తల వాకిలి ఓరగా వేసివుంది.
లోపల నుంచి మాటలు వినపడుతున్నాయి. ఆ గదిలో వున్న
ఇద్దరూ నా రాకను గమనించలేదు. నడిచివచ్చిన బడలిక తీర్చుకోవడానికి ఓ కుర్చీలో
కూలబడ్డాను.
వారిలో ఒకావిడ వృద్ధురాలు. ఎనిమిది పదులు దాటిన
వయసు. ఆవిడ ఎవరో కాదు,
స్వయానా నాకు పెద్ద వదిన. పెద్దన్నయ్య కీర్తిశేషులు పర్వతాల రావు గారి భార్య. మా ఇంటికి అరకిలోమీటరు దూరంలో ఉన్న కొడుకు రాఘవరావు
ఇంట్లో ఉంటోంది. అయిదు రోడ్లు కలిసే ఒక రోడ్డు కూడలిలో అడ్డదిడ్డంగా వచ్చే వాహనాలను
తప్పించుకుంటూ రోడ్డు దాటడం ఒక్కటే ఇబ్బంది. అయినా రోజూ
సాయంత్రం వెళ్లి కాసేపు ఆమె దగ్గర కూర్చుని రావడం అలవాటు.
నేను వెళ్లేసరికి వదిన మంచం మీద దిండును ఆనుకుని కూర్చుని, ఎదుటి మనిషి చెబుతున్న మాటలను ఏకాగ్రతగా
వింటోంది.
ఎదురుగా వున్న ఆవిడ పేరు స్వరూప. పేరు ఆధునికంగా
వున్నా పల్లెటూరు మనిషి అని చూడగానే తెలిసి పోతుంది. ఆవిడ మా వదిన గారికోసం వాళ్ళ
అబ్బాయి, హైదరాబాదులోని రమణాశ్రమం సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన కేర్ టేకర్. ఈ
మధ్యనే మా వదిన తూలిపడడం చేత కుడిచేయి
మణికట్టు దగ్గర ఎముక విరిగింది. కట్టు
వేశారు. జాగ్రత్తగా ఉండమని, తోడు, సాయం
లేకుండా నడవ వద్దని, నాలుగు అడుగులు కూడా వేయవద్దని డాక్టరు జాగ్రత్తలు చెప్పి పంపాడు. ఇదీ నేపధ్యం.
మా వదినను మాట్లాడనివ్వకుండా, ఆమె రెండు చేతులూ
పట్టుకుని స్వరూప ఏకబిగిన చెప్పుకుపోతోంది.
నేను మౌనంగా వింటున్నాను.
“అమ్మా! మీరు పెద్దవారు. ఎనభయ్ దాటాయని
చెబుతున్నారు. మీ వయసులో సగం లేదు నా వయసు. మిమ్మల్ని కనిపెట్టుకుని చూడమని మా
యజమాని నన్ను మీ వద్దకు పంపాడు. ఆయనకు మాట రానివ్వకుండా చూడాలి నేను. మీరేమో
రాత్రుళ్లు నాకు చెప్పకుండా లేస్తున్నారు.
మీ పక్కనే పడుకుంటున్నాను. ఓ చేయి మీ వంటిమీదే ఉంచుతున్నాను. ఏమాత్రం అవసరం వున్నా
నన్ను లేపండి. నేను దగ్గర వుండి మిమ్మల్ని బాత్ రూముకు తీసుకువెడతాను. మీరు నా
కంటే చాలా పెద్ద. కానీ నాకంటికి నువ్వు రెండేళ్ల పిల్లవే. కన్నబిడ్డ పక్కబట్టలు ఆగం
చేస్తే తల్లి శుభ్రం చేయదా! నేనూ అంతే! పక్క మీద నుంచి రాత్రి వేళ కదిలే
పనిలేకుండా నేనే చూస్తాను. లోగడ కొన్నాళ్ళు ఓ ఆసుపత్రిలో ఆయాగా పనిచేశాను. ఇవన్నీ
నాకు అలవాటే. కాబట్టి నా మాట వినండి. నేను
ఈ పనులు డబ్బుల కోసం చేస్తున్నా, డబ్బొక్కటే ముఖ్యం కాదు. నాకిక్కడ మూడు పూటలా
అన్నం పెడుతున్నారు. చక్కగా కనుక్కుంటున్నారు. నా పనిలో ఏదైనా తేడా వస్తే ఆపైన
దేవుడు నన్ను వదిలిపెడతాడా!
“మళ్ళీ చెబుతున్నాను. ఈసారి అరిచి కసిరి
చెబుతాను. పిల్లలకు తల్లి చెప్పదా! అలాగే నేనూ గట్టిగానే చెబుతాను. మనసులో
పెట్టుకోకండి. మీ కట్టు విప్పి, మీ చేయి నయం అయ్యేవరకు నేను మిమ్మల్ని వదిలిపోను.
తర్వాత మీ ఇష్టం. అంతవరకూ నాకు మాట రానీయకండి”
ఇదంతా విన్న తర్వాత నాకు అక్కడ ఉండాల్సిన అవసరం
కనపడలేదు. ఎంత మౌనంగా వచ్చానో అలాగే బయటకు వచ్చేశాను. వదిన ఎలా వుందో చూడాలని వచ్చాను. ఆమెను పదిలంగా చూసుకునే మనిషి
దొరికింది.
గుళ్ళో వుండే దేవుడు మనుషుల్లో కూడా ఉంటాడు. ఈ
దేవత కొలువైన గుడి నుంచి బయలుదేరి మా ఇంటికి వెళ్లాను.
ఇది జరిగిన కొద్ది రోజులకే చేతి కట్టు విప్పారు.
(30-04-2022)
1 కామెంట్:
👏👏 ఈ రోజుల్లో అంత నిబద్ధత గల కేర్-టేకర్ దొరకడం నిజంగా అదృష్టం.
- విన్నకోట నరసింహారావు
కామెంట్‌ను పోస్ట్ చేయండి