9, జనవరి 2025, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (61) - భండారు శ్రీనివాసరావు

 

1975 లో పుట్టి 1985 లో చనిపోయాను.

అంటే వెలుగు జిలుగుల ప్రభలు విరజిమ్మిన రేడియో  విలేకరిగా నా వృత్తి  జీవితం అంతలో ముగిసిందన్నది నా కవి హృదయం. విలేకరిగా ఒక వెలుగు వెలిగింది నిజానికి ఆ పదేళ్లే!

మళ్ళీ ఈ పదేళ్ళలో  స్వర్ణ యుగం, అంజయ్య గారు ముఖ్యమంత్రిగా వున్న పద్దెనిమిది నెలల కాలం. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే, ఆయన ముఖ్యమంత్రిగా అధికారంలో వున్నది ఏడాది మీద 136 రోజులు. ఆయనకు ముందు దాదాపు రెండున్నర సంవత్సరాలు దుర్నిరీక్షంగా పరిపాలన సాగించిన మర్రి చెన్నారెడ్డి గారి స్థానంలో కాంగ్రెస్ అధిష్టానం, ఆరణాల కూలీగా ప్రసిద్ధి చెందిన టంగుటూరి అంజయ్యను ముఖ్యమంత్రిగా నియమించింది. రాష్ట్రానికి చెందిన అతిరథమహారధులైన కాంగ్రెస్ నాయకులను పక్కనబెట్టి అంజయ్యను ఎంపిక చేయడం అందర్నీ ఆశ్చర్యపరచింది.

రేడియో విలేకరిగా చాలామంది రాజకీయ నాయకులు పరిచయం అవుతూ వుంటారు. అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. అందులో కొంతమంది మాత్రమే మనల్ని  గుర్తు పెట్టుకుంటారు. మనకి  గుర్తుంటారు. వారిలో ప్రథముడు శ్రీ అంజయ్య. నాకే కాదు, హైదరాబాదులో విలేకరులు అందరికి ఆయన ఆప్తుడు. పేరు పెట్టి విలేకరులను పలకరించే భేషజాలు తెలియని రాజకీయ నాయకుడు. కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి తెలుసు. వెంగళరావు మంత్రివర్గంలో పనిచేసిన మండలి వెంకట కృష్ణారావు గారు, భాట్టం శ్రీరామ మూర్తి గారు, కేవీ కేశవులు గారు, హయగ్రీవాచారి గారు  ఇదే కోవలోకి వస్తారు. వార్తలు లేని రోజుల్లో వీరిలో ఎవరి దగ్గరకు వెళ్ళినా ఏదో వార్త చెప్పకుండా పంపరు. తినడానికి ఏదో పెట్టకుండా వదలరు. వీరిలో భాట్టం గారు, హయగ్రీవాచారి గారు ఇంటి నుంచి చిట్టి గారెలు, పులిహోర  వంటివి వండించి సచివాలయంలో విలేకరులను పిలిచి సంతర్పణ చేసేవారు. వీరిని గురించి కొంత చెప్పుకోవాలి.

తానమ్మిన సత్యాన్నే బోధించిన ధీశాలి, బోధించిన సత్యాన్నే పాటించిన వ్రతశీలి' అనే దానికి నిలువెత్తు నిర్వచనం శ్రీ భాట్టం శ్రీరామమూర్తి. నిండు జీవితం గడిపి, గడిపిన జీవితానికి చరితార్ధత కల్పించిన ధన్యజీవి. జయప్రకాష్ నారాయణ్, రాంమనోహర్ లోహియా వంటి అగ్రనేతలకు సన్నిహితుడిగా మెలిగిన ఈ పాత తరం   వృద్ధ రాజకీయవేత్త, మారిన రాజకీయాన్ని, మారిన విలువలను  కళ్ళారా చూసి, తాను మాత్రం మారకుండా   తన ఎనభయ్ తొమ్మిదో ఏట విశాఖపట్నంలో  కన్ను మూశారు. 1926 లో ధర్మవరం గ్రామంలో, ఒక సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో, నన్నయ పంతులు, తరుణమ్మల సంతానంగా   జన్మించిన భాట్టం శ్రీరామమూర్తి,  స్వయం కృషితో ఎదిగి  ఇరవై ఏళ్లకు పైగా శాసన సభ్యుడిగా పనిచేశారు. 1957లో జరిగిన విజయనగరం అసెంబ్లీ  ఉపఎన్నికలో శ్రీ భాట్టం శ్రీరామమూర్తి, సోషలిష్టు పార్టీ అభ్యర్ధిగా ఏకగ్రీవంగా ఎన్నికయి తొలిసారి శాసన సభలో అడుగుపెట్టారు. అంతకుముందు ఎమ్మెల్యేగా వున్న శ్రీ పీవీజీ రాజు లోకసభకు ఎన్నిక కావడంతో ఈ ఉప ఎన్నిక అవసరం అయింది. ఆ తరువాత 1962 లో జరిగిన ఎన్నికల్లో కూడా భాట్టం అదే నియోజక వర్గంనుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి  అసెంబ్లీకి రెండో పర్యాయం ఎన్నికయ్యారు. తరువాత విశాఖ జిల్లా పరవాడ నియోజకవర్గం నుంచి వరసగా రెండు సార్లు (1972, 1978)కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందారు.  ఎనిమిదేళ్ళు మంత్రిగా, ఒక పర్యాయం లోకసభ సభ్యుడిగా వున్నారు. శ్రీ పీవీ నరసింహారావు, శ్రీ జలగం వెంగళరావు, శ్రీ మర్రి చెన్నారెడ్డి, శ్రీ అంజయ్య మంత్రివర్గాల్లో శ్రీరామమూర్తి కీలకమైన వివిధ శాఖలు నిర్వహించారు. రెండు ప్రపంచ తెలుగు మహాసభలు ఆయన సారధ్యంలోనే జరిగాయి. కౌలాలంపూర్ లో నిర్వహించిన ప్రపంచ సభలకు నాటి విద్యాశాఖ మంత్రి శ్రీ మండలి వెంకట కృష్ణారావు కారణాంతరాలవల్ల వెళ్ళలేక పోవడంతో సాంస్కృతిక శాఖ మంత్రిగా వున్న శ్రీ భాట్టం ఆ సభల్లో కీలక ప్రసంగాలు చేసి సభికులను తన అసాధారణ వక్తృత్వ ప్రతిభతో ఆకట్టుకున్నారు. పీవీ మంత్రివర్గంలో వున్న ఈ ఇద్దరు మంత్రుల్ని 'జంట కవులు' అని పిలిచేవాళ్ళు. తరువాత వెంగళరావు ముఖ్యమంత్రి అయినప్పుడు వీరి శాఖల్ని మార్చి ఒకరిది మరొకరికి కట్టబెట్టారు. 'జలగం గారు  మాకు కుండ మార్పిడి చేశారు' అనేవారు శ్రీరామ మూర్తిగారు హాస్యోక్తిగా.    

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. శ్రీ భాట్టం శ్రీరామమూర్తి వ్యక్తిత్వం నచ్చిన నాటి టీడీపీ అధ్యక్షుడు శ్రీ ఎన్టీ రామారావు, ఆయన్ని తమ పార్టీలోకి ఆహ్వానించారు. 1984లో టీడీపీ టిక్కెట్టు మీద శ్రీ శ్రీరామమూర్తి, విశాఖ నియోజకవర్గం నుంచి  తొలిసారి లోకసభకు ఎన్నికయి పార్లమెంటులో తన స్వరం వినిపించారు.  

 

 

రాజకీయ జీవితంలో డబ్బుకు దూరంగా, ప్రజలకు దగ్గరగా గడిపిన చరిత్ర శ్రీ శ్రీరామమూర్తిది. రాజకీయ శత్రువులు సయితం ఆయన నిజాయితీని శంకించలేని స్తితి.  హోదాలు కోరుకోలేదు. ఆస్తులు కూడబెట్టలేదు. విశాఖపట్నంలో ఏ చిన్న ఇంట్లో వున్నారో, జీవిత చరమాంకం వరకు అదే ఇంట్లో గడిపారు.    మంత్రిగా వున్నప్పుడు అత్యంత నిరాడంబరంగా కుమారుడు విద్యాసాగర్  పెళ్లి చేశారు. ఆ పెళ్ళికి శుభలేఖలు కూడా అచ్చు వేయించలేదు. తన కుటుంబసభ్యులను తీసుకుని ఒక ప్రైవేటు వాహనంలో పెళ్ళికి వెళ్ళి వచ్చారు. డాబూ దర్పాలూ లేవు, వందిమాగధులూ లేరు. అదీ భాట్టం శ్రీరామమూర్తి గారు  పాటించిన జీవన విధానం.

తాను నమ్మింది ఆచరించి చూపడం అన్నది శ్రీరామ మూర్తి గారు తన పెళ్ళిలో కూడా ప్రదర్శించి చూపారు. ఆయనది కులాంతర వివాహం. మద్దూరి అన్నపూర్ణయ్య గారి పౌరోహిత్యంలో శ్రీమతి సత్యవతితో జరిగిన ఆ పెండ్లితంతుకయిన ఖర్చు కేవలం పదిహేను రూపాయలు.          

 ఒక పర్యాయం లోకసభ సభ్యుడిగా పనిచేసిన తరువాత మరో సారి శ్రీ రామారావు విశాఖ నుంచి రెండో మారు పోటీ చేయాలని  శ్రీ శ్రీరామ మూర్తిని  కోరారు. కానీ ఎప్పుడో ఒకప్పుడు రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకున్న శ్రీ భాట్టం, రామారావుగారి కోరికను సున్నితంగా తిరస్కరించారు. అప్పటినుంచీ ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా, ఆధ్యాత్మిక వ్యవహారాలకు దగ్గరగా  వుంటూ వచ్చారు. ఏళ్ళు మీద పడి, కాళ్ళూ చేతులూ సరిగా ఆడని వాళ్లు కూడా పదవులకోసం వెంపర్లాడుతున్న ఈ రోజుల్లో భాట్టం వంటి వారిని ఊహించుకోవడం కూడా కష్టం. అంతేకాదు, అయన తన కుటుంబ సభ్యులనెవ్వరినీ రాజకీయాల్లో ప్రోత్సహించలేదు. తన టిక్కెట్టు తన భార్యకు ఇమ్మని కూడా దేబిరించలేదు. ఆ పుణ్యాత్మురాలు సత్యవతి గారు కూడా భర్తకు తగ్గ భార్య. ఆయన ఆలోచనలకు తగ్గట్టుగా, ఆశయాలకు తగినట్టుగా ఆయన వెంట నడిచారు.

భాట్టం శ్రీరామ మూర్తి గారు  మిత్రుల కోరికపై తన ఆత్మ కధ రాశారు. దానికి అయన పెట్టుకున్న పేరు 'స్వేచ్చాభారతం'.  సాధారణంగా రాజకీయ నాయకులు రాసే ఆత్మ కధల్లో 'ఆత్మ స్తుతి పరనింద' తొణికిసలాడతాయి. కానీ భాట్టం తరహానే వేరు. ఆయన అన్ని విషయాలు చాలా నిక్కచ్చిగా రాసుకున్నారు.

చివర్లో తనకు తానే 'తుది పలుకులు' కూడా  రాసుకున్నారు.

'కోహం (నేనెవర్ని) అంటూ పుట్టావు. సోహం (నేనే నువ్వు అంటే భగవంతుడు)  అంటూ ఆ ఎరుకతో మరణించు. పుట్టిన చోటు చేరడానికి  ఏడుపెందుకు?'      

శ్రీ భాట్టం శ్రీరామ మూర్తికి ఒకనాటి రాజకీయ సహచరుడు, ముఖ్యమైన స్నేహితుడు కీర్తిశేషులు మండలి వెంకట కృష్ణారావు. అయన కుమారుడు  శ్రీ మండలి బుద్ధ ప్రసాద్  ఈ గ్రంధానికి 'ముందు మాట' రాశారు. మహాకవి,  సంస్కృత పండితుడు భవభూతి సూక్తిని శ్రీ బుద్ధ ప్రసాద్ అందులో ఉటంకించారు.

'కాలో హ్యయం నిరవధి:, విపులాచ పృధ్వీ'. విశాలమైన విశ్వంలో, అనంతమైన కాలంలో అసంఖ్యాక ప్రజానీకం పుడుతూ వుంటుంది. గిడుతూ వుంటుంది. వాళ్ళంతా ఎవరికి తెలుసు ? కొద్ది మంది పేర్లే మనం తలచుకుంటూ వుంటాం.'

ఆ కొద్దిమందిలో ఒకరు శ్రీ భాట్టం శ్రీరామ మూర్తి. 

కింది ఫోటో:



(నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి విశాఖ వచ్చిన సందర్భంలో ఆ నాటి ముఖ్యమంత్రి  కాసు బ్రహ్మానందరెడ్డితో భాట్టం శ్రీరామ మూర్తి)

 

(ఇంకావుంది)  

8, జనవరి 2025, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (60) - భండారు శ్రీనివాసరావు

 


 

పురుషులలో ఉత్తమ పురుషుల మాదిరిగా జర్నలిష్టులలో హిందూ విలేకరులను అలా పరిగణించే రోజులు నాకు తెలుసు.
అలాంటి ఒకానొక రోజుల్లో హిందూ కరస్పాండెంట్ (ముందు ముందు విలేకరి అంటాను, టైప్ చేయడం ఇబ్బందిగా వుంది) గా పనిచేస్తున్న దాసు కేశవరావు అనే చిన్నగా కనబడే ఈ పెద్దమనిషికి, కొన్ని రోజులపాటు నా చిలిపితనాన్ని భరించాల్సిన పరిస్తితి ఏర్పడింది. దీనికి కారణం ఆ నాటి రాష్ట్రపతి డాక్టర్ నీలం సంజీవరెడ్డి.

సంజీవరెడ్డి గారు రాష్ట్రపతి అయిన తర్వాత తొలిసారిగా అనంతపురం వచ్చారు. ఆ పట్టణానికి దగ్గరలోనే వారి స్వగ్రామం ఇల్లూరు వుంది. అనంతపురంలో ఉన్న వారి సొంత ఇల్లు తాత్కాలికంగా రాష్ట్రపతి నిలయం అయింది. అంతటి పెద్దాయన మొదటిసారి సొంతూరు వస్తుంటే పత్రికలు ఊరుకుంటాయా! హైదరాబాదు నుంచి విలేకరులను పంపించాయి. ఇక ఆకాశవాణి సంగతి చెప్పేదేముంది. నేనూ వాలిపోయాను.

