14, ఏప్రిల్ 2022, గురువారం

నస్మరంతుల పరిణామక్రమంబెట్టిదనిన .... భండారు శ్రీనివాసరావు

 

ఒకానొక కాలంలో బాపూ రమణలు తెలుగు వారపత్రికల్లో చెలరేగిపోయి రాస్తున్న ఒకానొక స్వర్ణ యుగంలో, ఒకసారి ఈ నస్మరంతి పురాణం విప్పిచెప్పారు.
“పెళ్ళయి పాతికేళ్ళు అవుతున్నా కూడా పెళ్ళానికి ఆమె పుట్టింటి పేరు మీదనే ఉత్తరాలు వస్తుంటే, ఆ మగడిని “నస్మరంతి గాడు” అంటారని వాళ్ళు వాకృచ్చారు. అంటే ఏమిటన్న మాట. అతగాడిని ఎవరూ తలచుకోరు, లెక్క పెట్టరు, గుర్తించరు అనేది వారి ప్రతిపదార్ధ తాత్పర్యం.
తరవాత్తరవాత కాలంలో సెల్ ఫోన్లు వచ్చాక, రోజుకు ఒక్కసారి కూడా ఎవరూ ఫోన్ చేయకపొతే. కనీసం రాంగ్ కాల్స్ కూడా రాకపోతే, ఆ ఫోన్ తాలూకు శాల్తీని నస్మరంతి అంటారని మరో ఉవాచ.
ఇక ఇప్పుడు ఈ సాంఘిక మాధ్యమాల కాలంలో చెప్పాల్సివస్తే, రాసి పోస్టు చేసి పది గంటలు గడుస్తున్నా, ఒక్కరంటే ఒక్కరు మర్యాదకోసమైనా, పోనీ మొహమాట పడైనా లైక్ చేయడం, లేదా కామెంటు పెట్టడం అంటూ చేయని పక్షంలో ఆ పోస్టించిన మగానుభావుడిని ‘నస్మరంతి’ అంటారని సూతుడు శౌనకాది మునులకు చెప్పగా వారిలో నొకండు దానిని ఎల్లలోకంబులకు తెలియపరిచె.
(14-04-2022)

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

కామెంటెడితే శౌనకాది వారి వాక్కు తప్పై పోతుంది.

కామెంటెడకుంటేనేమో మీ ఈ పోష్టుకు ద్రోహం చేసినట్టై పోతుంది.