10, ఏప్రిల్ 2022, ఆదివారం

కమలం ప్రస్థానం – భండారు శ్రీనివాసరావు

(Published in Andhra Prabha on 10-04-2022, SUNDAY today)

నలభయ్ ఏళ్ళు దాటాయి అంటే అది నడికారు వయస్సు. ఇంగ్లీష్ లో ప్లస్ ఫార్టీ సిండ్రోం అంటారు. జీవితంలో పూర్తిగా స్థిరపడిన వయసు కాదు, అలా అని స్థిరపడని వయసూ కాదు. నాలుగురోడ్ల కూడలిలో నిలబడి, అంతవరకూ జీవితం బోధించిన గుణపాఠాలతో మంచిబాటలో సాగడానికి, లేదా అనవసరమైన ఆకర్షణలకు లోబడి చెడు మార్గం వైపు మళ్ళడానికి అదే తరుణం.
ఒక రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ కూడా సరిగ్గా ఈ దశకు చేరుకుంది.
ఆరెస్సెస్ మూలాలు వున్నవాళ్ళు మా కుటుంబంలో నాకు తెలుసు. చదువుకుంటూ ఉద్యోగధ్యాసలో వుండాల్సిన వయసులో వాళ్ళు, పొద్దున్న పొద్దున్నే లేచి ఖాకీ నిక్కరు తొడుక్కుని, లాఠీ చేతబట్టుకుని వెడుతుంటే నాకు ఆశ్చర్యంగా అనిపించేది. ఒక్కోసారి వాళ్ళతో వెళ్ళేవాడిని. మైదానంలో కవాతు చేసేవారు. ఎవరో ఏదో అర్ధం కాని భాషలో ఏదేదో చెప్పేవారు. అంతటి క్రమశిక్షణ నేను క్లాసు రూములో కూడా చూడలేదు.
మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత, దివి సీమ ఉప్పెన సమయంలో ఆరెస్సెస్ మాట వినబడింది. ఆ విపత్కర సమయంలో వాళ్ళు చేసిన సేవలను చూసినప్పుడు, విన్నప్పుడు, వరద నీటిలో రోజుల తరబడి నాని పోయి, కుళ్లిపోయి కంపు కొడుతున్న శవాలకు అగ్ని సంస్కారాలు చేసిన వార్తలు చెవిన పడ్డప్పుడు వీళ్లు కదా మనుషులంటే అనే అభిప్రాయం ఏర్పడింది.
ఆ రోజుల్లో గోడల మీద రాజకీయ పార్టీల నినాదాలు కనిపించేవి. ప్రమిద గుర్తుకు మీ ఓటు అని రాసి వుండేది. అది జనసంఘం పార్టీ అనేవారు. ఆరెస్సెస్ కార్యకర్తలు ఈ నిరాడంబర ప్రచారం చేసేవారని చెప్పుకునేవారు. అప్పటికి ఎక్కడా ఏ ఎన్నికలో జనసంఘం పార్టీ గెలిచిన దాఖలా లేదు. గెలవని పార్టీకి ఓటు వేయడం ఎందుకు దండగ అని కొందరు ఆ పార్టీ పట్ల అభిమానం ఉన్నప్పటికీ వేరే పార్టీకి వేసేవాళ్ళు.
కాలేజి చదువుల నాటికి వామపక్ష విద్యార్థి సంఘాలదే హవా. కొన్నాళ్ళకు మరో విద్యార్థి సంఘం పుట్టుకు వచ్చింది. భారతీయ జనతా పార్టీ తరపున వచ్చిన విద్యార్థి పరిషత్ అది. దాని నాయకులు మృదువుగా మాట్లాడి తోటి విద్యార్ధులను తేలికగా ఆకర్షించే వాళ్ళు. త్వరలోనే ఆ విద్యార్థి సంఘం విశ్వ విద్యాలయ స్థాయిలో కూడా బాగా వేళ్ళూనుకుంది. అప్పుడో సత్యం తెలిసింది. పోటీ లేనప్పుడు, వున్న సంఘాలనే ఆదరిస్తారు. ప్రత్యామ్నాయం దొరికింది అనుకుంటే మాత్రం తటస్థులు దాని వైపు మొగ్గుతారు.
ఇక జర్నలిజంలో ప్రవేశించిన తర్వాత అన్ని రాజకీయ పార్టీల నాయకులతో పరిచయాలు ఏర్పడ్డాయి. బీజేపీ, వామ పక్షాల నాయకుల తీరు విభిన్నంగా వుండేది. విలేకరులకు రాజమర్యాదలు చేయకపోయినా వారి మాటల్లో మర్యాద మన్నన కనిపించేవి. చెప్పదలచుకున్నది సూటిగా చెప్పేవారు. విమర్శలు సహేతుకంగా ఉండేవి. ఈ వార్త రావాలి సుమా అనే హెచ్చరికతో కూడిన అభ్యర్ధనలు ఉండేవి కావు. ఒక స్థాయి నాయకులు పార్టీలో ఉన్నత స్థాయికి ఎదగడం అనేది ఒక జర్నలిస్టుగా నేను చూడగలిగాను. ఇతర పార్టీలలో ఇలా జరగదు అని కాదు కానీ, బీజేపీలో ఈ సంఖ్య హెచ్చుగా కనబడింది.
తరం మారినప్పుడు మార్పు సహజం. అయితే ఈ మార్పులు సిద్ధాంతాలలోనా, విధానాలలోనా అనేది ప్రధానం. లక్ష్యంతో పాటు, దాన్ని చేరుకునే మార్గం కూడా సరైనది వుండాలనేది పాత తరం బీజేపీ నాయకుల విధానం. గమ్యం సరైనది అయినప్పుడు ఆ లక్ష్య సాధనలో నడిచే మార్గం ఎలాటిదైనా పర్వాలేదనేది తర్వాతి తరం విశ్వాసం కావచ్చు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొన్ని మార్పులు అనివార్యం. అయితే, మూల సిద్ధాంతాలకు తిలోదకాలు ఇవ్వనంత కాలం విధానాల మార్పును కొంత మేరకు అర్ధం చేసుకోవచ్చు.
ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. బీజేపీని ఒక రాజకీయ పార్టీగా విశ్లేషించడం ఒక విషయం. ఎన్డీయే కూటమికి నాయకత్వం వహిస్తున్న పార్టీగా విశ్లేషించడం మరో విషయం. ప్రస్తుతాంశానికి సంబంధించి ఒక రాజకీయ పార్టీగా మాట్లాడుకోవడమే సముచితంగా వుంటుంది.
లోకసభలో పార్టీ బలం రెండే రెండు స్థానాల నుంచి మూడంకెల సంఖ్యకి చేరుకోవడానికి దాదాపు మూడు దశాబ్దాలు పట్టింది. అలాంటిది ఇప్పుడు అత్యధిక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండగలగడం చిన్న విషయమేమీ కాదు.
2014లో బ్రహ్మాండమైన మెజారిటీతో మోడీ నాయకత్వంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి కేంద్రంలో అధికారానికి వచ్చినప్పుడు ఆ పార్టీ ఇచ్చిన కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే నినాదం వివాదాస్పదం కావడానికి కారణం అది ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం. ప్రతిపక్షం లేని పాలకపక్షం నియంతృత్వానికి దారి తీసే అవకాశం వుంటుంది. ప్రత్యర్థి పార్టీని బలహీన పరచడాన్ని ఎవరూ తప్పుపట్టరు. సమూలంగా నిర్మూలించడం అనేది కొంచెం కటువుగా ధ్వనిస్తుంది. నాకు తెలిసి అనేక పార్టీలు కాలక్రమంలో కాలగర్భంలో కలిసిపోయాయి. అందుకు స్వయంకృతాపరాధాలు కారణం. ఎవరూ పనికట్టుకుని వాటిని మట్టుపెట్టలేదు.
సాధారణంగా సిద్ధాంత ప్రాతిపదిక కలిగిన పార్టీలకు పిడివాద పార్టీలు అనే ముద్ర పడుతుంది. ముందు వాటిని అర్ధం చేసుకోవడం కష్టం. అయితే క్రమేణా ప్రజలకు వాటిపట్ల విశ్వాసం కలిగే అవకాశం వుంది. ఎట్టి పరిస్థితుల్లోను ఈ పార్టీ సిద్ధాంతాలతో రాజీపడదు అనే నమ్మకం ప్రబలితే అది దానికి శ్రీరామ రక్ష అవుతుంది.
హిందుత్వ అజెండా అనేది భారతీయ జనతా పార్టీకి పిడివాద పార్టీ అనే ముద్ర వేసింది. దేశానికి స్వతంత్రం వచ్చిన అనేక దశాబ్దాల వరకు అత్యధిక ప్రజానీకం సెక్యులరు అనే కృత్రిమ భావజాలానికి కట్టుబడివుంది. అంచేత జనం అప్పట్లో పిడివాద బావజాలాన్ని అంగీకరించే స్థితి లేదు. అయితే గత ఒక దశాబ్ద కాలంలో ప్రజల ఆలోచనా ధోరణిలో కొంత మార్పు భారీగానే కనబడుతోంది. మైనారిటీల పట్ల వారి అభిప్రాయం క్రమేణా మారుతోంది. మెజారిటీ ప్రజల ప్రయోజనాల పరిరక్షణ గురించిన ఆలోచనలు ఊపిరి పోసుకోవడం మొదలయింది. బీజేపీ సాంఘిక మాధ్యమాల ప్రచార విభాగాలు పోషించిన పాత్ర కూడా దీనికి కారణం. ప్రధానంగా విద్యాధికులు, యువతీ యువకుల్లో ఈ మార్పు కొట్టవచ్చినట్టుగా కనబడుతోంది. ఇది బలమా బలహీనతా అనేది రానున్న కాలమే నిర్ణయించాలి.
కొంతకాలం క్రితం వరకు బీజేపీకి అగ్రవర్ణాల పార్టీ అనే పేరు వుండేది. క్రమంగా ఇది కనుమరుగు అవుతోంది. ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల ప్రతి పార్టీ విధిగా అణగారిన కులాలకు రాజకీయ అధికారంలో వాళ్లకు దక్కాల్సిన న్యాయమైన వాటా వారికి ఇవ్వాల్సిన అనివార్యత ఏర్పడింది. అందుకు అనుగుణంగానే బీజేపీ నడుచుకోవడం మొదలుపెట్టడంతో ఇప్పటివరకు ప్రత్యర్థుల చేతుల్లో బలమైన ఆయుధంగా వున్న అగ్రవర్ణాలపార్టీ బీజేపీ అనే ముద్ర క్రమంగా మసకబారుతోంది.
అయితే ఉత్తరాది పార్టీ అనే అపప్రథ ఇంకా అలాగే వుంది. దక్షిణాదిన బలమైన నాయకత్వం లేకపోవడం, ప్రాంతీయ పార్టీలపై ఆధారపడే ధోరణి కారణంగా బలపడలేకపోవడం వంటి కారణాల వల్ల ఈ ముద్ర వదిలించుకోవడానికి మరి కొంత కాలం పట్టవచ్చు.
పార్టీ విధానాల్లో కొట్టవచ్చిన మార్పు ఇతర పార్టీల నుంచి చేరికలను ఆహ్వానించే విషయంలో కనబడుతోంది. పార్టీ మూల సిద్ధాంతాలకు పూర్తిగా కట్టుబడిన వారికే గతంలో అగ్రాసనం లభించేది. ఇప్పుడలా లేదు. పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరించిన చరిత్ర కలిగిన వాళ్లకు కూడా పార్టీలో ప్రవేశం అతి సులభం అవుతోంది. పైగా పెద్ద పీటలు కూడా వేస్తున్నారు. ఒక రకంగా అవకాశవాద రాజకీయానికి ఇది మచ్చుతునక. ఒకే ఒక్క ఓటు తక్కువై కేంద్రంలో అధికారాన్ని చేజేతులా వదులుకున్న త్యాగచరిత్ర బీజేపీది. ఈ నేపధ్యంలో చూసినప్పుడు, అలాంటి మొక్కవోని సిద్ధాంత బలం కారణంగా ఆ పార్టీకి చేరువైన వారికి నిరాశ కలగడం సహజం.
అయితే ఏ సిద్ధాంతాన్ని అమలు చేయాలన్నా, అనుకున్న పనులను ఆటంకం లేకుండా చేసి చూపించాలన్నా చేతిలో తగిన అధికారం వుండాలి. అంచేత ముందు అధికారం ముఖ్యం అంటూ అని సమర్థించేవారు లేకపోలేదు.
గమ్యం ముఖ్యం, మార్గం కాదు అనడానికి భాగవతంలో ఓ దృష్టాంతం వుంది.
వైకుంఠ౦లో విష్ణుమూర్తి దర్శనం కోసం వెళ్ళిన సనకసనందనాదిమునులను ద్వారపాలకులైన జయవిజయులు అడ్డగిస్తారు. కోపించిన మునులు వారిని మర్త్యులుగా జన్మించమని శాపమిస్తారు. విష్ణుమూర్తి కల్పించుకుని వారిరువురికి ఒక మధ్యేమార్గం సూచిస్తాడు. పలుమార్లు విష్ణు భక్తులుగా జన్మించి తిరిగి వైకుంఠం చేరుకోవడం, లేదా మహావిష్ణువుకు ఆగర్భ శత్రువులు గా జన్మించి, మూడే మూడు జన్మల తర్వాత తమ స్వామిని చేరడం. వారు ద్వితీయ మార్గాన్నే ఎంచుకుంటారు. శ్రీహరిని విడిచి అన్ని జన్మలు దూరంగా ఉండలేమని, అంచేత మూడు జన్మల్లో వెనక్కి రావడానికి వీలుగా హరివైరులుగా జన్మిస్తామని వేడుకుంటారు.
చేయదలచుకున్న మంచి పనులు చేయాలి అంటే చేతిలో అధికారం అవసరం. అది లేకుండా సిద్ధాంతాలు అంటూ కాలయాపన చేయడం కంటే త్వరితగతిన అధికార పీఠాన్ని తిరుగులేని బలంతో సాధించి, కర్తవ్యాన్ని నెరవేర్చడం ముఖ్యమని బీజేపీ నాయకత్వం భావిస్తున్నదేమో తెలియదు. ఆ కారణంగానే జయవిజయుల బాటలో నడుస్తున్నదేమో అనే సందేహం కలుగుతోంది.
అయితే నాదొక ఆప్తవాక్యం.
అధికారం అనేది ఒక వ్యసనం కాకుండా చూసుకోవాలి. ఏంచేసయినా సరే, అధికారంలో కొనసాగాలి, అధికారాన్ని విస్తరించుకోవాలి అనే భావన కలగకుండా జాగ్రత్త పడాలి. ప్రజాస్వామ్య బద్ధంగా ఇవి జరిగితే కాదనేవారు వుండరు.
తోకటపా:
పాత తరం వాజ్ పాయ్, ఆద్వానీలది తిరుగులేని నైతికబలం.
ఈ తరం మోడీ, అమిత్ షాలది ఎదురులేని ప్రజాబలం.(9-04-2022)

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

మర్త్యులుగా కాదు రాక్షసులుగా.
పలుమార్లు కాదు ఏడు జన్మలు.