4, మే 2017, గురువారం

ప్రభుత్వాలూ! ఆలోచించండి!


రైతుది ఒక విచిత్ర పరిస్తితి.
పండిన ఏడు ధర వుండదు. ఎండిన ఏడు ధర మాటే వుండదు. పంట పండినా, ఎండినా పండించే రైతు డొక్క నిండదు.
ఒకడు ఒక సినిమా తీస్తాడు, ఆడుతుంది. డబ్బులు కురుస్తాయి. అది చూసి మరొకడు అదే తరహా ఫిలిం తీస్తాడు. డబ్బాలు తిరిగొస్తాయి. కాస్త పలుకుబడి వుంటే వినోదపు పన్ను రద్దు రూపంలో సర్కార్లు ఆదుకుంటాయి. ప్రభుత్వాలకు రావాల్సిన మొత్తం వాళ్ళ ఖాతాల్లో జమవుతుంది.
అదే నిరుడు మంచి ధర వుందని అదే పంట వేసిన రైతుకు ధరలు లేక కన్నీరే మిగులుతుంది. కన్న పేగుతీపిని కూడా లక్ష్యపెట్టకుండా ఆరుగాలం కష్టించి పండించిన పంటనే కడుపుమండి తగలబెట్టుకుంటాడు. ఒడ్డున కూర్చుని తమాషా చూసే వాళ్ళు అలా చేయడం తగదంటారు. రైతును ఆదుకోవడంలో తమను మించినవాళ్లు లేరంటూ జబ్బలు విరుచుకుంటూ ప్రకటనలు చేస్తారు. వీలుంటే ప్రజలు కట్టిన పన్నుల నుంచి కొంత మొత్తం విదిలించి చేతులు దులుపుకుంటారు.       
ఇంతేనా! చేయాల్సింది ఇంకేమీ లేదా! ప్రతి ఏడు ఇదే తంతయితే కొన్నాళ్ళకు పాలకుల పట్ల ప్రజలకు  విశ్వాసం పోదా!
రెండు తెలుగు రాష్ట్రాల వ్యవసాయ  మార్కెట్లలో మిర్చికి ధరలేదు. మరి పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో అంత ధర ఎందుకు వుంది. ఆ రాష్ట్రం మన దేశంలో ఉందా! పరాయి గడ్డపై ఉందా!
మిర్చికి ధర లేదు సరే! మరి వినియోగదారుడు షాపుల్లో కొనుక్కునే కారం ధర ఎందుకలా మండిపోతోంది! దీనికి జవాబు వుండదు.
పండించిన రైతుకు, దాన్ని వినియోగించే పౌరుడికీ దక్కని ‘ప్రయోజనం’ ఎవరికి దక్కుతోంది. జవాబు చెప్పడం కష్టమేమీ కాదు, దళారీలకు, వ్యాపారులకు. మరి అంతంత లాభాలు గడించేవారి నుంచి, ఇప్పటికే వసూలు చేస్తున్న పన్నులకు అదనంగా  ఎంతో కొంత మొత్తం ‘సెస్సు’ రూపంలో వసూలు చేసి, దానితో ఒక శ్రేయోనిధిని ఏర్పాటు చేసి, సరయిన ధర దొరకని రోజుల్లో రైతులను ఆదుకునే ప్రయత్నం చేయవచ్చు కదా!      

ప్రభుత్వాలూ! ఆలోచించండి!

తల్లులు మారరు


అరవై ఏళ్ళ క్రితం.
ఇంటి పెరట్లో చింతచెట్టు కింద నిలబడి చూపు సాగినంత మేర నిలబడి చూస్తుండేది మా అమ్మ. సెలవులకు వచ్చి తిరిగి వెళ్ళే నా వైపే ఆమె చూపు. వెనక్కి తిరిగి చూస్తానేమో అని ఆమె ఆరాటం. నేను వెళ్ళే కాలిబాట మలుపు తిరిగేవరకు ఆమె చూపు నా మీదే. మరోసారి నేను వచ్చేవరకు నా రూపు తన కళ్ళల్లో దాచుకోవాలనే  కోరిక కాబోలు.

మళ్ళీ ఇన్నేళ్ళకు అదే దృశ్యం మరో రూపంలో పునరావృతం. విదేశంలో ఉన్న మా పెద్దవాడు హైదరాబాదు వచ్చి కొన్ని రోజులు మాతో గడిపి తిరిగి వెడుతుంటే మా ఆవిడ కళ్ళల్లో అదే నీటి పొర. కిందకి వెళ్లి కారు ఎక్కించేవరకు కళ్ళార్పకుండా అవే చూపులు, రెప్ప వాలిస్తే కంటికి కనబడుతున్నది కనబడదేమో అన్న భయం కాబోలు.




3, మే 2017, బుధవారం

రోములో వున్నప్పుడు .....


రోమన్ లా వుండాలని సామెత. మన వాళ్లకు ఈ సామెత పిచ్చపిచ్చగా నచ్చేసినట్టు వుంది. అంచేత వాళ్ళు ఏదేశం వెడితే ఆ దేశపు అలవాట్లు తుచ తప్పకుండా పాటిస్తుంటారు.
రెండు రోజుల క్రితం అమెరికా నుంచి వచ్చిన మా పెద్దవాడితో కలిసి ఓ పెద్ద మాల్  కి వెళ్ళాము. పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులే  ఆ మాల్స్ కి మహారాజ పోషకులుగా అనిపించారు. బిల్లు చెల్లించే కౌంటర్ దగ్గర బాగా రద్దీగా వుంది. క్యూ పద్దతి పెద్దగా పట్టించుకున్న దాఖలా లేదు.
అది చూసి మావాడు చెప్పాడు.

“అమెరికాలో బయలుదేరినప్పుడు తోటి ప్రయాణీకులు, మినహాయింపు లేకుండా ప్రతి ఒక్కరూ క్యూ పద్దతి పాటించారు. ఒకరినొకరు తోసుకోకుండా, తాకకుండా చాలా మర్యాదగా వ్యవహరించారు. దుబాయ్  లో దిగిన తర్వాత కాస్త మార్పు కనిపించింది. క్యూ వున్నా ‘కాస్త తప్పుకోండి’ అనే రుబాబు బాబులు ఎక్కువయ్యారు. ఇక హైదరాబాదులో దిగగానే లగేజ్ కలక్షన్ దగ్గర అసలు రంగు బయట పడింది. ఎవరికి వారు హడావిడిగా పక్కవారిని తోసుకుంటూ సూటుకేసులు లాగేసుకుంటున్న ధోరణి చూస్తే, అమెరికాలో విమానం ఎక్కిన వాళ్ళు వీళ్ళేనా అనిపించింది” 

2, మే 2017, మంగళవారం

పీ ఎల్ 480 – ఓ పాత జ్ఞాపకం

అరవైయేళ్ళ క్రితం వార్తాపత్రికలు చదివే అలవాటు ఉన్న వారికి పీ ఎల్ 480 అనే పదంతో పరిచయం వుండేవుంటుంది. Public Law 480 అనే ఈ పధకం అమెరికన్ ప్రభుత్వానికి సంబంధించింది. 1954లో అప్పటి ప్రెసిడెంట్ ఐసెన్ హోవర్ హయాములో ఈ చట్టం అమల్లోకి వచ్చింది. వ్యవసాయ, వాణిజ్య అభివృద్ధి కోసం ఉద్దేశించిన ఈ పధకానికి 1961లో ప్రెసిడెంట్ జే.ఎఫ్. కెనెడీ, శాంతికోసం ఆహారం (Food for Peace) అనే కొత్త పేరు పెట్టారు.

ఆ రోజుల్లో అమెరికా నుంచి ఈ పధకం కింద దిగుమతి చేసుకున్న గోధుమలు, పాలపొడిని ఉచితంగా స్కూలు పిల్లలకు, గ్రామీణ పేదలకు పంపిణీ చేసేవారు. వీటిని కొందరు దళారీలు నల్ల బజారుకు తరలించి లక్షలు అక్రమంగా సంపాదించారు. కొందరు ఆ డబ్బుతో రాజకీయ రంగప్రవేశం చేసి అంచలంచెలుగా పైకి ఎదిగారు.
అమెరికా సదుద్దేశ్యంతో మొదలు పెట్టిన ఈ పధకం వల్ల నిజమైన లబ్ధిదారులకు ఏం ప్రయోజనం జరిగిందో లెక్కలు లేవు కాని, లాభం పొందాలని ప్రయత్నించినవారికి మాత్రం ఏమాత్రం నష్టం జరగలేదు.

ఆ రోజుల్లో మరో విషయం వింతగా చెప్పుకునేవారు. అమెరికాలో ధాన్యం దిగుబడి ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిన సందర్భాలలో ధరలు పడిపోయి రైతులు నష్టపోకుండా,  గోధుమలను ఓడల్లో నింపి నడిసముద్రంలో పారబోసేవారని, ఇంకా మిగులు వుంటే ఇలా ఇటువంటి పధకాలతో పేద దేశాలకు సరఫరా చేసేవారని వార్తలు ప్రచారంలో ఉండేవి.      

30, ఏప్రిల్ 2017, ఆదివారం

ఇదేమిటబ్బా!


“ఎక్కడెక్కడి విషయాలు, ఎప్పటెప్పటివో సంగతులు రాస్తుంటారు, ఏం జ్ఞాపకశక్తండీ మీది” అంటుంటారు స్నేహితులు చాలామంది.
కానీ అందరికీ తెలియని విషయం ఏమిటంటే నాకు ఏదీ బొత్తిగా గుర్తుండదని.
“నేను రెండు మూడు ప్రశ్నలు అడుగుతాను, ఒకటి రెండింటికి సరయిన  జవాబులు చెబితే బాహుబలి సినిమాకు తీసుకు వెళ్ళమని నేను అడగను” అంటుంది మా ఆవిడ.
“కొస్చెన్ నెంబర్ వన్. రాత్రి మీరు భోజనంలో బాగుందని మెచ్చుకుంటూ తిన్న కూరేది? నెంబరు టూ ప్రశ్న. నిన్న మీరు బయటకు వెళ్ళేటప్పుడు వేసుకువెళ్ళిన చొక్కా కలరేమిటి? చెప్పగలరా! చెప్పలేరు. మీ మొహం చూస్తేనే తెలుస్తోంది, చెప్పలేరని. అయ్యొ సంబడం. జ్ఞాపక శక్తి అట, ఈయన్ని మించిన వాళ్ళు లేరట! మళ్ళీ అనకండి, విన్న జనం మొహాన్నే నవ్విపోతారు”

“అది సరే! ఇందాక అనగా వాకింగుకు పోతూ వేడి వేడి కాఫీ కలిపి పక్కన పెట్టి వెళ్లాను. వెడుతూ చెప్పాను కూడా, ఎప్పుడూ ఆ కంప్యూటరులో తల పెట్టి టిక్కూ టిక్కూ నొక్కడం కాదు, అప్పుడప్పుడూ బయట ప్రపంచంలో ఏం జరుగుతోంది గమనిస్తూ వుండాలని. కాఫీ వేడిగా వుంది, తాగమని చెప్పానా! చూడండి, చప్పగా చల్లారి పోయింది. ఇంతోసిదానికి అబ్బో వాళ్ళు మెచ్చుకున్నారు, వీళ్ళు మెచ్చుకున్నారంటూ ముసి ముసి నవ్వులు. మళ్ళీ కలుపుకు వస్తాను, ఈ సారయినా వేడిగా తాగండి”

28, ఏప్రిల్ 2017, శుక్రవారం

ఇదో తుత్తి.....

1975 నుంచి 2017 వరకు. అంటే నలభయ్ మూడేళ్ళు.


గుర్తింపు పొందిన మీడియా సంష్టలలో పనిచేసే జర్నలిష్టులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు (ACCREDITATION CARDS) ఇవ్వడం అనేది 1975 సంవత్సరానికి పూర్వం కూడా అమల్లో వున్న విధానమే.
నేను రేడియోలో చేరింది 1975 నవంబరు  14 వ తేదీన. ఆ ఏడాది జర్నలిస్టులకి  ఇచ్చిన గుర్తింపు కార్డుల  గడువు మరో నెలన్నర రోజుల్లో ముగిసే సమయంలో అన్నమాట. ఆ కొద్ది వ్యవదానానికి ఈ గుర్తింపు కార్డు తెచ్చుకోవడం ఎంత గగనమో ఈ నాటి జర్నలిస్టులకు తెలిసిందే. అయితే  ఆనాడు ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగంలో న్యూస్ ఎడిటర్  గా పనిచేస్తున్న పన్యాల రంగనాధ రావు తరహానే వేరు.    
నేను రాసుకున్న ‘రేడియో రోజులు’ అనుభవాల్లో ఆయన్ని గురించి రాసుకున్నది గుర్తు చేసుకోవడం అప్రస్తుతం కాబోదు.
“హైదరాబాద్ లో రేడియోలో చేరిన కొత్తల్లో ఒక రోజు ఉదయం ఆఫీసుకు వెళ్లేసరికి రంగనాధరావు గారు ఏదో పనిచేసుకుంటూ కనిపించారు. ‘ఏం పని మీద వచ్చావ’న్నట్టు నా వైపు చూసారు. నా  మొహంలో రంగులు మారడం చూసి,ఇక్కడ మీకు పనేమిటి? మీరు రిపోర్టర్. బయట తిరిగితే కదా నాలుగు వార్తలు తెలిసేది?  రోజూ సెక్రెటేరియట్ కు వెళ్ళండి. మంత్రులో, అధికారులో  చెప్పేది వినండి. నాలుగు ముక్కలు ముక్కున పెట్టుకు వచ్చి, తెచ్చి నా మొహాన కొట్టండి. అంతే! సింపుల్అని తేల్చేసారు. అలా అంటూనే, “ఇంతకీ ఆఫీసుకు ఎలా వచ్చారు?” అని మరో అర్ధం కాని ప్రశ్న సంధించారు. ఆటోలో వచ్చుంటారు. అవునా! అలా అయితే మీ జీతం డబ్బులన్నీ ఈ రిపోర్టర్ తిరుగుళ్ల కోసం ఆటోలకే తగలెయ్యాల్సి వుంటుంది. వార్తల సంగతి తరవాత. ముందు నేనో ఉత్తరం ఇస్తాను. దాన్ని తీసుకువెళ్ళి సమాచార శాఖలో ఇవ్వండి. అక్కడ అక్రిడేషన్ కార్డు తీసుకుని ఆర్టీసీ ఆఫీసుకు వెళ్ళండి. వాళ్ళు ఇచ్చే బస్ పాసు తీసుకున్న తరవాతే, మిగిలిన ఏ పనులయినా!  తెలిసిందాఅన్నారు. తెలియకపోవడానికి ఏముంది. కానీ ఇలాటి పైఅధికారులు కూడా వుంటారా అన్నదే అంతవరకూ తెలియని విషయం.”
అలా ఒక్క రోజులో తెచ్చుకున్న ‘అక్రిడిటేషన్’ నా విషయంలో ఇన్నేళ్ళుగా కొనసాగుతూనే వస్తోంది. (నేను మాస్కోలో వున్న కాలానికి కూడా) బహుశా నాకంటే సీనియర్లు కొంతమంది ఉండివుండవచ్చేనేమో కానీ  ఒకే ఊరిలో (హైదరాబాదు) ఒకే ఒక సంస్థ తరపున వరసగా అన్నేళ్ళు ఆ ‘గుర్తింపు’ వున్నది నేను ఒక్కడినే అని గట్టిగా చెప్పగలను.
ఈ ఏడాది ఈ కార్డు రావడం కొంచెం ఆలస్యం అయింది. సమాచార కమీషనర్ నవీన్ మిట్టల్  కు ఒక ఎస్సెమ్మెస్ పెట్టాను. వారం తిరక్క ముందే కార్డు చేతికి వచ్చింది. అంతే కాదు, జర్నలిష్టుల హెల్త్  స్కీము అర్హుల జాబితాలో నాకు నేనుగా చేరడానికి వీలుగా “USER NAME, PASSWORD” వెనువెంటనే ఎస్సెమ్మెస్ పంపారు.
తెలంగాణా ప్రభుత్వానికి, సమాచార శాఖ అధికారులకు, తెలంగాణా ప్రెస్ అకాడమీకి, వయోధిక పాత్రికేయ సంఘానికి  నా కృతజ్ఞతలు.
INDEPENDENT JOURNALIST కేటగిరీలో ఇచ్చిన ఈ కార్డు గౌరవాన్ని కాపాడడానికి నేను కష్టపడాల్సి వుంటుంది. పడతాను కూడా.  


27, ఏప్రిల్ 2017, గురువారం

మారింది రోజులా! మనుషులా!!


తన రంగంలో క్రమంగా నిలదొక్కుకుని, జీవితంలో ఒక స్థాయికి ఎదిగిన ఒక కళాకారుడిని ఇంటర్వ్యూ చేస్తూ అడిగాడు విలేకరి.
“జీవితంలో అనేక ఎత్తుపల్లాలు చూసారు. లేని రోజులకు, ఉన్న రోజులకు తేడా ఏమైనా కనిపిస్తోందా’ అని.
“హస్తిమశకాంతరం’ జవాబు వచ్చింది వెంటనే.
“లేని రోజుల్లో లేనిడబ్బు ఒక్కటే సమస్య. ఇప్పుడో డబ్బు తప్ప అన్నీ సమస్యలే”
“అదెలా?”
“ఆ రోజుల్లో డబ్బు లేకపోయినా మనుషుల నడుమ ఆప్యాయతలు, అనురాగాలు ఉండేవి. స్నేహితుల సంగతి చెప్పక్కర లేదు. ఎవరు ఎవరి మీద పడి  తింటున్నాడో ఎవరికీ పట్టేది కాదు. ఇప్పుడలా కాదు. అన్నిటికీ లెక్కే. అవసరానికి ఎవరినైనా ఏదైనా అడిగితే ఆ అవసరం వెనుక ఏదైనా మర్మం ఉందా అనే శోధింపు ఎక్కువైంది. ఇతరుల గురించి కాదు, నేను చెప్పేది. నేనైనా అంతే! ఈ తేడా ఎలా వచ్చిందో ఏమిటో మరి!”
“.........”
“రేపెలా గడుస్తుంది అనే అ రోజుల్లో రేపటి గురించిన బెంగ ఎవ్వరికీ  వుండేది కాదు. ఏపూటకాపూట హాయిగా గడిచిపోయేది. వున్నవాళ్ళు, లేనివాళ్ళు వున్నదా౦తోనే గడుపుకునేవాళ్ళు. లేదనే లోటు వుండేది కాని, లేదన్న మనాది ఉండేది కాదు”       
“......”
“మరో విషయం చెప్పనా! కష్టాలు తెప్పించే కన్నీళ్లు కళ్ళల్లో తిరిగేవేమో కాని, మొహంలో చిరునవ్వులు మాత్రం చెరిగేవి కావు. తరాలకు సరిఅడే ఆస్తులు పోగుపడ్డాయి కానీ, ఆ నాటి సంతృప్తి కలికానికి కూడా మిగల్లేదు”

విలేకరి దగ్గర అడగడానికి ప్రశ్నలు లేవు, నోట మాటలూ  లేవు. 


(COURTESY: IMAGE OWNER)