అవధానం విద్య మాత్రమే కాదు వైద్యం కూడా.
శ్రీమతి మరపు
‘ఉత్తరం రాసేశాననుకుని
పోస్టులో వేసేశాననుకుని
రాని జవాబు కోసం ఎదురు చూడడం
మా శ్రీమతి పని’
ఎప్పుడో యాభయ్ ఏళ్ళకు పూర్వం బెజవాడ ఆంధ్రజ్యోతి దినపత్రికలో పనిచేసే రోజుల్లో, నాటి ఎడిటర్ నార్లగారి పూనికపై, నండూరి గారి ప్రోత్సా హంతో, అనుదినం ఎడిటోరియల్ కింద, నేను రాసిన ఓ నాలుగు పంక్తుల 'వాక్టూన్' ప్రచురించేవారు. పత్రిక కార్టూనిస్ట్ ఈవీ రమణ అందుకు తగిన కార్టూన్ గీసి దానికి జోడించేవారు. నేను జ్యోతి వదిలి హైదరాబాదు రేడియోలో చేరేవరకు నా ఈ వ్యాపకం కొనసాగింది. ముందు రాసింది వాటిల్లో ఒకటి.
అప్పుడేదో మా ఆవిడ పేరు పెట్టి మతిమరపు మీద ఇలా కవిత్వం గీకాను కానీ, ఇప్పుడు పొద్దుగుంకే వయసులో మతిమరపు అనేది నా పాలిట శాపంలా మారుతుందని ఏనాడు అనుకోలేదు.
ఏమిటో ఏదీ గుర్తుండదు. గుర్తున్నా సమయానికి జ్ఞాపకం రాదు, కర్ణుడి శాపంలా.
వెనుకటి రోజుల్లో నాకు రెడీ రెకనర్ అయినా, గూగులమ్మ అయినా అన్నీ మా ఆవిడే. నేనేదో రాసుకుంటూ ‘అన్నట్టు పలానా వాళ్ళ మనుమడి పేరేమిటి?’ అని అడిగితే చాలు, లోపల వంట చేస్తున్న తను, తడుముకోకుండా ఆ పేరు చెప్పేది. ఏది మరచిపోయినా చటుక్కున గుర్తు చేసేది.
ఇప్పుడా అవకాశం బొత్తిగా లేదు. నేనే కిందపడి, మీదపడి, జుట్టు పీక్కుని గుర్తుచేసుకుని రాయాల్సి వస్తోంది. అప్పటికీ జ్ఞాపకం రాకపోతే ఆ విషయం తప్పించి వేరే సంగతులు. ఇప్పటికి బండి ఇలా నడుస్తోంది.
నా చిన్నప్పుడు దత్తాత్రేయ శర్మ గారితో పరిచయం వుండి వుంటే, గూగులమ్మ లాంటి భార్యను పోగొట్టుకుని, ఈ మునిమాపు వయసులో మతిమరపుతో ఇలా ఇబ్బంది పడాల్సిన అవసరం పడేది కాదేమో.
ఎవరీ దత్తాత్రేయ శర్మ అంటారా!
రెండేళ్ల క్రితం, 2024 లో ఓ ఉదయం మిత్రుడు జ్వాలా నన్ను వెంటబెట్టుకుని, మా ఇంటికి పాతిక కిలోమీటర్ల దూరంలో జరిగిన ఒక కార్యక్రమానికి తీసుకువెళ్లాడు.
జ్వాలా ముఖ్య అతిథి. నారుమంచి అనంత కృష్ణ శర్మగారు అధ్యక్షులు. ఈ రెండు పాత్రల్లో ఉభయులకీ అపార అనుభవం ఉంది. అంచేత చివరివరకూ సజావుగా ఆసక్తికరంగా సాగిపోయింది.
ఇది చిన్న సైజు స్నాతకోత్సవం అని చెప్పాలి. అవధాన విద్యలో చక్కటి శిక్షణ పొందిన చిన్నారులు, యువతీ యువకులకు సర్టిఫికెట్ల ప్రదానం జరిగింది.
అవధానానికి కావాల్సింది ధారణ శక్తి. అవధాన విద్యార్థులకే కాదు, నిజానికి ప్రతి విద్యార్థికి ఇది ఎంతో అవసరం. అలాగే ఈ అవధాన విద్యలో ప్రావీణ్యం సంపాదిస్తే, ముసలితనంలో అల్జీమర్స్ వంటి వ్యాధులు దరిచేరవు అనే అభిప్రాయం నాకు ఆ క్షణంలో కలిగింది.
దత్తాత్రేయ శర్మగారు ఉపాధ్యాయుడిగా పని చేసారు. పదవీ విమణ అనంతరం, పిల్లలకు చిన్న నాటి నుంచే అవధాన ప్రక్రియలో శిక్షణ ఇచ్చే మేలుబంతి లాంటి కార్యక్రమాన్ని తమ భుజాలకు ఎత్తుకున్నారు. దర్శనం శర్మగా ప్రసిద్ధులైన మరుమాముల శర్మ గారికి వీరు స్వయానా సోదరులు. సంకల్ప శుద్ధి వుంటే ఏదైనా సిద్ధిస్తుంది, సాధ్యమవుతుంది అని త్రికరణ శుద్ధిగా నమ్మిన సోదరులు వీరు. వీరి ప్రయత్నాలు విజయవంతం కావాలని కోరుకుంటున్నాను.
తూముకుంటలోని సీతారామభద్ర ఆలయం నిర్వాహకులు తగిన తోడ్పాటు అందించారు. మధ్యలో జ్వాలాతో కలిసి దైవ దర్శనం చేసుకున్నాను.
గుడి మెట్ల దగ్గరే నాకు దేవుడు కనిపించాడు. ఓ పాల బుగ్గల పసివాడు, ఉద్ధరిణ, పంచపాత్ర ముందు పెట్టుకుని, అర్ధ నిమీలిత నేత్రాలతో ధ్యాన ముద్రలో కానవచ్చాడు. అంతటి సంరంభం పక్కనే జరుగుతున్నా అతడి ఏకాగ్రత చెదరలేదు. బహుశా అవధాన శిక్షణ పొందిన కారణంగా ఇది సిద్ధించి వుండవచ్చు.
అప్రయత్నంగా ఆ చిన్నారికి చేతులు జోడించి నమస్కారం చేశాను. నేను వయో వృద్ధుడిని. ఆ బాలుడు జ్ఞాన వృద్ధుడు. నమస్కరిస్తే తప్పేముంది?
(ఇంకావుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి