె ఇంతే సంగతులు.

మొన్న రామజోగి మందు గురించి చెప్పిన కృష్ణారావు గారు రాత్రి మళ్ళీ ఫోన్ చేశారు.

ఈసారి ఇదిగో ఈ నామ బలం గురించి చెప్పారు.

ఓసారి, అంటే అప్పుడెప్పుడో దశాబ్దాల కిందట మంగళంపల్లి బాల మురళీ కృష్ణ గారు బెజవాడ వచ్చారు. యథావిధిగా ఇండియన్ మెడిసిన్ హౌస్ డి.ఎల్. నారాయణ గారింట్లో మధ్యాన్న భోజనం. ఆ సాయంత్రం కచేరీ.

నారాయణ గారికి ఆయుర్వేద వైద్యశాల వారసత్వంగా వచ్చింది. వారి హయాములో మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లింది.

భోజనాల సమయంలో కృష్ణారావు గారు బాల మురళి గారితో అన్నారు. ‘నారాయణ గారి చవులూరించే విందు, మరి వీనుల విందుగా మీ విందు మాత్రమే మిగిలింది’

ఈ మాటలు గుర్తుపెట్టుకున్నట్టుగా ఆ సాయంత్రం కచేరీలో బాల మురళి గారు ఆనంద భైరవి రాగంలో ‘ నా బలమా! నీ నామ బలమా’ అనే త్యాగరాయ విరచిత కీర్తన సుమధురంగా పాడారు. ఆయుర్వేద వైద్యంలో డి.ఎల్. నారాయణ గారి ఆనంద భైరవి అనే ఔషధం వుంది. అలాగే కృష్ణారావు గారు అడిగిన వీనుల విందు లాంటి ఆనంద భైరవి రాగం వుంది.

సరే ఇదలా ఉంచితే ..

ఒకానొక కాలంలో ఆయుర్వేద వైద్యం తెలుగునాట విలసిల్లింది. చింతలూరు వెంకటేశ్వర ఆయుర్వేద నిలయానికి ఆ రోజుల్లో వెయ్యి కోట్ల టర్నోవర్ ఉండేదని చెప్పుకునేవారు. దాదాపు ప్రతి గ్రామంలో ఆయుర్వేద వైద్యులు వుండే వాళ్ళు. మిస్సమ్మ సినిమాలో అల్లు రామలింగయ్య పాత్ర అటు స్కూలు టీచరు, ఇటు ఆయుర్వేద వైద్యం. పిల్లల చేత మందులు అరగదీయించడం గుర్తుండే వుంటుంది.

ప్రముఖ దర్శకుడు కేవీ రెడ్డి గారికి భవిష్యత్ వాణి తెలుసల్లె వుంది. ఆయుర్వేదానికి ముందు ముందు కాలం చెల్లిపోతుందన్న అనుమానం కలిగిందేమో తెలియదు. దొంగ రాముడు సినిమాలో ఒక సన్నివేశం పెట్టారు.

చిన్న నాగేశ్వర రావు తల్లికి జబ్బు చేసి ప్రాణం మీదకు వస్తే, ఆయుర్వేద వైద్యుడుగా వేసిన వంగర వెంకట సుబ్బయ్య రోగి నాడి పట్టి చూసి ఒక మందు చీటీ రాసిచ్చి పట్రంమంటాడు. చిల్లి కాణీ జేబులో లేకపోయినా చిన్న నాగేశ్వర రావు పరిగెత్తుకుంటూ ఆయుర్వేదం మందులు అమ్మే షాపుకి పరిగెడతాడు. షాపు వాడు చీటీ చూసి మందుల అలమరా తెరిచి, ఓ సీసా తీసి దానిపై వున్న దుమ్ము ఉఫ్ అని ఊది పిల్లాడి చేతికి ఇస్తాడు. అంటే ఆయుర్వేద మందులకు భవిష్యత్తులో గిరాకీ తగ్గి దుమ్ము కొట్టుకు పోతాయనే సంకేతం అందులో ఉందంటారు కృష్ణారావు గారు.

పూర్వం పాసింజర్ రైళ్ళలో ఆయుర్వేదం మందులు అమ్మేవాళ్లు. కస్తూరి మాత్రలు, సువర్ణ శూర్యావతి, పైత్యాంతక రసం, కాశీ దారాలు, ఇత్తడి పిన్నీసులు, పేల దువ్వెనలు వగైరా వగైరా. ఒక పొడవాటి కర్రకు వీటిని వేలాడగట్టి అటూ ఇటూ ఊపుతూ రైల్లో తిరిగి అమ్మేవాడు.

వెనకటి రోజుల్లో వైద్యుడు అనేవాడు ముందు నాడి పట్టి చూసేవాడు. వున్న ఊళ్ళో వైద్యం కనుక రోగుల శరీర తత్వం వాళ్లకి బాగా తెలుసు. అందుకు తగ్గ మందులు కుప్పెల్లో అరగదీసి, కల్వంలో నూరి అప్పటికప్పుడు తయారు చేసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆయుర్వేదం వంటి దేశీయ వైద్య ప్రక్రియల్లో కూడా కార్పొరేట్ శక్తులు అడుగు పెట్టడంతో ఆకర్షణీయమైన ప్యాకెట్లలో అవి కూడా ఇంగ్లీష్ అలోపతి మందుల్లాగా మార్కెట్లో విరివిగా దొరుకుతున్న మాట వాస్తవమే అయినా, అందులో భారతీయ ఆత్మ లోపిస్తోంది. రోగికీ, వైద్యుడికీ నడుమ ఉండాల్సిన సున్నితమైన అనుబంధం చెరిగిపోతోంది. నాడి పట్టి చూడకుండానే చేసే వైద్యంలో డబ్బు ఉండవచ్చు కాని, జబ్బు నయం చేసే శక్తి క్రమంగా లోపిస్తోంది.

కామెంట్‌లు లేవు: