19, జనవరి 2014, ఆదివారం

గ్రేట్ ఫెయిల్యూర్ స్టొరీ



పంతొమ్మిదివందల డెబ్బయి ఒకటి -ఆగష్టు నెల- ఇరయయ్యవ తేది.
విజయవాడ, లబ్బీపేట లోని 'ఆంద్ర జ్యోతి' కార్యాలయం.
అందులో అడుగు పెట్టి - ఎడిటర్ నార్ల వెంకటేశ్వర రావు గారిని కలుసుకున్నాను.
ఆయన ఎగాదిగా చూసి, నా పరిచయం కనుక్కుని-
'మీ అన్నయ్య ఒకటే చంపేస్తున్నాడయ్యా! పైకి పో. ఉపేంద్ర వుంటాడు. నేను పంపానని చెప్పు' అన్నారు ఫోన్ మీద చేయి వేస్తూ.
అదే నా తొట్ట తొలి ఉద్యోగ నియామకపు ఉత్తర్వు.
ఉపేంద్ర గారిని కలిసాను. కూర్చోమని సైగ చేసారు. గుర్రపు నాడా ఆకారంలో వున్నా బల్ల చివర్లో కూర్చున్నాను. పీ టీ ఐ , యు ఎన్ ఐ వార్తల్ని తెలుగులోకి తర్జుమా చేయమన్నారు. ఆ విధంగా మొదలయింది నా జర్నలిస్టు జీవితం.
ఉదయం ఎనిమిది గంటలకల్లా అన్నం తిని ఆంధ్ర జ్యోతి కి వెళ్ళే వాడిని. అన్నయ్య పర్వతాలరావు గారు ఇమ్మన్న రూపాయి నోటు వొదినె సరోజినీ దేవి నా చేతులో పెట్టేది. రాను పోను సిటీ బస్సుకు నలభై పైసలు. మధ్యాహ్నం ఆఫీసు కు ఎదురుగా వున్నా టీ స్టాల్లో ముప్పయి పైసలు పెట్టి ఒక సమోసా తిని టీ తాగేవాడిని. రోజుకు ము ప్పయి పైసలు మిగిలేవి. వేరే ఖర్చులు లేవు. అలా నెలకు సుమారు పది రూపాయలు ఆదా. అదే నా మొట్టమొదటి నెలసరి ఆదాయం.
అలా మూడు నెలలు గడిచాయి. జీతం విషయం నేను అడగను లేదు - వాళ్ళు చెప్పను లేదు. ఒక రోజు అటెండర్ నాగేశ్వరరావు నా దగ్గరకు వచ్చి ఎక్కవుంటేంట్ ని కలవమని చెప్పాడు. వెడితే- ఓ ఓచర్ మీద సంతకం చేయించుకుని పది- పది రూపాయల నోట్లు - వంద నా చేతిలో పెట్టారు. అదే నా తొలి వేతనం.
ఉద్యోగం తప్ప వేరే ధ్యాస లేని రోజులవి. రాసిన ప్రతిదీ మర్నాడు పేపర్లో రాకున్నా ప్రూఫ్ లో అచ్చయిన నా ఐటెంసుని నేనే చదువుకుని మురిసిపోయేవాడిని. నేను చేరిన కొత్తల్లోనే నార్ల గారు హైదరాబాద్ వెళ్ళిపోవడం - నండూరి రామమోహనరావు గారు బాద్యతలు స్వీకరించడం జరిగిపోయాయి.ఎందుకో ఏమోగానీ,దిన,వార పత్రికలకు సంబంధిoచిన అన్ని అంశాలలో నాకు తర్ఫీదు ఇచ్చారు. ప్రతిరోజూ ఎడిట్ పేజీలో కార్టూన్ తో కూడిన నాలుగు వాక్యాల గేయాన్ని 'వాక్టూనులు ' అనే శీర్షికతో రాసేవాడిని. సినిమా సమీక్షలు, పుస్తక సమీక్షలు, ఆదివారాల్లో పిల్లలకోసం ప్రత్యెక కధలు , బంగ్లాదేశ్ అవతరణకు దోహదం చేసిన పంతొమ్మిదివందల డెబ్బయి ఒకటి ఇండో-పాక్ యుద్ధంలో భారత సైన్యాల కదలికలను సూచించే మ్యాపులు - ఇలా అన్నింట్లో నేనున్నానంటూ వేలు పెట్టేవాడిని. శ్రీయుతులు ఉపేంద్ర, ఐ వెంకటరావు,కే.రామకృష్ణ, వీరభద్రరావు, ఎల్వీ రమణ ( ఈ మధ్యనే కాలం చేశారు), సత్యనారాయణ, ఆంజనేయులు, చంద్రశేఖర ఆజాద్ వంటి సహోద్యోగుల నడుమ నా ఆంధ్ర జ్యోతి ఉద్యోగ పర్వం నాలుగున్నర సంవత్సరాలపాటు ఇట్టే గడిచిపోయింది.
అన్నట్టు చెప్పడం మరిచాను. మొదట్లోనే నార్లగారు నాకో బ్రహ్మొపదేశం చేశారు. జర్నలిస్టు అనే వాడు ఎప్పుడూ, జేబులో రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకోవాలనే వారు. చాలా కాలంపాటు దాని పాటించాను కూడా. తర్వాతి రోజుల్లో రేడియోలో ఏదో విషయంలో పేచీ వచ్చి,రాజీనామా ఇచ్చేసి ఇంటికి వచ్చేశాను. అంతే! నెలరోజులపాటు మళ్ళీ ఆఫీసు మొహం చూడలేదు. చివరికి ఎవరో పూనుకుని రాజీ చేయడం, ఉద్యోగంలో తిరిగి చేరడం జరిగిపోయాయి. అదో అధ్యాయం.
హైదరాబాద్ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగంలో విలేకరిగా చేరడం యాదృచ్చికమే అని చెప్పాలి. అంతకుముందు ఈ ఉద్యోగాన్ని ఎంతో సమర్ధంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్న తురగా కృష్ణమోహన రావు గారు - గోల్కొండ ఎక్స్ ప్రెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లి- దురదృష్టవశాత్తు -నకిరేకల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆ విధంగా ఏర్పడ్డ ఖాళీని భర్తీ చేయడానికి ఆకాశవాణి ఇచ్చిన ప్రకటనకు అనుగుణంగా నేను ధరకాస్తు  చేసుకోవడం, ఇంటర్వ్యూ కు హాజరు కావడం - సెలెక్ట్ కావడం జరిగిపోయాయి. ఆంద్ర జ్యోతి అనుభవం ఈ ఉద్యోగం పొందడానికి అదనపు అర్హతగానే కాకుండా- అసలైన అర్హతగా తోడ్పడిందని నా నమ్మకం. రాసిన రాతలు అచ్చులో చూసుకునే అవకాశం ఆంద్ర జ్యోతి ద్వారా లభిస్తే- సొంత గొంతును తెలుగునాట నలుగురికీ వినిపించే వీలు రేడియోలో దొరికింది. వార్తా సేకరణ, కూర్పు, తెలుగులోకి అనువాదం ఇలాంటి ప్రక్రియలతో పాటు, రెగ్యులర్ న్యూస్ రీడర్లు రాని రోజున ఏకంగా స్టూడియోలోకి వెళ్లి వార్తలు చదివేయడం- వారానికి రెండు మార్లు వార్తా వాహిని - ఒకసారి జీవన స్రవంతి (రోజువారి జరిగే ఘటనలకు కొంత హాస్యాన్ని జోడించి తయారు చేసిన ప్రత్యేక వార్తలు ) ఇలా అన్నిరకాలుగా నా రేడియో జీవితాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నాను.
ఆ రోజుల్లో ఇన్ని పత్రికలూ లేవు. ఇంత మంది విలేకరులు లేరు. ముఖ్య మంత్రి నిర్వహించే విలేకరుల సమావేశానికే పది, పన్నెండు మంది హాజరైతే గొప్పగా వుండేది. నేను రేడియోలో చేరింది ఎమర్జెన్సీ రోజుల్లో కావడం - వార్తల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాగం రేడియో పై ఎక్కువగా ఆధారపడాల్సిరావడం- రేడియో విలేకరిగా నా ప్రాధాన్యతను  కొంత పెంచింది. ఇక  అంజయ్య గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు - రేడియో మీది అభిమానాన్ని, నా మీది వ్యక్తిగత అభిమానాన్ని కలబోసి ప్రదర్శించేవారు. విలేకరుల సమావేశాలను -'శ్రీనివాస్ వచ్చాడా!' అని కనుక్కుని మొదలు పెట్టడం అప్పుడప్పుడు నలుగురిలో ఇబ్బందిగా వుండేది. తన ఎయిర్ బస్ మంత్రివర్గంపై చెలరేగిన విమర్శల దరిమిలా- మంత్రుల మూకుమ్మడి రాజీనామాలను ప్రకటించడానికి ఓసారి విలేకరులకు కబురు పెట్టారు. మధ్యాన్నం వార్తల టైం దగ్గర పడుతుండడంతో-రాజీనామాల సంగతి ముందుగా నాకు చెప్పడం- విలేకరుల సమావేశం మొదలు కాకముందే ఆ సమాచారం ప్రాంతీయ వార్తల్లో ప్రసారం కావడం జరిగిపోయింది. ఇది నా వృత్తి జీవితంలో మరచిపోలేని సంఘటన.
ఆ రోజుల్లో ప్రతి రోజు సచివాలయానికి వెళ్లి మధ్యాహ్నం దాకా ప్రెస్ రూం లోనో లేదా ప్రెస్ కాన్ఫరెన్స్ ల్లోనో గడిపి- అంతవరకు సేకరించిన సమాచారం తెసుకుని న్యూస్ బుల్లెటిన్ కు అందించడానికి కాలినడకన రేడియో స్టేషన్ కు వెడుతుండే వాడిని. ఒకరోజు అలా పోతున్నప్పుడు ముఖ్యమంత్రి  పైలట్ వాహనం సైరన్ మోగిస్తూ వెళ్ళింది.అంజయ్య గారు- తన అధికారిక వాహనం అయిన అంబాసిడర్ కారులో డ్రైవర్ పక్కన ముందు సీట్ లో కూర్చునే వారు. ఆయనకు కార్యకర్తల తాకిడి ఎక్కువ. వెనుక సీట్ లో ఎవరికీ వారు దూరి పోయేవారు. ఈ ఇబ్బంది తట్టుకోవడం కోసమో ఏమో ఆయన ముందు సీట్ కి మారిపోయారు. సరే! ఆ రోజు నా పక్కనుంచి వెళ్ళిన ముఖ్యమంత్రి వాహనం కొద్దిగజాలు ముందుకు పోయి ఆగింది. ఆయన అంగరక్షకుడు బాలాజీ- - రిటైర్ అయిన తర్వాత ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో పనిచేస్తున్నారు- కిందికి దిగి ‘సీఎం గారు పిలుస్తున్నారు రండి’ అనడం- నన్ను కారు ఎక్కించుకుని రేడియో స్టేషన్ లో దింపడం క్షణాల్లో జరిగిపోయాయి. అనుకోకుండా ముఖ్యమంత్రి రేడియో స్టేషన్ కి రావడంతో మా వాళ్ళంతా అవాక్కయ్యారు. అంజయ్య గారు ఇలా నాపట్ల చూపిన అవ్యాజానురాగాలకి ఇంకా ఎన్నో ఉదాహరణలు వున్నాయి. అవి ఆయన గొప్పతనానికి, మంచి తనానికి తార్కాణాలుగా భావిస్తానే కాని , నా ప్రత్యేకత ఏమీ లేదు.
పోతే , ఎందరో మంత్రులు, ఎంతోమంది ముఖ్యమంత్రులు, డీజీపీలు ,చీఫ్ సెక్రటరీలు, సీనియర్ ఐ.ఏ.ఎస్, ఐ.పీ.ఎస్. అధికారులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, శాసన సభ్యులు - ఇందరితో సాన్నిహిత్యాలు, విందులు, వినోదాలు, విమాన యానాలు, విదేశీ ప్రయాణాలు, హెలికాఫ్టర్ చక్కర్లు - మాస్కో రేడియో ఉద్యోగ విజయాలు - ఓ విధమైన 'మత్తులో' వృత్తి జీవితం గడిచిపోయింది.
అటు చూస్తే, వ్యక్తిగత జీవితం ఓ గుండు సున్నా. జీతానికీ, జీవితానికీ పొంతన లేకపోవడంతో అందినంతవరకు అప్పులు చేయడం (చేబదుళ్లు పుట్టవు కానీ జర్నలిష్టులకు మాత్రం బ్యాంకు రుణాలు కోకొల్లలు ) వాటిని తీర్చడం కోసం మళ్ళీ కొత్తవి చేయడం - అదో రుణ చక్ర భ్రమణం. ఇలా ఊబిలో కూరుకుపోయిన జీవితానికి ఆసరాగా మా ఆవిడ నిర్మల- అమ్మ వొడిని ప్రారంభించింది. కన్న సంతానం ఇద్దరు పిల్లలతో పాటు - మరో పాతికమంది పసి పిల్లల ఆలనా పాలనా నెత్తిన వేసుకుంది. ఓ గృహిణిగా సంసార బాధ్యతలో పాలు పంచుకుంటున్నదని అనుకున్నానే కాని, అలవికాని భారం మోస్తున్నదని అనుకోలేదు. ఫలితం - పదేళ్ళ తరవాత ఆమెకు జరిగిన ఓపెన్ హార్ట్ సర్జరీ. మరో పదేళ్ళ అనంతరం మొన్నీమధ్య రెండో సర్జరీ.
ఇక వృత్తి జీవితం చివరి రెండేళ్ళు – కే.ఎస్. శర్మ గారి పుణ్యమా అని హైదరాబాద్ దూర  దర్శన్ వార్తా విభాగంలో ఆర్వీవీ గారి సారధ్యంలో దొర్లిపోయాయి. రెండువేల అయిదు డిసెంబరు ఆఖర్లో ఉద్యోగ విరమణ. మోహన్ కందా గారన్నట్టు- మనిషికి మరణం, ఉద్యోగికి రిటైర్మెంట్ రెండూ తప్పవు.
వెనక్కు తిరిగి చూసుకుంటే- ఎన్నో అనుభూతులు-అనుభవాలు. ప్లస్ లూ, మైనస్ లూ.
అన్నింటి సమగ్ర సమాహారమే జీవితం.
నిజానికి జీవితంలో ఫెయిల్యూర్ స్టొరీ లు వుండవచ్చు కానీ, ఏ జీవితం ఫెయిల్యూర్ కాదు.

(డిసెంబర్. ఆరు - రెండువేల ఆరులో ఉద్యోగవిరమణ సందర్భంలో  రాసినదానికి కొద్దిపాటి సవరణలతో )

4 కామెంట్‌లు:

పల్లా కొండల రావు చెప్పారు...

"నిజానికి జీవితంలో ఫెయిల్యూర్ స్టొరీ లు వుండవచ్చు కానీ, ఏ జీవితం ఫెయిల్యూర్ కాదు."

బాగా చెప్పారు. ప్రతీ జీవితమూ ప్రపంచానికి ఓ పాఠమే.

అజ్ఞాత చెప్పారు...

మీ బ్లాగు నిత్యం చూస్తాను. కొన్ని తిరిగి, తిరిగి చదువుతాను. చాలా బాగుంటాయి.మీరు మీ పాత్రికేయ అనుభవాల్ని ఎందుకు ఒక పుస్తకంగా తీసుకు రాకూడదు?నేను పత్రికా రంగంలో లేను. మీ అనుభవమంత లేదు నా వయసు. కాని నాకు ఆసక్తి ఉంది. మీ లాంటి వారు చరిత్రని మీ అనుభవాల రూపంలో గ్రంధస్థం చెయ్యాలి . ఇది భవిష్యత్ లో కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఆలోచించండి.ఆచరణ లో పెట్టండి శీఘ్రంగా.

శ్రీరామ

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@పల్లా కొండలరావు - ధన్యవాదాలు

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత - మీ అభిమానానికి ధన్యవాదాలు. పైకి ఎన్ని చెప్పినా ప్రతి రచయితకు తన రచనను అచ్సులోనో, పుస్తక రూపంలోనో చూసుకోవాలనే కోరిక మనసు మూలల్లో వుంటుంది. కాకపొతే గ్రంధ ప్రచురణ అనేది ఇప్పుడు తలకు మించిన భారంగా తయారయింది.మీ మెయిల్ అడ్రసు ఇస్తే మరికొంత వివరణ ఇవ్వడం సాధ్యపడుతుంది.నాది - bhandarusr@gmail.com