9, నవంబర్ 2021, మంగళవారం

ఒక రోగి వైరాగ్యం - భండారు శ్రీనివాసరావు

 

ఎక్కడ చూసినా, ఎటు చూసినా ఈసురోమంటూ రోగులు. చెరగని చిరునగవులతో వారి మధ్యలో తిరుగుతుండే నర్సులు, గంజాయి పొలంలో తులసి మొక్కల్లా.
నీరవ నిశ్శబ్దం. వెలుతురూ, చీకటీ కాని మధ్యస్తపు వెలుతురులో ప్రాణం కొట్టుకుంటున్నట్టుగా ఒంటికి తగిలించిన మిషన్లు చేసే చప్పుళ్ళు, యముని మహిషపు మెడ గంటల ధ్వనుల మాదిరిగా.
డబ్బులు వద్దు, తిని హరాయించుకోలేని సిరి సంపదలు అసలే వద్దు, నా ముద్ద అన్నం నేను తినే ఆరోగ్యం ఇవ్వు చాలు దేవుడా!
లోకంలోని రోగాలన్నీ ఆసుపత్రుల్లోనే కొలువు తీరినట్టున్నాయి. ఈ రోగాలూ, ఈ ఆసుపత్రులూ అమాంతం ఈ లోకంనుంచి మాయమయిపోతే యెంత బాగుంటుందో కదా!
కన్నుకింత, పన్నుకింత, గుండెకింత, నడవని కాలుకింత, మడవని కీలుకింత. బొమికగా మారని ఎముకకింత, ఒంట్లో పారే నెత్తురుకింత. అన్నింటికీ లక్షల్లో రేట్లు. ఖరీదు కట్టని అవయవం అంటూ ఈ దేహంలో ఒక్కటయినా ఉందా?
ఒక్క రూపాయి కూడా మారు అడగకుండా, అమ్మ కడుపులో వుండగానే మనిషికి అన్నీ అమర్చి, ఈ భూమ్మీద పడేసిన అద్భుత శక్తికి యెంత ఇస్తే ఆ రుణం తీరాలి?


1 కామెంట్‌:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

వైరాగ్యం సబబే కానీండి // “చెరగని చిరునగవులతో వారి మధ్యలో తిరుగుతుండే నర్సులు,” // అన్నటువంటిది ఎక్కడా కనబడదు. తుమ్మల్లో పొద్దు గుంకినట్లు మొహం పెట్టుకుని తిరుగుతుంటారు. ప్రభుత్వాస్పత్రుల్లో నర్సులకు ప్రభుత్వోద్యోగం అనే నిర్లక్ష్యం, ప్రైవేటాస్పత్రుల్లో నర్సులకు కార్పొరేట్ పొగరు. చిరునగవుల నర్సులను సినిమాల్లోనే చూడడం.