20, మే 2026, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో : (311): భండారు శ్రీనివాసరావు

 వన్ మ్యాన్ ఆర్మీ

కింది ఫోటోల్లోని మనిషిని తెలియని వాళ్ళు వుండరు. విశ్రాంత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు గారు. కానీ తెలియని సంగతల్లా నడిరోడ్డు మీద ఆయన ఎందుకలా నిలబడ్డారు? దూరం నుంచి చూస్తే,  ట్రాఫిక్ పోలీసులు నిలబడే ట్రాఫిక్ ఐ లాండ్ లా వుంది. ఒక పక్క నుంచి సిటీ బస్సు వెడుతున్నట్టు కానవస్తోంది. ఏవేవో కేబుల్స్ వేలాడుతున్నాయి. రోడ్డు భద్రతకు సంబంధించిన బోర్డు అడ్డంగా వుంది. అక్కడ వున్న ఒక కాంస్య విగ్రహాన్ని అది చాలావరకు కప్పివేస్తోంది. మాజీ ఉపరాస్ట్రపతిగా అత్యంత భద్రత కలిగిన వెంకయ్య నాయుడు గారు అలాంటి చోటుకు ఎందుకు వెళ్ళారు అనేది రెండో ఫోటో చూస్తే అర్ధం  అవుతుంది.

ఈరోజు మే ఇరవై, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతి. వారి సంస్మరణార్ధం ప్రకాశం అధ్యయన సంస్థ ఆధ్వర్యంలో అక్కడ ఒక కార్యక్రమం జరిగింది.

అనేక సంవత్సరాలుగా మే ఇరవై ప్రకాశం గారి వర్ధంతి నాడు, మళ్ళీ ఆగస్టు ఇరవై మూడో తేదీ ప్రకాశం గారి జయంతి నాడు ఒక దీక్ష మాదిరిగా ఆ మహానీయునికి  ఈ పుష్పాంజలి కార్యక్రమాన్ని   నిర్వహిస్తున్నది,  ఆ సంస్థకు కర్తా, కర్మా క్రియ అయిన టంగుటూరి శ్రీ రాం. వన్ మ్యాన్ ఆర్మీ అనేది ఈయన గురించే. వీరి నాన్నగారు టంగుటూరి సూర్యనారాయణ గారు తన కొడుక్కు వారసత్వంగా ఏమి ఆస్తులు ఇవ్వలేదు కానీ, ఇలాంటి బాధ్యతలు ఒప్పగించి దాటిపోయారు. మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు అయిదుగురు ముఖ్యమంత్రుల దగ్గర ప్రధాన పౌర సంబంధాల అధికారిగా పనిచేసే బహు పాత కాలంలో,  ఈ సూర్య నారాయణ గారు నాకు పరిచయం. ఆయన ఇంటి పేరు చూసి ప్రకాశం పంతులు గారికి బంధువు ఏమో అనుకునేవారు వున్నారు. నాకు తెలిసి వారి ముత్తాతల కాలంలో దాయాది బంధుత్వం వుండేది. ఆ కుటుంబానికి ప్రకాశం గారంటే అంతులేని అభిమానం. అంతే!

అలాంటి అభిమానం, గౌరవంతోనే వెంకయ్య నాయుడు గారు ఈ కార్యక్రమానికి అడిగిన వెంటనే వచ్చారు. అదీ ఎప్పుడూ? చివరి నిమిషంలో ఏదో కార్యక్రమానికి వెళ్ళినప్పుడు కష్టం మీద ఆయన్ని కలసి నిర్వాహకులు శ్రీ రాం ఆహ్వానించినప్పుడు, ప్రకాశం గారి పేరు వినగానే వెంకయ్య నాయుడు గారు, వారి మీద తన అభిమానంతో వెంటనే  అంగీకరించారు.  వారిలాగే అనేకమంది ఈ ఉదయం  రవీంద్ర భారతి, ఆకాశవాణి, అసెంబ్లీ ఎదురుగా మూడు రోడ్ల కూడలిలో వున్న ప్రకాశం పంతులు గారి కాంస్య విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన వారిలో వున్నారు. ఉదయపు వేళ అయినా వేసవి ఎండ చురుక్కుమనిపిస్తున్న సమయంలో వచ్చారు అంటే ప్రకాశం గారి మీద తమకున్న అభిమానంతోనే. వీరిలో చాలామంది వృద్ధులే కావడం ఆశ్చర్యం.

వెంకయ్య నాయుడు గారు తాము చెప్పినట్టే 8.45 కల్లా వచ్చి రోడ్డు మీద కారు దిగి, రోడ్డు పక్కన ఫుట్ పాత్ మాదిరిగా కొంచెం ఎత్తుగా వున్న ప్రదేశానికి వచ్చేశారు. ఒక చిన్న షామియానా, పదో ఇరవయ్యో కుర్చీలు ఆ చిన్న స్థలంలోనే వేశారు. వచ్చి ఒక కుర్చీలో కూచుని చుట్టూ చూసారు. ప్రకాశం గారి విగ్రహాన్ని కనబడకుండా చేస్తున్న బోర్డులను గమనించారు. ఆయన సునిశిత దృష్టి ఎలాంటిది అంటే రోడ్డుకు ఒక పక్క రెడ్ లైట్ వెలిగి చాలా వాహనాలు నిలిచిపోయాయి. తన కోసం వారిని ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆరా తీశారు. అలా కాదు, రెడ్ లైట్ కారణంగా ట్రాఫిక్ నిలిచిపోయిందని చెప్పిన తర్వాత ఆయన స్థిమిత పడ్డారు. వచ్చిన పెద్దలను అందర్నీ సాదరంగా పలకరించారు. ప్రకాశం గారి విగ్రహం ప్రస్పుటంగా కనబడేలా చేయడానికి ఏమి చెయ్యాలో తాను సంబంధిత అధికారులతో మాట్లాడుతాను అని హామీ ఇచ్చారు.

ప్రకాశం గారి గురించి , ఈ నాటి తరం వారే కాకుండా నేటి రాజకీయ నేతలు కూడా నేర్చుకోవాల్సింది చాలా వుందని అన్నారు. ప్రకాశం గారి జీవితంలో స్పూర్తిని రగిలించే అనేక ఘట్టాలను ఆయన తనదైన శైలిలో ప్రస్తావించారు.

తెలంగాణా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, తెలంగాణా బీసీ సంక్షేమ శాఖ రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు, మాజీ మంత్రి వి.హనుమంతరావు గారు,   మాజీ కేంద్రమంత్రి, వేణుగోపాలాచారి గారు,  మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఎల్వీ సుబ్రహ్మణ్యం గారు, ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారు, నా రేడియో రోజుల్లో సుపరిచితులైన రాజకీయ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ రుద్రరాజు  పద్మరాజు వంటి పాత దోస్తులు,  దైవజ్ఞాశర్మ  గారు, కర్నూల్ వాసి, కూరడి చంద్రశేఖర కల్కుర గారు ఇంకా   అనేకమంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

కదానాయకుడైన శ్రీ రాం గారి తండ్రిని మా పెద్దన్నయ్య నాకు పరిచయం చేస్తే, శ్రీ రాం గారిని పరిచయం చేసింది, నా మేనల్లుడు,  108, 104 పధకాల  రూపశిల్పి డాక్టర్ ఏపీ రంగారావు. అప్పుడు ఆయన పూనికపై  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వున్న జంద్యాల హరి నారాయణ్ గారి సహాయ సహకారాలతో, హౌసింగ్ బోర్డు అధీనంలో వున్న ఒక పాత భవనంలో ప్రకాశం అధ్యయన సంష్తకు సంస్థకు ఒక చిన్న ఆవాసం కల్పించే పనిలో నేను ఒక చిటికెన వేలు పాత్ర పోషించాను. ఈ సంస్థతో నాకిది ఓ బాదరాయణ సంబంధం. తరువాత కూడా డాక్టర్ రంగారావు ఈ సంస్థకు మాట సాయం చేసే బాధ్యతను తన కుమారుడు డాక్టర్ భరత్ కు  ఒప్పగించాడు. వీరిద్దరూ పితృవాక్య పరిపాలనలో కలిసి మెలిసి పనిచేసుకుంటూ వస్తున్నారు. ఏటా మే ఇరవై, ఆగస్టు ఇరవై మూడుకు ముందు రోజున డాక్టర్ భరత్, ఫోన్ చేసి గుర్తు చేస్తాడు. ఇద్దరం కలిసి వెళ్లి ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం ఒక ఆనవాయితీగా మారింది. ప్రకాశం పంతులు గారికి పుష్పాంజలి ఘటించే అవకాశంతో పాటు పెద్దలను చాలామందిని కలుసుకునే అదృష్టం ఇందువల్ల ప్రాప్తిస్తోంది.















(ఇంకావుంది)    

కామెంట్‌లు లేవు: