20, జనవరి 2014, సోమవారం

గతం గుర్తులు చెరిగిపోతున్నాయి


ఈరోజు పత్రికల్లో రెండు చిన్న వార్తలు వచ్చాయి. ఒకటి, హైదరాబాదు నగరంలో అతివేగంగా  అమలవుతున్న మెట్రో రైలు  ప్రాజెక్టుపై  ప్రజలకు అవగాహన కలిగించే ఫోటో ప్రదర్శన గురించిన వార్త. నగరంలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో దాన్ని ప్రారంభించడంలో ఉద్దేశ్యం నిర్వాహకులకే తెలియాలి. మెట్రో రైళ్ళను సాధారణంగా దిగువ, మధ్య తరగతి వాళ్ళతో పాటు సాధారణ ప్రజానీకం ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశం వుంటుంది. ఫైవ్ స్టార్  సంస్కృతికి అలవాటుపడిన వారు ఏదో ఒకసారి సరదాకు మెట్రో ఎక్కుతారేమోకాని ‘కార్లు’ దిగిరారు. అలాటి పెద్ద హోటళ్ళలో  ఇలాటి ప్రదర్శనలు ఏర్పాటు చేయడం వల్ల  ప్రయోజనం ఏముంటుందో అన్నది నిర్వాహకులకే తెలియాలి.  కానీ, మెట్రో నిర్మిస్తున్నది  అల్లాటప్పా సంస్థ కాదు. అలాటి  వాళ్లని ఫైవ్ స్టార్ హోటళ్ళు వొదిలిరమ్మనడం అత్యాశే అవుతుందేమో!


మెట్రో రైలు మార్గం నిర్మాణం కోసం నగరంలో అనేకచోట్ల పాత నిర్మాణాలను తొలగించేందుకు చర్యలను వేగవంతం చేస్తున్నారన్నది మరో వార్త. అభివృద్ధి వల్ల వాటిల్లే తప్పనిసరి సమస్యల్లో ఇదొకటి. పాత కట్టడాలను తొలగించడం తప్పనిసరి అయినప్పుడు వాటిని ఫోటోలు తీయించి భావితరాలకోసం భద్రపరచడం నిర్మాణ సంస్థల బాధ్యత. అభివృద్ధి కార్యక్రమాల కారణంగా అనేక నగరాల రూపురేఖలు అనూహ్యంగా అతివేగంగా మారిపోతున్నాయి. వెనుక నగరం ఇలా వుండేది అని చెప్పుకోవడానికి ఏమీ మిగిలేట్టు లేదు. ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తి ఒకరు వున్నారు. ఇప్పుడు దేశంలో వున్నారో, వాళ్ల పిల్లల వద్ద అమెరికాలో వున్నారో తెలియదు. ఆయన ఎవ్వరో కాదు విజయవాడ నగరం పూర్వ మేయర్ శ్రీ జంధ్యాల శంకర్. ఆయన బెజవాడ నగరానికి చెందిన అనేక పాత భవనాలను (రాజగోపాలచారి రోడ్డులోని లాయర్ చక్రవర్తి గారి ‘శ్వేత భవనం’ వాటిల్లో ఒకటి) ఫోటోలు తీయించి పెట్టారని విజయవాడ ఆకాశవాణిలో చాలాకాలం వార్తావిభాగం న్యూస్ ఎడిటర్ గా పనిచేసిన శ్రీ ఆర్.వీ.వీ. కృష్ణారావు చెప్పారు. మెట్రో నిర్మాణ సంస్థ తలచుకోవాలే కాని ఇదేమంత పెద్ద విషయం కాదు. నన్నడిగితే పాత నిర్మాణాలను కూలగొట్టి కొత్తవి నిర్మించేందుకు అనుమతులు కోరేవారు విధిగా పాత కట్టడం ఫోటో జత చేయాలని అధికారులు నిబంధన విధిస్తే బాగుంటుందేమో! (20-01-2014)

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

అవునండి, మీరు చెప్పినది నిజం. ఎవరిదో అయినా సరే...మనం చిన్నప్పటి నుండి చూస్తున్న ఒక పాత ఇల్లుని పడగోట్టేస్తుంటే బాధ కలుగుతుంది. అయితే, ఇదే బాధ సెంటిమెంటు ఆ భవన యజమానులకి కూడా ఉంటే వారు తప్పకుండా ఫోటోలు, విడియోలు తీసుకుంటారు. కానీ, ఇప్పటి డబ్బు కాలంలో ఇలాంటి సెంటిమెంటులు కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోయ్యే వారే ఎక్కువ... నిజమే,సెంటిమెంటులని కూడా చట్టం చేస్తే కానీ పాటించ లేని దుస్తితిలో ప్రజలున్నప్పుడు...ఇలాంటి వాటికి కూడా ఒక చట్టం తీసుకురాక తప్పాదు...

astrojoyd చెప్పారు...

when i visited shakesphears house in 1996,at england i surprised why bcz i red the descriptions of his house in world history almanics in 1982,what i red was actually seen by me in 1996.They have taken such a care that no one should not alter the historic monuments.Even in the case of new roads nd bridges projects westreners wont spoil any of the citys existing morphology.we should learn this beautifull art of protecting city scapes from them...i can understand ur feelngs rao jee...

Jai Gottimukkala చెప్పారు...

@astrojoyd: లండన్ కోవెంట్ గార్డెన్ ప్రాంతంలో మెట్రో వల్ల పోయిన చారిత్రిక కట్టడాల పునర్నిర్మాణానికి వేలాది కోట్ల పౌండులు ఖర్చు పట్టారు.

మరో వైపు మన వెధవలు అభివృద్ధి పేరు చెప్పి నగర చరిత్రను, అందాన్ని సర్వనాశనం చేస్తున్నారు. వారసత్వసంపద & సంస్కృతి మీద ఇంగ్లీషు వాళ్ళకున్న గౌరవంలో వెయ్యో వంతు మన పాలకులకు లేకపోవడం హైదరాబాదీల దౌర్భాగ్యం.