ఓటమిలో ఆనందం
చిన్న కోడలు నిషా నిన్న ఆఫీసు పని మీద అమెరికా వెళ్ళింది. మళ్ళీ వచ్చే ఆదివారం తిరిగి వస్తుంది. రాను పోను ప్రయాణానికే మూడు రోజులు. అక్కడ వుండేది మూడు రోజులకంటే తక్కువ. అయినా తప్పని ప్రయాణాలు. వెళ్ళేది బిజినెస్ క్లాసులో కాబట్టి అంత అలసట వుండకపోవచ్చనేది ఓ ఊరట.
ఇంట్లో నాకు తోడు నా మనుమరాలు జీవిక. అందుకే దాన్ని తీసుకుని దగ్గరలో వున్న గలేరియా మాల్ కు తీసుకు వెళ్ళాను.
సరిగ్గా అయిదేళ్లు కూడా లేని జీవిక తెలివితేటలు చూస్తుంటే కొన్నిసార్లు నాకు అసూయ కలుగుతుంది. మరికొన్ని సార్లు ఆనందం, భయం, ఆశ్చర్యం కూడా.
జెన్ జీ అని ఈ మధ్య వింటున్న కొత్త తరం ఆలోచనలు, అవగాహన పాత తరాన్ని మించి పోతున్న సంగతి నిజమే అనిపించింది. మా జీవిక సంగతి ఒక్కటే కాదు, తరం మారుతోంది అని గమనంలో పెట్టుకోవడం పాత తరానికే మంచిది.
మాల్ లోకి వెళ్ళగానే,
“తాతయ్యా, నాకు లాలిపాప్ కావాలి” అంది. అంతే కాదు, నా చెయ్యి పట్టుకుని ఎస్కలేటర్ మీద పైకి తీసుకువెళ్లి, అక్కడ లాలిపాప్‌లు అమ్మే దుకాణానికి తీసుకెళ్లింది. తీరా అక్కడికి వెళ్లాక చూస్తే లాలిపాప్‌లు లేవు.
ఒక ప్లాస్టిక్ మోటార్‌సైకిల్ బొమ్మను చూపించి, అది కొనిపెట్టమంది. చిన్న బొమ్మ. ధర రెండువందల యాభయ్ చెప్పాడు.
“చూడమ్మా అది కొనడానికి నా దగ్గర డబ్బులు లేవు” అన్నాను.
జీవిక నా మొబైల్ ఫోన్ వైపు చూపించి, “డబ్బులు ఇందులో ఉన్నాయి కదా తాతయ్యా” అంది.
ప్రతిరోజూ నేను ఫోన్ ద్వారా చేసే చెల్లింపులను జీవిక గమనిస్తున్నట్టుంది.
ఐదేళ్ల వయసులోనే ఆమె తెలివితేటలు, అవగాహన చేసుకునే సామర్ధ్యాన్ని చూసి నేను ముచ్చట పడాలా, గర్వపడాలా, ఆందోళన చెందాలా అనేది అర్ధం కాలేదు.
చివరికి ఆ బొమ్మను కొనక తప్పలేదు.
కానీ ఆ బొమ్మలో ఏమి కనిపించిందో, ఎందుకు ఇష్టపడిందో నాకు మాత్రం అర్థం కాలేదు. అది పైకి మోటార్‌సైకిల్‌లా కనిపించినా, దాని చక్రాలన్నీ పిల్లలు తినే చిన్న చిన్న జెమ్స్‌తో నిండి వున్నాయి. ఆ విషయం ఇంటికి వస్తున్నప్పుడు చెప్పింది. అంటే మళ్లీ జీవిక చేతిలో నేను మోసపోయానన్న మాట.
అయినా బాధ లేదు. పిల్లల చేతిలో ఓటమిని మించిన ఆనందం పెద్దలకు ఏముంటుంది”
ఇంటికి చేరే లోగా మోటార్ సైకిల్ వెనుక టైర్ ఖాళీ చేసేసింది. ఇంటికి రాగానే ఆ బొమ్మను మూలకు విసిరేసింది.
17-05- 2026
(ఇంకా వుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి