మూడేళ్ళ క్రితం కిరణ్ కుమార్ రెడ్డి
ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆనాటి పరిస్థితుల్లో ఏడాది
కొనసాగడం కూడా అబ్బురమే అనుకున్నారు. అయితే అటు పరుగులు చేయకుండా ఇటు అవుట్
కాకుండా (NO RUNS – NOT OUT)
క్రీజులో వుండిపోయే క్రికెట్ ఆటగాని మాదిరిగా మొత్తం మీద ఆయన మూడేళ్ళు బండి లాగించేశారు.
(మూడేళ్ళక్రితం ఇదే రోజున ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి)
రోశయ్యగారి తరువాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు
స్వీకరించినప్పుడు, మంత్రుల శాఖల్లో సీనియర్లను కూడా పక్కనబెట్టి మార్పులు చేసిన
విధానం గమనించిన వారికి కొత్త ముఖ్యమంత్రి ‘మొనగాడేమో’ అన్న అభిప్రాయం కలిగింది.
కానీ, అది కరిగి కనుమరుగై పోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు.
ఏ రాజకీయ నాయకుడికయినా ముఖ్యమంత్రి పదవి అనేది ఓ
కమ్మటి కల. ఏళ్ళూ పూళ్ళూ ఎదురుచూస్తూ
కూర్చున్నా ఆ కల సాకారం కావడం అంత సులభం కాదు. ప్రత్యేకించి ఈ పరిస్తితి కాంగ్రెస్ పార్టీలో
మరింత ఎక్కువ. ఢిల్లీలో కొలువుతీరివుండే ఎంతోమంది అధిష్టాన దేవతలను ప్రసన్నం
చేసుకుంటే కాని నెరవేరని కల. అందుకే ముఖ్యమంత్రిగా కిరణ్ పేరు వెల్లడయినప్పుడు
రకరకాల వదంతులు వెలుగులోకి వచ్చాయి. సోనియా గాంధీ, సీఎం మార్పు విషయం గురించి ఆలోచన చేసినప్పుడు
ఆమె మనస్సులో మెదిలిన పేరు, అంతకుముందు స్పీకర్ గా పనిచేసిన కే. ఆర్. సురేష్ రెడ్డి. ఆయన ఎన్నికల్లో వోడిపోయిన సంగతి ఆ క్షణంలో గుర్తుకురాక,
‘స్పీకర్ రెడ్డి’ అనడంతో అప్పుడు స్పీకర్
గా వున్న కిరణ్ కుమార్ రెడ్డి పేరును అధిష్టాన దేవతలు ఖరారు చేసారని సూతుడు
శౌనకాది మునులకు చెప్పినట్టు ఓ కధ ప్రచారంలోకి
వచ్చింది కూడా.
ఇలాటి నేపధ్యంలో – ఒక్కసారి కూడా మంత్రిగా ప్రమాణస్వీకారం
చేసిన అనుభవం కూడా లేని కిరణ్ కుమార్ రెడ్డిచేత ఏకంగా ముఖ్యమంత్రిగా ప్రమాణం
చేయించడం కాంగ్రెస్ వర్గాల్లో అత్యంత చర్చనీయాంశం అయింది. స్పీకర్ హోదానుంచి నేరుగా ముఖ్యమంత్రి పదవికి
ఎగబాకిన కిరణ్ కుమార్ రెడ్డి అదృష్టాన్ని ఆహ్వానించిన
వారికంటే కన్ను కుట్టిన వారి సంఖ్యే సొంత పార్టీలో ఎక్కువగా వుండడం కాంగ్రెస్
సంస్కృతి తెలిసిన వారికి ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. సరిగ్గా అదే జరిగింది.
రోశయ్య గారిని మార్చడం అంటూ జరిగితే ఆ వరమాల తమ మెడలోనే పడేట్టుగా లోపాయికారి
ప్రయత్నాలు సాగించిన సీనియర్ మంత్రులకు ఈ పరిణామం సహజంగానే మింగుడు పడలేదు.
కాబట్టే మొదటి ముద్దలోనే ఈగ పడిందన్న చందంగా తొలినాళ్ళలో ఆయనకు సొంత మంత్రులనుంచే
సహకారం అందకుండా పోయింది. పరిపాలన మీద పట్టు చిక్కించుకోవడం మాట అటుంచి మంత్రివర్గ
సమావేశం ఏర్పాటు చేసుకోవడమే గగనమైపోతోందన్న మాటలు వినబడ్డాయి. ఒకపక్క రాష్ట్ర
విభజన ఉద్యమం, మరోపక్క కొత్తగా పుట్టుకొచ్చిన జగన్ పార్టీ విసురుతున్న సవాళ్లు - కొత్త
ముఖ్యమంత్రికి కంటిమీద కునుకు లేకుండా చేసాయి. దానికి తోడు పీసీసీ అధ్యక్షుడిగా
బొత్స సత్యనారాయణ నియామకంతో కిరణ్ పాలనకు రోజులు మూడాయన్న ప్రచారం కాంగ్రెస్
వర్గాల్లోనే బాగా సాగింది. కాంగ్రెస్ నుంచి కొత్త పార్టీలోకి వలసలను
అరికట్టలేకపోతున్నారన్న అపప్రధ ఓ పక్క.
మరోపక్క ఉపఎన్నికల్లో పాలకపక్షం పరాజయ పరంపర. సొంత గొడవలే తప్ప ప్రజలగోడును
ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఇంకో పక్క. ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాత్రికి రాత్రే మాజీ ముఖ్యమంత్రి కావడానికి ఇవి చాలు. కానీ,
కిరణ్ అదృష్టం ఏమిటో గాని అధిష్టానం ఇవేవీ పట్టించుకున్న దాఖలాలు లేవు. అందుకే మొదటి
ఏడాది కాలం ఇట్టే గడిచిపోయింది. రెండో ఏడాది ఇవన్నీ మరింత ముదిరి పాకాన పడ్డాయి.
అయినా ఆయన కుర్చీ కిందకు నీళ్ళు రాకపోవడం చూసి కాంగ్రెస్ పార్తీవాళ్ళే
ఆశ్చర్యపోవడం మొదలెట్టారు. చూస్తుండగానే మూడో ఏడు. ఈలోగా పాలన మీద పెద్దగా
కాకపోయినా ఓ మోస్తరుగానయినా ముఖ్యమంత్రికి పట్టుకుదిరింది. ఆయన్ని మార్చరేమో అన్న అనుమానం మొదలు కాగానే ముందు
మొరాయించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులందరూ ఎందుకయినా మంచిది అన్న ధోరణిలో సర్దుకుపోవడం
మొదలెట్టారు. అంతకు ముందు ప్రైవేటు సంభాషణల్లో ‘కిరణ్’ అంటూ తేలిగ్గా మాట్లాడిన వాళ్లందరూ ‘గౌరవనీయులయిన ముఖ్యమంత్రి
గారు, పూజ్యులయిన ముఖ్యమంత్రి కిరణ్
కుమార్ రెడ్డి గారు’ అని ముందూ వెనుకా గౌరవ వాచకాలు తగిలించి మరీ మాట్లాడడం
గమనిస్తే క్రమేపీ పార్టీపై ఆయన పట్టు బిగిస్తున్న సంగతి బోధపడుతుంది. దీనికి తోడు ఆయనొక
‘సీతయ్య- ఎవ్వరి మాటా వినడు’ అనే పద్ధతిలో సాగిన ప్రచారం కూడా కిరణ్ కుమార్
రెడ్డికి కొంత కలిసివచ్చింది.
వాస్తవానికి ముఖ్యమంత్రిగా కిరణ్ సాధించిన ఘన కార్యాలు ఏవీ
లేవు. ఏవో కొన్ని కొత్త పధకాలకు రూపకల్పన చేసి అమలుచేస్తున్నా, వాటిలో కొన్నింటికి ‘తన పేరు’ పెట్టుకోవడం అన్న సంగతి పక్కన పెడితే, వాటిపై తనదైన ముద్ర వేసుకోవడంలో కానీ, వాటికి తగిన ప్రాచుర్యం కల్పించుకునే విషయంలో కానీ,
గతంలో చంద్రబాబు, రాజశేఖర రెడ్డి చూపించినట్టుగా కిరణ్ కుమార్ రెడ్డి అంతగా ఆసక్తి ప్రదర్శించకపోవడం కూడా ముఖ్యమంత్రిగా ఆయన
వైఫల్యాల జాబితాలో చేరిపోయింది. ఎన్నికల్లో పార్టీని గెలిపించి మరోసారి
అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యత అంటూ లేకపోవడం వల్లనే ఆయన ఇలా నిరాసక్తంగా
వ్యవహరిస్తున్నారన్న నింద కూడా వుంది.
సాఫల్య వైఫల్యాలు యెలా వుంటేనేం, ముఖ్యమంత్రిగా మూడేళ్ళు పూర్తిచేసిన రికార్డు
ఆయన ఖాతాలో చేరిపోయింది. 1975 నుంచి తీసుకుంటే ‘ఎమర్జెన్సీ’ కాలపు ముఖ్యమంత్రి
జలగం వెంగళరావు, ‘వాజ్ పేయీ నీడన చంద్రబాబు, అధిష్టానం చల్లని చూపుల్లో రాజశేఖర
రెడ్డిని మినహాయిస్తే, ఇటీవలి కాలంలో కిరణ్ కుమార్ రెడ్డిదే అరుదయిన రికార్డ్. కాంగ్రెస్ పార్టీలో ఉద్దండ నాయకులు
మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయ భాస్కర రెడ్డి, నేదురుమల్లి జనార్ధన రెడ్డి వీరెవ్వరికీ
ఈ రికార్డ్ లేదు. వీరిలో రెండు మార్లు ఈ పదవి పొందిన వారు వున్నారు కానీ ఏకబిగిన
మూడేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేయలేదు.
ఇక కిరణ్ కుమార్ రెడ్డి గురించి చెప్పుకోవాల్సిన
ఆసక్తికరమైన అంశం ఒకటుంది. ఆయన ముఖ్యమంత్రి అయిన తొలిరోజుల్లో తెలంగాణా అంశం
ఆయన్ని బాగా ఇబ్బంది పెట్టింది. బలహీనుడయిన ముఖ్యమంత్రిగా ముద్ర వేసింది. విచిత్రం
ఏమిటంటే మళ్ళీ తెలంగాణా అంశమే కిరణ్ కుమార్ రెడ్డిని అత్యంత శక్తిమంతుడిని చేసింది. ఈ విషయంలో ఆయన
అధిష్టానాన్ని దిక్కరిస్తున్న తీరు ‘కొందరి దృష్టిలో’ అయినా ఆయన్ని ‘మొనగాడి’ని
చేసింది.
నిజానికిది ఒక ‘రాజకీయ విచిత్రం’ (25-11-2013)