నిజానికి ఇది కధ కాదు. నిజ జీవితమే.
కదల
కోసం కంచికి పోనవసరం లేదు, జీవితాల్లోకి తొంగి చూస్తే కనబడతాయి, మనసును ఆర్ద్రం చేసే కధలు. అలాంటిదే
ఇది.
మా
స్వగ్రామంలో పూర్వీకుల ద్వారా సంక్రమించిన ఆస్తి కొంత వుంది. వుందని తెలుసు కానీ
వాటి ఆజాపజా మా అన్నదమ్ములు నలుగురికి
కానీ, అన్నదమ్ముల సంతానం పదిమందికి కానీ ఎవరికీ తెలియదు. కొంచెం తెలిసిన మా మూడో
అన్నయ్య ఆకాలంగా కాలం చేశాడు. అల్లాగే మా పెద్దన్నయ్య కూడా. ఇప్పుడు ఇద్దరం
మిగిలాము. చిన్నవాడి నైన నాకే డెబ్బయి అయిదు. మా రెండో అన్నయ్య ఎనభయ్ కి దగ్గరలో
వున్నాడు. ఇక ఆస్తి పాస్తులు గురించి తెలుసుకోవాల్సిన అవసరం మా ఇద్దరికీ ఈ వయసులో
ఉంటుందని అనుకోను.
ఈ
నేపధ్యంలో మా మూడో అన్నయ్య కొడుకు భండారు రమేశ్ వీటి విషయం తెలుసుకోవాలని నడుం
కట్టాడు. అడ్డదిడ్డంగా పెరిగిన చెట్లూ పుట్టల్ని తొలగించి పొలాలని కొత్తగా సర్వే
చేయించే బృహత్తర కార్యక్రమాన్ని ఈ మండే ఎండల్లో నెత్తికి ఎత్తుకున్నాడు. ఈ క్రమంలో
వాడి కంటికి కనిపించిన ఒక మానవీయ దృశ్యానికి అక్షర రూపం ఇచ్చాడు. అదే ఇది:
“పై ఫోటోలో కనిపిస్తున్న మనిషి పేరు పిండిప్రోలు పిచ్చయ్య. భార్య పేరు పిచ్చమ్మ.
వీరికి ఒక కూతురు కూడా ఉంది. ఈమె ఎవరికి కనపడదు. (సరిగా బట్టలు వేసుకోదని బయటకు
రానివ్వరు) మండుటెండలో సైతం చెట్టు నీడ కూడా లేకుండా, ఈ రేకుల షెడ్డులోనే ఊరు బయట
నాలుగేళ్లుగా ఉంటున్నారు. కనీసం తాగడానికి నీళ్లు లేక పోగా, కనుచూపుమేరలో విద్యుత్ వెలుగులు
కనిపించవు. పిలిచినా పలికే నాధుడే లేకపోయినా, కటిక
చీకట్లో కాలం వెళ్లదీస్తున్నారు.
“వెనుకటి
రోజుల్లో పిచ్చమ్మ అనే ఆమె మన ఊళ్ళో ఉండేది. ఈ పిచ్చయ్య ఆమె కుమారుడు. కంభంపాడు
లోనే కూలి పనులు చేసుకుని జీవిస్తున్నాడు. కూతురు కుట్టు మిషన్ పనిచేస్తూ
తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేది. అయితే అనుకోని సంఘటనతో వీరి కుటుంబ జీవనం
తలకిందులైంది. కొంత మంది కామాంధుల పైశాచిక చేష్టలతో వీళ్ల కూతురు మానసికంగా
దెబ్బతింది. దీంతో ఆమె తల్లి కూడా అనారోగ్యానికి గురైంది. తల్లీ కూతుళ్లు ఇద్దరూ
కూడా పిచ్చిగా ప్రవర్తించడంతో గ్రామస్తులు వీరు తమ ఇళ్ళ
మధ్య ఉండటానికి ఇష్టపడ లేదు.
“ఈ
విషయం నాకు ఒకరిద్దరు చెప్పడంతో, కంభంపాడు
వెళ్లి మన ట్రాన్స్ఫారం పొలం ఆనుకుని ఒక మూలన పొలంకు అడ్డులేకుండా చివరన
తాత్కాలికంగా ఉండమని చెప్పాను. దీంతో వాళ్లు అక్కడ ఒక రేకుల షెడ్డు నిర్మించుకొని
ఉంటున్నారు. ప్రతిరోజు వాళ్లకు కావలసినవన్నీ పిచ్చయ్య సమకూర్చుతూ ఉంటాడు. రోజువారి
వాడే నీళ్ల నుంచి మంచినీళ్ల వరకు తానే స్వయంగా తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తాడు.
పిచ్చయ్య ఒక్కడి రెక్కల కష్టంతోనే వాళ్ళిద్దరూ జీవిస్తున్నారు. పిచ్చయ్య కూడా
పెద్దవాడు కావడంతో ఓపిక సన్నగిల్లి ఆదాయవనరులు తగ్గిపోయాయి. తల్లి కూతుర్లు ఆ
రేకుల షెడ్డు దాటి బయటకు రారు, రాలేరు.
“అయితే
ఇప్పుడు మన పొలాలు కొలిపిస్తున్నందున అక్కడి నుంచి వాళ్ళని ఖాళీ చేయమని చెప్పాను.
పిచ్చయ్య నన్ను అడిగిన దాని ప్రకారం ఎక్కడో ఒకచోట వారికి నివాసం ఏర్పాటు చేయాలని
అనుకున్నాను. నేను నాతో పాటు నా మిత్రులు, అన్నయ్య, ఇంగువ అనంత రామయ్య గారి మనుమడు
గోపాలకృష్ణ కలిసి వీళ్ళకి పోరంబోకు స్థలం చూపించి నివాసం ఏర్పాటు చేయాలని
భావించాము. వాళ్ళకి మన ఊళ్ళోనే ఒక నివాసం ఏర్పాటు చేసేందుకు తలా ఒక చేయి
వేస్తున్నాము”
ఈ
కధనానికి మా కుటుంబంలో వాళ్ళ స్పందన మొదలయింది. అతి త్వరలోనే ఆ కుటుంబానికి ఒక ఆధారం
ఏర్పడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మా భండారు సంతానం మేలిమి బంగారం. ఇలాంటి వాటిల్లో వాళ్ళు ఎప్పుడు ముందే
వుంటారు. మేము సైతం అని ముందుకు వచ్చారు.
పిచ్చయ్య
కుటుంబానికి ఆధారం దొరుకుతుంది. కానీ
ఇలాంటి అభాగ్యులు ఈ దేశంలో ఎంతమంది వున్నారో!
(25-04-2022)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి