‘ఏ’ కూ ‘బీ’ కూ పడదు. ‘ఏ’ ఏది చెప్పినా ‘బీ’ ఖండిస్తుంది. ‘బీ’ ఏది వాదించినా ‘ఏ’ అడ్డు తగులుతుంది.
‘సీ’ కీ ‘డీ’ కీ చుక్కెదురు. ‘సీ’ చెప్పే మాట ‘డీ’ చెవిదూరనివ్వదు. ‘డీ’ మాట ‘సి’ చెవిన పెట్టదు.
ఇంతేనా అంటే ఇంకా వుంది.
ఈ నాలుగింటిలో మళ్ళీ ఒకదానికొకటి కుదరదు. కాకపొతే ‘ఏ, బీ’ వాదించుకుంటుంటే ‘సి, డీ’ లు వినోదం చూస్తుంటాయి. ‘సి, ‘డీ’ తగవు పడితే ‘ఏ, ‘బీ’ లు మౌనంగా ఆనందిస్తాయి.
అంశాన్ని బట్టి అందరూ ఒకరితో ఒకరు వాదించుకోవడమో, లేదా ఇతరుల వాదనలు వింటూ వినోదించడమో చేస్తుంటాయి.
ఇంతేనా అంటే ఇంకా వుంది మరి.
ఈ నాలుగింటిలో కొన్నింటికి బహిరంగ స్నేహం. మరో కొన్నింటికి పరోక్ష స్నేహం. ఒకదానినొకటి సమర్ధించుకుంటాయి. (లోపల ఇష్టం లేకపోయినా). మిగిలిన వాటితో కలిసి తగువు పడుతుంటాయి. (ఇది మాత్రం ఇష్ట పూర్తిగా)
ఇంతటితో అయిపోయిందా అంటే అయిపోలేదు మరి.
వీళ్ళని పిలిచి మాట్లాడించే మాధ్యమాలు వున్నాయి చూసారు, వాటి విషయం చెప్పాల్సిన పని లేదు. ఎవరికి వారికే సొంత ఎజెండాలు. మాట్లాడే వాళ్ళు తాము అనుకున్నట్టు మాట్లాడడం లేదు అనుకున్నప్పుడు వాళ్ళే కల్పించుకుని సుదీర్ఘంగా మాట్లాడడం మొదలెడతారు. ప్రశ్నలు వేస్తారు. సమాధానాలు కూడా వాళ్ళే చెబుతారు. ఇక్కడకి వచ్చేసరికి రేటింగులకన్నా, తాము నమ్ముకున్న, తమని నమ్ముకున్న పార్టీ ప్రయోజనాలకే పెద్ద పీట.
ఏతావాతా ప్రేక్షకులకు మిగిల్చేది మాత్రం ఓ క్వింటాలు అయోమయం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి