15, నవంబర్ 2021, సోమవారం

ఆదర్శమూర్తికి కాంస్య విగ్రహం

 ఆదర్శం ముందెన్నడు అవసరాన్ని చూడకు అనేవారు మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు. అలా చూడడం మొదలు పెడితే అవసరాలదే ఎప్పుడూ  పై చేయి అవుతుంది.

ఆదర్శాలకు విలువ తగ్గిపోతూ ఉండడానికి  ప్రధాన కారణం వాటిని వల్లె వేసేవారు ఎక్కువై, ఆచరించేవాళ్లు స్వల్ప సంఖ్యాకులు కావడం.

ఈ నేపధ్యంలో ఎన్నదగిన ఓ సామాన్యుడు డాక్టర్ అయితరాజు పాండురంగారావు.

ఆయన స్వగ్రామం ఖమ్మం జిల్లా వల్లభి.

హైదరాబాదులో డాక్టరీ చదివి, ఇంగ్లాండులో పై చదువులు పూర్తి చేసుకుని స్వదేశానికి తిరిగివచ్చి, అందివచ్చిన  ప్రభుత్వ ఉద్యోగానికి హైదరాబాదును కాకుండా  మారుమూల బూర్గుంపాడు ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నప్పుడు, పై అధికారులతో సహా అందరూ ఆశ్చర్యపోయారు. ఆ విధంగా ‘తానమ్మిన సత్యాన్నే బోధించిన ధీశాలి, బోధించిన సత్యాన్నే పాటించిన వ్రతశీలి’ అనిపించుకున్నాడు.

ఉద్యోగపర్వంలో బూర్గుంపాడు, భద్రాచలం, హైదరాబాదు ఇలాగే రోజులు గడిచిపోయాయి. ఒక ప్రభుత్వ డాక్టరుగానే జీవితం గడిపివుంటే ఆయన్ని గురించి రాయాల్సిన అవసరం, తలచుకోవాల్సిన సందర్భం ఉండేదే కాదు. వైద్య విద్యార్ధిగా తొలిపాఠం నేర్చుకున్నప్పుడే డాక్టర్లకు నేర్పే మరో నీతిపాఠాన్ని ఆయన ఒంటపట్టించుకున్నాడు. జీవితాంతం దాన్నే పాటిస్తూ వచ్చాడు.

‘రోగికి అవసరం లేని వైద్యం చేయకూడదు, చేసిన వైద్యానికి డబ్బు తీసుకోకూడదు’ అన్నది ఆ పాఠం.

108, 104 అంటే ఏమిటో ఈరోజు తెలుగు రాష్ట్రాలలో యావన్మందికీ తెలుసు. వాటి రూపశిల్పి ఈ డాక్టరు గారే. హైదరాబాదులో ఉంటున్నా, నెలలో చాలా రోజులు వాళ్ళ సొంతూరు వల్లభిలో గడిపిన ‘శ్రీమంతుడు’ డాక్టర్ అయితరాజు పాండురంగారావు. దూర ప్రాంతాలకు వెళ్లి వైద్యం చేయించుకోలేని గ్రామ ప్రజలకోసం పుష్కరకాలానికి పైగా సొంత ఊరిలో టెలి మెడిసిన్ సదుపాయాన్ని కల్పించి ఎంతో మంది బడుగు బలహీన వర్గాలకు సాయపడ్డాడు. ఇప్పటికీ అది కొనసాగుతోంది.

ఆ డాక్టర్ చనిపోయిన తర్వాత కూడా ఆ ఊరి ప్రజలు ఆయన్ని తమ గుండెల్లో పెట్టుకున్నారు. డాక్టర్ రంగారావు జీవించి వున్న కాలంలో ఆవిష్కరించిన మహాకవి కాళోజి విగ్రహం సరసనే డాక్టర్ రంగారావు  కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు.

నిన్న ఆదివారంనాడు  రంగారావు విగ్రహావిష్కరణ ఆయన ఆశయాలకు తగ్గట్టుగానే ఆ వూరి ప్రజలు నిరాడంబరంగా నిర్వహించారు.

తెలంగాణా ముఖ్యమంత్రి ప్రధాన పౌర సంబంధాల అధికారి వనం జ్వాలా నరసింహారావు విగ్రహాన్ని ఆవిష్కరించి వైద్య రంగంలో డాక్టర్ రంగారావు సేవలను సోదాహరణంగా వివరించారు. సికిందరాబాదు గాంధీ హాస్పిటల్ మాజీ సూపర్ ఇన్ టెండెంట్ డాక్టర్ నాగభూషణం అధ్యక్షత వహించారు. గతంలో ప్రాజక్టు సీఈ ఓ గా పనిచేసిన డాక్టర్ బాలాజీ ఊట్ల, డాక్టర్ రంగారావుతో సన్నిహితంగా పనిచేసిన డాక్టర్ గోపాల్, శశి కుమార్ వంటి అనేకమంది హైదరాబాదు నుంచి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.   

ఖమ్మం జిల్లాలో కడగొట్టు గ్రామం అయిన ఆ పల్లెలోని బడుగు బలహీన వర్గాల నుంచి దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో  అత్యున్నత చదువులు  అభ్యసించి జీవితంలో బాగా  ఎదిగివచ్చిన  నలుగురు యువకులను ఈ సందర్భంగా సత్కరించిన నిర్వాహకులు అభినందనీయులు.

అలాగే సభకు వచ్చిన గ్రామస్తులు అందరూ ‘నేను కరోనా టీకా తీసుకున్నాను అని రాసి వున్న బాడ్జ్ ధరించడం ఓ విశేషం.




(14-11-2021)

 

 

కామెంట్‌లు లేవు: