ఈ నగరానికి ఏమైయింది?
1975 వ సంవత్సరం. నవంబరు నెల.
రేడియో ఉద్యోగంలో చేరడానికి బస్సులో హైదరాబాదు వచ్చాను. నగరం పొలిమేరలకు కూడా చేరక ముందే ఆలిండియా రేడియో ట్రాన్స్ మిటర్లు (ఇప్పుడు నడిబొడ్డుకు చేరాయి) కనబడ్డాయి. బస్సు కిటికీ చువ్వలు ముట్టుకుంటే ఐసు కడ్డీలు తాకినట్టు చల్లగా తగిలేవి. చుట్టూ ఎటు చూసినా కనుచూపు మేర వరకు ద్రాక్ష తోటలు.
నగరంలో రోడ్లు తీర్చి దిద్దినట్టు ఎక్కడా గోతులు, గుంటలు లేకుండా శుభ్రంగా ఉండేవి. ఇరువైపులా పచ్చని చెట్లు. భారీ వర్షం పడినా, రోడ్లు ఏరులై పారినా, వాన వెలవగానే వరదలా వెల్లువెత్తిన నీళ్లన్నీ చప్పున మాయం అయ్యేవి. రోడ్లమీద నీళ్ళు నిలిచేవి కావు. ఇప్పుడా పరిస్తితి వుందా! లేదని చెప్పడానికి తడుముకోవాల్సిన పని లేదు.
నగరంలో జర్నలిష్టులకు మరో కాలనీ మంజూరయింది. ఎక్కడో ఊరవతల జూబిలీ హిల్స్ అట. చూద్దామని కొందరు మిత్రులతో బయలుదేరాను.
పంజాగుట్ట స్మశానం దాటగానే ఊరు కనబడలేదు. రోడ్డుకు అటూ ఇటూ విసిరేసినట్టు అక్కడక్కడా ఇళ్ళు. చెక్ పోస్ట్ దాటితే అన్నీ పొలాలే. ఎన్టీఆర్ తన కుమారుడు బాలకృష్ణ కోసం కట్టిన భవంతి ఒక్కటే దారిలో ఒంటరిగా నిలబడి వుంది. అది దాటిన తరువాత జర్నలిష్టుల కాలనీ కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలం. (పొలం అనాలా). దానికి చివర్లో పెద్ద లోయ. దాని అంచున అడ్డంగా ఇనుపకడ్డీల రెయిలింగ్. అక్కడ నుంచి చూస్తే, కింద నిండు కుండలా ఓ తటాకం. చిక్కడపల్లి నుంచి వెళ్ళిన నాకది ఓ అపూర్వ దృశ్యం.
ఇప్పుడా లోయా లేదు, తటాకమూ లేదు. లోయకు పైన జర్నలిష్టుల (బీ) కాలనీ, లోయని పూడ్చేసి సంపన్నుల కాలనీ వెలిశాయి. వీటికి ఆనుకుని ప్రభుత్వాలను, ప్రజలను శాసించే ఐ.ఏ.ఎస్.,ఐ.పీ.ఎస్., అధికారుల నివాస భవనాలు.
హైదరాబాదు నగరం చుట్టుపక్కల వేల సంఖ్యలో చిన్నా చితకా చెరువులు వుండేవని నగరం గురించి రాసిన పుస్తకాలు చదివితే తెలుస్తుంది. అదేమిటో చాలావరకు చెరువులన్నీ మంత్రం వేసినట్టు మాయమై పోయాయి. వాటిల్లో చిన్న స్థాయి వాళ్ళు కట్టుకున్న చిన్న వాడలు, మధ్యతరగతి వాళ్ళు వుండే అపార్ట్ మెంట్లు, ఇంట్లో వంట్లో పుష్కలంగా వుండే కలిగినవాళ్ళు నివసించే సంపన్న కాలనీలు అంగుళం జాగా లేకుండా వెలిసాయి. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, హుస్సేన్ సాగర్ కుంచించుకు పోయినా ఇంకా మిగిలే వున్నాయి. సంతోషించాలి.
గతంలో గండిపేట చెరువు చూడడానికి విహార యాత్రకు వెళ్ళేవాళ్ళం. అందులో అపార జలరాశిని చూస్తుంటే కడుపు నిండిపోయేది. (అలాంటి దృశ్యాలు ఇప్పుడు కేవలం పాత తెలుగు సినిమాల్లో మాత్రమే కనబడతాయి)
ఇప్పుడు అదే తటాకం వేసవిలో వట్టిపోయి రాళ్ళు తేలి కానవస్తోంది.
ఒకప్పుడు ఏడాదిలో చాలా మాసాలు, ఎయిర్ కండిషన్లు సరే, కనీసం పంకాలు కూడా అవసరం లేని చల్లటి వాతావరణం కలిగిన హైదరాబాదులో ఎండలు మండుతున్నాయని ఇప్పుడు గగ్గోలు పెడితే ఏమి లాభం? అంతా స్వయంకృతం.
తోకటపా:
మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, హరివిల్లు విరిస్తే !
రెండేళ్ల క్రితం మండే వేసవిలో ఒక రోజు :
'త్తాతా త్తాతా' అంటూ నా గదిలోకి పరిగెత్తుకు వచ్చింది నా మనుమరాలు జీవిక. తా కు వత్తు పెట్టి పిలవడంలోనే కనిపిస్తోంది దాని ఎక్జైట్ మెంట్.
'తాతా! వాన, ర్రెయిన్! దా దా ' అంటూ చేయి పట్టి బయటకు తీసుకువచ్చింది.
అపార్ట్ మెంట్ జీవితాల్లో, పిడుగులు పడితే తప్ప, చినుకుల చప్పుడు లోపల వినపడదు. వర్షాన్ని టీవీల్లో చూడాల్సిందే.
వెంటనే చిన్నతనం గుర్తుకు వచ్చి ఓ కాగితం పడవ తయారు చేసి, చిన్నదాన్ని వెంటబెట్టుకుని కిందికి వెళ్లి వర్షపు నీళ్లలో కాగితపు పడవ మజా ఏమిటో చూపించాలని బయట తలుపు తెరిచాను. మండుతున్న శరీరాలు చల్లపడేట్టు ఒక్క ఉదుటున చల్లగాలి తోసుకు వచ్చింది. లక్షల ఎయిర్ కండిషనర్లు చేయలేని పని ఒక్క వాన చేసింది.
అడుగు బయట పెట్టే లోగా కరెంట్ ఫట్. వాన రాకడ కరెంటు పోకడ అంటారు అందుకే.
కరెంటు లేకపోతే లిఫ్ట్ పనిచేయదు. అంచేత కాగితపు పడవల ఆటకు అలా బ్రేక్ పడింది. ఏమిటో జీవితం! స్మాల్ ప్లెజర్స్ కు కూడా నోచుకోలేదు.
(ఇంకావుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి