2, నవంబర్ 2021, మంగళవారం

తవ్వి తీసిన ఓ జ్ఞాపకం – భండారు శ్రీనివాసరావు

 సీ.జీ.హెచ్.ఎస్.

కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న యాభై లక్షలమంది ఉద్యోగులకు, ముప్పై లక్షలమంది రిటైర్డ్ సిబ్బందికీ సుపరిచితమైన పదం. సిబ్బంది అనారోగ్యాలకు గురైనప్పుడు ఆదుకునేందుకు ఉద్దేశించిన సెంట్రల్ గగవర్నమెంట్ హెల్త్ స్కీమ్,(C.G.H.S.)

1975 నుంచి 2005 వరకు నేను ఆకాశవాణి, దూరదర్శన్ లలోనే ఉద్యోగం చేసాను. మధ్యలో ఓ అయిదేళ్ళు మాస్కో రేడియోలో పనిచేయడం కోసం మాస్కోలో వున్నాను. ఆ సమయంలో ఓ సారి 1989లో సెలవుమీద మాస్కోనుంచి హైదరాబాదు వచ్చినప్పుడు అనుకోకుండా మా ఆవిడను ఆస్పత్రిలో చేర్చాల్సివచ్చింది. అప్పుడే కొత్తగా మొదలయిన జూబిలీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో డాక్టర్ వెంకట్రామరెడ్డి గారు ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. ఆ రోజుల్లో మొత్తం అంతా కలిపి ముప్పై వేలు అయివుంటాయి. నేను మాస్కోలో పనిచేస్తున్నందువల్ల సీజీహెచ్ఎస్ కిందికి రానని తేల్చారు. మాస్కోలో ఆపరేషన్ చేసివుంటే మొత్తం అణాపైసలతో (రూబుళ్ళు,కోపెక్కులతో) సహా మాస్కో రేడియో భరించేది. కావున మాకు సంబంధం లేదని వాళ్లు తేల్చారు. సరే! మా ఆవిడ ఆరోగ్యం ముఖ్యం కనుకా, విదేశాల్లో ఉద్యోగం కాబట్టి ఆసుపత్రి ఖర్చు సొంతంగా పెట్టుకున్నా పెద్ద భారం కాదు కనుకా అప్పటికి ఆ అంకాన్ని అలా ముగించాము. ఆ తరువాత ఆమెకే మళ్ళీ 2009 లో మరో ఆపరేషన్. ఈసారి స్టార్ ఆసుపత్రిలో డాక్టర్ గోపీచంద్, గుండెలో వాల్వ్ మార్చి కొత్తది వేసారు. అప్పటికి నేను కేంద్ర ప్రభుత్వంలో మాజీ ఉద్యోగిని. 2005 లో దూరదర్శన్ లో పదవీ విరమణ చేసినప్పుడు సీజీహెచ్ఎస్ కార్డు రెన్యూ చేయించుకోమని వాళ్ళూ చెప్పలేదు, నేనూ చేయించుకోలేదు. ఆ విధంగా మూడు దశాబ్దాల పైచిలుకు సర్వీసులో సీజీహేచ్ఎస్ సేవలను వాడుకోగల అవకాశం నాకు ఎన్నడూ దొరకలేదు. డీడీ లో నా సీనియర్ సహోద్యోగి ఆర్వీవీ కృష్ణారావు గారు సీజీహేచ్ఎస్ కార్డు అవసరాన్ని గురించి వెంటబడి చెబితే బేగంపేట పాత ఎయిర్ పోర్ట్ పక్కన వున్న సీజీహేచ్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లాను. ప్రభుత్వ కార్యాలయాల్లో పని పడ్డప్పుడు కానీ అవి యెలా పనిచేస్తాయన్న విషయం బోధ పడదు. కొంచెం కష్టంగా, కొంచెం ఇష్టంగా పని పూర్తిచేశారు. పది రోజుల్లో వచ్చి కార్డు పట్టుకుపొమ్మన్నారు. వాళ్లు చెప్పిన తేదీకి, ఇచ్చిన సమయానికి వెడితే, ఫోటో కార్డులు తయారు చేయడానికి వొప్పుకున్న ఓ చెన్నై కంపెనీ మధ్యలోనే కాడి కిందపారేసిన కారణంగా 'కార్డు బదులు ఫోటోలు అతికించిన కాగితం ఇస్తాం తీసుకెళ్ళి లామినేట్ చేసుకొని వాడుకోండ'ని సలహా ఇచ్చారు. ఆరోజు రావాల్సిన సిబ్బంది రాలేదో, లేక అక్కడ అదే రివాజో తెలియదు కాని, ఫైలు చేతికిచ్చి పలానా రూములో పలానా అధికారి సంతకం పెట్టించుకురమ్మన్నారు. ఆయన దగ్గరకు వెడితే 'మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు వుందే' అంటూనే సంతకం పెట్టి మళ్ళీ ఫైలు నా చేతికి ఇచ్చారు. మొత్తానికి ఆ కార్యాలయంలో ఫైళ్ళ కదలికలో నేను కూడా పాలు పంచుకుని, ఇచ్చిన కాగితం పట్టుకుని, నేను సయితం సర్కారు ఆఫీసుల్లో పనులు చేసుకుని రాగలనన్న గర్వంతో బయట పడ్డాను.

కొసమెరుపు: ఇందులో ఏముంది అందరిలా మీదీ ఓ అనుభవం అంటారేమో. కానీ వుంది. బయటకు వచ్చిన తరువాత ఆ కాగితాన్ని తేరిపార చూస్తే 'VALID UPTO : 01-01-2099' అంటే అప్పటికే ఏడుపదులకు దగ్గర పడిన నేను మరో 80 ఏళ్ళకు పైగా ఈ కార్డు వాడుకోవచ్చు అన్నమాట.

ఆరోగ్య సేవల పధకం కదా! దీర్ఘాయుష్మాన్ భవ! అని దీవిస్తూ ఇచ్చివుంటారని సరిపెట్టుకున్నాను.

 

కామెంట్‌లు లేవు: