5, ఏప్రిల్ 2022, మంగళవారం

నిజంగా అది రౌడి కాలేజీనా? – భండారు శ్రీనివాసరావు

 ఎస్సారార్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల.  ఆరోజుల్లో అంటే ఒక అర్ధ శతాబ్దికి పూర్వం, మొత్తం విజయవాడలో ఇదొక్కటే ప్రభుత్వ కళాశాల. రెండోది ప్రైవేటు యాజమాన్యంలోని  లయోలా   కాలేజి. స్కూలు చదువు అయిపోయిన తర్వాత పీయూసీ, డిగ్రీలో చేరాలంటే ఈ రెండే దిక్కు. గవర్నమెంటు కాలేజీలో ఫీజులు నామ మాత్రం అయినా రౌడీ కాలేజి అనే పాడు పేరు ఒకటి. లయోలా  కాలేజీకి అలాంటి పేరు లేదు కాని సామాన్యులు భరించలేని ఫీజులు గుంజుతారని ప్రతీతి.

ఇదంతా ఎందుకు అంటే ఇవ్వాళ హైదరాబాదులో ఎస్సారార్ కాలేజిలో జంధ్యాల బ్యాచ్ కి చెందిన ముప్పయారు మంది పూర్వ విద్యార్ధులం  నారాయణగూడా లోని ఎస్బీఐ గెస్టు హౌస్ లో కలుసుకున్నాం. అదీ యాభయ్ అయిదేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత. వచ్చిన వారిలో ఓ పదిమంది భార్యా సమేతంగా వచ్చారు.

వారిలో ఒకావిడ గారు చెప్పారు.

‘అసలు ఇలాంటి మీటింగులకు ఆడవాళ్ళం ఎందుకు అనిపించింది. అదే మా వారితో చెప్పాను, మీరొక్కరు వెళ్లి రండని. ఈలోగా ఆయన స్నేహితులు కొంతమంది బలవంత పెట్టారు. దానితో రాకతప్పలేదు. వచ్చిన తర్వాత అనిపించింది, రాకుండా వుండి వుంటే నేను పొరబాటు చేసిన దాన్ని అయ్యేదానినని. ఈ కాలేజి గురించి విన్నది వేరేగా వుంది. ఇప్పుడు చూస్తుంటే అక్కడ చదువుకున్న వారు చాలా సంస్కారవంతులు అనిపిస్తోంది”

మా అందరికీ గొప్ప కాంప్లిమెంట్ కదా!

ప్రముఖ రంగస్థల, సినీ నటుడు, ఈ పూర్వ విద్యార్ధులలో ఒకరు అయిన  సుబ్బరాయ శర్మ గారు మైకు తీసుకున్నారు. లేదు, మాట్లాడమని అందరు బలవంత పెడితే తీసుకున్నారు.

“ ఈ  కాలేజీలో లెక్చరర్ గా పనిచేసిన    విశ్వనాధ సత్యనారాయణ వంటి ప్రముఖ పండితులు, పురాణం సుబ్రమణ్య శర్మ వంటి ఎడిటర్లు,   జంధ్యాల, ఏమ్వీ రఘు, మాధవపెద్ది సురేశ్ వంటి సినీ ప్రముఖులు, వైణిక విద్వాంసుడు అయ్యగారి శ్యామసుందరం, ఇంకా అనేకమంది బ్యాంకర్లు, మల్లాది వెంకట కృష్ణ మూర్తి వంటి నవలా రచయితలు,  మురళి దేవరకొండ వంటి కధారచయితలు, కవులు, కళాకారులు అనేకమందిని ఈ కాలేజి సమాజానికి అందించింది. ఇలాంటి కాలేజీని రౌడీ కాలేజ్ అనడం భావ్యమా!” అంటూ తనదైన రీతిలో స్పందించారు.

బ్రిగేడియర్ శ్రీరాములు ఒక ఆసక్తికర అంశాన్ని బయట పెట్టారు. ఎస్సారార్ కాలేజీలో కొందరు ‘ఘనాపాటీలు’ వున్న మాట వాస్తవమే అన్నారు. కాలేజి ఫంక్షన్లలో పాల్గొనడానికి విద్యార్థినులు జంకుతున్నారు, అదీ తమ వల్లనే అనే విషయం ఆ ఘనాపాటీలకు తెలిసిపోయింది. వెంటనే వాళ్ళు కార్యక్రమాలు ముగిసిన తర్వాత వాటిల్లో పాల్గొన్న  ఆడపిల్లలను  రిక్షాలలో కూర్చోబెట్టి, సైకిళ్ళపై వెంటవెళ్లి, భద్రంగా ఇళ్ళ దగ్గర దింపే పనిని కొందరు జూనియర్లకు ఒప్పగించారుట. అంటే ఆ కాలేజీలో ఏళ్ళ తరబడి చదువుతూ తిష్ట వేసిన ఆకతాయిలు కూడా ఆడపిల్లల పట్ల చక్కటి సంస్కారాన్ని ప్రదర్శించే వారన్నది ఆయన కవి హృదయం.

లైలా కాలేజీలో చేరిన వారు కూడా అవకాశం దొరకగానే ప్రభుత్వ కళాశాలలో చేరడానికి మక్కువ చూపేవారని, దానికి కారణం  ఎస్సారార్ కాలేజి కోఎడ్యుకేషన్ కాలేజి కావడమే అనేది  ధర్మవరపు రామ్మోహన రావు గారి చమత్కారం. డెబ్బయి పై చిలుకు వయసులో కూడా ఆయన సుస్వరంతో కర్ణుడి జన్మ రహస్యం అంకంలోని పద్యాలను చక్కగా ఆలపించారు. అలాగే, డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్ చేసిన  దాసు గారు, ఏలేశ్వరపు ప్రసాద్ గారు పాత పాటలు వినిపించారు. ఈ వయసులో కూడా తమ గాత్ర మాధుర్యం చెక్కు చెదరకుండా చూసుకోవడం ఆశ్చర్యం అనిపించింది.

వీణా వాయిద్య కళాకారుడు, దేశ విదేశాల్లో అనేక ప్రశంసలు, అవార్డులు పొందిన అయ్యగారి శ్యామ సుందరానికి పద్మశ్రీ పురస్కారం లభిస్తే బాగుంటుందని వచ్చిన మితృలు అందరూ అభిప్రాయ పడ్డారు. వస్తే,  అంతకంటే కావాల్సింది ఏముంటుంది?

ఇక కృతజ్ఞతలు చెప్పాల్సిన వ్యక్తి ఒకరున్నారు. ఆయన స్టేట్ బ్యాంక్ లో ఉన్నత అధికారిగా రిటైర్ అయిన ఎన్.వీ.కే. రావు గారు. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఈ యావత్ కార్యక్రమానికి ఆయన కర్తా, కర్మా, క్రియ.



 

(05-04-2022)       

కామెంట్‌లు లేవు: