రైతుది ఒక విచిత్ర పరిస్తితి.
పండిన ఏడు ధర వుండదు. ఎండిన ఏడు ధర
మాటే వుండదు. పంట పండినా, ఎండినా పండించే రైతు డొక్క నిండదు.
ఒకడు ఒక సినిమా తీస్తాడు, ఆడుతుంది. డబ్బులు
కురుస్తాయి. అది చూసి మరొకడు అదే తరహా ఫిలిం తీస్తాడు. డబ్బాలు తిరిగొస్తాయి.
కాస్త పలుకుబడి వుంటే వినోదపు పన్ను రద్దు రూపంలో సర్కార్లు ఆదుకుంటాయి.
ప్రభుత్వాలకు రావాల్సిన మొత్తం వాళ్ళ ఖాతాల్లో జమవుతుంది.
అదే నిరుడు మంచి ధర వుందని అదే పంట
వేసిన రైతుకు ధరలు లేక కన్నీరే మిగులుతుంది. కన్న పేగుతీపిని కూడా
లక్ష్యపెట్టకుండా ఆరుగాలం కష్టించి పండించిన పంటనే కడుపుమండి తగలబెట్టుకుంటాడు.
ఒడ్డున కూర్చుని తమాషా చూసే వాళ్ళు అలా చేయడం తగదంటారు. రైతును ఆదుకోవడంలో తమను
మించినవాళ్లు లేరంటూ జబ్బలు విరుచుకుంటూ ప్రకటనలు చేస్తారు. వీలుంటే ప్రజలు కట్టిన
పన్నుల నుంచి కొంత మొత్తం విదిలించి చేతులు దులుపుకుంటారు.
ఇంతేనా! చేయాల్సింది ఇంకేమీ లేదా!
ప్రతి ఏడు ఇదే తంతయితే కొన్నాళ్ళకు పాలకుల పట్ల ప్రజలకు విశ్వాసం పోదా!
రెండు తెలుగు రాష్ట్రాల వ్యవసాయ మార్కెట్లలో మిర్చికి ధరలేదు. మరి పొరుగు
రాష్ట్రం మహారాష్ట్రలో అంత ధర ఎందుకు వుంది. ఆ రాష్ట్రం మన దేశంలో ఉందా! పరాయి
గడ్డపై ఉందా!
మిర్చికి ధర లేదు సరే! మరి
వినియోగదారుడు షాపుల్లో కొనుక్కునే కారం ధర ఎందుకలా మండిపోతోంది! దీనికి జవాబు
వుండదు.
పండించిన రైతుకు, దాన్ని వినియోగించే
పౌరుడికీ దక్కని ‘ప్రయోజనం’ ఎవరికి దక్కుతోంది. జవాబు చెప్పడం కష్టమేమీ కాదు, దళారీలకు,
వ్యాపారులకు. మరి అంతంత లాభాలు గడించేవారి నుంచి, ఇప్పటికే వసూలు చేస్తున్న
పన్నులకు అదనంగా ఎంతో కొంత మొత్తం ‘సెస్సు’
రూపంలో వసూలు చేసి, దానితో ఒక శ్రేయోనిధిని ఏర్పాటు చేసి, సరయిన ధర దొరకని
రోజుల్లో రైతులను ఆదుకునే ప్రయత్నం చేయవచ్చు కదా!
ప్రభుత్వాలూ! ఆలోచించండి!