అనంతపురంలో మెయిన్ రోడ్డుపైనే ఉన్న హోటల్లో మా బస. చెప్పానుకదా నాకు చిలిపితనం ఓ పాలెక్కువ అని. దాసు కేశవరావు గంగిగోవు లాంటి జర్నలిష్టు. మేమిద్దరం చాలా ఏళ్ళుగా స్నేహితులం. అంచేత నా గోల ఆయన మౌనంగా భరించేవాడు.
ఇద్దరమూ బయటకు పోయేవాళ్ళం. కాసేపు అటూ ఇటూ తిరిగేవాళ్ళం. మధ్యలో ఓ పబ్లిక్ కాల్ ఆఫీసు నుంచి నేను హోటల్ రిసెప్షన్ కు ఫోను చేసేవాడిని.
రాష్ట్రపతి క్యాంప్ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నాము. మీ హోటల్లో, కేశవరావు, శ్రీనివాసరావు, హైదరాబాదు జర్నలిష్టులు వుంటే ఒకసారి కనెక్ట్ చేస్తారా! అర్జంటుగా మాట్లాడాలి’ అనే వాడిని.
హోటల్లో అడుగుపెడుతూ ఉండగానే మేనేజర్ పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. ‘మీకోసం ప్రెసిడెంటు గారి ఆఫీసు వాళ్ళు ఫోన్ చేసారు’ అని చెప్పేవాళ్ళు ఆదుర్దాగా.
వాళ్ళు అలానే చేస్తారు. అవసరం వుంటే మళ్ళీ వాళ్ళే చేస్తారు, ఏం పర్వాలేదు’ అనేవాడిని నిర్లక్యంగా.
ఈ ట్రిక్కు బాగా పనిచేసింది. ఆ రోజు నుంచీ హోటల్లో మాకు మర్యాదలు పెరిగాయి. ఉదయం సాయంత్రం కనుక్కునేవారు. రూమ్ సర్వీసు బాగు పడింది.
ఇది అవసరమా’ అనేది కేశవరావుగారిలోని గంగిగోవు. ‘అవసరమే’ అనేది నాలోని పోట్లగిత్త.

ఒక రోజు ఇల్లూరు ప్రయాణం కట్టాము. ఎందుకంటే సంజీవరెడ్డి గారు అక్కడికి బయలుదేరారు.

సందర్భం కనుక, ఇల్లూరు చేరేలోగా  నీలం సంజీవరెడ్డి గారి గురించి క్లుప్తంగా నాలుగు ముక్కలు.

1956 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ తర్వాత నీలం సంజీవరెడ్డి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పనిచేశారు. బస్సుల జాతీయకరణ అంశంలో నాయస్థానం తప్పుపట్టిన చిన్న కారణంతో మనస్తాపం చెందిన సంజీవరెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడాన్ని రాజకీయాల్లో నైతిక విలువల ప్రస్తావన వచ్చినప్పుడల్లా రాజకీయ పరిశీలకులు గుర్తు చేస్తుంటారు. నిజాయితీ విషయంలో ఆయన్ని ప్రత్యర్థులు కూడా తప్పుపట్టలేరు. లోక సభ స్పీకర్ గా ఎన్నికయినప్పుడు వెంటనే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. నిష్పక్షపాతంగా సభని నిర్వహించేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ప్రకటించారు.

దేశ రాజకీయాలను మలుపు తిప్పిన ఒక పరిణామంలో సంజీవరెడ్డి గారు ఒక భాగస్వామి. 1969 లో  రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ మరణం తర్వాత రాష్ట్రపతి అభ్యర్ధిగా సంజీవరెడ్డిని నాటి పాలకపక్షం అయిన కాంగ్రెస్ అధిష్టానం నామినేట్ చేసింది. అయితే పార్టీలో తన ఆధిపత్యాన్ని రుజువు చేసుకునేందుకు నాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి ఇండిపెండెంట్ అభ్యర్ధి వీవీ గిరికి మద్దతు పలకడంతో ఆయన గెలవడం, పార్టీ అధికార అభ్యర్ధి సంజీవరెడ్డి పరాజయం పాలవడం జరిగింది. దానితో ఖిన్నుడైన సంజీవరెడ్డి గారు, రాజకీయాలను వదిలిపెట్టి అనంతపూర్ కు వచ్చి వ్యవసాయంలో నిమగ్నం అయ్యారు. 1977 లో జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో ఏర్పడ్డ జనతా పార్టీలో చేరి నంద్యాల నుంచి పోటీ చేసి లోకసభకి ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికయిన మొత్తం  42 మంది అభ్యర్ధులలో ఈయన ఒక్కరే కాంగ్రెసేతర  అభ్యర్ధి. అయితే ఆ  ఎన్నికల్లో కేంద్రంలో జనతా ప్రభుత్వం ఏర్పడింది. అప్పుడు ఆయన్ని లోక సభ స్పీకరుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తరువాత జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో జనతా పార్టీ అభ్యర్ధిగా ఏకగ్రీవంగా గెలిచి 1977 జులై 25 న రాష్ట్రపతిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. పోటీ లేకుండా రాష్ట్రపతి పదవికి ఎన్నికయిన ఘనత కూడా ఆయన ఖాతాలో చేరింది. 64 ఏళ్ల అతితక్కువ  పిన్న వయస్సులో అత్యంత ఉన్నత పదవికి ఎన్నికయిన కీర్తి కూడా సంపాదించుకున్నారు. రాష్ట్రపతిగా తన పదవీ కాలంలో ఆయన ముగ్గురు ప్రధానులు, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్ లతోనే కాకుండా, ఒకనాడు రాష్ట్రపతి ఎన్నికల్లో తన ఓటమికి కారకురాలైన  ఇందిరా గాంధీతో కూడా  కలిసి పనిచేయడం విశేషం.

ఇల్లూరులో నీలం వారిల్లు పెళ్లివారిల్లులా హడావిడిగా వుంది. తన ఈడువారిని ఆయన ఆప్యాయంగా ‘ఏమప్పా’ అంటూ పేరుపెట్టి పలకరిస్తున్నారు. చిన్నవారితో ఎప్పటి సంగతులో ముచ్చటిస్తున్నారు. వూరు ఊరంతా అక్కడే వుంది.
సాయంత్రం ఆరవుతోంది. నేను వారింటి నుంచే హైదరాబాదు ఫోన్ చేసి వార్త చెప్పాను. రాష్ట్రపతి మకాం చేస్తున్న సందర్భం కాబట్టి వెంటనే లైను కలిపారు. అది మొదటి వార్తగా వస్తుందని నాకు తెలుసు. వెంటనే సంజీవరెడ్డి గారిని ( రాష్ట్రపతి కార్యదర్శి పేరు కూడా సంజీవరెడ్డే. పీ.ఎల్. సంజీవ రెడ్డి గారు. ఐ.ఏ.ఎస్. అధికారి)ని ఒక రేడియో తెప్పించమన్నాను. ఆయన నావైపు అదోలా చూస్తూ రేడియో తెప్పించారు. దాన్ని అక్కడ ఉన్న మైక్ సెట్టుకు కలిపారు.
వార్తలు మొదలయ్యాయి. అంతా నిశ్శబ్దం. రాష్ట్రపతి స్వగ్రామం వచ్చిన వార్తా విశేషాలతో బులెటిన్ మొదలయింది.
ఈ మారుమూల గ్రామంలో వార్త ,అంత త్వరగా రేడియోలో ఎలా వచ్చిందని జనం ఆశ్చర్యంగా గుసగుసలాడుకున్నారు.
నేను ఇప్పటికీ గర్వపడే మరో విషయం ఏమిటంటే, ఆ నాటి శ్రోతల్లో నీలం సంజీవ రెడ్డి గారు కూడా ఒకరు.
ముందు కొంచెం రుసరుసలాడినట్టు కనిపించిన పీ.ఎల్. సంజీవరెడ్డి గారు కూడా ఖుషీ.
భుజం తట్టారు, మెచ్చుకోలుగా.

దేశ, రాష్ట్ర  రాజకీయాల్లో ఒక ముఖ్యమైన పాత్ర పోషించిన డాక్టర్ నీలం సంజీవరెడ్డి 1996 లో తన 83 వ ఏట బెంగుళూరులో కన్నుమూశారు.

 

కింది ఫోటో :



నాటి రాష్ట్రపతి డాక్టర్ నీలం సంజీవరెడ్డి

 

(ఇంకా వుంది)

అయాం ఎ బిగ్ జీరో (59) - భండారు శ్రీనివాసరావు

 మంటలు అంటుకున్న విమానం అంత ఎత్తు నుంచి పెద్ద చప్పుడుతో రన్ వే పై కూలిపోయింది. తలుపు తెరుచుకుంది. అయితే పదిహేను అడుగుల పై నుంచి ప్రయాణీకులు దూకి ప్రాణాలు కాపాడుకోవాల్సిన పరిస్థితి. అందరికంటే ముందు దూకింది ముఖ్యమంత్రి చెన్నారెడ్డి. ఇలా దూకడంలో ఆయనకు కొన్ని దెబ్బలు తగిలాయి. ఒకరి వెంట మరొకరు కిందికి దూకారు. చిట్టచివరి ప్రయాణీకులకు ఒళ్ళు కాలిపోయింది. వారిలో ఇద్దరు చనిపోయారు. మొత్తం పదిహేడు మంది ఈ దుర్ఘటనలో గాయపడ్డారు. ప్రయాణీకుల లగేజి పూర్తిగా కాలిపోయింది. బహుశా మరునాడు కాబోలు ముఖ్యమంత్రి దుర్ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లి చూసినట్టు వదంతులు షికార్లు చేసాయి. ఢిల్లీకి తరలిస్తున్న డబ్బు సంచుల కోసం ఆ వెతుకులాట అని ప్రతిపక్షాల వాళ్ళు బహిరంగంగానే చెవులు కొరుక్కున్నారు. ఇప్పుడయితే, విస్తరించిన మీడియా పుణ్యమా  ఇటువంటి పుకార్ల ప్రభావం చాలా వుండేది. ఆ రోజుల్లో కొన్ని కారిడార్లలో మాత్రమే వినిపించేవి. వినిపించినంత వేగంగా సమసియేవి. ఇలాంటిదే మరో వదంతి సంజయ్ గాంధి ఢిల్లీలో విమానం నడుపుతూ, అది  కూలిపోయి చనిపోయినప్పుడు, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రమాద స్థలికి వెళ్లి దేనికోసమో దేవులాడినట్టు వెలుగు చూసింది కానీ పెద్ద చర్చ లేకుండానే ముగిసిపోయింది.

చిత్రం ఏమిటంటే ఆ పార్టీకి జాతీయ నాయకురాలైన ఇందిరా గాంధి ఆ ఎన్నికల్లో ఓడిపోయింది. ఓడిపోవడమే కాదు, కేంద్రంలో అధికారాన్ని, ప్రధాని పదవిని కోల్పోయింది. దేశం మొత్తంలో కేవలం రెండే రెండు రాష్ట్రాలలో, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లలో మాత్రమే అధికారం దక్కించుకుంది. కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి దేవరాజ్ అర్స్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఈ ఇద్దరు మాత్రమే ఇందిరాగాంధీకి, ఆమె పార్టీకి పెద్ద దిక్కుగా మారారు. దీనితో అసలే స్వతంత్ర ప్రవృత్తి కలిగిన చెన్నారెడ్డికి ఈ అవకాశం అవధులు లేని స్వేచ్ఛను ప్రసాదించింది. అధిష్టానమే తనపై ఆధారపడాల్సిన పరిస్థితి. దీనితో ఆయన పాలనపై లేనిపోని కొన్ని కానిపోని అభాండాలు, నీలినీడలు కమ్ముకున్నాయి.  నోట్ అప్రూవుడ్. నాట్ అప్రూవుడ్ అనే అపహాస్యపు వ్యాఖ్యలు ఆయన ఎదుర్కున్నారు. తన వద్దకు వచ్చిన ప్రతి ఫైలుపై ముందు నాట్ ( NOT APPROVED) అని సంతకం చేసి, డబ్బు ముట్టిన సంగతి నిర్ధారించుకుని మళ్ళీ అదే ఫైలుపై ఒక్క అక్షరం అదనంగా చేర్చి నోట్ అప్రూవుడ్   (NOTE APPROVED) అని రాసే వారని వార్తలు వ్యాఖ్యలతో పాటు, చందారెడ్డి అనే నిక్ నేం ఆయన పేరుకు జత చేరింది. ఇవన్నీ ఢిల్లీకి మోసేవాళ్ళు ఆ పార్టీలోఎప్పుడూ సిద్ధంగానే వుంటారు. కాకపొతే అధిష్టానం కూడా ఏమీ చేయలేని పరిస్థితి.

 

డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అధికారులకి ఆయన అంటే సింహ స్వప్నం. ఆయన మాట  వేదవాక్యం. ఎదురు చెబితే, నలుగురి ఎదుటా ఆయన నోట  ఏ మాట పడాల్సివస్తుందో అని బెదిరిపోయేవారు. ఆయన పేషీలో  ఎస్.ఆర్. రామమూర్తి అని నిజాయితీకి మారుపేరయిన ఓ ఐ.ఏ.యస్. అధికారి వుండేవారు. చెన్నారెడ్డి గారి వ్యవహార శైలి విలక్షణం. నిండు పేరోలగం మాదిరిగా, మంత్రులు, శాసన సభ్యులతో  కొలువుతీరి కూర్చునేవారు.  తన వద్దకు పనుల మీద వచ్చిన అనుయాయులను సంతృప్తి పరచడానికి 'ఖుద్దున ఆ పని పూర్తిచేయాల'ని అధికారులకి  తక్షణ ఆదేశాలు ఇచ్చేవారు. వాటిల్లో  నిబంధనల ప్రకారం చేయలేనివి కొన్ని వుంటాయి. తన నోటి మాటే 'జీవో' అని బాహాటంగా ప్రకటించిన ముఖ్యమంత్రి ఆయన. అంచేత అలాటి వ్యక్తి ఆర్డరు వేస్తె కాదనే దమ్ము ఏ అధికారికి  వుంటుంది. రామమూర్తిగారు తన 'బాసు' మనస్తత్వాన్ని కనిపెట్టి తదనుగుణంగా ప్రవర్తించేవారు.  చెన్నారెడ్డి గారు నలుగురిలో వున్నప్పుడు  ఒక పని చెప్పీ చెప్పగానేవెంటనే 'యస్. సర్. తప్పకుండా అలాగే చేద్దాము' అనేవారు. పని మీద వచ్చిన వాళ్ళు కూడా పనయిపోయిందన్న సంతోషంతో వెనక్కి మళ్లేవారు. అధికారులు తన మాట 'తూచ' తప్పకుండా వింటున్నారని ముఖ్యమంత్రి అనుకునేవారు. అయితే, తీరా  ఆ ఫైలు ముఖ్యమంత్రి సంతకం కోసం వెనక్కి వచ్చినప్పుడు, రామమూర్తిగారు అందులోని మర్మాలను, ఇబ్బందులను  ముఖ్యమంత్రికి విడమరచి చెప్పి, ఏ పరిస్తితుల్లోనూ సానుకూల ఉత్తర్వులు ఇవ్వడానికి వీల్లేదని చెబుతూ, 'నో సర్! ఇది కుదరదు' అని నిక్కచ్చిగా చెప్పేవారు. చెన్నారెడ్డి గారు కూడా హుందాగా తల పంకించి ఊరుకునేవారు కానీ ఆ విషయం మీద మరింత పట్టుపట్టేవారు కాదు.  ఇవన్నీ చూసిన వారు యస్. ఆర్. రామమూర్తి గారిని పరోక్షంలో 'యస్.సర్, రామమూర్తి, నో సర్. రామమూర్తి' అని హాస్యోక్తిగా అనేవారు. అలాటి అధికారులు ఈనాడు అసలు లేరని చెప్పలేము కానీ అరుదని మాత్రం ఘంటాపధంగా చెప్పవచ్చు.

