15, ఫిబ్రవరి 2014, శనివారం

'ఐశావిట్, నోశావిట్'



అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాలు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతున్నప్పుడు స్పీకర్ నోటి వెంట - అర్ధం అయీ కానట్టుగా  'ఐశావిట్, నోశావిట్' అనే పదాలు వినబడుతుంటాయి. నిజానికి వీటిని 'ayes have it, noes have it' అని పలకాలి.
కాలిన్స్ ఇంగ్లీష్ నిఘంటువు ప్రకారం - ayes have it అంటే  those who voted in favour of something have won (ఎక్కువమంది అనుకూలురు).noes have it అంటే there is a majority of votes in the negative (ఎక్కువమంది వ్యతిరేకులు)


14, ఫిబ్రవరి 2014, శుక్రవారం

లెస్స పలికిన చైనా


వార్త - వ్యాఖ్య  
వార్త : "భారత్ ది అపరిపక్వ ప్రజాస్వామ్యం : చైనా (ఈనాటి 'ఈనాడు' దిన పత్రిక మెయిన్ ఎడిషన్ రెండో పేజీ)
"భారత్ తో సహా అనేక ఆసియా దేశాల్లో నేటికీ అపరిపక్వ ప్రజాస్వామ్యమే నడుస్తోందని చైనా వ్యాఖ్యానించింది. ఈ పరిస్తితి ఆయా దేశాల ఆర్ధిక పురోగతిని దెబ్బతీస్తోందని పేర్కొంది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లోని  పార్టీలన్నీ వోట్ల రాజకీయాలకే పెద్ద పీట వేస్తున్నాయని విశ్లేషించింది. ప్రజాస్వామ్యం ఘర్షణ వాతావరణానికి దారితీస్తే, (జరగనున్న) ఎన్నికలు యుద్ధవాతావరణాన్ని తలపిస్తాయని (జోస్యం) చెప్పింది.

వ్యాఖ్య : "కాదనేందుకు ఏముంది ? లెస్స పలికితివి చైనా!" 
(14-02-2014)   

13, ఫిబ్రవరి 2014, గురువారం

వ్యాఖ్య అవసరం లేని వార్తలు


(ఈ మధ్యాహ్నం టీవీల్లో దొర్లిన స్క్రోలింగులు)
"ఇప్పటికీ సోనియానే మా లీడర్ - విభజననే వ్యతిరేకిస్తున్నాం" - కిరణ్
"టీ బిల్లు లోక సభలో ప్రవేశపెట్టారు" - దిగ్విజయ్
"ప్రవేశపెట్టలేదు" - బీజేపీ నేత సుష్మాస్వరాజ్
"మ్యాచ్ పూర్తికాలేదు, లాస్ట్ బాల్ మిగిలే వుంది" - సీఎం

"దారులు వేరయినా బారులొక్కటే"

వార్త - ఈరోజు (13-02-2014) 'ఆంధ్ర జ్యోతి' మెయిన్ ఎడిషన్ ఏడో పేజీ:
"కాలు దువ్వారు - కలిసి భోంచేశారు"
న్యూ ఢిల్లీ లోని ఏపీ భవన్ బుధవారం కూడా ప్రత్యేక, సమైక్య నినాదాలతో దద్దరిల్లింది.తెలంగాణా - సమైక్య వాదులు ఎదురెదురుగా భైఠాయించి పోటాపోటీ నినాదాలతో హోరెత్తించారు. సై అంటే సై అంటూ కాలు దువ్వారు. ....ఓ రెండు గంటలు గడిచాక అందరికీ ఆకలైంది. నినాదాలకు విరామమిచ్చి విడివిడిగా క్యాంటీన్ దారి పట్టినా , అక్కడ మాత్రం కలివిడిగా తిరుగుతూ భోజనాలు ముగించారు."

వ్యాఖ్య - "దారులు వేరయినా బారులొక్కటే"     

9, ఫిబ్రవరి 2014, ఆదివారం

ధర్మ సందేహం


"కలిపేస్తే విడదీస్తాం" - డిగ్గీ
"విడదీస్తే కలిపేస్తాం" - కేసీఆర్  (ఈరోజు 'ఆంధ్ర జ్యోతి'లో వార్త)
"నన్నోడి తన్నోడెనా ? తన్నోడి నన్నోడెనా ?"
(మహాభారతం - ద్రౌపదీ వస్త్రాపహరణ ఘట్టంలో పాంచాలి లేవనెత్తిన 'ధర్మ సందేహం' - వ్యాఖ్య)
(09-02-2014)

20, జనవరి 2014, సోమవారం

మాయమై పోతున్నవమ్మా!


ఎనభయ్యవ దశకం పూర్వార్ధంలో  స్నేహితుడొకడిచ్చాడని చెప్పి మా పిల్లలు  ఓ తెలుగు సినిమా క్యాసెట్ ఇంటికి పట్టుకొచ్చారు. కాసెట్ అయితే వుంది కానీ దాన్ని టీవీ (నలుపు తెలుపు) తెరపై చూడడానికి వీడియో క్యాసెట్ ప్లేయర్ (వీ సీ పీ ) లేదు. నాడా దొరికిందని ఘోడా కోసం వెదికినట్టు చిక్కడపల్లిలో ఓ షాపునుంచి దాన్ని గంటకు ఇంత అని రెంటుకు  తీసుకొచ్చి ఇంట్లో  ఆ సినిమా చూసాం. ఆ తరువాత అందరి  ఇళ్ళల్లో వీసీపీలు, వీసీఆర్ లు గృహప్రవేశం చేశాయనుకోండి. అది వేరే కధ.
మళ్ళీ ఇన్నేళ్ళ తరవాత - మా బావగారి డెబ్బయ్యేడవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని 1995 లో తీసిన  వీడియో క్యాసెట్ చూడాలనిపిస్తే -  వీసీఆర్ అనే పరికరం ఇళ్లల్లోనే కాదు షాపుల్లో కూడా మాయమై పోయింది. ఒకప్పుడు వీసీఆర్ ఇంట్లో వుంటే  ఘనంగా చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడా మాట చెబితే నమ్మేవాళ్ళు వుండరేమో. ఎందుకంటె ఈ నాటి పిల్లలకు ఆనాటి  వీడియో క్యాసెట్లు, వీడియో ప్లేయర్లు చూసివుండే అవకాశం లేదు కాబట్టి.
నిన్ననో మొన్ననో పేపర్లో ఓ వార్త చదివాను.
అందుబాటులోకి వచ్చిన  టెక్నాలజీ పుణ్యమా అని, ఉత్తరాలు చదవడం దగ్గరనుంచి, టెలిఫోన్ డైరెక్టరీ  చూడడం వరకు అనేక పనుల అవసరం ఇప్పుడు జనాలకు లేకుండా పోయిందని ఓ సర్వే తేల్చిందట. ఇలాటివి దాదాపు  యాభయ్ దాకా వున్నాయని కూడా  ఆ సర్వే సారాంశం.
వెబ్ ప్రపంచం ఆవిష్కృతమైన దరిమిలా,  లోగడ ప్రజలు అలవాటు  పడిన అనేక పనుల  అవసరం నేటి  ప్రపంచంలో లేకుండాపోయింది. వెనుక ఏదయినా ఫోను నెంబరు కావాల్సివస్తే, టెలిఫోన్  డైరెక్టరీ తో పనిపడేది. ఇప్పుడు వాటిని చూసేవారే లేరు. ఇంటర్ నెట్ వినియోగం  ఇంకా పూర్తిగా  వ్యాపించని కొన్ని దేశాల మాటేమో గాని ఇప్పుడు అనేకానేక దేశాల్లో ట్రావెల్ సంస్తల కార్యాలయాలకు వెళ్లి ప్రయాణాల టిక్కెట్లు కొనుక్కునే వారి సంఖ్య నామమాత్రం. పోస్ట్ కార్డులు, పబ్లిక్ టెలిఫోన్ బాక్సులు, ఫోటో ప్రింటింగ్, టెలిఫోన్ నెంబర్లను  గుర్తుగా రాసుకునే చిన్నిచిన్ని  పుస్తకాలు క్రమంగా కనుమరుగైపోతున్నాయి అని లండన్ కు చెందిన మొజి కంపెనీ చేసిన సర్వే తెలుపుతోంది. ఫిలిం షో టైమింగులు చెక్ చేసుకోవడానికి పేపర్లు తిరగేయడం కూడా బాగా తగ్గిపోతోంది.

నిన్న మొన్నటిదాకా కళ్ళముందు కదలాడిన వస్తువులు కళ్ళముందే కనుమరుగు అవుతూ వుండడం ఓ విషాదం.

గతం గుర్తులు చెరిగిపోతున్నాయి


ఈరోజు పత్రికల్లో రెండు చిన్న వార్తలు వచ్చాయి. ఒకటి, హైదరాబాదు నగరంలో అతివేగంగా  అమలవుతున్న మెట్రో రైలు  ప్రాజెక్టుపై  ప్రజలకు అవగాహన కలిగించే ఫోటో ప్రదర్శన గురించిన వార్త. నగరంలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో దాన్ని ప్రారంభించడంలో ఉద్దేశ్యం నిర్వాహకులకే తెలియాలి. మెట్రో రైళ్ళను సాధారణంగా దిగువ, మధ్య తరగతి వాళ్ళతో పాటు సాధారణ ప్రజానీకం ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశం వుంటుంది. ఫైవ్ స్టార్  సంస్కృతికి అలవాటుపడిన వారు ఏదో ఒకసారి సరదాకు మెట్రో ఎక్కుతారేమోకాని ‘కార్లు’ దిగిరారు. అలాటి పెద్ద హోటళ్ళలో  ఇలాటి ప్రదర్శనలు ఏర్పాటు చేయడం వల్ల  ప్రయోజనం ఏముంటుందో అన్నది నిర్వాహకులకే తెలియాలి.  కానీ, మెట్రో నిర్మిస్తున్నది  అల్లాటప్పా సంస్థ కాదు. అలాటి  వాళ్లని ఫైవ్ స్టార్ హోటళ్ళు వొదిలిరమ్మనడం అత్యాశే అవుతుందేమో!


మెట్రో రైలు మార్గం నిర్మాణం కోసం నగరంలో అనేకచోట్ల పాత నిర్మాణాలను తొలగించేందుకు చర్యలను వేగవంతం చేస్తున్నారన్నది మరో వార్త. అభివృద్ధి వల్ల వాటిల్లే తప్పనిసరి సమస్యల్లో ఇదొకటి. పాత కట్టడాలను తొలగించడం తప్పనిసరి అయినప్పుడు వాటిని ఫోటోలు తీయించి భావితరాలకోసం భద్రపరచడం నిర్మాణ సంస్థల బాధ్యత. అభివృద్ధి కార్యక్రమాల కారణంగా అనేక నగరాల రూపురేఖలు అనూహ్యంగా అతివేగంగా మారిపోతున్నాయి. వెనుక నగరం ఇలా వుండేది అని చెప్పుకోవడానికి ఏమీ మిగిలేట్టు లేదు. ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తి ఒకరు వున్నారు. ఇప్పుడు దేశంలో వున్నారో, వాళ్ల పిల్లల వద్ద అమెరికాలో వున్నారో తెలియదు. ఆయన ఎవ్వరో కాదు విజయవాడ నగరం పూర్వ మేయర్ శ్రీ జంధ్యాల శంకర్. ఆయన బెజవాడ నగరానికి చెందిన అనేక పాత భవనాలను (రాజగోపాలచారి రోడ్డులోని లాయర్ చక్రవర్తి గారి ‘శ్వేత భవనం’ వాటిల్లో ఒకటి) ఫోటోలు తీయించి పెట్టారని విజయవాడ ఆకాశవాణిలో చాలాకాలం వార్తావిభాగం న్యూస్ ఎడిటర్ గా పనిచేసిన శ్రీ ఆర్.వీ.వీ. కృష్ణారావు చెప్పారు. మెట్రో నిర్మాణ సంస్థ తలచుకోవాలే కాని ఇదేమంత పెద్ద విషయం కాదు. నన్నడిగితే పాత నిర్మాణాలను కూలగొట్టి కొత్తవి నిర్మించేందుకు అనుమతులు కోరేవారు విధిగా పాత కట్టడం ఫోటో జత చేయాలని అధికారులు నిబంధన విధిస్తే బాగుంటుందేమో! (20-01-2014)