ఎనభయ్యవ దశకం పూర్వార్ధంలో స్నేహితుడొకడిచ్చాడని
చెప్పి మా పిల్లలు ఓ తెలుగు సినిమా క్యాసెట్ ఇంటికి పట్టుకొచ్చారు. కాసెట్
అయితే వుంది కానీ దాన్ని టీవీ (నలుపు తెలుపు) తెరపై చూడడానికి వీడియో క్యాసెట్
ప్లేయర్ (వీ సీ పీ ) లేదు. నాడా దొరికిందని ఘోడా కోసం వెదికినట్టు చిక్కడపల్లిలో ఓ
షాపునుంచి దాన్ని గంటకు ఇంత అని రెంటుకు తీసుకొచ్చి ఇంట్లో ఆ సినిమా
చూసాం. ఆ తరువాత అందరి ఇళ్ళల్లో వీసీపీలు, వీసీఆర్ లు
గృహప్రవేశం చేశాయనుకోండి. అది వేరే కధ.
మళ్ళీ ఇన్నేళ్ళ తరవాత - మా బావగారి
డెబ్బయ్యేడవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని 1995 లో తీసిన వీడియో
క్యాసెట్ చూడాలనిపిస్తే - వీసీఆర్ అనే
పరికరం ఇళ్లల్లోనే కాదు షాపుల్లో కూడా మాయమై పోయింది. ఒకప్పుడు వీసీఆర్ ఇంట్లో
వుంటే ఘనంగా చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడా మాట చెబితే
నమ్మేవాళ్ళు వుండరేమో. ఎందుకంటె ఈ నాటి పిల్లలకు ఆనాటి వీడియో క్యాసెట్లు,
వీడియో ప్లేయర్లు చూసివుండే అవకాశం లేదు కాబట్టి.
నిన్ననో మొన్ననో పేపర్లో ఓ వార్త చదివాను.
అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ పుణ్యమా
అని, ఉత్తరాలు చదవడం దగ్గరనుంచి, టెలిఫోన్ డైరెక్టరీ చూడడం వరకు అనేక పనుల
అవసరం ఇప్పుడు జనాలకు లేకుండా పోయిందని ఓ సర్వే తేల్చిందట. ఇలాటివి దాదాపు
యాభయ్ దాకా వున్నాయని కూడా ఆ సర్వే సారాంశం.
వెబ్ ప్రపంచం ఆవిష్కృతమైన దరిమిలా, లోగడ ప్రజలు అలవాటు పడిన అనేక పనుల
అవసరం నేటి ప్రపంచంలో లేకుండాపోయింది. వెనుక ఏదయినా ఫోను నెంబరు
కావాల్సివస్తే, టెలిఫోన్ డైరెక్టరీ తో
పనిపడేది. ఇప్పుడు వాటిని చూసేవారే లేరు. ఇంటర్ నెట్ వినియోగం ఇంకా పూర్తిగా
వ్యాపించని కొన్ని దేశాల మాటేమో గాని ఇప్పుడు అనేకానేక దేశాల్లో ట్రావెల్
సంస్తల కార్యాలయాలకు వెళ్లి ప్రయాణాల టిక్కెట్లు కొనుక్కునే వారి సంఖ్య నామమాత్రం.
పోస్ట్ కార్డులు, పబ్లిక్ టెలిఫోన్ బాక్సులు, ఫోటో
ప్రింటింగ్, టెలిఫోన్ నెంబర్లను గుర్తుగా రాసుకునే
చిన్నిచిన్ని పుస్తకాలు క్రమంగా కనుమరుగైపోతున్నాయి అని లండన్ కు చెందిన
మొజి కంపెనీ చేసిన సర్వే తెలుపుతోంది. ఫిలిం షో టైమింగులు చెక్ చేసుకోవడానికి
పేపర్లు తిరగేయడం కూడా బాగా తగ్గిపోతోంది.
నిన్న మొన్నటిదాకా కళ్ళముందు కదలాడిన వస్తువులు కళ్ళముందే
కనుమరుగు అవుతూ వుండడం ఓ విషాదం.
3 కామెంట్‌లు:
విలువైన మనుషులే కనుమరుగైపోతున్నారు ఇక వస్తు వుల సంగతి వేరే చెప్పాలా రావు గారు
i think u know but if u want to see such precious videos u can convert the old video or audio cassettes to cd or dvd if u take them to video shop.
@అజ్ఞాత - మీరు పరిష్కారం చెబుతున్నారు. నేను రాసింది మనం పోగొట్టుకుంటున్నవాటి గురించి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి