15, జనవరి 2014, బుధవారం

ఎవరా జర్నలిష్టు ........అని మాత్రం అడక్కండేం......


ఇది ఇప్పటి మాటకాదు. ఇది జరిగిన నాటికే ఆయన చేయి తిరిగిన పత్రికారచయిత. అంతేకాదు, బాగా ప్రాచుర్యంలో వున్న పత్రిక్కి సంపాదకుడు కూడా. అనుదినం రాసే సంపాదకీయాలతో పాటు వారం వారం కలం పేరుతొ ఆయన రాసే ప్రత్యేక వ్యాసాల పట్ల ఆకర్షితులై, అభిమానులుగా మారిన పాఠకులు ఆయనకు వేల సంఖ్యలో వుండేవారు. ఇదిలా వుంచితే....


హైదరాబాదు దూరదర్శన్ లో తెలుగు వార్తలతో పాటు వార్తాసంబంధిత కార్యక్రమాలు మొదలయిన రోజులవి. ఆ కార్యక్రమాలు పర్యవేక్షించి నిర్వహించే అధికారికి పైన పేర్కొన్న జర్నలిష్ట్ అంటే వల్లమాలిన అభిమానం. ఒక్క సారయినా ఆ జర్నలిష్టుతో ఏదో ఒక ఇంటర్వ్యూనో లేదా ఆయన పాల్గొన్న ఏదయినా కార్యక్రమాన్నో బుల్లితెరపై చూపాలన్నది ఆయన ప్రగాఢ అభిమతం. చాన్నాళ్ళకు కానీ అది నెరవేరలేదు. ఎందుకంటే ఆయనకు ఇలా టీవీల్లో కనిపించడం ఇష్టం వుండదు. మొత్తానికి డీడీ అధికారి ఎంతో బామాలి బతిమాలి ఆయన్ని స్టూడియోకు తీసుకువచ్చారు. అప్పటికింకా కలర్ టీవీ శకం మొదలు కాలేదు. స్టుడియోలో జర్నలిష్టు కూర్చున్న తరువాత లైటింగు అదీ సరిచేస్తున్న కెమెరామన్  ఆయన వేసుకొచ్చిన చొక్కా రంగు చూసి  పెదవి విరిచాడు. వెనుక వున్న బ్యాక్ గ్రౌండ్ రంగుకు ఆ చొక్కా రంగు మ్యాచ్ కావడం లేదన్నది ఆయన అభ్యంతరం. అయితే దాన్ని  సంపాదకులవారు ఏమాత్రం  లెక్కపెట్టలేదు. ఇలా టీవీ కోసం చొక్కా రంగులు, రంగుల చొక్కాలు మార్చడం తన వల్ల కాదని చెప్పి బయటకు వెళ్ళబోయారు. అదీ నిజమే. ఆయన కొన్ని దశాబ్దాలుగా తన ఆహార్యాన్ని యెంత మాత్రం మార్చుకోకుండా ఒకేరకమైన దుస్తులు ధరిస్తూ  వస్తున్నారు. ఆయనలా భీష్మించడంతో దూరదర్శన్ అధికారులే చివరకు  రాజీ పడాల్సివచ్చింది. మొత్తానికి ఏమైతేనేం ఆ కార్యక్రమం రికార్డింగు పూర్తిచేసి వూపిరిపీల్చుకున్నారు.
ఇది జరిగి ఏండ్లూపూండ్లు గడిచిపోయాయి. దూరదర్శన్ కు పోటీగా ‘ఏ టు జడ్’  ప్రైవేట్ టీవీలు రంగప్రవేశం చేశాయి. ఇరవై నాలుగ్గంటల న్యూస్ ఛానల్స్ అందుబాటులోకి వచ్చాయి. కలర్ టీవీ సెట్లు ఇంటింటా కొలువు తీరాయి. ఇప్పుడదే జర్నలిష్టు వివిధ రంగుల చొక్కాలు ధరించి వేర్వేరు ఛానళ్ళలో దర్శనమిస్తున్నారు.


ఇది రాసికూడా ‘చాలాకాలమయింది’ అని గమనించ ప్రార్ధన.

2 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

మానవసమూహం యొక్క గొప్ప కుతూహలం ఏమిటంటే కాలం‌ మీద పెత్తనం చేయాలని.

ఏదో కొద్దో గొప్పో అది కాస్తా సాధించామని మనుషులు భావించుకుని సంబరపడే సమయాల్లో ఒక్క నిజం ముందుకు వస్తుంది.

ఎంతో కొంత మారిన కాలం, కొద్దికొద్దిగా మనిషిని చివరకు ఎంతో మార్చివేసిందన్నదే ఆ నిజం.

కారణం చాలా సరళమే. ప్రతి మనిషీ తాను కూడా తన కాలంలో ఒక భాగమే కాని వేరు కాడు.

ఇక్కడొక సందేహం. నిజంగానే కాలం మారుతోందా?
కాలం మారిందన్న భ్రమతో‌ మనిషే మారుతున్నాడా?

ఇక్కడ కూడా ఒక ఉపపత్తి చెప్పవచ్చును.
కాలం‌ అనేది మనిషి మార్చగలిగితే అది తన అస్తిత్వాన్ని కోల్పోయే అవకాశం తప్పకుండా ఉంది.

ఈ కాలాన్ని మార్చటం అనే భ్రమలో మనిషే తన అస్తిత్వాన్ని పోగొట్టుకుంటున్నాడు. మనిషే తనకు తెలిసీ, తెలియకా కూడా నిత్యం‌ మారుతూనే ఉన్నాడు.

మారేది మనిషే. అవును మరి మార్పులేకుండా ఉంటే మనిషి ఐతే భగవంతుడవ్వాలి లేకపోతే ఒక కఠినపాషాణం ఐనా అవ్వాలి.
పాషాణాలూ కాలం గడిచేకొద్దీ అరిగిపోవచ్చు, విరిగిపోవచ్చు. భగవంతుడి సంగతి అనిశ్చితిలో ఉంది మనిషికి సంబంధించినంత వరకూ. ఇకపోతే మనిషి మారుతూ ఉండటం అతని ప్రవృత్తి లక్షణం అన్నమాట.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@శ్యామలీయం - సవివరణ విశ్లేషణకు కృతజ్ఞతలు ౦ భండారు శ్రీనివాసరావు