(Published in Andhra Prabha today, Sunday, 17-04-2022)
నలభయ్ యాభయ్ ఏళ్ళక్రితం హైదరాబాదులో దుకాణాల పేర్లు, వీధుల పేర్లు తెలుగులో ఎలా రాసేవారో గుర్తున్న వాళ్లకు, ఆ తెలుగు చూసి తాము పడ్డ ఆవేదన కూడా గుర్తుండే వుంటుంది. భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరిట దేశంలో తొట్ట తొలిసారిగా ఏర్పడ్డ తెలుగు రాష్ట్రంలో మాతృభాష తెలుగుకు ఈ దుర్గతి ఏమిటని బాధపడేవారు ఆనాటి వారు. సబ్బులు, తలనొప్పి గోళీల గురించి సినిమా హాళ్ళలో చూపించే, పత్రికల్లో వేసే ప్రకటనల్లో సయితం తెలుగు పరిస్తితి అదే విధంగా వుండేది. ఎందుకంటే ఆరోజుల్లో ఇలాటి ప్రకటనలన్నీ బొంబాయి(ఇప్పుడు ముంబై)లో తయారయ్యేవి. హిందీలిపిలో తెలుగు రాయించి, తెలుగు కొద్దిగా తెలిసివాళ్ళచేత చదివించడంవల్ల వచ్చిన అపభ్రంశపు తెలుగునే తెలుగువారిపై రుద్దేవారు. ఈనాడు అరవై ఏళ్ళు దాటిన ప్రతిఒక్కరికీ ఇది అనుభవైకవేద్యమే.
మా కుటుంబంలో మా బావగార్లూ, వాళ్ళ పెద్దవాళ్ళూ ఉర్దూ మీడియంలో చదువుకున్నవాళ్ళే. గ్రామాల్లో రాతకోతలన్నీ ఆ భాషలోనే జరగడంవల్ల ఉర్దూ మాట్లాడగలిగినవారికి అయాచిత గౌరవం లభించేదని చెప్పుకునేవారు.
ఆ రోజుల్లో ఖమ్మం జిల్లా మొత్తానికి కలిపి ఒకే ఒక్క డిగ్రీ కాలేజి ఖమ్మంలో వుండేది. అక్కడినుంచి హైదరాబాదుకు ఒకే ఒక్క పాసింజర్ బస్సు. దాదాపు పన్నెండు గంటల ప్రయాణం. బెజవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఒకే ఒక్క రైలు, నైజాం పాసింజర్. కుంటుకుంటూ నడిచే ఆ రైలు, బొగ్గుకోసం, నీళ్ళ కోసం మధ్య మధ్యలో ఆగుతూ, పడుతూ లేస్తూ ఎప్పటికో హైదరాబాద్ చేరేది. ప్రయాణ సౌకర్యాలు అంతగా లేని రోజుల్లో ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు రాకపోకలు కూడా తక్కువ. పైగా భాష తెలియకపోవడం మరో ఇబ్బంది. అయినా, పై చదువులకోసం, పెద్ద వైద్యాల కోసం హైదరాబాద్ తప్పనిసరిగా రావాల్సిన పరిస్తితి. మరోవైపు, రాష్ట్ర రాజధాని కావడం వల్ల ఏదో ఒక పనిపై రాకుండా వుండలేని స్తితి. ఈ క్రమంలో రాకపోకలు పెరిగాయి. ఉద్యోగాలకోసం, ఉపాధుల కోసం వలసలు పెరిగాయి. వ్యాపార అవకాశాలు వెతుక్కుంటూ వచ్చే వారి సంఖ్యా పెరిగింది.
ఫలితంగా, గత యాభయ్, అరవై ఏళ్లలో పరిస్తితి పూర్తిగా మారిపోయింది. రవాణా సౌకర్యాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. రోజుకొక పాసింజర్ బస్సు స్తానంలో గంటగంటకూ నడిచే ఎక్స్ ప్రెస్ బస్సులు వచ్చాయి. నలుమూలలనుంచి హైదరాబాదుకు రైళ్ల సౌకర్యం ఏర్పడింది. రాష్ట్ర రాజధానికి ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాలనుంచి లక్షలాదిమంది జనం హైదరాబాదుకు వచ్చి స్తిరనివాసాలు ఏర్పరచుకోవడం మొదలయింది. ఆ రోజుల్లో ఆయా ప్రాంతాలలో వున్న అక్షరాస్యతను బట్టి చూస్తే బయట నుంచి వచ్చే ఇలాటివారి సంఖ్య గణనీయంగా వుండడం ఆశ్చర్యకరమేమీ కాదు. వలసలు వచ్చిన వాళ్ళు వారితో పాటే తమ సంస్కృతిని, ఆచారవ్యవహారాలను, భాషలో తమదయిన నుడికారాలను వెంటబెట్టుకు వస్తారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది ఇదే. ఉదరపోషణార్ధం ఇతరదేశాలకు ముఖ్యంగా అమెరికాకు వెళ్ళిన తెలుగు వాళ్ళు చేస్తున్నదీ ఇదే. ఇదంతా సహజ సిద్దంగా జరిగేదే. పట్టణీకరణ (అర్బనైజేషన్) వల్ల వచ్చిపడే అనర్థాలలో ఇదొకటి కాబట్టి సర్దుకుపోవాలని చెప్పడం కాదు కానీ, ఈవిధమయిన పరిణామాలు అనివార్యం అన్న వాస్తవాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో వారివారి భాషలు, యాసలు పదిలంగా వుండడాన్ని గమనిస్తే వలసలు ఎక్కువగా వుండే పట్టణ ప్రాంతాలలోనే ఈ రకమయిన మార్పులు చోటు చేసుకుంటున్నాయని కూడా అనుకోవాలి.
భాష పట్ల మమకారంలేని వాడు వుండడు. అది కన్నతల్లితో సమానం. పరాయి భాషల వాళ్ళు మన భాషలో తడిపొడిగా యేవో రెండుముక్కలు మాట్లాడితే మురిసి ముక్కచెక్కలయ్యేది అందుకే.
మాండలికాలు ఎన్ని వున్నా తల్లి వేరు ఒక్కటే. భాషకు యాస ప్రాణం. పలికే తీరులోనే వుంటుంది మాధుర్యమంతా. చిన్నప్పుడు స్కూల్లో రసూల్ సారు ఉర్దూలో అనర్ఘలంగా మాట్లాడేవారు. ఆయన మాట్లాడే దానిలో మాకు ఒక్క ముక్క అర్ధం అయ్యేది కాదు. కానీ ఇంకా ఇంకా వినాలనిపించేది. అదీ భాషలోని సౌందర్యం. ఏ భాషలో అయినా అంతే!
ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అన్ని ప్రాంతాల్లో అనేక తెలుగు మాండలికాలు వున్నాయి. ఒక్కొక్కదానిదీ ఒక్కొక్క తరహా. దేనికదే గొప్ప. కొన్ని పదాలు అర్ధం కాకపోయినా చెవికి ఇంపుగా వుంటాయి. ప్రతి భాషలో వుండే ఈ యాసలు ఒకదానికొకటి పోటీ కాదు. ఒకదానికొకటి ప్రత్యామ్నాయమూ కాదు. కాకపొతే భాషను సుసంపన్నం చేయడంలో వీటి పాత్ర అమోఘం.
అయితే భాషలో ‘తమవి’ అనుకున్న పదాలు తమవి కాకుండా పోవడమే కాకుండా మాయమయి పోతూవుండడం చూస్తూ బాధ పడేవారి ఆవేదన కూడా అర్ధం చేసుకోవాలి.
భాషాభిమానులందరు బాధ పడాల్సిన అంశాలు మరికొన్ని కూడా వున్నాయి. నాన్నను ‘ఒరే’ అనడం, అమ్మను ‘ఒసే’ అనడం వంటి వికృత ప్రయోగాలు తెలుగునాట, ముఖ్యంగా తెలుగు సినిమాలలో నానాటికీ ముదిరిపోతున్నాయి. తెలుగు భాషకు, సంస్కృతికి చీడపురుగుల్లా మారుతున్న ఈ ధోరణులకు సయితం అడ్డుకట్ట వేయాల్సిన అవసరం వుంది.
1 కామెంట్:
ఏమి చెప్పదలచుకున్నారు ?
కామెంట్‌ను పోస్ట్ చేయండి