27, మే 2026, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (315): భండారు శ్రీనివాసరావు


మీడియాతో జాగ్రత్త!
తెలుగుదేశం పార్టీ వార్షిక సదస్సుకు ఆ పార్టీ అధ్యక్షుడు ఎన్టీఆర్, మహానాడు అని తొలుత నామకరణం చేసినప్పుడు అందరు ఇదెక్కడి పేరు అని ఆశ్చర్యపోయారు. కానీ తదాదిగా మహానాడు అనేది తెలుగునాట బాగా ప్రాచుర్యం పొందింది.
మాస్కోలో వున్న అయిదేళ్లు మినహాయిస్తే, ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యేంతవరకు తెలుగుదేశం పార్టీ నిర్వహించిన అన్ని మహానాడు కార్యక్రమాలకు నేను రేడియో విలేకరిగా హాజరయ్యాను. టీడీపీ మాజీ ఎంపీ శ్రీ కె. రామ్మోహన్ రావు, పార్టీ పీఆర్వో శ్రీ LVSRK ప్రసాద్ (వీరి ఇంటి పేరు చాలా పొడుగు, అందుకని ఆయనతో సన్నిహితంగా వుండే విలేకరులం ఏబీసీడీ ప్రసాద్ అనే వాళ్ళం. హైదరాబాదు విలేకరుల యోగక్షేమాలు అన్నీ వీరిద్దరూ అతి జాగ్రత్తగా చూసుకునేవారు.
చంద్రబాబునాయుడు అవిభక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఓసారి తెలుగుదేశం మహానాడు కాకినాడలో జరిగింది. హైదరాబాదు నుంచి విలేకరులను తీసుకువెళ్ళారు. ప్రారంభానికి ముందు రోజే అక్కడికి చేరుకున్నాం.
అప్పటికి ప్రైవేటు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాలు ప్రయోగాత్మక దశలో వున్నాయి. టీవీ 9 వారికి ఓ ఆలోచన కలిగింది. ప్రారంభోత్సవానికి ముందు ఎవరయినా జర్నలిస్టుతో మాట్లాడించాలని అనుకున్నారు.
‘పొద్దున్నే(మహానాడు జరిగే ప్రదేశం దగ్గరికి) పోదాం రెడీగా ఉండమ’ని చెప్పారు. బ్రేక్ ఫాస్ట్ చేయకుండానే వెళ్లాం. మహానాడు వెన్యూ దగ్గర తిరుగుతూ నేనూ రజనీకాంత్ మాట్లాడుకుంటున్నాం. ఆయన ఏవో అడుగుతున్నారు. నేను ఏదో చెబుతున్నాను.
‘ప్రతి రాజకీయ పార్టీ తమ కేడర్ ను ఉత్సాహ పరచడం కోసం ఇలాంటి తంతులు నిర్వహిస్తుంటారు. ఎక్కడో పల్లెటూరిలో వుండే పార్టీ కార్యకర్తలకు ఇదో పండగ. పార్టీ నాయకత్వం గుర్తింపు తమకు లభించిందని తమ తోటివారితో చెప్పుకుని గర్వపడతారు.
ఇక ఇలాంటి సభల్లో ఏవో మొక్కుబడి తీర్మానాలు ప్రవేశపెడతారు. ఏదో చర్చ జరిగిందని అనిపిస్తారు. తర్వాత ఆ తీర్మానాలు ఏమయ్యాయో ఎవరూ పట్టించుకోరు. కాకపోతే, హైదరాబాదులో వుండే నాయకులకి గ్రౌండ్ లెవెల్ రియాలిటీలు తెలుసుకోవడానికి ఇదొక మంచి అవకాశం. ఇలాంటి సందర్భాలలో గ్రామ స్థాయి కార్యకర్తల్ని పిలిచి మాట్లాడితే, హైదరాబాదులో కూర్చుని, పార్టీ స్తితిగతుల గురించి వేగుల ద్వారా తెలుసుకోలేని విషయాలు వాళ్లకు బోధపడతాయి. కానీ అంత తీరిక వాళ్ళకి వుండదు. అందుకే ఇదంతా ఒక తంతు అనేది. టీడీపీ అనే కాదు కాంగ్రెస్ ఏ పార్టీ వార్షిక సమావేశాలు ఏ పేరుతో జరిగినా ఇదే తంతు”
ఏదో ఇలా చెప్పుకుపోతున్నాను. కాసేపు అలా తిరిగి మళ్ళీ హోటల్ కు వచ్చాము.
బ్రేక్ ఫాస్ట్ టేబుల్ దగ్గర మంత్రి యనమల రామకృష్ణుడు కనిపించారు. ఆయన మొహంలో ఎప్పుడూ కనిపించే ప్రసన్నత కానరాలేదు. ప్లేటు చేతికి ఇస్తూ అన్నారు నా మొహం లోకి చూస్తూ.
“అంతే లెండి! ఇంతింత శ్రమ పడి చేసినదంతా మీకు ఓ తంతులాగా కనిపిస్తోంది అన్నమాట”
ముందు నాకు అర్ధం కాలేదు ఆయన అలా ఎందుకు అంటున్నారో.
తర్వాత తెలిసింది, అంతకు ముందు నేను మాట్లాడినదంతా ఆ టీవీలో లైవ్ లో చూపించారట! చూడనిది నేనొక్కడినే.
(ఇంకావుంది)

కామెంట్‌లు లేవు: