31, జనవరి 2025, శుక్రవారం

ఆర్రోజుల అజ్ఞాత వాసం – భండారు శ్రీనివాసరావు

 జలుబు వెలగని బలుబు

ముళ్ళపూడి వెంకటరమణ గారన్న మాట నిజంగా నిజం. జలుబు చేసిన మనిషి శరీరం మాడిపోయిన బల్బు రీతి. స్విచ్చి పనిచేసినా బల్బ్ వెలగదు. అన్ని అవయవాలు పనిచేస్తుంటాయి. ఒకటి చెప్పింది మరొకదానికి ఎక్కదు. చదవాలని అనిపించదు. రాయాలని అనిపించదు. ఒకరితో మాట్లాడాలని అనిపించదు. ఒకరు చెప్పేది వినాలని అనిపించదు. బాడీలోని పార్టులన్నీ టోటల్ గా అప్రకటిత సమ్మె చేస్తుంటాయి.  

ఇంగ్లీష్ వాడు ఎప్పుడో చెప్పాడు. జలుబుకు మందు వేసుకుంటే వారం రోజుల్లో, వేసుకోకపోతే ఏడు రోజుల్లో తగ్గుతుందని. అంచేత, జలుబుతో పాటు జ్వరం, వెళ్ళు నొప్పులు గట్రా లేవు కనుక వాడి మాటే విన్నాను. మందుల జోలికి పోలేదు. మా అన్నయ్య రోజూ ఫోన్ చేసి నా క్షేమం కనుక్కునే వాడు. ఆ కాసేపు ముక్కుతూ మూల్గుతూ ముక్కుతో మాట్లాడడం కొంత కంట్రోల్ చేసుకుని నా ఒంట్లో పర్వాలేదు అనే ఫీలింగ్ ఆయనకు కలిగేలా జాగ్రత్త పడేవాడిని. ఎంత అదృష్టం చెప్పండి. జలుబు చేసిన తమ్ముడి ఆరోగ్యం గురించి ప్రతిరోజూ వాకబు చేసే అన్నయ్య వుండడం మాటలా!

జనవరి 21, 22, 23. మూడు రోజులు మా రెండో వాడు సంతోష్ ఏడూడి మాసికాలతో హడావిడిగా గడిచింది. మా కోడలి కోరిక ప్రకారం అన్నీ సలక్షణంగా, శాస్త్రీయంగా పూర్తి చేశాను. అమెరికా నుంచి వచ్చిన పెద్దవాడు, పెద్ద కోడలు తిరిగి వెళ్ళారు. అదిగో అప్పుడు సందు చూసుకుని ఒంట్లో దూరింది ఈ జలుబు. అయాం ఎ బిగ్ జీరోకి పెద్ద బ్రేకు పడింది. నిజానికి ఇదేమంత పెద్ద రోగమేమీ కాదు.  ఇంట్లో మూడేళ్ల మనుమరాలు వుంది కాబట్టి, నా గదిని కరోనా టైం లో మాదిరిగా క్వారంటైన్ గది చేసుకున్నాను.

మొత్తానికి ఆరు రోజుల జలుబు ముసురు నిన్న కొంత తెరిపి ఇచ్చింది. ముక్కు కాకుండా నోటితో మాట్లాడడం మొదలయింది. మొబైల్ లో ఆన్సర్ చేయాల్సిన కాల్స్ చాలా వున్నాయి. అలాగే మెసేజెస్. ఒకటి నా కంటికి ఆనింది.

Tuesday, January 28

Article received. @ Hyd PH 0n 28-1-25, 11.38 PM

Article No. ….booked on 28 Jan at 11.33.26.

Wednesday, January 29

Article received at Sanathnagar IE SO on 29/1/25 08.20.51

Article out for delivery through P.Sivaiah (Beat No.B27) on 29.1.25 at 09.04.28, INDIAPOST.

ఇవ్విధమ్ముగా ఇండియా పోస్టు వారు నిమిషాలు, సెకన్ల వారీగా ఆ పార్సెల్ కదలికలను ఎప్పటికప్పుడు నాకు తెలియచేస్తూ వచ్చారన్న మాట. కానీ ఏం లాభం ? రెక్కలు కట్టుకుని ఎగురుకుంటూ వచ్చిన ఆ పుస్తకం మా ఇంట్లోనే రెండు రోజులు నా కంట పడకుండా  నాతోపాటు పడకేసింది. వెరీ వెరీ సారీ బుద్దా మురళి గారు. (Murali Buddha)

ఈరోజు ఉదయం మా మనుమరాలి కేర్ టేకర్ అంకిత నా చేతికి అందించిన మరో పార్సెల్స్ లో, సంగారెడ్డి నుంచి సీనియర్ జర్నలిస్టు పీవీ రావు గారు (P.V. Rao) పంపిన పుస్తకం కూడా వుంది. రోగానంతరం  కోలుకునే దశలో పుస్తకపఠనం అవశ్యం కదా!        

తోకటపా:

2013 ఆగస్టు నెలలో ఒక రోజు. అంటే పుష్కరం కిందటి మాట.

భార్యాభర్తల నడుమ మాటలు తక్కువ అనే అపకీర్తి సమాజంలో వుంది. ఇందులో నిజమెంతో తెలవదు.

మొన్న ఖమ్మం ఓ పెళ్ళికి వెళ్ళి వచ్చాం. గాలి మార్పో, నీటి  మార్పో తెలియదు. తనకు ఒకటే రొంప.

 రాత్రి, ఓ రాత్రివేళ చూస్తే తను పక్కనలేదు. లేచి చూస్తే పూజగదిలో ఓ దుప్పటి కప్పుకుని పడుకుని వుంది.

పొద్దున్నే నేను ఓ ఛానల్ కు వెళ్ళాలి. పక్కన పడుకుంటే జలుబు అంటుకుంటుందేమో అని ఆలోచించి ఈ పని చేసి వుంటుంది.

మనసుతో మాట్లాడ్డం అంటే ఇదేనేమో!

కింది ఫోటోలు :

సుప్రసిద్ధ పాత్రికేయులు బుద్దా మురళి గారు రాసిన రెండు పుస్తకాలు, సీనియర్ జర్నలిస్ట్ పీవీ రావు గారు రాసిన వ్యాస సంపుటి 






(31-01-2025)

27, జనవరి 2025, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (81 ) : భండారు శ్రీనివాసరావు

 


 “నేను ఈ గవర్నర్  పదవిలోకి రాక మునుపు ఒక గైనకాలజిస్టుగా ఎంతో మంది నవజాత శిశువులను  హాండిల్  చేశాను. తెలంగాణా కూడా నవజాత రాష్ట్రమే. కాబట్టి సులభంగా ఈ రాష్ట్రాన్ని కనిపెట్టి చూసుకోగలననే ధైర్యం వుంది. నేను తమిళ బిడ్డనుఇప్పుడు తెలంగాణా సోదరిని”

ఈ మాటలు అన్నది ఎవరో కాదుఒకప్పటి తెలంగాణా గవర్నర్ డాక్టర్  తమిళ్ సై సౌందర రాజన్.

తమిళ్ సై సౌందర రాజన్  తెలంగాణా  రాష్ట్ర  గవర్నర్ గా నియమితులైన తర్వాత  కొన్నాళ్ళకు రాజ్ భవన్ నుంచి గవర్నర్ ప్రెస్ సెక్రెటరి శ్రీ మల్లాది కృష్ణానంద్ ఫోన్ చేశారు. ‘రేపు మీరు రాజ్ భవన్ కు రావాలి. గవర్నర్ గారి పుస్తకం ఆవిష్కరణ. వీలయితే నాలుగు ముక్కలు మాట్లాడాలి.

రాజ్ భవన్ నాకు కొత్త కాదురేడియో విలేకరిగా చాలా సార్లు వెళ్లాను. రాజ్ భవన్ లో జ్వాలా పనిచేసేటప్పుడు దాదాపు ప్రతి సాయంత్రం అక్కడే అన్నట్టు రోజులు గడిచాయి.  అటువైపు వెళ్లక  ఇంచుమించు పదిహేనేళ్లు కావస్తోంది. అయినా అక్కడ పనిచేసే సిబ్బంది చాలామంది నా మొహం చూసి గుర్తుపట్టి పలకరించడం సంతోషం అనిపించింది. కొంతమంది నా భార్య చనిపోయిన విషయాన్ని ప్రస్తావించి పరామర్శించారు.

గవర్నర్ వచ్చారు. వెంట ఆవిడ భర్త సౌందర రాజన్ కూడా వచ్చారు. ఆయన కూడా డాక్టరే. చాలా చాలా నిరాడంబరంగా వున్నారు. అతిశయం అన్నది మచ్చుకు కూడా కనబడలేదు. ప్రతి సందర్భంలో, అతిధుల్ని ముందుంచి ఆయన వెనుకనే నిలబడ్డారు. అలాగే గవర్నర్ గారి సలహాదారులు. శ్రీ ఏపీవీఎన్ శర్మ గారు. ఒకప్పుడు  మేమున్న ఎర్రమంజిల్ క్వార్టర్స్ లోనే వుండేవారు. వారి ఇల్లు నిశ్శబ్దంగా ప్రశాంతంగా వుండేది. మా ఇల్లు అర్ధరాత్రి అయినా హడావిడిగా వుండేది. మా గందరగోళాన్ని ఆయన ప్రశాంత చిత్తంతో భరించారు. అలాగే  మహంతిగారు. Principled officer అంటే ఆయన పేరే ముందు చెప్పుకునే వారు.

సాంస్కృతిక సభలు, సమావేశాలు కవర్ చేసే ఇంగ్లీష్ పత్రికావిలేకరులకు అలవాటయిన పదం, ఆల్సో స్పోక్.

వక్తల సంఖ్య భారీగా వుంటే అందరి పేర్లూ, వాళ్ళు చేసిన ప్రసంగాలు తమ రిపోర్టులో ప్రస్తావించడం కష్టం కనుక, పలానా పలానా వాళ్ళు కూడా మాట్లాడారు అనడానికి ఇలా క్లుప్తంగా రాసి సరిపుచ్చుతుంటారు. అలాంటిదే ఇది.

హిందూ పత్రికలో ఓ పేరా వస్తే చాలు అదే మహాప్రసాదం అని మహామహులే భావిస్తారు. అలాంటిది ఓ పుస్తకం గురించి ఆ పత్రికలో ఏకంగా ఓ సమీక్షే వచ్చింది. ఇక నేను అనగానెంత. అంచేత నేను కూడా, పైన చెప్పినట్టు “….also spoke” అన్నమాట.

ఇక విషయం ఏమిటంటే!

ఆ పుస్తకం రాసింది దాసు కేశవ రావు గారనే పెద్ద మనిషి (1867- 1934). ఈ దాసు గారికి ఓ మనుమడు. ఆయన పేరు కూడా దాసు కేశవరావే. ఈ చిన్న దాసుగారు నా ఈడువాడే కానీ నాకంటే చాలా పెద్దవాడు, గొప్పవాడున్నూ. హిందూ దినపత్రిక హైదరాబాదు ఎడిషన్ డిప్యూటి ఎడిటర్/ బ్యూరో చీఫ్ గా చేసిన సీనియర్ జర్నలిస్టు. ఆయనా నేనూ ఉద్యోగార్ధులమై, దాదాపు కొంచెం అటూ ఇటూగా ఒకేసారి హైదరాబాదు వచ్చాము. అప్పటినుంచి పరిచయం.

జర్నలిస్ట్ దాసు కేశవరావు గారి కుటుంబం చాలా పెద్దది. సుప్రసిద్ధమైనది. దాసు గారి కుటుంబానికి మూల పురుషుడు, దేవీ భాగవతం కావ్యం సృష్టికర్త అయిన దాసు శ్రీరాములు (1846- 1908) గారి కుమారుడే మన కథానాయకుడు దాసు కేశవ రావు సీనియర్. (బొంబాయి మొదలయిన చోట్ల చాలా కాలం వుండబట్టేమో, ఆయన పేరుకి చివర పంత్ అని చేర్చినట్టున్నారు) వారి కుటుంబంలో దాదాపు అందరూ న్యాయవాది వృత్తిలో స్థిర పడినప్పటికీ, ఈయన గారి అభిప్రాయాలు విభిన్నం. మన ఒక్కరి కడుపు నింపుకోవడం కాదు, పదిమందికీ ఉపాధి కల్పించాలనే సదుద్దేశ్యంతో వ్యాపారాలు చేయాలని అప్పటి బొంబాయి, హైదరాబాదు, ట్రావెన్ కూర్ సంస్థానాల్లో రైల్వే కాంట్రాక్టులు అవీ చేసి పుష్కలంగా డబ్బు గడించారు. ఆ డబ్బుతో, సంపాదించిన అనుభవంతో బెజవాడకు వచ్చి అత్యంత అధునాతన ముద్రణా పరికరాలతో 1896లో వాణి ప్రెస్ ప్రారంభించారు. అప్పటికి బెజవాడ వాసులకు కరెంటు అంటే ఏమిటో తెలియదు. తన సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించి, ఒక చిన్నపాటి విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేసుకుని వాణి ప్రెస్ తో పాటు,ఇరవై ఒక్క గదుల తన రాజ ప్రసాదానికి కూడా విద్యుత్ కాంతుల సొగసులు అద్దారు. అలాగే బాపట్లలో తన కుమార్తె పెళ్లి చేసినప్పుడు, అక్కడే ఒక పవర్ హౌస్ నిర్మించి (ఇప్పుడు రంగారావు తోట అంటున్నారు) కళ్యాణ మండపం యావత్తూ విద్యుత్ వెలుగులు నింపారు. అయిదు రోజులపాటు రంగరంగవైభవంగా జరిగిన ఈ పెళ్లి వేడుకలని, ప్రత్యేకించి విద్యుత్ దీపాల తోరణాలను తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బండ్లు కట్టుకుని బాపట్ల వచ్చేవారని ఆ రోజుల్లో వైనవైనాలుగా చెప్పుకున్నారు.

తెలంగాణా గవర్నర్ డాక్టర్ (శ్రీమతి) తమిళ్ సై రాజభవన్ లో ఆవిష్కరించిన ఈ పుస్తకానికి నా ముందు మాట - ఇంగ్లీష్ పుస్తకం గురించి తెలుగులో పరిచయం- అనే పేరుతొ రాశాను.  నా పాత అనుభవాన్ని అందులో ఉటంకించాను. ఈ సీరియల్ లో ఒకచోట ఈ ప్రస్తావన వచ్చింది కూడా.

"మూడు/నాలుగు  దశాబ్దాల క్రితం నాకు రేడియో మాస్కోలో ఉద్యోగం వచ్చింది. నేను నా కుటుంబాన్ని వెంటబెట్టుకుని  మాస్కోకి వెళ్లాను. ఆ దేశంలో శాకాహారులకు భోజనానికి ఇబ్బంది అని ఎవరో చెప్పగా విని, కొన్ని నెలలకు సరిపడా ఉప్పూ కారాలు, పోపుగింజలు మొదలయిన తిండిసామానులు సూటుకేసుల నిండా సర్దుకుని పట్టుకు పోయాము.

మాస్కో షెర్మితోవా అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల నుంచి ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు కానీ మా ఆవిడ తెచ్చిన ఇంగువ డబ్బా కొంత తంటా తెచ్చిపెట్టింది. ఇంగువని ఇంగ్లీషులో ఏమంటారో ఆ క్షణాన చప్పున గుర్తు రాలేదు. అది తినే వస్తువనీ, వంటల్లో వాడతామనీ ఎన్నో విధాలుగా నచ్చ చెప్పే ప్రయత్నం చేసాను. ఘాటయిన ఇంగువ వాసన, వారి అనుమానాలను మరింత పెంచింది. చివరకు ఇంగువ ముక్క నోటిలో వేసుకుని నమిలి చూపించి, అది వారనుకునే మాదక పదార్ధము కాదని రుజువు చేసుకున్న తర్వాతనే అక్కడ నుంచి బయలుదేరలిగాము.

మాలాంటి ఈ బాపతు వాళ్ళు ఉంటారని దాసు కేశవరావు పంత్ గారు ఊహించే అంతకు యాభయ్ ఏళ్ళకు పూర్వమే ఒక పుస్తకం రాశారు. ‘ఇది జాగ్రత్తగా చదివి అర్ధం చేసుకుంటే ఇంగ్లీషులో చక్కగా మాట్లాడగలుగుతారు’ అని దానికిందనే ఓ ట్యాగ్ లైన్ కూడా వుంది. ఆంగ్లంలో పట్టు సాధించాలని కోరుకునే తెలుగువాళ్ళకు పనికొచ్చే చిన్న పుస్తకం అన్నమాట. ఈ పుస్తకం పేరు A Vade Mecum. లాటిన్ పదం. చిన్ని పుస్తకం అని అనడం ఎందుకంటే, జేబులో పెట్టుకోవడానికి వీలైన గైడు లాంటిది అని తెలుగులో ఆ లాటిన్ పదానికి నిఘంటు అర్ధం.

ఇంగ్లీష్ బాగా తెలిసినవాళ్ళకు కూడా కొన్ని కొన్ని ఆంగ్ల పదాల తెలుగు సమానార్ధకాలు చప్పున స్పురించవు. మరీ ముఖ్యంగా సామెతలు, కాయగూరలు వగైరా.

ఉదాహరణకు ‘He is at his wits end for dinner’ అనే వాక్యాన్ని అనువాదం చేయాల్సివస్తే అది ఏ రూపం సంతరించుకుంటుందో వర్తమాన వార్తాపత్రికల్లో వస్తున్న అనువాదాలను చూస్తే తెలిసిపోతుంది. నిజానికి మనవైపు బాగా ప్రాచుర్యంలో ఉన్న వాడుక పదం,  ‘వాడికి పూటకు ఠికానా లేదు’ అంటుండే దానికి అది ఇంగ్లీష్ సమానార్ధకం అని ఈ పుస్తకంలో వుంది. అలాగే ‘She is near her time’ అని ఎవరైనా అన్నారనుకోండి. మన తెలుగు అనువాదకులు హడావిడిగా ఎలా రాస్తారో తెలుసుకోవడం పెద్ద కష్టమే కాదు. కానీ దాసు కేశవరావు పంత్ గారు దీనికి తెలుగు సమానార్ధకాన్ని పట్టుకున్నారు. ‘ఆవిడకు పురిటి ఘడియలు దగ్గర పడ్డాయి’.

గందరగోళంలోకి నెట్టే మరో వాక్యం. ‘It rains cats and dogs’. ఎప్పుడో, ఎక్కడో చదివాను. పిడుగుల వర్షం లాగా ‘పిల్లులు, కుక్కల వాన’ అనే అనువాదాన్ని. దాసు కేశవ రావు పంత్ గారు ‘కుంభపోత’గా వర్షం కురవడం’ అని రాసారు. బహుశా కుండపోతను ఆయన ‘కుంభ’పోతగా రాసివుంటారు. కుంభం అన్నా కుండ అనే అర్ధం కదా!.

ఇప్పుడు ఏది తెలుసుకోవాలన్నా గూగులమ్మ వుంది కదా అనే వాళ్ళు ఉండొచ్చు. వారికి ఇటువంటి పొత్తాలతో ఒరిగేది ఏమిటి అనే ప్రశ్న ఎదురు కావచ్చు.

అయితే ఇక్కడ అర్ధం చేసుకోవాల్సిన అంశం వేరే. దాసు కేశవ రావు పంత్ అనే పెద్దమనిషి ఎప్పుడో ఎనభయ్ ఏళ్ల క్రితమే ఇటువంటి బృహత్తర ప్రయత్నం చేసారు అనే సంగతిని వర్తమాన సమాజంలో జీవిస్తున్న వారికి తెలియచెప్పడానికి కూడా ఈ ప్రచురణ ఉపయోగపడుతుంది. ఇది పందొమ్మిదో ప్రచురణకు నోచుకున్నది అంటేనే దీనికి లభించిన ఆదరణ, దీనికి ఉన్న విశిష్టత బోధపడతాయి.

ప్రచురణకర్తలయిన మా వయోధిక పాత్రికేయ సంఘం వారికి మనఃపూర్వక అభినందనలు.

ముందు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం. దీప స్తంభం దగ్గరికి వస్తూనే గవర్నర్ తల ఎత్తి పైకి చూసారు. పైన వున్న ఏసీ వెంట్ నుంచి వస్తున్న గాలి ఏమైనా ఇబ్బంది పెడుతుందా అని ఒక్క క్షణం పరకాయించి చూసారు. ఆమె సునిశిత దృష్టి నాకప్పుడు బోధ పడింది.

నన్నూ మరికొందరు సీనియర్ జర్నలిస్టులను వేదిక మీదకు ఆహ్వానించి పుస్తకం విడుదల చేశారు.

ఆ తర్వాత మాలో కొందరిని మాట్లాడమని కోరారు. సుదీర్ఘ ప్రసంగాలు చేసే సందర్భం కాదు. కృష్ణానంద్ కోరినట్టే ముక్తసరిగా మాట్లాడాను. సంవత్సరం కిందట తెలంగాణా గవర్నర్ గా పదవీ స్వీకారం చేసిన పిమ్మట,  ‘తెలుగు నేర్చుకుంటాను’ అని లేడీ గవర్నర్ చెప్పిన వార్త పత్రికల్లో వచ్చిన సంగతి గుర్తుచేసిఆ కారణంగానే తెలుగులో మాట్లాడుతున్నాను అని చెప్పాను. కేంద్ర రాష్ట్ర సంబంధాలను కాపాడడంలో గవర్నర్ల పాత్ర కీలకం, ఈ బాధ్యత నిర్వహణ దిశగా అడుగులు వేస్తున్నందుకు సంతోషంగా వుందని,  తద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని, ముందు ముందు కూడా ఈ సుహృద్భావ వైఖరి కొనసాగాలని ఆశిస్తున్నట్టు చెప్పాను.

మరికొందరి  ప్రసంగాలు అయిన తర్వాత లేడీ గవర్నర్ తన ప్రసంగాన్ని తెలుగులో మొదలు పెట్టిఇంగ్లీష్ లో కొనసాగించారు.

గవర్నర్ ప్రసంగం కాబట్టి పత్రికల్లోమీడియాలో వివరంగానే వస్తుంది. కనుక ఆ ప్రసంగంలో వినవచ్చిన ఒక ముచ్చటతో ముగిస్తాను.

‘ఒక రాజకీయ నాయకుడి దగ్గరకు ఓ నిరుద్యోగి వచ్చి తన కష్టాలను ఏకరవు పెట్టిబతుకుతెరువుకోసం ఏదైనా ఉద్యోగం వేయించండి’ అని ప్రాధేయపడ్డాడుట. ఆ నాయకుడు చిరునవ్వు నవ్వి‘ఏ ఉద్యోగం దొరక్కనే తాను రాజకీయాల్లోకి వచ్చాను’ అని జవాబిచ్చాడుట.

సభానంతరం జరిగిన విందులో మమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకుని అందర్నీ అడిగి అడిగి  మరీ వంటకాలు సర్వ్ చేయించారు. మహిళలు ఎంతటి ఉన్నత స్థానంలో వున్నా కూడా తమకు మాత్రమే సొంతం అయిన ఆప్యాయంతో కూడిన  అతిథి మర్యాదల్ని మరిచిపోలేరు అనిపించింది. ఒకప్పుడు మా రేడియో వార్తా విభాగంలో పైనుంచి కింద నాలుగో తరగతి ఉద్యోగివరకు అందరూ మహిళలే పనిచేసి అఖిల భారత స్థాయిలో మా యూనిట్ కు గొప్ప అవార్డులు తీసుకువచ్చిన సంగతిని భోజనాల  కబుర్లలో భాగంగా లేడీ గవర్నర్ చెవిన వేశాను.

ఎన్నో రోజుల కరోనా గృహనిర్బంధం తర్వాత ఒక రోజు ఇలా  ఉల్లాసంగా హాయిగా గడిచిపోయింది.

 ఎంతో మంది పాత పాత్రికేయ మితృలు కలిసారు. అనేక నెలల తర్వాత అంతమందిని ఒకే చోట కలిసే మహత్తర అవకాశం కల్పించిన మిత్రుడు కృష్ణానంద్ కి ధన్యవాదాలు. 

లేడీ గవర్నర్ తో మొదలుపెట్టి ఎటో వెళ్ళిపోయింది మనసు.

అక్కడికే వస్తున్నాను.

కింది ఫోటో:

తెలంగాణా లేడీ  గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ తో వ్యాస రచయిత భండారు శ్రీనివాసరావు




(ఇంకా వుంది) 

 

 

 

 

 

 

26, జనవరి 2025, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో (80) – భండారు శ్రీనివాసరావు

 

రాష్ట్ర రాజధానిలో వుండే విలేకరులకు ముఖ్యమంత్రులతో పరిచయాలు పెంచుకునే వీలున్నంతగా, గవర్నర్లతో వుండే అవకాశాలు వుండవు. రాష్ట్రపతి, గవర్నర్ వంటి రాజ్యాంగ పదవుల్లో వున్న ప్రముఖులతో విలేకరులకు నిత్యం కలిసే వీలు తక్కువ, ఏదైనా రాజ్యాంగ సంక్షోభం తలెత్తితే తప్ప.

నేను చూసిన మొదటి గవర్నర్  చందూలాల్ మాధవ లాల్ త్రివేది. ప్రైమరీ  స్కూల్లో చదువుకునే రోజుల్లో, గవర్నర్ అంటే ఎవరో ఏమిటో తెలియని రోజుల్లో ఆయన ఒకసారి బెజవాడ గవర్నర్ పేటలో మా బావగారి ఇంటికి దగ్గరలో ఏదో కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చారు. ఎన్నడూ ఎరుగని విధంగా ఆ వీధిలో ఇద్దరు పోలీసులు పొద్దటి నుంచి నిలబడి వుంటే, ఎందుకా అనుకున్నాము. కాసేపటికి ముందు ఒక పోలీసు జీపు, వెనుక ఒక కారులో గవర్నర్ వచ్చారు. ట్రాఫిక్ ఆపడాలు గట్రా ఏమీ లేవు. అసలు ట్రాఫిక్ వుంటే కదా! అన్నీ రిక్షాలు, జట్కాలు. పోలీసు కనబడితే రిక్షాలు లాగే వాళ్ళు ఆమడ దూరం పారిపోయేవాళ్ళు. ఆ రోజుల్లో సైకిళ్లకి, రిక్షాలకి రాత్రిపూట  కిరోసిన్ తో వెలిగించే దీపాలు తప్పనిసరి. లేకుంటే పోలీసులు పట్టుకుంటారనే భయం.

తరువాత ఖమ్మంలో స్కూలు చదువు నటిస్తున్న రోజుల్లో, నాటి గవర్నర్ భీమసేన్ సచార్ ఎస్ ఆర్ అండ్ బీజీ ఎన్ ఆర్ కాలేజీకి వచ్చారు. డెబ్బయ్ ఏళ్ళ కిందటి ముచ్చట. అప్పుడు లెక్చరర్ గా పనిచేస్తున్న కేవైఎల్ గా ప్రసిద్ధులైన కొమరగిరి యోగానంద లక్ష్మీ నరసింహారావు గారు కాలేజీ విద్యార్ధులతో రవీంద్రనాధ ఠాగూర్ ఇంగ్లీష్ నాటికశాక్రిఫైజ్’ నాటిక వేయించారు.  వేయించడమే కాకుండా ఆయన కూడా ఒక పాత్ర  ధరించారు. అందులో నా మేనల్లుడు డాక్టర్ ఏవీ మనోహర రావు కూడా ఒక వేషం కట్టాడు. ఆ నాటిక చూసిన గవర్నర్ భీమసేన్ సచార్ తమ ప్రసంగంలో దానిపై  మంచి ప్రసంశలు కురిపించారు. ప్రముఖ సాంస్కృతిక సంస్థ ‘సంస్కార భారతి’కి కూడా  కేవైఎల్ చాలాకాలం అధ్యక్షులుగా పనిచేసారు. స్పురద్రూపి. కంగుమనే కంఠస్వరంతో,    ఫుల్ సూటులో, ఆయన్ని చూస్తుంటే క్లియో పాత్రా ఇంగ్లీష్ సినిమాలో అంటోనీ గుర్తుకు వచ్చేవారు.   

ఇక నేను 1975 లో రేడియోలో చేరేనాటికి ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి జస్టిస్ ఓబులరెడ్డి గవర్నర్. ఆయన ఆ పదవిలో వున్నది ఏడాది మాత్రమే. తరువాత మోహన్ లాల్ సుఖాడియా గవర్నర్. ఆయన ఎక్కడి నుంచో కానీ, బహుశా బెంగుళూరు అనుకుంటా, రైల్లో కాచీగూడా రైల్వే స్టేషన్ కు వచ్చారు. ఆయన ప్రయాణించిన ప్రత్యేక బోగీ దగ్గర నుంచి రైల్వే స్టేషన్ బయట వరకు ఎర్ర తివాసీలు పరిచారు. నేనూ నా టేప్ రికార్డర్ తో సిద్ధం. నిజానికి  అక్కడ ఆయన మాట్లాడింది ఏమీ లేదు. కాకపోతే గవర్నర్ అంటే ఎంత హంగామా వుంటుందో తెలిసి వచ్చింది. అయితే తదనంతర కాలంలో ప్రత్యేక విమానాల్లో ప్రమాణ స్వీకారానికి హైదరాబాదు  వచ్చే గవర్నర్ లను చూసిన తర్వాత అప్పుడు చూసిన హంగామా తేలిపోయింది.

తరువాత కాలంలో నేను చూసిన బహు నెమ్మదైన, హుందాతనం కలిగిన లేడీ గవర్నర్ శారదా ముఖర్జీ. ఆ రోజుల్లో రాజ్ భవన్  నిజంగా రాజ్ భవన్ మాదిరిగా వుండేది, ఎలాంటి హడావిడి బయటకు తెలిసేది కాదు.

దేశంలో ఒకే పార్టీ పాలన సాగినంతవరకు,  రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ ఆవిర్భావం వరకు రాజ్ భవన్ లో రాజకీయాలకు ప్రవేశం లేదనే చెప్పాలి.

1985 నవంబరు  నుంచి 1990 ఫిబ్రవరి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్ భవన్ వెలుపల నడిచే రాజకీయాలకు ధీటుగా గవర్నర్ నివాసంలోను నడిచిన రాజకీయ సందడి గురించి ఆ రోజుల్లో పత్రికల్లో అనేక కధనాలు వెలువడుతుండేవి. దానికి ప్రధాన కారణం అప్పట్లో గవర్నరుగా పనిచేసిన కుముద్ బెన్ జోషి.

తన ఎనభయ్ ఎనిమిదో ఏట కుముద్ బెన్ జోషి స్వరాష్ట్రం అయిన గుజరాత్ లోని  స్వగ్రామంలో, 2002 మార్చి పద్నాలుగో తేదీ సోమవారం నాడు  కన్ను మూశారు. ఒకప్పుడు పత్రికల వార్తలకు ప్రధాన ముడి వనరు అయిన కుముద్ బెన్ చనిపోయిన వార్త మాత్రం  పత్రికలకు అంతగా పట్టినట్టు లేదు. లోపల పేజీల్లో ఓ చిన్న వార్తగా  వచ్చింది. ఆమె మరణం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేయడంవల్ల, ఏపీ మాజీ గవర్నర్ మరణ వార్త తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసిందని అనుకోవాలి.  సహజమే. అధికారానికిఆరోగ్యానికి దూరమై ఇప్పటికే అనేక సంవత్సరాలు దొర్లిపోయాయి. అలాంటి వ్యక్తులను గురించి పట్టించుకునే తీరిక ఓపిక ఈనాటి వేగ ప్రపంచానికి ఉంటుందని ఆశించడం అత్యాశే అవుతుంది. అంచేతే తళుక్కు మంటేనే తారలుమిణుక్కు మంటే చుక్కలు అనేది.

గవర్నర్ల పాత్ర గురించి ఈనాడు జరుగుతున్న చర్చ ఏనాడో అంటే నలభయ్ ఏళ్ళ క్రితమే జరిగిందని ఈనాటి యువ తరానికి తెలిసే అవకాశం ఉంటుందని అనుకోను. ఆ రోజుల్లో ఇరవై నాలుగ్గంటల టీవీ వార్తాప్రసారాలు ఉన్నట్టయితే మీడియాకు అనుక్షణం పండగలాగా గడిచిపోయేది. రాజ్ భవన్ రాజకీయాలు ఆరోజుల్లో  అంతటి సంచలనాత్మకంగా సాగేవి.

ఇందుకు ప్రధాన కారణం కేంద్రంలో రాజీవ్ గాంధి నాయకత్వంలో జాతీయ పార్టీ  కాంగ్రెస్ ప్రభుత్వంరాష్ట్రంలో ఎన్టీఆర్ నేతృత్వంలో ప్రాంతీయ పార్టీ  టీడీపీ ప్రభుత్వం. రెండూ ఉత్తర దక్షిణ ధ్రువాలు. పొసగని విధానాలు. మాదే పైచేయి కాదు, మాదే అనే ఆధిపత్య ధోరణి.

గవర్నర్ కుముద్ బెన్ జోషి యాభయ్ ఏడేళ్ల వయసులోనే ఈ పదవిలోకి వచ్చారు. గవర్నర్ పదవికి ఇది చిన్న వయసు కిందే లెక్క. అప్పటికే ఆవిడ చురుకైన కాంగ్రెస్ నాయకురాలు. గుజరాత్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, మూడు సార్లు రాజ్యసభ సభ్యురాలిగాకేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఆవిడకు వుంది.

ఓ రిపబ్లిక్ దినోత్సవం రోజున గవర్నర్ సాంప్రదాయక ప్రసంగం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి మింగుడు పడని రీతిలో మాట్లాడడం ఆనాటి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. ఇరవై నిమిషాల పాటు సాగిన హిందీ ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వ సాయం లేకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పధకాలను అమలు చేయడం సాధ్యం కాదని జోషీ కుండ బద్దలు కొట్టారు. కేంద్రం రాష్ట్రానికి చేస్తున్న సాయాన్ని ఆ ప్రసంగంలో ఓ పక్క  ప్రముఖంగా ప్రస్తావిస్తూమరోపక్క  రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాల పట్ల చిన్నచూపు ప్రదర్సించడాన్ని తెలుగుదేశం ప్రభుత్వం జీర్ణించుకోలేక పోయింది. నిరసన వ్యక్తం చేస్తూ మంత్రివర్గం తీర్మానం కూడా చేసింది. ఈ తీర్మానాన్ని రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్ కు  పంపాలని మంత్రివర్గం ముఖ్యమంత్రిని కోరింది.

గవర్నర్ తీరు పట్ల కొందరు బాహాటంగానే అసంతృప్తిఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అటవీ శాఖ మంత్రి ముద్దుకృష్ణమ నాయుడుసహకార శాఖ మంత్రి ఎన్. యతిరాజారావు ప్రభ్రుతులు గవర్నర్ పదవికి ఉన్న ప్రతిష్టను  జోషి దిగజార్చారని. ఆవిడ కాంగ్రెస్  ఏజెంటుగా పనిచేస్తున్నారని ఆరోపించారు.   రాజ్ భవన్, గాంధి భవన్ (రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం) గా తయారైందని ఆక్షేపించారు.

కుముద్ బెన్ జోషి గవర్నర్ హోదాలో రాష్ట్రంలోని ఇరవై మూడు జిల్లాల్లో అనేక మార్లు విస్తృతంగా పర్యటించారు. అనేక కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళు.  రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడం అనే రాజకీయ ప్రయోజనం కోసమే గవర్నర్ ఇలా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని  టీడీపీ మంత్రులు ఆరోపించేవారు. రాజ్ భవన్ పై పెట్టే  వ్యయం పెరుగుతూ వుండడం పట్ల  వారు అడపాదడపా ఆగ్రహం వ్యక్తం చేసేవాళ్ళు. అప్పటికే గవర్నర్ వ్యవస్థను వ్యతిరేకిస్తూ వచ్చిన ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సైతం జోషీ తీరు పట్ల అసహనం పెంచుకున్నారు.

కుముద్ బెన్ జోషి గవర్నర్ హోదాలో స్థానిక పత్రికలకు ఎడాపెడా ఇంటర్వ్యూలు ఇచ్చేవారు. టీడీపీ నాయకులు తనపై చేస్తున్న విమర్శలుఆరోపణలు ఆధార రహితం అని కొట్టి వేసేవారు. వాటికి జవాబు ఇవ్వడం గవర్నర్ గా తన హోదాను తగ్గించుకోవడమే అవుతుందనివాటిని తాను లెక్కపెట్టనని ఘాటుగా చెప్పేవారు.

అంతకు ముందు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా పనిచేసిన శారదా ముఖర్జీ తన పదవీ కాలంలో తన అధ్యక్షతన చేతన అనే స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేశారు. కుముద్ బెన్ జోషి ఈ సంస్థకు మరిన్ని జవసత్వాలు కల్పించడమే కాకుండా, నీసా అనే మరో సంస్థను నెలకొల్పారు. అచేతనావస్థలో ఉన్న రెడ్ క్రాస్ సంస్థకు కొత్త ఊపిరి పోశారు. చేతన ఆధ్వర్యంలో తెలంగాణాలోని కొన్ని ప్రాంతాల్లో ప్రబలంగా ఉన్న జోగినీ వ్యవస్థను నిర్మూలించే దిశగా ప్రయత్నాలు చేశారు. కొన్ని జోగినీ జంటలను రాజ్ భవన్ కు ఆహ్వానించి దర్బారు హాలులో ఆ జంటలకు పెళ్ళిళ్ళు చేశారు. రాజ్ భవన్ లో సాగుతున్న ఈ కార్యక్రమాల పట్ల నాటి మంత్రి  నల్లపరెడ్డి  శ్రీనివాసులు రెడ్డి చేసిన వ్యాఖ్య ప్రకంపనలు సృష్టించింది. రాష్ట్ర ప్రభుత్వానికిరాజ్ భవన్ కు నడుమ అగాధాన్ని మరింత  పెంచింది.

ఉమ్మడి రాష్ట్రంలో గవర్నర్ పదవిని దుర్వినియోగం చేసిన వ్యక్తిగా రాం లాల్ ముద్ర వేయించుకుంటేకుముద్ బెన్ వివాదాస్పద గవర్నర్ గా పేరు తెచ్చుకున్నారు.

ఆవిడ చేసిన ప్రయత్నాల ఫలితం అని చెప్పలేము. కాని తర్వాత జరిగిన  అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశాన్ని ఓడించి అధికారానికి రావడం కాకతాళీయం కావచ్చు.

తోకటపా:

గవర్నర్ కు ముఖ్యమంత్రికి అసలు పొసగదని,  నిప్పులో ఉప్పు బాపతు  అని జనం బాహాటంగా చెప్పుకుంటున్న సమయంలో జరిగిన సంఘటన ఇది. నగరం నుంచి గండి పేటకు పోయే దారిలో గవర్నర్ తన అధ్యక్షతన ఉన్న   స్వచ్చంద సంస్థల భూమిలో ఒక వృద్ధాశ్రమం కట్టాలని తలపెట్టారు. దానికి సరైన తెలుగు పేరు సూచించాలని గవర్నర్ అడిగిన వ్యక్తి ఎవరో తెలుసా! సాక్షాత్తు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు.  బదులుగా   ఎన్టీఆర్ సూచించిన  పేరు ఏమిటో తెలుసా! వయోధిక ఆశ్రమం.

కింది ఫోటో:

రాజ్ భవన్ లో గవర్నర్ కుముద్ బెన్ జోషీతో, అప్పటి ఉపరాష్ట్రపతి వెంకట్రామన్, ప్రముఖ కవి దాశరధి,  స్వాతంత్ర సమరయోధులైన మా పెద్ద బావగారు అయితరాజు రాం రావు గారు, రెండో బావగారు కొలిపాక రామచంద్రరావు గారు



(ఇంకా వుంది)

24, జనవరి 2025, శుక్రవారం

ఇదీ అసలు కధ – భండారు శ్రీనివాసరావు

  

నిజానికి రాద్దాం అనుకున్నది ఇది. పొరబాటున పోస్టు చేసింది వేరొకటి. తొందర్లో తప్పులు తొక్కటం అంటే ఇదే. 

‘భార్యను చంపి, ముక్కలు చేసి, కుక్కర్ లో ఉడికించి’ ...అంటూ ఈరోజు (గురువారం, 23-01-2025) పత్రికల్లో ఒక  భయంకరమైన కధనం వచ్చింది. చదవగానే కడుపులో తిప్పే ఇలాంటి వార్తను తక్షణమే మరచి పోవాలి. లేదా పేజీ తిప్పేయాలి.  కానీ నేను ఆ పని చేయకుండా 65 ఏళ్ళ కిందటి ఒక పాత క్రైం స్టోరీ పోస్టు చేశాను. తీరా చూస్తే ఈ వార్తకు ఆ స్టోరీకి పోలికే లేదు. అందుకే మళ్ళీ ఈ పోస్టు. వద్దు వద్దు అనుకుంటూ మళ్ళీ ఈపోస్ట్  లేమిటి అని మరోలా అనుకోవద్దు. తప్పు దిద్దుకునే ప్రయత్నంలో మరో పొరబాటు అని పెద్ద మనసుతో సరిపుచ్చుకోండి.

ఇది కూడా జరిగిన ఘోరమే. ఇది కూడా పాత రోజుల్లో కొన్ని పత్రికల్లో వచ్చింది. 

ఖమ్మం సాయిబాబాగా ప్రసిద్ధి చెంది అక్కడ ఒక ఆశ్రమం కూడా నిర్మించుకుని కొన్నేళ్ళ క్రితం పరమపదం చేరుకున్న జీవై కృష్ణమూర్తి స్వయంగా మా బాబాయి గారి అల్లుడు. మా అక్కయ్య మధురకు భర్త. పూర్వాశ్రమంలో సమర్ధుడైన పోలీసు అధికారి. యూనిఫారంలో ఆయన్ని చూస్తే మాకు ఒణుకు. నేరగాళ్లకు సింహస్వప్నం. ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్నప్పుడు, ఒక ముఖ్యమంత్రి గారి (ఆయన అప్పుడు కారులో లేరు, పైగా ఆ రోజుల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు) కారును ట్రాఫిక్ ఉల్లంఘన కింద బుక్ చేస్తే, పనిష్ మెంటుగా నేర విభాగానికి బదిలీ చేశారు. 

ఆ రోజుల్లో జరిగిన కధ ఇది. నేను చాలా చిన్నపిల్లవాడిని. మా పెద్దవాళ్లు మాట్లాడుకుంటుంటే విన్న కధను గుర్తు చేసుకుని చెబుతున్నాను. ఆ కాలం నాటి వాళ్ళు ఎవరైనా వుంటే చదివి చెప్పండి. పొరబాటు వుంటే సరిదిద్దుకుంటాను.  

ఆ రోజుల్లో హుస్సేన్ సాగర్ ఒడ్డున కొన్ని కుక్కలు ఆహారం కోసం వెతుకుతూ కాలి గోళ్ళతో  తవ్వుతుంటే మనిషి చేయి ఒకటి బయటకు వచ్చింది. ఎవరో చెబితే పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఒకచోట చేయి, మరో చోట మనిషి తాలూకు మరో అంగం ఇలా పలుచోట్ల దొరికాయి. ఒక చోట ఆ మనిషి ధరించిన వస్త్రం (తరువాత అది ఆడవాళ్ళు ధరించే నైటీ అని తెలిసింది) కనబడింది. 

అప్పుడు మా బావగారు క్రైం ఇన్స్పెక్టర్. ఆ నైటీ భాగాన్ని పరిశీలనగా చూస్తే చాకలి గుర్తు కనిపించింది. (ఆ రోజుల్లో పేపర్లో అలాగే రాశారు కాని, ఈ రోజుల్లో ఇలా ఒక కులం పేరు రాయడం తప్పని తెలుసు. నన్ను మన్నించాలి). దర్యాప్తు చేస్తే ఆ గుర్తు బొంబాయిదని తేలింది. కృష్ణమూర్తిగారు బొంబాయి (ఇప్పుడు ముంబై) వెళ్లి ఆ గుర్తు ఆధారంగా తన పరిశోధన కొనసాగిస్తే, అది నానావతి అనే ఒక డాక్టర్ ఇంటిది అని తెలిసింది. తీగెను కదిలిస్తే డొంక కదిలింది.

కుటుంబ కలహాల కారణంగా ఆ డాక్టరుకు భార్యపై తగని కోపం ప్రబలింది. ఆ ఉద్రేకంలో ఆమెను ఇంట్లోనే హత్య చేశాడు. తరువాత పరిణామాలు ఆయన్ని భయపెట్టాయి. డాక్టరుగా అనేక ఆపరేషన్లు చేశాడు. శరీరంలో ఏ భాగాన్ని ఎలా కత్తిరించాలో బాగా తెలుసు. ఎలా కట్ చేస్తే రక్తం ఎక్కువగా స్రవించదో కూడా తెలిసిన మనిషి. ఆ పరిజ్ఞానంతో శరీర భాగాలను ముక్కలుగా కట్ చేసి ఒక పెద్ద సూటు కేసులో పెట్టి, రైల్వే స్టేషన్ కు వెళ్లి హైదరాబాదుకు వెళ్ళే రైలు ఎక్కాడు. తెలతెలవారుతుండగా ఆ సూటుకేసును రైలు బోగీ గుమ్మంనుంచి హుస్సేన్ సాగర్ లోకి నెట్టి వేశాడు. ఆ రోజుల్లో రిజర్వేషన్ల గొడవ లేదు కాబట్టి తిరుగు రైలులో బొంబాయి వెళ్ళిపోయాడు. హుస్సేన్ సాగర్ లో పడ్డ ఆ  సూటు కేసు తెరుచుకుని శరీర భాగాలు చెల్లాచెదురు అయ్యాయి. అవి ఒడ్డుకు కొట్టుకు వచ్చి భూమిలో కూరుకుపోయి చివరికి వీధి కుక్కల నోటికి ఒక చేయి దొరికింది. 

ఇదీ జరిగిన కధ. 

అప్పుడూ ఈ క్రైం స్టోరీ కధలు కధలుగా అంధ్రపత్రిక దినపత్రికలో వచ్చిన గుర్తు.

తోకటపా: బొంబాయిలో నానావతిని అరెస్టు చేసి మా బావగారు హైదరాబాదు తీసుకువచ్చారు. అప్పుడు సిటీ పోలీసు నేర విభాగం రేడియో స్టేషన్ కు దగ్గరలో వున్న సిటీ పోలీసు కంట్రోల్ రూమ్ పైన వుండేది. ముద్దాయిని విచారిస్తున్న సమయంలో అతడు  హఠాత్తుగా  మూడో అంతస్తు నుంచి దూకి చనిపోయాడు.




(ఈరోజు పత్రికల్లో వచ్చిన వార్త)


(23-01-2025)

23, జనవరి 2025, గురువారం

65 ఏళ్ళ కిందటి క్రైమ్ స్టోరీని గుర్తు చేసిన ఈనాటి వార్త - భండారు శ్రీనివాస రావు

 

ఇది జరిగిన కధే. అంచేత ఓ కధలా ముచ్చటిద్దాం. పేర్లూ, ఊర్లూ తర్వాత చెప్పుకుందాం.
అతడో పెద్ద అధికారి. భార్యా, ముగ్గురు పిల్లలు. ఉద్యోగ బాధ్యతల కారణంగా అతడు నెలలో చాలా రోజులు వేరే ఊళ్లలో ఉంటుంటాడు. ఈ క్రమంలో అతడి భార్యకు భర్త స్నేహితుడితో సంబంధం ఏర్పడుతుంది. విడాకులు తీసుకుని అతడ్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. కానీ ఆ ప్రియుడి ఉద్దేశ్యం వేరు. ఆడవాళ్ళను వాడుకుని వదిలేసే రకం.
ఈ విషయం భర్తకు తెలుస్తుంది. అధికార రీత్యా ప్రభుత్వం అతడికి సమకూర్చిన రివాల్వర్ తీసుకుని భార్యను లోబరుచుకున్న వ్యక్తి ఇంటికి వెడతాడు. నా భార్యను పెళ్లి చేసుకుని, నా పిల్లల్ని నీ పిల్లలుగా చూసుకునే ఉద్దేశ్యం ఉందా లేదా అని నేరుగా అడిగేస్తాడు. ‘నాతొ కాలక్షేపం చేసిన ప్రతి అమ్మాయిని పెళ్ళాడాలంటే నేను వెయ్యి పెళ్ళిళ్ళు చేసుకోవాలని అతడు ఎకసెక్కంగా మాట్లాడుతాడు. భర్తకు పట్టలేని ఆగ్రహం కలిగి పిస్టల్ తో కాలుస్తాడు. భార్య ప్రియుడు అక్కడికక్కడే ప్రాణాలు విడుస్తాడు. అతడు నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లి నేరం ఒప్పుకుని లొంగిపోతాడు. కేసు విచారణ సుదీర్ఘంగా సాగుతుంది. జ్యూరీ అతడ్ని నిర్దోషిగా పరిగణిస్తుంది. కానీ సెషన్స్ జడ్జి జ్యూరీ నిర్ణయాన్ని కాదని కేసును హై కోర్టుకు పంపుతాడు. అక్కడ అతడికి జీవిత ఖైదు విధిస్తారు. హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు ధ్రువ పరుస్తుంది.
ఇక్కడ కధ మరో మలుపు తిరుగుతుంది.
ఇప్పుడు పేర్లూ వివరాలు చెప్పుకుందాం. అతడి పేరు నానావతి. నేవీ కమాండర్. స్నేహితుడి పేరు ప్రేమ్ ఆహూజా. బాగా డబ్బున్నవాడు. విలాసపురుషుడు.
కధలో మలుపుకు కారణం ఓ పత్రిక. ఒకానొక రోజుల్లో విపరీతమైన పాఠకాదరణ కలిగిన ఇంగ్లీష్ వారపత్రిక బ్లిట్జ్. ఆ పత్రిక ఎడిటర్ ఆర్కే కరంజియా.
ఆ పత్రిక ముద్దాయిని భుజాలకు ఎత్తుకుంటుంది. ధారావాహిక కధనాలు అతడికి మద్దతుగా ప్రచురిస్తుంది. దానితో ప్రజలందరూ ఆ కేసు గురించే మాట్టాడుకోవడం మొదలవుతుంది. పాతిక పైసల పత్రికను రెండు రూపాయలు పెట్టి కొనుక్కుని చదివేవారు. నానావతి పేరుతొ పిల్లలు ఆడుకునే బొమ్మ పిస్తోల్లు, ఆహూజా పేరుతొ టీ షర్ట్లులు అమ్మడం మొదలైంది. నానావతికి నైతిక మద్దతు తెలుపుతూ ర్యాలీలు, ఊరేగింపులు జరుగుతాయి. దేశవ్యాప్తంగా నానావతి కేసు ఓ సంచలనంగా మారుతుంది.
చివరికి అప్పటి మహారాష్ట్ర గవర్నర్ శ్రీమతి విజయలక్ష్మి పండిట్ క్షమాభిక్ష పెట్టి అతడి యావజ్జీవ శిక్షను రద్దు చేయడంతో కధ సుఖాంతమవుతుంది.
కేసు నుంచి బయట పడిన నానావతి తన కుటుంబాన్ని తీసుకుని కెనడా వెళ్లి అక్కడే సెటిల్ అయి అక్కడే చనిపోవడంతో అతడి కధ ముగుస్తుంది.
ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి. బ్లిట్జ్ పత్రిక యజమాని, సంపాదకుడు ఆర్కే కరంజియా పార్సీ. ముద్దాయి నానావతి కూడా పార్సీ.
1959లో కాబోలు ఇది జరిగింది. అప్పుడు నేను స్కూల్లో చదువుకుంటున్నాను. ఆంధ్ర పత్రిక వాళ్ళు దీన్ని ఓ సీరియల్ గా ప్రచురించేవారు. బ్లిట్జ్ పత్రిక ఏమి రాసిందో తెలియదు కానీ అంధ్రపత్రిక మాత్రం ఆసక్తికరమైన వార్తా కధనాలను వండి వార్చేది.
కోర్టులో వాదోపవాదాలు ఎలా జరుగుతాయో తెలుసుకోవడం మీద ఆ రోజుల్లో జనాలకు చాలా ఆసక్తి వుండేది. ప్రాసిక్యూషన్ తరపున రాం జెట్ మలానీ వాదిస్తే, ముద్దాయి నానావతి తరపున ఖండాలావాలా ఈ కేసు వాదించారు.
ఇరవై నాలుగు గంటల టీవీ చానళ్ళ కాలంలో జరిగివుంటే పండగే పండగ.


(ఈనాడు పత్రికల్లో ప్రముఖంగా వచ్చిన వార్త)


22, జనవరి 2025, బుధవారం

అప్పుడే ఏడాది అయిందా?


కాలం పరిగెత్తుతుందని, దాని వేగం అందుకోవడం కష్టమని తెలిసివచ్చింది.

సంతోష్ చనిపోయి అప్పుడే సంవత్సరం అయిందా. అసలు వాడు పోయాడా, ఏదైనా దేశానికి ఉద్యోగానికి వెళ్ళాడేమో, రేపోమాపో తిరిగి వస్తాడేమో అనే ఆలోచన వుట్టి  భ్రాంతే అని, విప్రవరులు ఉచ్చై స్వరంతో రెండు రోజులుగా  ఏడూడి మాసికాలు పెడుతుంటే, వాళ్ళు చెప్పినట్టు వింటూ, చేస్తూ పిండాలు అగ్నిహోత్రంలో  నేనే స్వయంగా వేస్తుంటే నమ్మకం పోవడం ఎలా!

నమ్మిచేసేది ఏముంది? నమ్మక చేయగలిగేది ఏముంది?

అష్ట ఐశ్వర్య సిద్ధిరస్తు  అని పండితులు ఆశీర్వదిస్తుంటే నవ్వు వచ్చింది. నిజంగానే పైనున్న దేవతలు తథాస్తు అంటే, ఒక పక్క భార్య పోయి, కుడి భుజంగా ఉంటాడు అనుకున్న ఎదిగిన కొడుకు పోయి ఏం చేసుకోవాలి ఆ ఐశ్వర్యాలను? 

కూతురు జీవికతో ఆడాల్సిన ఆటలు, పాడాల్సిన పాటలు పాడి తన దోవ తాను చూసుకున్నాడు.

పాపం కోడలు నిషా!


https://www.youtube.com/watch?v=9ijzemJPsCM 

(22-01-2025)  



21, జనవరి 2025, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (79) – భండారు శ్రీనివాసరావు

 


“ఇంటి అద్దెలు భరించలేకపోతున్నాను, ఒక ఇల్లు ఇప్పించండి” అని అడిగాను ముఖ్యమంత్రిని. ఒకరిని కాదు, ఇద్దరు ముఖ్యమంత్రులను. వాళ్ళూ ఇలా అడగ్గానే అలా ఇచ్చేసారు. 

ఈ ఇద్దరిలో ఒక ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు నా అభ్యర్ధనపై రెంట్ కంట్రోల్ చట్టం కింద ఇల్లు కేటాయించిన సంగతి, దాన్ని నేను వాడుకోలేకపోయిన విషయం ఆయనకు సంబంధించిన అధ్యాయంలో విశదంగా రాశాను. 

ఇక అడగగానే ఇల్లు ఇచ్చిన  రెండో ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు.

కిందటి ఎపిసోడ్ లో ముఖ్యమంత్రుల ఇళ్ళ కధలు వినిపించా కదా! ఇక నా ఇళ్ళ పురాణం చిత్తగించండి.

చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రానికి రెండో పర్యాయం ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ మనసులోఇంటి పురుగు తొలిచింది. ఆయన్ని కలిసి, అద్దెలు భరించడం కష్టంగా వుంది ఓ ఇల్లు ఇప్పించండి అని అడిగేశాను. ఆయన చిన్నగా నవ్వి, అదెంత భాగ్యం అన్నట్టు చూసి ఓ అధికారికి నన్నూ, నా పనీ ఒప్పచెప్పారు. ఇల్లు అంటే నా ఉద్దేశ్యం గవర్నమెంటు క్వార్టర్ అని. అదయితే ఎంచక్కా  తక్కువ అద్దె కట్టుకుంటూ కాలక్షేపం చేయొచ్చని నా ఆలోచన.  ఆ అధికారికి నా తరహా నచ్చలేదు. క్వార్టర్ అయితే రేపు రిటైర్ కాగానే ఖాళీ చేసిపోవాలి అన్నాడు. నేనన్నాను. 'అదే మంచిది. నేను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని. ఈ ఒక్క మినహాయింపు ఇచ్చి క్వార్టర్ అలాట్ చేస్తే నాకూ ఇబ్బంది వుండదు, ముఖ్యమంత్రి గారికి కూడా మాట రాదు. నాకు క్వార్టరే కావాలి అన్నాను. ‘పిచ్చి బ్రాహ్మడిలాగున్నావే’ అన్నారాయన వెక్కిరింతగా.

వాతావరణం చల్లబరచడానికి, ‘నిజమే, క్వార్టర్ సరిపోదు, ఫుల్లు కావాలి’ అన్నాను. ఆయన పెద్దగా నవ్వేశాడు. 

ఎర్రమంజిల్ కాలనీలో ఐ.జే. 2 క్వార్టర్ నా పేరు మీద అలాట్ చేస్తూ మర్నాటికల్లా  ఆర్డర్ వచ్చింది. 

2005 డిసెంబరులో దూరదర్సన్ నుంచి  రిటైర్ అయ్యేదాకా తక్కువ అద్దె కట్టుకుంటూ, అటూ ఇటూ ఐ.ఏ.ఎస్. అధికారులు, ఐ.పి.ఎస్. అధికారులు వుండే ఆ  కాలనీలో, సెకండ్ క్లాస్ టిక్కెట్టుతో ఫస్ట్ క్లాస్ బోగీలో ప్రయాణం చేస్తున్న ఫీలింగుతో కాలం  గడిపాము. 

మొత్తం కాలనీలో అధికారిక వాహనం కానీ, సొంత కారు కానీ లేని ఇల్లు మాదే. కారు షెడ్డు ఖాళీగా వుండేది.

కాకపోతే,  మా పక్క, వెనుక క్వార్టర్ లలో వున్న మామిడి చెట్ల నుంచి సీజనులో మా ఇంట్లో రాలిపడే  మామిడికాయలు ఉచితం. 

చివరకు చంద్రబాబు పేషీలో అధికారి చెప్పినట్టే జరిగింది. 2005 డిసెంబరు ఆఖర్లో రిటైర్ కాగానే, అంతవరకూ బకాయి పడ్డ అద్దె మొత్తాలను, కరెంటు, నీటి బిల్లులను సెటిల్ చేసి క్వార్టర్ ఖాళీ చేయమని  నోటీసు ఇవ్వడమే కాకుండా, నా  రిటైర్ మెంటు బెనిఫిట్స్ నుంచి వసూలు చేసి, ఇక నీ ఇష్టం వచ్చిన చోటికి పొమ్మన్నారు. గవర్నమెంట్ డబ్బా మజాకా! 

అరవై ఏళ్ల వయసులో, నాకు  దక్కిన  షష్టిపూర్తి పూర్తి కానుక అనుకుని సంతృప్తి పడ్డాను. 

పిల్లి పిల్లల్ని పెట్టి, ఏడిళ్ళు మారుస్తుందని అంటారు. మేము మా పిల్లలతో కలిసి ఏడిళ్ళకు పైగా మారి ఉంటాము. ఆఖరికి ఇళ్ళ సమస్యలేని మాస్కోలో కూడా రెండు ఫ్లాట్లు మారాము. మాస్కో వెళ్ళేటప్పటికే ఊలిత్స వావిలోవాలోని రేడియో మాస్కో భవనంలో మాకోసం డబల్ రూమ్ ఫ్లాటు సిద్ధంగా వుంచడం, దాంట్లో చేరిపోవడం జరిగింది. అందులో ఒక చిన్నపొరబాటు జరిగింది. దాన్ని అధికారులే గుర్తించి దిద్దుకున్నారు. పిల్లల సంఖ్యను బట్టి ఎన్ని పడక గదులు ఉండాలో నిర్ణయం అవుతుంది. మాకు ఇద్దరు పిల్లలు కాబట్టి మూడు పడక గదుల ఫ్లాటుకు వెంటనే మార్చారు. మంచాలు, పరుపులతో సహా సమస్తం అమర్చి పెట్టిన ఫ్లాట్ కాబట్టి ఆ అయిదేళ్ళు కాలుమీద కాలువేసుకుని కాలక్షేపం చేశాము.

1975 లో హైదరాబాదు రేడియోలో చేరినప్పుడు 75 రూపాయలకు అశోక్ నగర్ చమన్ దగ్గర ఒక వంటిల్లు, ఒక గదితో మా జీవనయానం మొదలయింది. అక్కడి నుంచి చిక్కడపల్లి సుధా హోటల్ దగ్గర మరో వాటాలో దిగాము. అక్కడే మా ఆవిడ ‘అమ్మ ఒడి ‘పేరుతొ ఒక చైల్డ్ కేర్ సెంటర్ మొదలు పెట్టింది. 1987 లో మాస్కో వెళ్ళేవరకు అదే ఇల్లు. తిరిగొచ్చిన తరువాత మకాం పంజాగుట్ట వైపు మారింది. దుర్గానగర్లో రెండిళ్ళు , తరువాత అమీర్ పేటలో మరో ఇల్లు, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుట్ ఆఫ్ టర్న్ పద్దతిలో కేటాయించిన ఎర్రమంజిల్ ఐ.ఏ.ఎస్. కాలనీకి మా మకాం మారింది. , సెకండ్ క్లాసు టిక్కెట్టుతో ఫస్ట్ క్లాస్ లో ప్రయాణిస్తున్న అనుభూతితో అక్కడి క్వార్టర్ లో కొన్నేళ్ళు కాపురం. రిటైర్ కాగానే, తదుపరి ఎల్లారెడ్డి గూడా. తరువాత మజిలీ మాధాపూర్. ఇలా మారుతూ, మారుతూ ఊరి చివరకు చేరుతామేమో  అనుకున్నాము. ఒకప్పుడు ఇంట్లో ఒంట్లో బాగా వున్నవాళ్ళు ఊరి నడిబొడ్డున వుండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళూ ఊరి పొలిమేరలకు చేరి విల్లాలు కట్టుకుంటున్నారు. మా పక్కన పలానా పెద్దమనిషి వుంటున్నాడని మేమూ చెప్పుకునే రోజు వస్తుందేమో అని కూడా ఆనందపడ్డాము.  ఇలా ఇళ్ళు మారడంలో ఓ సులువు కూడా వుంది. కొత్త ప్రాంతాలు, కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. అదే కట్టుకున్న సొంత ఇల్లు అయితే, ఒండుకున్న అమ్మకు ఒకటే కూర సామెత చందం.

ఇలా  రోజులు  గడుపుతున్న రోజుల్లో  ఓ రోజున, మా ఇంటాయన, ఆయన ఢిల్లీలో ఉంటాడో, విశాఖపట్నంలో ఉంటాడో తెలియకుండానే ఈ ఇంట్లో దిగాము, తాలూకు ఒక పెద్ద మనిషి వచ్చి చల్లటి కబురు చెవులో వేసి వెళ్ళాడు, రెండు నెలల్లో ఇల్లు ఖాళీ చేయమని.

మరి, ఈ ఇంట్లోకి వచ్చి దాదాపు రెండేళ్ళు దాటుతోంది కదా! అడక్క వారికీ తప్పదు, ఖాళీ చేయక మాకూ తప్పదు. అంతయు మన మేలునకే అనుకుంటే పోలా అని మళ్ళీ ఇల్లు మారాము..

కొసమెరుపు: భూమి గుండ్రం సామెత మాదిరిగా మళ్ళీ యెల్లారెడ్డి గూడాకే, అదే మధుబన్ ఫ్లాట్ కి మళ్ళీ చేరాం.

(ప్రాణం పోసిన వాడు ఆవాసం చూపించడా)

కింది ఫోటో:

కాలు విరిగి ఆసుపత్రిలో వున్న నన్ను పరామర్శించడానికి వచ్చిన నాటి, నేటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు 




(ఇంకావుంది)