నేను రేడియోలో చేరినప్పుడు పన్యాల రంగనాధ రావు గారు మా న్యూస్ ఎడిటర్. వారు రామోజీ రావు గారు ప్రచురించబోయే సినీ వారపత్రిక సితార లో పనిచేయడానికి ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అంతవరకూ ఫీల్డ్ పబ్లిసిటి విభాగంలో పనిచేస్తున్న నర్రావుల సుబ్బారావు గారిని  హైదరాబాదు వార్తా విభాగం న్యూస్ ఎడిటర్ గా బదిలీ చేశారు.  ఆయన కంటే పై అధికారి ఢిల్లీలో వుంటారు. అంటే హైదరాబాదుకు సంబంధించినంత వరకు ఆయనే  మా న్యూస్ రూమ్ హెడ్.  నర్రావుల సుబ్బారావు గారి ఆహార్యం చూస్తే ఎవరూ ఆయన్ని ప్రభుత్వ అధికారి అనుకోరు. మోచేతుల కిందకి చొక్కాపంచెకట్టుతో చేతిలో చుట్టతో అచ్చం ఒక రైతు మాదిరిగా కనిపించేవారు. ఆకారంలోనే కాదునిజంగానే ఆయన రైతు పక్షపాతి. ఆ నైజం వార్తల్లో కూడా ప్రతిఫలించేది. వర్షాలు కురవక పలానా జిల్లాలో పైర్లు ఎండిపోతున్నాయని వార్తల్లో వివరాలతో సహా ప్రసారం చేసేవారు. ఆ రోజుల్లో ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు. ఆయన మాటకు ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో ఎదురులేదు.   ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎన్నో వార్తలు  ప్రసారం చేసినా కూడా సుబ్బారావు గారు తరువాత అనేక సంవత్సరాలు రేడియోలో కొనసాగారు.

ఒకసారి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో సుబ్బారావు గారు లేచి పలానా ప్రాంతంలో పంటలు ఎండి పోతున్నాయనిఅధికారులు చేతులు ముడుచుకుని కూర్చున్నారని ఫిర్యాదు చేశారు ఆయన తరహాలో. చెన్నారెడ్డి గారి తరహా కూడా విలేకరులకు తెలుసు. ఆ ప్రశ్న ఆయనకు సుతరామూ నచ్చలేదు. అది ఆయన మాటల్లో కనబడింది.

చూడు సుబ్బారావ్! నువ్వు విలేకరిగా ఈ ప్రశ్న వేస్తే జవాబు చెబుతాను. రైతుల ప్రతినిధిగా వేస్తే ఇక్కడ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు”

ఇరువురూ హుందాగా వ్యవహరించడంతో రసాభాస కాకుండా అది అక్కడకి ముగిసిపోయింది.

రేడియోమీద కానీరేడియో వార్తలమీద కానీ సర్కారువారికి పట్టోపెత్తనమో వుంటుందని ఆ రోజుల్లో ఓ అభిప్రాయం ప్రచారంలో వుండేది.  ఇలాటి ఉదంతాలు విన్నప్పుడు వాటికి సరైన ప్రాతిపదిక లేదన్న వాస్తవం బోధపడుతుంది.

నా ఈడువాడేకొంచెం చిన్నవాడు కూడా ఓ జర్నలిస్టు స్నేహితుడు ఉండేవాడు. ప్రముఖ పత్రికలో పనిచేసేవాడు. నన్ను ఎప్పుడూ సర్కారీ జర్నలిస్ట్ అని ఎద్దేవా చేస్తుండేవాడు. నేనొకసారి అతడితో అన్నాను.

గంటలో ప్రాంతీయ వార్తలు వస్తాయి. నువ్వు ఒక వార్త ఇవ్వు ఏదైనా సరే. అది నీ ముందే రేడియోకి ఇస్తాను. అలాగే నేను నీకొక వార్త చెబుతాను. అది రేపటి నీ పత్రికలో వచ్చేట్టు చూడు. ఆ తర్వాత జర్నలిస్టుల స్వేచ్చ గురించి తీరిగ్గా మాట్లాడుకుందాము’

అతడు చెప్పిన వార్త రేడియోలో వచ్చింది. నేను చెప్పిన వార్త అతడి పేపర్లో రాలేదని వేరే చెప్పక్కరలేదు. మరునాడే కాదుఎప్పటికీ రాదని అతడికీ తెలుసు.

ఆ తర్వాత అతడెప్పుడూ సర్కారీ జర్నలిస్టు అనే పదం నా వద్ద తేలేదు.

 

కింది ఫోటో :



ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం ప్రాంతీయ విభాగం న్యూస్ ఎడిటర్ గా సుదీర్ఘ కాలం  పనిచేసిన ఎన్.జి. రంగా గారి శిష్యులు, కీర్తిశేషులు నర్రావుల సుబ్బారావు గారు  (ఫోటో కర్టేసి వారి కుమారుడు రావు గారు)

(ఇంకా వుంది)     

7, జనవరి 2025, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (58) - భండారు శ్రీనివాసరావు

 సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగలిగిన వాడు జీవితంలో విజయం సాధిస్తాడు అంటారు. ఈ సూత్రం మాత్రం రాజకీయాల్లో బాగా పనికివస్తుంది అనడానికి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఒక ఉదాహరణ.

ఒకానొక కాలంలో పనుల మీద వివిధ జిల్లాల నుంచి హైదరాబాదు వచ్చే ఆ నాటి కాంగ్రెస్ నాయకులకు ఆబిడ్స్ లో వుండే వసంత్ విహార్ హోటల్ ఒక విడిది. నాకు బాబాయి వరస అయ్యే నాటి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బొమ్మకంటి సత్యనారాయణ రావు గారు ఎప్పుడు హైదరాబాదు వచ్చినా ఆ హోటల్లోనే దిగేవాడు. ఒకటో నెంబరు గదిని ఆయన కోసం ప్రత్యేకించేవారు. అంతే కాదు పీటలు వేసి విస్తరిలో భోజనం వడ్డించే వారు. మర్రి చెన్నారెడ్డి వంటి నాయకులు బొమ్మకంటిని కలుసుకోవడానికి ఆ హోటల్ కు వెళ్ళేవాళ్ళు. ఆ రోజుల్లో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ రాజకీయాలకు కేంద్ర బిందువుగా వుండడం వల్ల ఆయనకు ఆ గౌరవం. బొమ్మకంటి తెలంగాణాకు చెందిన రాజకీయ నాయకుడు అయినప్పటికీ సమైక్యవాది.

నేను రేడియోలో చేరడానికి చాలా ముందుగానే నా మిత్రుడు వనం జ్వాలా నరసింహారావు పై చదువులుఉద్యోగం నిమిత్తం హైదరాబాదులోనే ఆయన మకాము. చిన్నప్పటి నుంచి  తన గ్రామ రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొంటూ ఉండేవాడు. పాలిటిక్స్  అంటే తగని ఆసక్తి. నాకు ఆసక్తి ఎలావున్నా, వృత్తిరీత్యా రాజకీయ నాయకులను కలుసునే వెసులుబాటు వుండేది.

ఒకరోజు జ్వాలా నన్ను ఆయన స్కూటర్ పై  ఎక్కించుకుని ఆబిడ్స్ లోని వసంత్ విహార్ కు తీసుకువెళ్లాడు.

అప్పటికే జాతీయ పార్టీ కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధి నాయకత్వంలో  కాంగ్రెస్ (ఐ) పార్టీ ఏర్పాటు అయింది. కొత్త పార్టీ పట్ల రాష్ట్రంలోని పాత కాంగ్రెస్ నాయకులకు ఆట్టే గురి కుదరలేదు. గుర్తింపు కలిగిన నాయకత్వం కొరత వుంది. చెన్నారెడ్డి అప్పటికి ఇంకా ఆ పార్టీ  రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు తీసుకోలేదు.

ఈ నేపధ్యంలో మేము వసంత్ విహార్ హోటల్లో బస చేసిన, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు  బొమ్మకంటి సత్యనారాయణ రావు గారిని కలుసుకున్నాము. (మేము ఆయన్ని సత్యం బాబాయ్ అని పిలుస్తాము. ఆయన కుమారుడే బొమ్మకంటి శంకర రావుఐ.పి.ఎస్.  పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ గా రిటైర్ అయి, ఈ మధ్యనే కన్ను మూశాడు)

మామూలుగా కుటుంబ క్షేమ సమాచారాలు వగైరా మాట్లాడుకున్న తరువాత జ్వాలా ఆయన్ని నేరుగా రాజకీయాల్లోకి దించాడు. ఇందిర పార్టీకి రాష్ట్రంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సరైన నాయకుడు లేడు. మీరు ఆ బాధ్యత తీసుకోవచ్చు కదా! అని సూచనగా చెప్పాడు.

అప్పుడు ఆయన నవ్వి ఇలా అన్నాడు.

“ఒర్రేయ్  నరసింహం!  పార్టీ అంటే మాటలు కాదురా! అంత  బరువు ఇప్పుడు ఎవడు మోస్తాడు? ఈ వయసులో అవసరమా చెప్పు” అని ఎదురు ప్రశ్న వేసాడు.

ఇంకో మాట కూడా అన్నాడు. ఆ మాట విన్న తరువాత ఆయనకు ఇందిరాగాంధి శక్తి సామర్ధ్యాల పట్ల అంత నమ్మకం వున్నట్టు నాకు అనిపించలేదు. మరి ఆమె గురించే అన్నాడో సరిగా గుర్తు లేదు కానీ, ‘గాంధారి గర్వ భంగం అవుతుంది చూడండి’ అన్న మాట గుర్తుంది.

అంతటి అనుభవశాలి కూడా వర్తమాన  రాజకీయాలను అధ్యయనం చేయడంలో విఫలం అయ్యాడు.

అదే చెన్నారెడ్డి గారు సరైన సమయంలో  సరైన నిర్ణయం తీసుకుని, నాయకత్వలోపంతో కునారిల్లుతున్న కాంగ్రెస్ (ఐ) రాష్ట్ర నాయకత్వ పగ్గాలను చేపట్టి, కొత్తగా పురుడు పోసుకున్న ఆ పార్టీకి రాష్ట్రంలో నూతన జవసత్వాలను ప్రసాదించి,  ఎన్నికల్లో ఆ పార్టీని  విజయపథంలో నడిపించి ముఖ్యమంత్రిగా మొదటిసారి  అధికార పగ్గాలను చేపట్టారు.

దటీజ్ చెన్నారెడ్డి.

ఆ రోజుల్లో ఒకసారి ముఖ్యమంత్రి ఢిల్లీ ప్రయాణం పెట్టుకున్నారు. ఇప్పటి మాదిరిగా యా రోజుల్లో హైదరాబాదు నుంచి ఢిల్లీ వెళ్ళడానికి ఇన్నిన్ని విమానాలు లేవు. ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాలు నడిచేవి. అవి కూడా ఢిల్లీ నుంచి మద్రాసుకి, మద్రాసు నుంచి ఢిల్లీకి హైదరాబాదు మీదుగా వెళ్ళే విమానాలు.

ఆ రోజు, డిసెంబరు 17 1978,  మధ్యాన్నం  ఇంట్లో కూర్చుని స్నేహితులతో కాలక్షేపం చేస్తుంటే రేడియోలో ఒక ప్రకటన వినపడింది. రక్తదాతలు వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి రక్తదానం చేయాలని పోలీసు అధికారుల పిలుపు. ఒకటికి రెండుసార్లు అదే ప్రకటన వస్తుంటే అనుమానం వేసి పోలీసు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేశాను.  బేగం పేట ఎయిర్ పోర్టులో ఏదో ప్రమాదం జరిగిందని మాత్రం చెప్పారు.

వెంటనే స్కూటర్ వేసుకుని ఎయిర్ పోర్టుకు వెళ్లాను. నేను వెళ్ళే సరికే అంతా అయిపోయింది.  టేక్ ఆఫ్ దశలో, విమానం చివరి భాగానికి మంటలు అంటుకోవడంతో  ఢిల్లీ వెళ్ళే విమానం వంద మీటర్లకు పైగా ఎత్తు నుంచి రన్ వే చివర్లో కూలిపోయిందని తెలిసింది. ఫైర్ ఇంజిన్లు చిమ్మిన నీళ్ళతో ఆ ప్రాంతం అంతా తడిసిపోయింది.  పోలీసు వాహనాలు, అంబులెన్సులతో చాలా హడావిడిగా వుంది. చుట్టూ తాళ్ళతో పోలీసులు బారికేడ్లు కట్టారు. ఎవరినీ దగ్గరకు పోనివ్వడం లేదు.

కింది ఫోటో:



బేగంపేట విమాన ప్రమాదం, ఇండియన్ ఎక్స్ ప్రెస్  పత్రిక న్యూస్ క్లిప్పింగులు: జి. శ్రీనివాసులు ఎక్స్ ప్రెస్ ఫోటోగ్రాఫర్  

(Courtesy: Marri Sashidhar Reddy)

(ఇంకా వుంది)

అయాం ఎ బిగ్ జీరో (57) - భండారు శ్రీనివాసరావు

 

 

 

వెంగళరావు గారి తరువాత ముఖ్యమంత్రి అయిన చెన్నారెడ్డి గారికి పరిపాలనాదక్షుడు అనే మంచి పేరుతొ పాటు చండశాసనుడు అనే కితాబు కూడా వుండేది.

 1978 లో మర్రి చెన్నారెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి కాగానే కాంగ్రెస్ నుంచి ఇందిరా కాంగ్రెస్ కు వలసలు మొదలయ్యాయి. ఎన్నికలు ముగియగానే పెద్ద ఎత్తున పాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయన వైపు మళ్లిపోతున్నారు. అసెంబ్లీలో  ప్రతిపక్ష కాంగ్రెస్ లో ఉన్న భాట్టం శ్రీరామ మూర్తి ఓ ఘాటు వ్యాఖ్య చేసారు.

'చెన్నారెడ్డి గారి ఆకర్షణ శక్తి అమోఘం. ఎన్నికల్లో గెలిచిన వాళ్లు జమాఖర్చులు కూడా ఇంకా దాఖలు చేయలేదు. దానికి ముందే పరకాయ ప్రవేశాలా! ఈ తంతు చూస్తూ వుంటే మంగళ సూత్రాలతోమధు పర్కాలతో పెళ్లి పీటల మీదనుంచి లేచిపోతున్నట్టుగా వుంది'

ఈ వ్యాఖ్య శాసన సభలో దుమారం రగిలించింది.

పార్టీ మారిన వాళ్ళలో మహిళా సభ్యులు కూడా వున్నారు. ‘లేచిపోవడం’ అనే పదానికి అభ్యంతరం తెలిపారు. అది సభలో వాడతగిన  పదమా కాదా అన్న దానిపై కొలిక్కిరాని చర్చ విస్తృతంగా జరిగింది.

పార్టీ మార్పిళ్ళపై ఇంతటి ఘాటు వ్యాఖ్య చేసిన భాట్టం శ్రీరామ్మూర్తి కూడా తరువాత కాంగ్రెస్ లో చేరిపోయారు. ఏకం తప్పితే అనేకం అన్నట్టు,  టీడీపీ తీర్థం కూడా తదనంతర కాలంలో  పుచ్చుకున్నారు.

మర్రి చెన్నారెడ్డి వ్యవహార శైలి విభిన్నం. ఆయన తార్నాక లోని సొంత ఇంట్లోనే వుండి, దానికి అన్నిరకాల హంగులు సమకూర్చుకున్నారు. బహుశా సొంత నివాసాలకు ప్రభుత్వ ఖర్చుతో వసతులు ఏర్పాటు చేసుకునే సాంప్రదాయానికి అప్పుడే బీజం పడిందని అనుకోవాలి. ఆ రోజుల్లో మొత్తం హైదరాబాదులో లిఫ్ట్ సౌకర్యం ఉన్న ప్రైవేటు గృహాలు రెండే ఉండేవని, వాటిల్లో ఒకటి చెన్నారెడ్డి గారి తార్నాక నివాసం అని జనం చెప్పుకునేవారు. ముఖ్యమంత్రి పేషీ కోసం సీ బ్లాకులో తన అభిరుచులకు తగ్గట్టుగా ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. ఖరీదయిన ఆధునిక ఫర్నిచర్ తో చూడముచ్చటగా వుండేది. సిబ్బంది సంఖ్య కూడా పెరిగింది. ఇద్దరు ముగ్గురు సీనియర్ ఐ ఏ ఎస్ అధికారులు పనిచేసే వారు. శ్రీయుతులు ఎస్ ఆర్ రామమూర్తి, గోవిందరాజన్, సంతానం, యుగంధర్, పరమహంస మొదలయిన వారు వున్నా వారిలో ఎక్కువకాలం వున్నది పరమహంస గారే. రామమూర్తిగారు తదనంతర కాలంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఎస్పీ రాంక్ ఐ పీ ఎస్ అధికారి శ్రీ మురళీధర్ ప్రధాన భద్రతాధికారి. పీ ఆర్ వొ గా సమాచారశాఖలో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్న మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారిని నియమించుకున్నారు. (అంతకు ముందు కొద్దికాలం సి. నరసింహారెడ్డి గారు కూడా ఈ బాధ్యతలు నిర్వహించారు. పర్వతాలరావు గారికి చెన్నా టు అన్నా అనే పేరు వుండేది. అంటే చెన్నారెడ్డి, అంజయ్య, భవనం వెంకట్రాం, విజయభాస్కర రెడ్డి, ఎన్టీ రామారావు ఇలా వరసగా అయిదుగురు ముఖ్యమంత్రుల వద్ద పీఆర్వో గా పనిచేసారు)
చెన్నారెడ్డి గారు ఎటువెళ్ళినా కొంతమంది మంత్రులు మరో పని ఏమీ లేదన్నట్టు ఆయన వెంటే వెళ్ళేవారు. దాంతో, సీ ఎం కాన్వాయ్ లో వాహనాల సంఖ్య కూడా పెరిగింది. ఆయన ఢిల్లీ వెళ్ళినా, ఢిల్లీ నుంచి వచ్చినా వీడ్కోలు, స్వాగతాలకు మంత్రుల కార్లు బేగంపేట విమానాశ్రయానికి బారులు తీరేవి. ఇక సచివాలయంలో ఆయన పేషీలో  మంత్రుల దర్బారు గంటలు గంటలు సాగేది.  ఐ.ఎ.ఎస్. అధికారులు ఫైళ్ళు చేతపట్టుకుని బయట ఆయన పిలుపుకోసం ఎదురు చూస్తూ వుండేవారు.  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి అయిన ఘనత దక్కిన కాంగ్రెస్ నాయకుల్లో చెన్నారెడ్డి గారొకరు. మొదటి సారి, అలాగే రెండోసారి కూడా ఆ పదవి కోల్పోవడానికి కారణం సొంత పార్టీలో ఆయన పట్ల చెలరేగిన అసమ్మతి. మరో విశేషం ఏమిటంటే ఆ రెండుసార్లు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం కూడా చెన్నారెడ్డి గారే కావడం. అయినా కాంగ్రెస్ పార్టీలో ఆయన వ్యతిరేకులు ఆయన దిగిపోయేదాకా నిద్రపోలేదు.
చెన్నారెడ్డి గారి వ్యవహార శైలి చాలా విలక్షణంగా వుండేది. మొదటిసారి సీఎం అయినప్పుడు చేతిలో వెండి పిడి తాపడం చేసిన పొన్నుకర్రతో అధికార దర్పం ప్రదర్శించిన తీరు ఆయన్ని విమర్శలకు గురిచేసింది. ఆయన పార్టీకే చెందిన బీ. రామారావు అనే జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఆయన్ని అనుకరిస్తూ శాసనసభలో పొన్నుకర్ర వూపుకుంటూ తిరగడం ఒక ఉపాఖ్యానం.
పేరుకుపోయిన ఫైళ్ళను ఒక్క పెట్టున క్లియర్ చేయడానికి ఆయన అనేక పద్దతులు అనుసరించేవారు. ఒక్కోసారి వూరికి బాగా దూరంగా వున్న బీ హెచ్ ఈ ఎల్ గెస్ట్ హౌస్ ల్లో రాత్రి పొద్దుపోయేదాకా వుండి పని పూర్తి చేసేవారు. అలాగే హైదరాబాదు నుంచి యే విశాఖపట్నమో వెళ్ళాల్సి వస్తే, ఫైళ్ళు వెంటబెట్టుకుని రైల్లో ప్రయాణం చేసేవారు. రైలు కాజీపేటలో ఆగగానే అప్పటివరకు సంతకం చేసిన ఫైళ్ళను హైదరాబాదు చేర్చడానికి ప్రభుత్వ వాహనం ఒకటి అక్కడ స్టేషన్లో సిద్దంగా వుండేది. అలాగే ఖమ్మం, విజయవాడ వచ్చేసరికి మరికొన్ని ఫైళ్ళు చూసి సంతకం చేసేవారు. అవన్నీ ఆ రాత్రికి రాత్రే హైదరాబాదులోని సచివాలయానికి చేరేవి.
చెన్నారెడ్డి గారికి అభిజాత్యం ఎక్కువ కావొచ్చుకాని, ప్రచారంలో వున్నట్టు కుల దురభిమానం లేదని ఆయన్ని బాగా ఎరిగున్న వారు చెబుతుంటారు. రెండోసారి పదవీ గండం దాపురించినప్పుడు, రేపోమాపో ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్న సమాచారం తెలియగానే చెన్నారెడ్డి మద్దతుదారులయిన నాటి మంత్రులు శ్రీ బాగారెడ్డి, శ్రీ హషీం కలసి నామినేటేడ్ పదవుల భర్తీ కోసం ఒక జాబితా తయారు చేసి ఇచ్చారు. దాన్నొకసారి పరకాయించి చూసిన చెన్నారెడ్డి గారు 'ఇదేమిటయ్యా అందరూ రెడ్లే వున్నారు, వేరేవాళ్ళు ఎవరూ మీ కంటికి ఆనలేదా!' అని నిలదీశారు. అప్పుడు వాళ్లు ఇచ్చిన సమాధానం ఆనాటి వాస్తవ రాజకీయ పరిస్తితికి అద్దం పడుతుంది.'రెడ్లు కానివాళ్ళు ఇంకా మన వెంట ఎవరున్నారు సారూ, అందరూ అటే (అసమ్మతి వైపు) వెళ్ళిపోయారు".
ఏ రాష్ట్రంలో అయినా స్తానికంగా ఏ నాయకుడయినా బలపడుతున్నాడని అనుమానం వచ్చినా సరే, కాంగ్రెస్ అధిష్టానం వూరుకునేది కాదు. వెంటనే అతడి మీద నిర్దాక్షిణ్యంగా వేటు వేసేది. ఒక్కోసారి ఆ చర్య ఆత్మహత్యాసదృశమైనా సరే ఎంతమాత్రం ఉపేక్షించేది కాదు. చెన్నారెడ్డి వంటి నాయకులు కూడా అధిష్టానానికి అణగిమణగి వున్నట్టు వుండేవారు కాని, ఒక్కోసారి ఆ అసహనం బయటకు వస్తుండేది. చెన్నారెడ్డి వ్యతిరేకులు ఆ రోజుల్లో ప్రభలు వెలిగిపోతున్న సంజయ్ గాంధీ సాయంతో నాయకత్వ మార్పిడి విషయంలో అధిష్టానం  ఒక నిర్ణయానికి రాగలిగేట్టు చేయగలిగారు. అప్పట్లో సంజయ్ ఏది చెబితే అంత. ఆయన మాటకు ఎదురు వుండేది కాదు. తనని తొలగించే ప్రయత్నంలో సంజయ్ హస్తం వుందని భావించే వారేమో, ఆయనంటే చెన్నారెడ్డి గారికి గుర్రుగా వుండేది. ఈ నేపధ్యంలో సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించడంతో రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు తాత్కాలికంగా వాయిదాపడింది. సంజయ్ అస్థికలను, దేశంలోని ప్రధాన నదులతో పాటు, గోదావరి నదిలో నిమజ్జనం చేసేందుకు అట్టహాసంగా ఏర్పాట్లు జరిగాయి. హైదరాబాదు వచ్చిన అస్థికల పాత్రను ప్రత్యేక రైలు  బోగీలో వెంట తీసుకుని ముఖ్యమంత్రి రాజమండ్రి వెళ్లారు. ఒక బోటులో చెన్నారెడ్డి ఆయన పరివారం గోదావరి నదిలో కొంత దూరం వెళ్లారు. ఆకాశవాణి విలేకరిగా టేప్ రికార్డర్ తో నేనూ వెంట వెళ్లాను. నిమజ్జనం అయిన తరువాత అక్కడ విలేకరులతో మాట్లాడారు. చుట్టూ మూగిన జనాలతో అంతా గందరగోళంగా వుంది. తిరిగి హైదరాబాదు వెళ్ళడానికి రైలు ఎక్కిన తరువాత నాకు కబురు వచ్చింది. వెళ్లాను. ముఖ్యమంత్రి పేషీలో పనిచేసే ఒక ఐ ఏ ఎస్ అధికారి పరమహంస గారు,  'సీ ఎం మాట్లాడింది మొత్తం రికార్డ్ చేసారా’ అని అడిగారు. ఔనన్నాను. వినిపించమన్నారు. కేసెట్ రివైండ్ చేసి వినిపించాను. అప్పుడు ఆశ్చర్యపోవడం నా వంతు అయింది. సంజయ్ గాంధీ మరణం తనకు బాగా బాధ కలిగించిందని చెన్నారెడ్డి చెప్పారు. కానీ ఆ వాక్యం ఇలా మొదలయింది. "ఐ యాం హ్యాపీ దట్ ...సంజయ్.....(సంజయ్ గాంధీ మరణించడం నాకు చాలా....ఆనందం...) తరువాత నాలుక కరుచుకుని బాధ కలిగించిందని అన్నారు.
ముఖ్యమంత్రి పేషీలో పనిచేసేవారు యెంత అప్రమత్తంగా వుంటారో తెలుసుకోవడానికి ఇదొక ఉదాహరణ. మొత్తం మీద అసమ్మతి సెగలు పనిచేసో, లేక దాన్ని అడ్డం పెట్టుకుని చెన్నారెడ్డి అడ్డు తొలగించుకోవాలని శ్రీమతి గాంధీ భావించారో, కారణం ఏదయినా, 1980 అక్టోబర్ 10 న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
చెన్నారెడ్డి 1989 లో రెండోమారు ముఖ్యమంత్రి అయినప్పుడు, నేను మాస్కోలో వున్నాను. అప్పుడు ఆయన పేషీలో పీ ఆర్ వొ గా చేరింది నా మిత్రుడు జ్వాలా నరసింహారావు. రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖరరావు వద్దకూడా, జ్వాలా  సీ పీ ఆర్ వొ గా దాదాపు పదేళ్లు పనిచేశాడు. పాతికేళ్ళ విరామం తరువాత ఆయన అదే పదవిలో చేరడం ఒక విశేషం.
1989 లో కూడా ఇదే అదే సీను రిపీట్ అయింది. పీసీసీ అధ్యక్షుడిగా వుండి, ఎన్నికల్లో ఎన్టీఆర్  నాయకత్వంలోని అధికార తెలుగుదేశం పార్టీని వోడించి, కాంగ్రెస్ ను మళ్ళీ అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఆయనదే . కానీ ఏడాదిలోనే చెన్నారెడ్డిని తిరిగి మాజీ ముఖ్యమంత్రిని చేసింది కూడా అదే అసమ్మతి. అదే అధిష్టానం.
చెన్నారెడ్డి గారితో నా సొంత అనుభవం ఒకటి చెప్పాలి.
ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఆకాశవాణి ఏర్పాటుచేసిన ఒక శిక్షణ కోసం ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పట్లా జర్నలిష్టులకు ఢిల్లీ ఏపీ భవన్ గెస్ట్ హౌస్ లో ప్రత్యేక కేటగిరీ వుండేది కాదు. గెస్ట్ హౌస్ కూడా ప్రస్తుతం వున్న విలాసవంతమైన పలు అంతస్తుల భవనం కాదు. పక్కనే ఆనుకుని వున్న అశోకా రోడ్లో మొదటి నెంబరు భవనం. పాతదే అయినా చాలా వసతిగా వుండేది. రోజు కిరాయి కూడా తక్కువే. అయితే, శిక్షణ కోసం వెళ్లడం వల్ల ఎక్కువ రోజులు వుండాల్సి వచ్చింది. హైదరాబాదు తిరిగివచ్చిన తరువాత ప్రైవేట్ అతిధుల జాబితాలో పెట్టి బిల్లు పంపించారు. వందల్లోనే వున్నా అప్పటి ప్రమాణాల ప్రకారం భారమే అనిపించి, సీ.ఎం. చెన్నారెడ్డి గారి దృష్టికి తీసుకు వెళ్లాను. ఆయన ఓ ధరఖాస్తు ఇమ్మన్నారు. వెంటనే ఓ జీవో జారీ అయింది. అక్రిడిటేషన్ కలిగిన జర్నలిష్టులను కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమానంగా పరిగణిస్తూ ఇచ్చిన జీవో అది. దాని కాపీ మా ఆఫీసు చిరునామాతో నాకు కూడా పంపారు. చాలాకాలం వుంది కానీ, మేము మాస్కో వెళ్ళినప్పుడు ఎక్కడో కాగితాల్లో మరుగునపడి, ఇప్పుడు కానరావడం లేదు. జర్నలిష్టులు ఎవరి వద్ద అన్నా వుంటే చూడండి. ఆ జీవోలో నా పేరు కూడా వుంది. (After careful consideration of the representation of Bhandaru Srinivasa Rao, the government…)  'పలానా శ్రీనివాసరావు ఇచ్చిన ధరకాస్తును జాగ్రత్తగా పరిశీలించిన మీదట ప్రభుత్వం .....' అని వుంటుంది.

 

చిన్న తోక పిట్ట: మర్రిచెన్నారెడ్డి గారు  పుట్టినప్పుడు జన్మ నక్షత్రం ప్రకారం అచ్యుతరెడ్డి అని నామకరణం చేసారు. చనిపోయిన తన తండ్రిని తలచుకుంటూ తల్లి శంకరమ్మ, పిల్లవాడిని చెన్నారెడ్డి అంటూ పిలిచేది. చివరికి ఆ పేరే స్థిరపడిపోయిందట.

 

కింది ఫోటో:

ఇందిరాగాంధితో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి







 

 (ఇంకా వుంది)