1, నవంబర్ 2013, శుక్రవారం

గరీబోళ్ళ బిడ్డ – నిను మరవదు ఈగడ్డ


మాజీ ముఖ్యమంత్రి అంజయ్య గారు మరణించినప్పుడు ఒక పత్రిక పెట్టిన పతాక శీర్షిక ఇది. ‘ఏ పత్రికలో ఇలా వచ్చింది – ఈ హెడ్డింగు పెట్టింది ఎవరు’ అంటూ చాలామంది అడిగారు. అంజయ్య గారు చనిపోయినప్పుడు అప్పుడు ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న శ్రీ  వర్దెల్లి మురళి ఈ శీర్షిక పెట్టారు. ప్రస్తుతం శ్రీ మురళి సాక్షి పత్రిక ఎడిటర్ గా వున్నారు.
ఎలాగూ హెడ్డింగుల ప్రసక్తి వచ్చింది కాబట్టి మరో విషయం. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మన రాష్ట్రంలో మొదటిసారి నల్గొండకు రైలు మార్గం ఏర్పాటు అయింది. అప్పుడు ఆంధ్ర ప్రభ ఎడిటర్ గా వున్న శ్రీ ఏబీకే ప్రసాద్ పెట్టిన పతాక శీర్షిక – “ నల్గొండకు రైలొచ్చింది”
ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు ఒక పత్రిక పెట్టిన హెడ్డింగు - " పేదోని అన్నం గిన్నె తొణికింది". (రెండు రూపాయల కిలో బియ్యం పధకం నేపధ్యంలో అనుకుంటాను.) ఈ శీర్షిక పెట్టింది కూడా  ఏబీకే గారే.    

పాశం యాదగిరిని తెలవని జర్నలిష్టులు హైదరాబాదులో వుండరు. చాలామందికి తెలవని సంగతి ఏమిటంటే - ఆయన ‘యాదు’ లో చాలా చక్కని చిక్కని సంగతులు ఎన్నో వున్నాయి. కదిలించి చూడాలే కాని ఇలాటి కదిలించే కబుర్లు ఎన్నో. 

పుణ్యమూర్తి పుట్టినరోజు

పుణ్యమూర్తి పుట్టినరోజు
కొందరికి అమ్మ. మరికొందరికి అత్తయ్య. ఇంకొందరికి  బామ్మ. ఎందరెందరికో అమ్ముమ్మ. ఆమే మా అమ్మ, కీర్తిశేషులు భండారు వెంకట్రావమ్మ. ఈరోజు ఆ  పుణ్యమూర్తి పుట్టినరోజు. మా  అందరి గుండెల్లో ఆమె ఇంకా జీవించే వుంది. అంచేత ఆమెకు మేము జయంతులు జరపం. ఏటా పుట్టిన రోజులే.


కృష్ణాజిల్లా జగ్గయ్యపేట తాలూకా గండ్రాయిలో పుట్టి అదే జిల్లా లోని మరో కుగ్రామం కంభంపాడును మెట్టి రాఘవరావుగారి అర్ధాంగిగా ఏడుగురు ఆడపిల్లలకి, నలుగురు మొగపిల్లలకు తల్లయి, అత్త పాత్రలో కూడా తల్లి ప్రేమనే పంచి,  భండారు వంశాంకురాలను కుల, మత, జాతి, ప్రాంతీయ భేదాలకు అతీతంగా విశ్వవ్యాప్తం చేసిన మహనీయురాలు. మా పెద్దన్నయ్య కీర్తిశేషులు భండారు పర్వతాలరావు గారు 1972 లో పూనుకుని చేసిన మా అమ్మ ‘సహస్ర  చంద్రదర్శనం’ కార్యక్రమానికి  పిల్లాజెల్లా అందరూ దేశవిదేశాలనుంచి తరలి వచ్చి ఆమె ఆశీస్సులు స్వీకరించి వెళ్ళిన శుభ సందర్భం ఇప్పటికీ మా అందరి మనస్సులో పదిలంగా వుంది.

పుణ్యలోకాలలో వున్న ఆమె ఆశీస్సులు ఇప్పటిమాదిరిగానే ఎప్పటికీ అందరికీ లభిస్తూ వుండాలని కోరుకుంటూ – భండారు కుటుంబం.                  

31, అక్టోబర్ 2013, గురువారం

దిగ్భ్రాంతి ప్రకటనలు కాదు – కావాల్సింది కనికరంతో కూడిన కార్యాచరణ


బస్సు ప్రమాదంలో నలభయ్ అయిదు మంది ప్రయాణీకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయిన దుర్ఘటనపై పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేసి చేతులు దులుపుకున్నారు. పరామర్శలతో పని ముగించుకున్నారు.  తమ వారినిపోగొట్టుకుని నిండు బాధల్లో వున్న వారి బంధువులను మరిన్ని బాధలు పెట్టే చర్యలకు స్వీకారం చుట్టారు. కాలి  బూడిద కుప్పలుగా మారిన వారిని గుర్తించడం కోసం రక్త బంధువులందరూ  హైదరాబాదు నాంపల్లిలోని ఫోరెన్సిక్ లేబొరేటరీకి పలానా సమయానికల్లా  రావాలని ఓ పత్రికా ప్రకటన చేసి వూరుకున్నారు. ఇంత కనికరం లేని అధికారులు, పాలకులు బహుశా మన దేశంలోనే వుంటారేమో. ఒక పక్క సొంత మనుషులు చనిపోయారు. ఆ బాధ ఒకటయితే సాంప్రదాయాల ప్రకారం నిర్వర్తించాల్సిన కర్మకాండల వొత్తిడి మరో పక్క.  వారిలో చాలామంది బయటి ప్రాంతాలవాళ్ళు. ఏమాత్రం బాధ్యత కలిగిన ప్రభుత్వం అయినా వారికోసం కొన్ని కనీస ఏర్పాట్లు చేసివుండేది. ఓ వంద మందికో నూటపాతిక మందికో హైదరాబాదులో ఆశ్రయం కల్పించలేని దుస్తితిలో ప్రభుత్వం వుందని అనుకోలేము. వారందరికీ ప్రభుత్వ అతిధి గృహాల్లో ఒక రోజో రెండు రోజులో వసతి  భోజన సౌకర్యాలు, లేబొరేటరీకి వెళ్ళి రావడానికి రవాణా ఏర్పాట్లు చేసివుంటే మన రాష్ట్రంలో ఒక సంక్షేమ ప్రభుత్వం పనిచేస్తోందని వాళ్లు తమ వారితో చెప్పుకునే వారు. బాధల్లో వున్నవారికి కాసింత ఆపన్న హస్తం అందించడం వల్ల సర్కారు నిధులేమీ తరిగిపోవు, కరిగిపోవు.  ‘మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం’  అని ప్రకటనలు చేయగానే సరిపోదు. ఆ చిత్తశుద్ధి ఆచరణలో కూడా కనబడాలి. ప్రభుత్వం తలచుకోవాలే కాని రక్త బంధువుల రక్త నమూనాలు వారికి ఎలాటి అసౌకర్యం లేకుండా సేకరించడం కూడా పెద్ద పనేమీ కాదు. వారి చిరునామాలు, వివరాలు అన్నీ ప్రభుత్వ అధికారుల వద్ద వున్నాయి. వాళ్ల ఇళ్లకు వెళ్ళే ఈ పని పూర్తిచేయవచ్చుకూడా.  ఇంట్లో ఓ మనిషి చనిపోయినప్పుడు ఆ ఇంట్లో పరిస్తితి యెంత దయనీయంగా వుంటుందో అర్ధం చేసుకోవడానికి పెద్ద మేధస్సు అక్కరలేదు. అర్ధం చేసుకునే మనస్సు వుంటే చాలు. రక్త నమూనాలు ఇవ్వడానికి వచ్చినవారి కడగండ్లు టీవీల్లో చూసినప్పుడు ఇలాటి కష్టం  పగవారికి కూడా రాకూడదు అనిపించింది. కానీ సర్కారు వారికి మాత్రం  చీమ కుట్టినట్టు కూడా లేదు. ఏం చేస్తాం. మన రాతల్ని బట్టే మన పాలకులు.
-    (31-10-2013)

పీవీ నరసింహారావు గారితో నా అనుభవం


ప్రధానిగా వున్నంతకాలం అందరూ ఆహా! ఓహో!!అన్నారు. పీకలలోతు  సమస్యల్లో కూరుకుపోయివున్న దేశ ఆర్ధిక వ్యవస్థను నూతన సంస్కరణలతో ఒడ్డున పడేసిన మేధావిగా కీర్తించారు. బొటాబొటి మెజారిటీ తో వున్న పాలక పక్షాన్ని అయిదేళ్ళ పాటు పూర్తి కాలంఅధికార పీఠం పై వుంచిన అపర చాణక్యుడని  వేనోళ్ళ పొగిడారు. అధికారం దూరం అయిన తరువాత, ఆయన పదవి నుంచి దిగిపోయిన తరువాత  పొగిడిన  ఆ నోళ్ల తోనే తెగడడం ప్రారంభించారు. ఆయన తరవాత కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన వ్యక్తికి ఆయన్ని మించిన గొప్ప లక్షణాలేమీ లేవు. కానీ పదవేసర్వస్వమయిన  కాంగ్రెస్ వారికి  ఆయన భజనేసర్వస్వమయిపోయింది. పీవీని విమర్శించిన పత్తిత్తులకుఆయన చేసిన మేళ్ళుకానరాలేదు. అయిదేళ్ళు తెలుగువాడిలోని వాడినీ వేడినీలోకానికి చాటిచెప్పిన వృద్ధ రాజకీయవేత్త న్యాయస్థానాలలో నిస్సహాయంగా బోనులోనిలబడినప్పుడు,  ఆయన పార్టీ వాళ్ళెవ్వరూ ఆయనను పట్టించుకోక పోగా ఏమీ తెలియనట్టు కళ్ళు’, ‘నోళ్ళు’  మూసుకున్నారు. ప్రధానిగా పీవీని సమర్ధించడం ఈ వ్యాసకర్త వుద్దేశ్యం కాదు. రాజకీయాల్లో కృతజ్ఞత, ‘విధేయత’  అనే పదాలకి  తావు లేకుండాపోయిందన్న విషయాన్ని విశదం చేయడానికే ఈ ఉదాహరణ.


(పీవీతో సోనియాగాంధీ)

పీవీ మరణించడానికి కొన్ని నెలలముందు హైదరాబాదు వచ్చారు. మాజీ ప్రధాని హోదాలో రాజ్ భవన్ గెస్టు హౌస్ లో బస చేసారు. గతంలో ప్రధానిగా ఆయన అక్కడ దిగినప్పుడు కనబడే హడావిడి యెలా వుండేదో  ఒక విలేకరిగా నాకు తెలుసు.  ఆయన చుట్టూనే కాదు చుట్టుపక్కల ఎక్కడ చూసినా  అధికారులు, అనధికారులు, మందీ మార్బలాలు, వందిమాగధులు,  ఆయన కళ్ళల్లో పడితే చాలనుకునే రాజకీయనాయకులు ఆ వైభోగం వర్ణించ తరమా? అన్నట్టు వుండేది.

మాజీ ప్రధానిగా పీవీ రాజ భవన్ లో వున్నప్పుడు నేనూ , ఆకాశవాణిలో నా సీనియర్ కొలీగ్   ఆర్వీవీ కృష్ణారావు గారు  - గవర్నర్ రికార్డింగ్ నిమిత్తం  వెళ్లి -  పని పూర్తిచేసుకున్నతరవాత - రాజ్ భవన్  గెస్ట్ హౌస్ మీదుగా తిరిగి  వెడుతూ అటువైపు తొంగి చూసాము. సెక్యూరిటీ మినహా రాజకీయుల హడావిడి కనిపించక పోవడంతో మేము లోపలకు వెళ్ళాము. అక్కడవున్న భద్రతాదికారిని  పీవీ గారిని చూడడం వీలుపడుతుందాఅని అడిగాము. అతడు తాపీగా  'లోపలకు వెళ్ళండి' అన్నట్టు సైగ చేసాడు. ఆశ్చర్యపోతూ లోపలకు అడుగు పెట్టాము.


పెట్టిన తరవాత మా ఆశ్చర్యం రెట్టింపు అయింది. పీవీ ఒక్కరే కూర్చుని టీవీలో ఫుట్ బాల్  మాచ్  చూస్తూ కనిపించారు. డిస్టర్బ్ చేశామేమో అన్న ఫీలింగుతోనే - మమ్మల్ని పరిచయం చేసుకున్నాము. లుంగీ మీద ఒక ముతక బనీను మాత్రమే వేసుకునివున్న పీవీగారు  నా వైపు చూస్తూ- 'మీ అన్నయ్య పర్వతాలరావు  ఎలావున్నాడయా!' అని అడిగేసరికి నాకు మతి పోయినంత పనయింది. ఎప్పుడో  దశాబ్దాల క్రితం,  పీవీగారు ముఖ్యమంత్రి గా వున్నప్పుడు - మా అన్నయ్య పర్వతాలరావు గారు సమాచారశాఖ అధికారిగా ఆయనకు పీఆర్వో గా కొద్దికాలం పనిచేశారు. అసలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నదే అతి కొద్దికాలం. అప్పటి విషయాలను గుర్తుపెట్టుకోవాల్సిన  అవసరం ఆయనకు లేదు.  అయినా ఆప్యాయంగా గుర్తు పెట్టుకుని మరీ అడిగారు. అదీ  పీవీగారి గొప్పతనం.  ఆ తరవాత కూడా  ఆయన ఏదో మాట్లాడుతున్నారు  కానీ మాకు కలయో వైష్ణవ మాయయోఅన్నట్టుగావుంది. మేము కలసి కూర్చుంది కొన్నేళ్ళ క్రితం వరకు దేశాన్ని వొంటి చేత్తో పాలించిన వ్యక్తితో అన్న స్పృహ వుండడం వల్ల కొంత ఇబ్బంది పడుతూ కూర్చున్నాము. కాసేపటి తరవాత కొణిజేటి రోశయ్య గారు వచ్చారు. ఆయన్ని చూడగానే  పీవీ గారి మొహంలో ఒక రిలీఫ్ కనిపించింది. రోశయ్య గారు వచ్చిన తరువాత కాసేపు వుండి మేము వచ్చేశాము. ఇది జరిగి  ఏళ్ళు గడిచిపోయాయి కానీ ఈ చక్కని జ్ఞాపకం మాత్రం మా గుండెల్లో ఇంకా తాజాగానే వుంది.  

30, అక్టోబర్ 2013, బుధవారం

అంజయ్య గారితో నా అనుభవాలు - చివరాఖరు భాగం


జ్ఞాపకాల తవ్వితీతలో జరిగిన ఓ పొరబాటు కారణంగా  ఓ అద్భుతమైన అనుభవాన్ని పంచుకోకముందే ‘ఆఖరి భాగం’ రాసేశాను. మన్నించాలి.
ఆరోజు ముఖ్యమంత్రిగా అంజయ్య గారు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. పగలల్లా విపరీతమనిన జనం తాకిడి. సాయంత్రానికి గ్రీన్ లాండ్స్ అతిధి గృహం చేరుకున్నారు. అప్పటివరకు కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నందువల్ల గెస్ట్ హౌస్ లో దిగడం ఆనవాయితీ. సమయం గడిచిపోతోంది. అక్కడా జనమే జనం. మధ్యలో ఒకసారి వెళ్ళి ఢిల్లీ ఫోను చేసి మాట్లాడారా అని అడిగాను. ఆయనకు కూడా ఏదో పొరబాటు జరిగిందని అర్ధం అయింది. పార్టీ అధ్యక్షురాలికి కృతజ్ఞతలు తెలుపుతూ ఒక పత్రికా  ప్రకటన కూడా  విడుదల చేయాలి. అప్పటివరకు చెన్నారెడ్డి గారికి పీ.ఆర్.వో. గా మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు గారు పనిచేసేవారు. ముఖ్యమంత్రి మారగానే ఆయన తన సొంత శాఖ సమాచార శాఖకు వెళ్లిపోవాలని అనుకున్నారు. ప్రెస్ రిలీజ్ తయారు చేయడానికి ఆయన్ని రమ్మంటే  ముందు ఇష్టపడలేదు. ‘సీఎం  పేషీలో మిగిలిన అధికారుల సంగతి వేరు, పీ.ఆర్.వో.  వేరు. ఈ పోస్ట్ కు కావాల్సిన వ్యక్తిని ముఖ్యమంత్రే స్వయంగా ఎంచుకుంటారు’ అన్నది ఆయన థియరీ. ఆయన్ని తీసుకురావడానికి జ్వాలా వెళ్లాడు. మొత్తం మీద  వొప్పించి జ్వాలా ఆయన్ని తన స్కూటర్ వెనుక కూర్చోపెట్టుకుని గ్రీన్ లాండ్స్ గెస్ట్ హౌస్ కి వెంటబెట్టుకు వచ్చాడు. కూర్చుని ప్రెస్ నోట్ రాస్తుంటే కరెంటు పోయింది. ఏం చెయ్యాలో తెలియలేదు. నేనూ జ్వాలా బయటకు పరిగెత్తి ఒక వీధి బండి మీది కిరోసిన్ దీపం పట్టుకు వచ్చాము. ఆ వెలుగు లోనే మా అన్నయ్య తన పని పూర్తి చేసాడు.
ఇక్కడ విచిత్రం ఏమిటంటే మొదటిరోజే  కరెంటు పోయినా అంజయ్య గారిలో ఏమాత్రం కోపం కానరాలేదు. అదే చెన్నారెడ్డి గారయితే ఎలక్ట్రిసిటీ బోర్డులో కనీసం  రెండు మూడు పెద్ద తలకాయలు తెగిపడేవని అక్కడి అధికారులు బహిరంగంగానే చెవులు కొరుక్కున్నారు.
దట్ ఈజ్ అంజయ్య! 

అంజయ్య గారితో నా అనుభవాలు (ఆఖరి భాగం)


అంజయ్య గారిని మార్చాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. వెంటనే అంజయ్య గారు  ముఖ్య మంత్రి పదవికి  రాజీనామా చేసారు. మర్నాడు కొత్త నాయకుడి ఎన్నిక. అప్పటికి  ఇంకా ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రే. నేనూ జ్వాలా కలసి ముఖ్యమంత్రి అధికార నివాసం జయప్రజాభవన్’ ( గ్రీన్ లాండ్స్) కు వెళ్లేసరికి పొద్దు బాగా  పోయింది. అంతా బోసిపోయి వుంది. నాయక జనం జాడ లేదు.  మేడ మీద అంజయ్య గారు తన షరా మామూలు వస్త్ర ధారణతో అంటే - గళ్ళ లుంగీ, ముతక బనీనుతో కనిపించారు. ఏమి మాట్లాడాలో తోచలేదు. కాసేపువుండి వచ్చేస్తుంటే వెనక్కి పిలిచారు. ఒక పిల్లవాడిని చూపించి చూడు శ్రీనివాస్ ఇతడికి దూరదర్శన్ లో ఏదో కాజువల్ ఉద్యోగం కావాలట. ఎవరికయినా చెప్పి చేయిస్తావా ?’ అని అడుగుతుంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నేను పని చేసేది రేడియోలో అని ఆయనకు బాగా తెలుసు. అయినా తనని నమ్ముకుని వచ్చిన ఆ పిల్లవాడిని చిన్నబుచ్చడం ఇష్టం లేక నన్ను అడిగి వుంటారు.
అందుకే ఆయన చనిపోయినప్పుడు ఒక పత్రిక పెట్టిన పతాక శీర్షికను నా జర్నలిస్టు మిత్రుడు పాశం యాదగిరి ఎప్పుడూ గుర్తు చేస్తుంటాడు.
“గరీబోళ్ళ బిడ్డ – నిను మరవదు ఈ గడ్డ”.

అంజయ్య గారితో నా అనుభవాలు - 7


ఆ రోజుల్లో ప్రతి రోజు సచివాలయానికి వెళ్లి మధ్యాహ్నం దాకా ప్రెస్ రూం లోనో లేదా ప్రెస్ కాన్ఫరెన్స్ ల్లోనో గడిపి- అంతవరకు సేకరించిన సమాచారం తీసుకుని  మధ్యాహ్నం వొంటి గంటా పది నిమిషాలకు ప్రసారం అయ్యే  న్యూస్ బులెటిన్ కు అందించడానికి కాలినడకన రేడియో స్టేషన్ కు వెడుతుండే వాడిని. ఒకరోజు అలా పోతున్నప్పుడు ముఖ్యమంత్రి పైలట్ వాహనం సైరన్ మోగిస్తూ వెళ్ళింది. అంజయ్య గారు- తన అధికారిక వాహనం అయిన అంబాసిడర్ కారులో డ్రైవర్ పక్కన ముందు సీట్ లో కూర్చునే వారు.ఆయనకు కార్యకర్తల తాకిడి ఎక్కువ. వెనుక సీట్ లో ఎవరికి వారు దూరి పోయేవారు. ఈ ఇబ్బంది తట్టుకోవడం కోసమో ఏమో ఆయన ముందు సీట్ కి మారిపోయారు.

సరే! ఆ రోజు నా పక్కనుంచి వెళ్ళిన ముఖ్యమంత్రి వాహనం కొద్దిగజాలు ముందుకుపోయి ఆగింది. ఆయన అంగరక్షకుడు బాలాజీ- - రిటైర్ అయిన తర్వాత ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో పనిచేస్తున్నారు- కిందికి దిగి ‘సీఎం గారు పిలుస్తున్నారు రండి’ అనడం- నన్ను కారు ఎక్కించుకుని రేడియో స్టేషన్ లో దింపడం క్షణాల్లో జరిగిపోయాయి.
అనుకోకుండా ముఖ్యమంత్రి రేడియో స్టేషన్ కి రావడంతో మా వాళ్ళంతా అవాక్కయ్యారు. అంజయ్య గారు ఇలా నాపట్ల చూపిన అవ్యాజాను రాగాలకి ఇంకా ఎన్నో ఉదాహరణలు వున్నాయి. అవి ఆయన గొప్పతనానికి, మంచితనానికి తార్కాణాలుగా భావిస్తానే కాని , నా ప్రత్యేకత ఏమీ లేదు.