29, మే 2026, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (317): భండారు శ్రీనివాసరావు

 

1975 నుంచి 2026 వరకు.
1975 లో హైదరాబాద్ రేడియోలో చేరిన కొత్తల్లో ఒక రోజు ఉదయం ఆఫీసుకు వెళ్లేసరికి మా న్యూస్ యూనిట్ హెడ్ పన్యాల రంగనాధరావు గారు ఏదో పని చేసుకుంటూ కనిపించారు. ‘ఏం పని మీద వచ్చావ’న్నట్టు నా వైపు చూసారు.
నా మొహంలో రంగులు మారడం గమనించి, “ఇక్కడ మీకు పనేమిటి? మీరు రిపోర్టర్. బయట తిరిగితే కదా నాలుగు వార్తలు తెలిసేది? రోజూ సెక్రెటేరియట్ కు వెళ్ళండి. మంత్రులో, అధికారులో చెప్పేది వినండి. నాలుగు ముక్కలు ముక్కున పెట్టుకు వచ్చి, తెచ్చి నా మొహాన కొట్టండి. అంతే! సింపుల్” అని తేల్చేసారు.
అలా అంటూనే, “ఇంతకీ ఆఫీసుకు ఎలా వచ్చారు?” అని మరో అర్ధం కాని ప్రశ్న సంధించారు. “ఆటోలో వచ్చుంటారు. అవునా! అలా అయితే మీ జీతం డబ్బులన్నీ ఈ రిపోర్టర్ తిరుగుళ్ల కోసం ఆటోలకే తగలెయ్యాల్సి వుంటుంది. వార్తల సంగతి తరవాత. ముందు నేనో ఉత్తరం ఇస్తాను. దాన్ని తీసుకువెళ్ళి సమాచార శాఖలో ఇవ్వండి. అక్కడ అక్రిడేషన్ కార్డు తీసుకుని ఆర్టీసీ ఆఫీసుకు వెళ్ళండి. వాళ్ళు ఇచ్చే బస్ పాసు తీసుకున్న తరవాతే, మిగిలిన ఏ పనులయినా! తెలిసిందా” అన్నారు. తెలియకపోవడానికి ఏముంది. కానీ ఇలాటి పై అధికారులు కూడా వుంటారా అన్నదే అంతవరకూ తెలియని విషయం.”
గుర్తింపు పొందిన మీడియా సంస్థలలో పనిచేసే జర్నలిష్టులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు (ACCREDIDATION CARDS) ఇవ్వడం అనేది 1975 సంవత్సరానికి పూర్వం కూడా అమల్లో వున్న విధానమే.
నేను రేడియోలో చేరింది 1975 నవంబరు 14 వ తేదీన. ఆ ఏడాది జర్నలిస్టులకి ఇచ్చిన గుర్తింపు కార్డుల గడువు మరో నెలన్నర రోజుల్లో ముగిసే సమయంలో అన్నమాట. ఆ కొద్ది వ్యవదానానికి ఈ గుర్తింపు కార్డు తెచ్చుకోవడం ఎంత గగనమో ఈ నాటి జర్నలిస్టులకు తెలిసిందే.
అలా ఒక్క రోజులో తెచ్చుకున్న ‘అక్రిడిటేషన్’ నా విషయంలో ఇన్నేళ్ళుగా కొనసాగుతూనే వస్తోంది. (నేను మాస్కోలో వున్న కాలానికి కూడా) బహుశా నాకంటే సీనియర్లు కొంతమంది ఉండి వుండవచ్చేనేమో కానీ , ఒకే ఊరిలో (హైదరాబాదు) ఒకే ఒక సంస్థ తరపున వరసగా అన్నేళ్ళు ఆ ‘గుర్తింపు’ వున్నది నేను ఒక్కడినే అని గట్టిగా చెప్పగలను.
ఆ రోజుల్లో జర్నలిస్టుల సంఖ్య చాలా తక్కువ. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రెస్ మీట్ పెడితే, పదిమంది విలేకరులు హాజరయితే గొప్ప.
కాలక్రమేణా, పత్రికల సంఖ్య, విలేకరుల సంఖ్యా పెరిగాయి. కొత్తగా విజువల్ మీడియా రంగప్రవేశం చేసింది. ఇటీవలి కాలంలో వందల సంఖ్యలో వెబ్ ఛానల్స్ పురుడు పోసుకున్నాయి. ఫలితంగా ఈ కార్డుల మంజూరు అనేది ప్రభుత్వాలకు కొంత ఇబ్బందిగా మారిన మాట కూడా వాస్తవం. దరిమిలా కొత్త కార్డుల జారీ బదులు వున్న కార్డుల గడువు పెంచుకుంటూ పోయారు.
ఒక ఏడాది, 2017 లో అనుకుంటా, ఈ కార్డు రావడం కొంచెం ఆలస్యం అయింది. అప్పటి సమాచార కమీషనర్ నవీన్ మిట్టల్ కు ఒక ఎస్సెమ్మెస్ పెట్టాను. వారం తిరక్క ముందే కార్డు చేతికి వచ్చింది.
ఈ ఏడాది జర్నలిస్టు సంఘాల ఒత్తిడితో, మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్, యువ ఐ.ఎ.ఎస్. అధికారి జి. ముకుంద రెడ్డి గారు, వారి సిబ్బంది కలిసి ఎట్టకేలకు ఈ క్రతువును జయప్రదంగా పూర్తిచేశారు.
2005 లో రిటైర్ అయిన తర్వాత కూడా వయోధిక పాత్రికేయ సంఘం తరపున అప్పటి కార్యదర్శి కొండా లక్ష్మణ్ రావుగారు, ఇప్పటి కార్యదర్శి ఎన్. శ్రీనివాస రెడ్డి గారు శ్రమ తీసుకుని సంఘం సభ్యులకు కార్డులు అందేలా కృషి చేశారు.
ఈ వయసులో ఏమిటి ఈ కార్డు వల్ల ఉపయోగం అంటారా!
యాభై ఏళ్ళకు పైగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతూ వస్తున్నందుకు ప్రభుత్వం తరపున చిన్న గుర్తింపు. అంతే!




(ఇంకా వుంది)

కామెంట్‌లు లేవు: